MISSING-3 దారి తప్పుతున్నారు.... గూగుల్ మ్యాపున్నా...

 


 

దారి తప్పుతున్నారు.... గూగుల్ మ్యాపున్నా... 

ü   

ü  బడికి పోకముందు మా వాడు ‘పెసలు’ అనేవాడు, ఇప్పుడు ‘ఫిసలు’ అంటున్నాడు.

ü  గూగుల్ మ్యాప్ పెట్టుకుని హైదరాబాద్ లో మా ఇంటికి రావాల్సిన వాడు, పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో వెతుక్కుంటున్నాడు. ....ఇలా

ఓట్లు ఎక్కువయ్యేటప్పటికి తెలివితేటలు కూడా ఎక్కువే అవుతున్నాయి........

 

*     జనరంజకంగా పాలించరా పోలిగా....అంటే....అదేగా నేను చేస్తున్నది అంటున్నాడు. జనరంజకం –అంటే ఏం చేస్తే జనానికి ఇవ్వాళ,  రేపు మంచి జరుగుతుందో అది జనరంజక పాలన కాదట...ఏం చేస్తే జనం కళ్ళు మూసుకుని చప్పట్లు కొడతారో,  తద్వారా వాళ్ళను ఎలా రంజింప చేస్తున్నామో అదట....కరెక్టే కదా..అని అనిపిస్తే...మనలో కూడా తేడా కొడుతున్నట్లేగా...

 

*     సంక్షోభ సమయాల్లో ముందుండి సేనలను, ప్రజలను సురక్షితంగా నడిపించేవాడిని రాజు, వీరుడు, నాయకుడు అంటున్నాం...ఔనా !!!  కానీ ..అది కానే కాదని  లాక్ డౌన్ – 1, లాక్ డౌన్ – 2 చూసిన తరువాత అనిపిస్తున్నది. పని జరిగితే నా మహిమ, కాకపోతే నీ కర్మ...చందంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ – 3 తరువాత  మనకు ఇంకెంత జ్ఞానోదయమవుతుందో..!!! 

 

*     ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం వేర్వేరు స్థానాల్లో కూర్చున్నా...నిత్య వ్యవహారంలో మాత్రం అవి రెండు శత్రు దేశాలే. యుద్ధాల్లో కూడా చావనంత సంఖ్యలో రోగాలబారిన పడి ప్రజలు వందలు, వేలల్లో ఛస్తున్నా పట్టదు. కలుపుకు పోరు, కలిసి సాగరు. ఒకడు దిగిరాడు, ఇంకొకడు పైకెక్కడు...శత్రు దేశాధినేతలయినా ఎక్కడో ఒక చోట ప్రపంచ వేదికలు, విందుల్లో కలుసుకోవడాలు, కరచాలనాలు ఉంటాయి...ఇక్కడ అదీ కుదరదు. 

 

*     ప్రభుత్వాన్ని ప్రజలకూ, ప్రజలను ప్రభుత్వానికి  ప్రతి క్షణం కలిపేది మీడియా..దాని ముఖం చూడడానికి కూడా ఈ రోజు ప్రభుత్వాధినేతలు ఇష్టపడడం లేదు, దరిదాపుల్లోకి రానీయడం లేదు...దీని భావమేమి తిరుమలేశా..!!! 

 

*     కోర్టులో దావా వేస్తా...నా తరఫున వకీలును పెట్టుకుంటా. ఉన్నట్లుండి ఈ వకీలును నా కక్షిదారులు లొంగదీసుకుంటారు. అప్పుడు నేనేం చేయాలి ???.....నేను ఓటేసి ఎంపిక చేసి పంపిన ప్రజాప్రతినిధే రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా గోడదూకితే...నేనేం చేసాను కనుక...నోరు మూసుకుని కూర్చోలా.. ఇదీ అంతే... అని కేసు వదిలేసుకుంటానా ???

 

*     యాచకుడు అమ్మా !! అని కేక వేస్తే...చెయ్యి ఖాళీలేదు వెళ్ళమంటుంది కోడలు...నువ్వెవతవే అలా అనడానికి అని...  వెడుతున్న యాచకుడిని వెనక్కి పిలిచి...నేను చెబుతున్నా వెళ్ళునాయనా...చెయ్యి ఖాళీలేదు అంటుంది అత్త....ఇది అందరికీ తెలిసిందే అయినా ఎందుకో ఇక్కడ గుర్తొస్తున్నది.....హైదరాబాద్ ఉన్నది ఇండియాలోనే, అమరావతి ఉన్నది ఇండియాలోనే, ఢిల్లీ కూడా ఇండియాలోనే ఉన్నా..ఒకే దేశం, ఒకే ప్రజ నినాదాలిస్తూ  గుంజుకోవడానికి మాత్రం ఒకే పన్ను ...కానీ పథకాలు అవి మావి అంటే మావి అని రోజూ స్టేట్ మెంట్లే......జనాలకు మాత్రం మొండి చెయ్యే...ఒక చేత్తో ఇస్తూ, మరొక చేత్తో తీసేసుకుంటుంటారు..ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి  ఫొటోలు, వీడియోలు, కటౌట్లతో భారీగా, విరివిగా ప్రకటనలు చేస్తారు,  ప్రజల ముక్కుపిండి వసూలు చేసేవి మాత్రం కరిమింగిన వెలగపండ్లు... 

