గు‘లాబీ’.. ఇదోరకం

 



గు‘లాబీ’.. ఇదోరకం

  

అదో వనం

సప్తవర్ణ శోభితం

అక్కడ ఓ మొక్క మొలిచింది

సవాలక్ష మొక్కల్లో అదొక్కటే నిలిచింది

 

పూలు తక్కువ ముళ్ళు ఎక్కువ

వృక్షజాతి కాదు

వేళ్ళు బలహీనం

తీగజాతి

అల్లుకుపోతుంది

గిల్లుకుపోతుంది

పక్కనున్న మొక్కలను

కమ్మేసి, కప్పేసి

నలిమేసి, నులిమేసి

పీక పిసికేస్తుంది

  

దీని రంగు

చూపరులకు భంగు

అలంకారపు మొక్క

కాయలూ పళ్ళూ ఉండవు

దీని పూలు

పూజలు చేస్తాయి

సన్మానాలు చేస్తాయి

గిట్టని జాతుల

శవాలపై నర్తన కూడా చేస్తాయి

  

ఈ పువ్వున్నచోట

మరో పూవు పూయదు

పూయనీయదు

ప్రేమపుట్టినా, పగబట్టినా

దూరం దూరమే

ముళ్లే దాని కంచెయినా..కళ్ళయినా, 

  

భక్తుడికీ అందదు

శత్రువుకీ చిక్కదు

కందిరీగలు గోలచేసినా

కంటిచూపుతో చంపేస్తుంది

  

గల్లీల్లో పెంచలేం

కుండీల్లో నిలవదు

సొంత కమతంలోనే సాగవుతుంది

గడీల్లోనే గుబాళిస్తుంది

  

రేకులు ఎలా అంటే అలా  విచ్చుకోవు

గిరికీలు కొట్టినా

అన్ని సిద్ధులుతెలిసిన

హరి  చేతులకే  అందవు

  

చంద్రశిల  తాకినా

తారకమంత్రం తగిలినా

కవితాగానం సోకినా

విచ్చుకుంటాయి

అవే దాని పాస్ వర్డ్ లు

ఎంటర్ చేస్తే

సీతాకోకచిలుకలకే

తెరుచుకుంటాయి తలుపులు

  

తుఫానులొచ్చినా,

గాలీదుమారం రేగినా

బే ఫికర్....

ప్రమాదం పొంచి ఉన్నప్పుడు

మత్తుపొడులతో ముంచెత్తుతుంది

ఇదో రకం గులాబీ

లాబీ దానికి హాబీ

 

 

-చినవ్యాసుడు,  మాఊరు




రెండూ కరెక్టే, రెండూ తప్పే

 


తెలుగు నటీనటుల ఆంతరంగిక విషయాలు, పెళ్ళాల మీద జోకులు, మనం స్వయంగా చేసుకుని తినే ఓపికలు లేకపోయినా అన్నిరకాల వంటలను గురించి తెలుసుకోవాలని  తహతహలాడే వారి కోసం కూడా రాద్దామనుకున్నా... అలా రాస్తే ఒఠ్ఠి లైకులు మాత్రమే కొట్టి తృప్తిపడకుండా నా ప్రియాతి ప్రియమైన తెలుగు సోదరసోదరీమణులు వాటిని క్షణాల్లో వైరల్ చేయగల దమ్మున్నవారని తెలుసు... అయినా ముందుగా మన సమస్యలేవో ముందు చూద్దామని ఇవి మొదలుపెట్టా.. ..

కాస్తంత ఆటవిడుపుగానయినా  కొద్దిగా సామాజిక సమస్యల మీదకూడా ఓ కన్ను... కనీసం ఓ చూపు మీరు అలా ఈ వైపు విసరగలరని ఆశించడం...అత్యాశ అనుకోవడం లేదు.

ఇది కూడా మన విషయమే... ఓ రెండు నిమిషాలు చదవండి... నచ్చితేనే నలుగురికీ పంచండి...


రెండూ కరెక్టే, రెండూ తప్పే

 

నువ్వు మాట్లాడింది కరెక్టా ? నేను మాట్లాడింది కరెక్టా ? 

రెండూ కరెక్టే. ... రెండూ తప్పే. 

ఏకకాలంలో ఇదెలా సాధ్యం ! ! ! 

అక్షరాలా సాధ్యమే.

 

మన మాతృభాష తెలుగు. నీవు మాట్లాడిందీ అదే,  నేను మాట్లాడిందీ అదే. కానీ తంటా అంతా...  అది ఏ తెలుగు..’ అని అడిగినప్పుడొస్తుంది. నీ తెలుగు వేరు, నా తెలుగు వేరు. .అంతవరకయితే ఓకే.... నాదే కరెక్ట్.. అన్నప్పుడు ఘర్షణ. ..నీది తప్పు-అన్నప్పుడు వివాదం. 

శాతవాహనులు తెలుగు వాళ్ళే. కాకతీయులూ తెలుగువాళ్లే, శ్రీనాథుడూ తెలుగు వాడే, సినారె, శ్రీశ్రీ లు తెలుగు వారే..  కానీ వాళ్ళ రాతలేవీ పూర్తిగా... అన్ని పదాలకు అర్థాలతో... ఒక మోస్తరు చదువరికే  తెలియదు. వాళ్ళదాకా ఎందుకు ....  ఆదిలాబాద్ తెలుగువాడు, చిత్తూరు తెలుగువాడు కలిస్తే !!!  శ్రీకాకుళం అమ్మాయి, మహబూబాబాద్ అమ్మాయి కలిస్తే !!! ... మా నాయనమ్మ పంజాబీ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుంటుంది. అర్థాలు, అపార్థాలు, అనర్థాలు... అన్నీ కలిసిపోయి పచ్చిమిర్చి రోటి పచ్చడిని రుచి చూపిస్తాయి.

ఇంతకూ అందరి తెలుగు కరెక్టే... అందరిదీ తప్పే... అని చెప్పుకున్నాం కదా... ఈ చర్చంతా ఇప్పుడెందుకు.. అంటే..

ఒక తెలుగు రాష్ట్రం రెండయింది. ఎవరికివారు వారి ప్రాంత అభిమానం కొద్దీ వారి భాషను గురించి చర్చించుకుంటున్నారు. చివరకు తెలుగు భాషా దినోత్సవాలు కూడా మీవి మీవే... మావి మావే అనేస్తున్నారు...  దీనితో కూడా ప్రస్తుతానికి మనకు  ఏ సమస్యా  లేదు.

సమస్య మనది కాదు ... మన పిల్లలది.. వారు ఏ తెలుగు నేర్చుకోవాలి...  ఏ తెలుగులో రాయాలి ? వారు నేర్చుకునే భాష, వ్యాకరణం ఏ తెలుగులో ఉండాలి ? వాటిని ఉపాధ్యాయులు... బోధనలోకానీ, ప్రశ్నల పత్రాలు తయారు చేయడంలోకానీ, జవాబులను మూల్యాంకనం చేయడంలోకానీ ఏ తెలుగును ప్రామాణికంగా తీసుకోవాలి ...???.. అన్న ప్రశ్నలకు సమాధానాలు అర్జంటుగా వెతుక్కోవాల్సిన అవసరం తన్నుకొస్తున్నది...

 

ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది కనుక !!!!

అన్నదమ్ములు వాటాలు పంచుకున్నాక ఆస్తిపాస్తులన్నీ చిన్నా చితకా గొడవలతో క్రమంగా సర్దుబాటయి పోతుంటాయి. చచ్చిన వాళ్ళ శ్రాద్ధాల సంగతి వదిలేసినా, మరి బతికున్న అమ్మాఅయ్యల సంగతేమిటి .... పెళ్ళిళ్ళు, బాంధవ్యాలు, ఇతరత్రా సంబంధాలలో రెండు కుటుంబాల్లో అటూఇటూ ఏళ్లతరబడి రక్తమాంసాలు కలిసిపోయినట్లుగా భాషా సంస్కృతులు కూడా కలిసిపోయాయి కదా... ఇప్పుడు వాటి పంపకాలు ఎలా ?