 

*     మన దేశంలో ఇకముందు... ఎంతమంది ఎమ్మేలేలు ఉంటే అంత మంది మంత్రులు ఉండాల్సిందే... ఎంతమంది ఎంపీలుంటే అంతమంది మంత్రులు ఉండాల్సిందే... ఎందుకంటే మంత్రులుగా ఇప్పుడున్న వారు ... అన్ని ప్రాంతాలనుంచి మెతుకు మిగల్చకుండా ఊడ్చేసుకుపోతున్నారు...బడ్జెట్ కేటాయింపులు మాత్రం వారివారి నియోజకవర్గాలకే, వారి వారి రాష్ట్రాలకే కదా !!!..మరి అటువంటప్పుడు అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే ఈ మార్పు తప్పదు....కాలజ్ఞానంలో రాద్దామనుకుని బ్రహ్మంగారు రాయడం మర్చిపోయిన పాయింటు ఇది... 

 

*     కొంతమంది చిలకలు పెంచుకుంటారు. ఎందుకు...ఎలా పలకమంటే అలా పలుకుతాయి కనుక. కొంత మంది కుక్కలుపెంచుకుంటారు..ఎందుకు ....అసమదీయులొస్తే ప్రేమగా అరవడానికి, తసమదీయులు కనబడితే కసిగా కరవడానికి....ఇప్పుడు అధికార పార్టీలు...  సోషల్ మీడియాలో ...ఇటువంటి చిలకలను, కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నాయి. అందుకే మనకు అవి బయట తక్కువగా కనిపిస్తున్నాయి. 

 

*     ఇప్పుడు మంత్రులు అంటే...లెక్కకు ఎక్కువగా కనిపించినా మనకు కనిపించేది, రోజూ వినిపించేదీ ఓ ముగ్గురు, నలుగురే....ఇక్కడయినా ఎక్కడయినా అదే సీన్. మంత్రిత్వ శాఖలూ అంతే...అయినా చాదస్తం కానీ.....‘‘ ...మొగుడు కోటలో ఉంటేనేం, తోటలో ఉంటేనేం..’’ అన్న ముతక సామెతలు గుర్తుకు రాకుండా చూసుకుందామంటే వాంతుల్లా ఆగకుండా వస్తున్నాయ్....వారి వాలకం చూస్తుంటే...

 

*     ముత్యాల ముగ్గు సినిమా గుర్తుందా...రావుగోపాల రావు పొగడ్తలకన్నింటికీ మేళం వాయిస్తుంటింది ఒక బృందం. అది  ఆయన వెంట ఎప్పుడూ ఉంటుంది. ఇపుడది ఎందుకు గుర్తుకొస్తున్నది అంటే.... ఇండియా.. రేపో ఎల్లుండో అగ్రరాజ్యం కాబోతున్నది- అని ఒక రా.గో.రావు అంటే, మరొక రావు...మన పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.. అందరూ మన తర్వాతే అంటాడు..ఇంకో రావు... ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమం పెట్టినా అది మక్కీ కి మక్కీ మనవాటికి కాపీయే...అంటాడు...అన్నిటికీ మించి ఇంత డెవలప్ మెంట్ ఏదో మనం ఇన్నాళ్ళుగా సాధించిందని కాదు, నిన్న గాక మొన్న మేము వచ్చిన తర్వాతే రాళ్ళన్నీ రత్నాలవుతున్నాయి..అంటారు ఈ రావులు..కింద అనుచర గణాలు వీటితో రికార్డింగ్ డాన్స్ లు వేసి మురిపిస్తుంటారు....వీళ్ళందరిదీ ఒకే మాట ఒకే బాట.. అవి వింటూ మనం అర్ధాకలితో ఉన్నా గుండెమీద చెయ్యేసుకుని హాయిగా , రంగుల కలలు చూస్తూ  గాఢ నిద్రలోకి జారుకుంటున్నాం. 

 

ఇక చాలు..ఆపేస్తా..ఇంకా తన్నుకొస్తున్నాయి...మీ బాధలూ మీరూ వెళ్ళగక్కండి....


 -        చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

2 కామెంట్‌లు:

  1. Neti samaja teerutennulu prajala aakankshalaku anugunanga ee vuasam sagindi.
    Maa attaiah kooda elane sandarbhochithanga samethalu cheptunte inka vinalanipichedi. Mee vyasamto aamenu marokasari thaluchukone adrustam kaligindi
    All the best.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా అమ్మ 5 మాటలు మాట్లాడితే అందులో మూడు సామెతలు గ్యారంటీ...సామెతల కోసమే ఆసక్తిగా వినేవా రు....అందులో సహస్రం అబ్బి నా...ధన్యుణ్ని ...thank you for your response

      తొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...