 

వృథా కాలక్షేపం

ఈ చర్చ అనవసరం. పంపకాల వేడి మీద భావోద్రేకాలు, తదనుగుణమైన రాజకీయ ప్రయోజనాలతో ఇప్పుడు ఇదో చర్చ అయ్యిందికానీ...  కొద్దికాలానికి అన్నీ సర్దుకుంటాయిగా.  ఈ చర్చ వృథా కాలక్షేపం తప్ప మరొకటి కాదు- అన్న మాట కూడా సమర్ధనీయంగానే కన్పిస్తుంది. ఎందుకంటే – ఇదో చిక్కుముడి. ఇదే ‘అసలు సిసలు తెలుగు’ ... అని ఇప్పటిదాకా ఉన్న వాటిలో ఏ ఒక్క దాన్నీ నిర్ధారించలేం. భవిష్యత్తులో కూడా ఇదే అసలు తెలుగు ... ఇలాగే ఉండాలి.. అని తీర్మానించడం ఆచరణలో (హిందీ వ్యవహారం వ్యాసం చివర్లో చూడండి) సాధ్యంకాని పని..... కొన్ని సమస్యల విషయంలో – పీటముడులు విప్పుతూ పుణ్యకాలం వృథా చేసుకోవడం కంటే ... ఆ సమస్యలను గాలికొదిలేసి వాటితో సహజీవనం చేస్తూ కాలక్షేపం చేయడమే అత్యుత్తమ పరిష్కారం ...అని చేతులు దులిపేసుకుందామా...???

యస్ ! అదే శ్రేష్ఠం ....అనుకొనేవారు ఇక్కడే ఆగిపోండి. ఇక చదవొద్దు.

కానీ ఎంత కారడవిలాగా కనిపించినా ఏదో కాలిబాటను ఆసరాగా చేసుకొని ఒక ప్రయత్నం చేద్దాం... అని సాహసించే వారికి మాత్రం స్వాగతం.

.........

తెలుగు భాషాదినోత్సవాలు.... ఎప్పటిలాగే ఎటువంటి దైనందిన సమస్యలను పట్టించుకోకుండానే వేడుకలతో ముగిసాయి... ఇప్పటికయినా తేరుకుని మన కాళ్ళకు చుట్టుకుంటున్న ముళ్లతీగలను ఒక్కొక్కటిగా తొలగించుకోవడం తక్షణ కర్తవ్యం.

.........


తెంధ్రీ

 

తెంధ్రీ.... అంటే ? ఈ పదం ఏమిటో ఇప్పటివరకు వినలేదు కదా... అయినా ఇది మీకు కొత్త కాదు. ఇప్పుడు మన రెండు తెలుగురాష్ట్రాల్లో మనం మాట్లాడుకుంటున్న భాష ఇదే ... అంతేతప్ప అటువారు, ఇటు వారు ‘మాదే 24  క్యారట్లు’ అని చెప్పుకుంటున్న తెలుగు మాత్రం కాదు. దానిని ‘తెంధ్రీ’ అనాలి. ‘ఆంధ్రం’ అంటే తెలుగు.. అనే అర్థం ఉన్నా...ఆ పదం తెలంగాణవారిలో అపార్థాలు, ఆంధ్రవారికి అనర్థాలూ సృష్టిస్తున్నది.

నిజానికి మొత్తం తెలంగాణ ప్రాంతంలో  ఇప్పుడు ప్రజలు వాడే భాష  తెలంగాణ తెలుగు కాదు. అలాగే ఈరోజున మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వాడేది ‘ఆంధ్ర’భాష కానే కాదు.  తెలంగాణ తెలుగు లో ఆంధ్ర మాటల ప్రాబల్యం, ఆంధ్ర ప్రాంతం వారి భాషలో తెలంగాణ మాటల ప్రభావం బాగా పెరిగిపోయి, కరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అటూఇటూ అందరం వాడుకలో దంచేస్తున్న భాష ‘తెంధ్రీ’.  ప్రస్తుతం ఇంగ్లీషు తదితర భాషలనుంచి అనువాదాలన్నీ మనం ప్రామాణికం అని చెప్పుకుంటున్న తెలుగులో(24 క్యారట్లలో) రావడం లేదు. తెంధ్రీకరణ అయి తెంధ్రీలో వస్తున్నాయి. (ఇంగ్లీషు, హిందీ, అరబ్బీ, ఫారసీ, ఉర్దూ, తమిళం, కన్నడం, మరాఠీవంటివన్నీ  ఇంతకుముందున్న తెలుగులో ఎప్పటినుంచో  కలిసే ఉన్నాయి కనుక వాటిని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగంటే ...అవన్నీ కలిపి ఉన్నదేనన్న భావం స్థిరపడి పోయింది కనుక.) కథలు, నవలలు, కవితలనుంచీ పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలన్నీ ఇప్పుడు తెంధ్రీలోనే నడుస్తున్నాయి.

నిజాం తెలంగాణలో ‘ఆంధ్ర విద్యాలయ’, ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, ‘ఆంధ్ర బాలికా పాఠశాల’.... ఇవన్నీ ‘ఆంధ్ర’ను ఇముడ్చుకున్నా అన్ని వర్గాల గౌరవమర్యాదలు అందుకొన్నాయి. ‘ఆంధ్రప్రదేశ్’గా ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తరువాత పెత్తనాలు, ప్రాబల్యాలు, అపోహలు, అనుమానాలతో ఆంధ్ర ప్రాంతం మీది వ్యతిరేకతతో క్రమేణా ‘ఆంధ్ర’ శబ్దం తెలంగాణ ప్రాంతంలో అంటరానిదయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి సంసారాలు వారివి అయిన తరువాత కూడా ‘ఆంధ్ర’ శబ్దం ఇంగువ కట్టిన బట్టయిపోయి ఆ అనుమానపు కంపు అలాగే కొనసాగుతూ పోతున్నది. ఇక ఆంధ్ర ప్రాంతంలో – భాషలో కూడా పెత్తందారీ పోకడలు స్థిరపడ్డాయి. తెలంగాణ ప్రాంత తెలుగునే కాక, ఆ ‘రెండు జిల్లాలు’ మినహా ఇతర ఆంధ్రాజిల్లాల తెలుగు కూడా ‘పట్టుచీర’ కట్టడానికి అర్హత సంపాదించ లేకపోయింది.

తెలుగును ఆ ‘రెండు జిల్లాల’ భాష శాసిస్తున్నదనే వాదన తరచుగా వినిపిస్తుంటుంది. ఆ రెండు జిల్లాలు-కృష్ణ, గుంటూరులు. అక్కడి భాషే ప్రామాణికమైనదన్నట్లుగా ఛలామణిలో ఉంది. ( రాతభాషగా కాక మాట్లాడేభాషలో కూడా) మిగిలిన అన్ని జిల్లాల మాండలికాలు, యాసలు... కామెడీకి బాగా గిట్టుబాటయ్యే సరుకయిపోయాయి. వాటిని ఆంధ్ర జిల్లాల వారు ఆమోదించి సర్దుకుపోయినా, తెలంగాణలో దశాబ్దాల ‘ఆంధ్ర’ ద్వేషానికి అదీ ఒక ప్రధాన కారణమయిపోయింది.

ఎన్టీఆర్ హయాం నుండీ హైదరాబాదు మన రాజధానే అని ఆంధ్రాజనం మనస్ఫూర్తిగా నమ్మి, ఆ భరోసాతో పాడీపంటా అమ్మేసుకుని, తట్టాబుట్టతో తరలివచ్చి కాస్త కాలు నిలదొక్కుకోంగానే ఇక్కడే పెళ్ళిళ్ళు, పురుళ్ళు చేసుకుంటూ పాతుకుపోతున్న తరుణంలో... పత్రికలు,  ప్రచురణ  సంస్థలు,  టీవీలు, సినిమాలు, స్కూళ్ళు, కాలేజీలు ..అన్నీ తామరతంపరగా హైదరాబాదును కమ్మేసాయి. మిగిలినవి మనకు అప్రస్తుతం. భాషాపరంగా ప్రధాన భూమిక పోషించేవి ఇవే కాబట్టి. అదీగాక తెలుగు భాషకు సంబంధించిన వ్యవస్థలన్నీ చాలాకాలంగా  హైదరాబాదులోనే  వేళ్ళూనుకుని ఉన్నాయి.  వీటి కారణంగా.... ప్రచార, ప్రసార మాధ్యమాల్లో క్రమేణా ఆ ‘‘రెండు’’ జిల్లాల ప్రభావం తగ్గి హైదరాబాదు, దాని చుట్టుపక్కల జిల్లాల తెలుగు పట్టు సాధిస్తున్న  దశలో – రాష్ట్రం విడిపోయింది. ఆవు తెలంగాణలో, తోక ఆంధ్రలో ఉండిపోయింది.

ఆంధ్ర, తెలంగాణ వారిమధ్య ఈ 40-50 ఏళ్ళ కాలంలో పెళ్ళిసంబంధాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే  జరిగాయి... పెళ్ళిఅంటే ఒక జీవిత కాలపు నమ్మకం. తరతరాల వంశం కొనసాగింపుకు ఈ సంబంధం సరైనదేనన్న నమ్మకం.  రెండు ప్రాంతాల వారు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు – ఉద్యమ కాలంలో కూడా వారి కుటుంబాలకు ప్రాంతీయ ద్వేషాలు మాత్రం అంటుకోలేదు. ఒకవేళ ఏదయినా బలహీన క్షణాల్లో నిప్పురవ్వలు చిటపటమంటున్నా... చివరకు జోకులతో ముగిసి అంతా సర్దుబాటయి పోతున్నాయి. జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇటువంటి కుటుంబాల్లో కూడా ‘భాష-యాస’...  సమస్యలు సృష్టించిన దాఖలాలు లేవు. ఉద్యమ నాయకుల కుటుంబాల్లో కూడా ఈ తరహా సంబంధాలు పెద్ద సంఖ్యలో ఉండడమే కాదు, ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కూడా కొత్తవి కూడా నిరాటంకంగా సాగిపోయాయి.


(ఆంధ్ర, తెలంగాణ చుట్టరికాల్లో ...ఇట్నుంచయినా, అట్నుంచయినా ఆసక్తికరంగా కనిపించే వాస్తవ దృశ్యం  ఒకటి చూద్దాం – అప్రస్తుతం అయినా  సరదాకోసం  ప్రస్తావిస్తా... ‘

‘మా ఆయన అక్కడివాడే కానీ ... ఆయన మంచోడే’... మా అల్లుడు అక్కడి వాడే కానీ....మా కోడలు అక్కడి పిల్లే కానీ... మంచోళ్లే,  ఆడపడుచులు, అత్తామామలు, చుట్టాలు కూడా అంతా బాగా కలిసిపోయారు. బాగా ప్రేమగా ఉంటారు. ఆ లొల్లంతా/ఆ గొడవంతా బయటోళ్ళతోనే...వంటి మాటలే ఆ కుటుంబాల్లో తరచూ విన్పిస్తూంటాయి. అంటే – దగ్గరగా చూస్తున్నారు కాబట్టి.. వాళ్ళవరకు మంచోళ్లే...మిగిలిన వాళ్ళంతా ఫూల్స్, దుర్మార్గులు, ధోఖేబాజ్ లు, లంగాలు..అని)

 

ఆంధ్రా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి లేదా తెలంగాణ పిల్ల, ఆంధ్ర పిల్లగాడు... వీరి వరకు ఈ సంబంధబాంధవ్యాల్లో పైకి ప్రేమ నటిస్తూ లోలోపల ద్వేషాలు రగులుతుండవచ్చు...  అని  అనుకుందాం... కాసేపు...  మరి గత 40-50 ఏళ్ళ కాలంలో వారికి పుట్టిన పిల్లలు, ఆ పిల్లల పిల్లల విషయంలో... వారు ఏ గట్టున ఉంటారు... అటా ..ఇటా .. అంటే... వాళ్లకు ఈ రంధి లేదు. ఏదో బయట అందరూ ఏది అంటూంటే ..వీళ్ళు అక్కడ ఆ పాటపాడి మరుక్షణం మర్చిపోతుంటారు.(నిజానికి వీరు ప్రాంతీయ అసమానతలకు/ద్వేషాలకు బాధితులు కాదు కూడా,  పైగా రెండు ప్రాంతాల  ప్రేమ, ఆప్యాయతలను పొందినవారు).

ఘరానా కుటుంబాలనుంచీ, నిరుపేదల వరకు... వేలసంఖ్యలో ఉన్న ఈ కుటుంబాల్లో...  సామాజికంగా ఉభయ ప్రాంతాల్లో ఉన్న  జీవన శైలి, సంస్కృతి, ఆచార వ్యవహారాలూ, పండుగలూపబ్బాలూ, కట్టూబొట్టూవంటివన్నీ పాలూనీళ్ళలాగా కలిసిపోయినట్లుగానే  తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల  భాష, యాస, మాండలికాలు కూడా  కలిసిపోయాయి. అలా కలిసి గత మూడు నాలుగు దశాబ్దాల్లో పుట్టిన భాషే ‘తెంధ్రీ’. ... తెలంగాణ + ఆంధ్ర యాసల కిచిడీ.

 

మరి సమస్యేమిటి?

ఆంధ్ర, తెలంగాణ కుటుంబాలు కలుపుకున్న చుట్టరికాలకు అటుకానీ, ఇటుకానీ, గడ్డిపోచంత అభ్యంతరం వ్యక్తం కాలేదు.  అవి సామాజికంగా, అధికారికంగా గుర్తింపు పొందినట్లే . రెండు సమాజాలు పూర్తిగా ఆమోదించాయి. కానీ ఈ ‘తెంధ్రీ’కి మాత్రం సామాజికంగా కానీ, అధికారికంగానీ గుర్తింపు రావడం లేదు.

తెలంగాణలోకానీ, ఆంధ్రలోకానీ తెలుగు మీడియం సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టి విద్యార్థులు రాసిన జవాబులకు మూల్యాంకనం చేసేటప్పుడు భాషాపరంగా ఉపాధ్యాయులు అవలంబిస్తున్న విధానాలు ఏమిటి ? అంటే టెక్స్ట్ పుస్తకాల్లో ఎలా ఉంటే – అలా రాసిన దాన్ని అంగీకరిస్తారు. ఇతర మాండలికాలు వాడితే ... ఆ పదాలు సదరు టీచరుకు తెలిస్తే మార్కులేస్తారు, తెలియకపోతే కొట్టేస్తారు. మరి టెక్స్ట్ పుస్తకాల్లో లేని అంశాలు... ఉదా.. వ్యాసరచన వంటివి స్వంతంగా తెలుగులో రాసినప్పుడు  ఎలా ..???

ఈ సమస్య ఆంధ్రాప్రాంతంలో తక్కువ, తెలంగాణలో ఎక్కువ అని చెప్పలేం. ఎందుకంటే – గత 4‌0-50 ఏళ్ళల్లో హైదరాబాదు, చుట్టుపక్కల జిల్లాల్లో  స్థిరపడ్డ ఆంధ్రా ప్రాంతానికి చెందినవారిని వారి చుట్టపక్కాలను కూడా ఈ ‘తెంధ్రీ’ భాష ప్రభావితం చేసింది. ఉద్యోగరీత్యా ఆంధ్రప్రాంతంలో చాలాకాలం సర్వీసు చేసినవారు, వ్యాపారాలు చేస్తూన్నవారు.... ఆ క్రమంలో అక్కడే స్థిరపడిపోయిన తెలంగాణీయుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. అలాగే సరిహద్దు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు సమీప ఆంధ్ర పట్టణాల్లో(విజయవాడ, కర్నూలువంటి..) చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలను చేసుకుంటూ పెద్దసంఖ్యలోనే స్థిరపడిపోయారు గత కొన్ని దశాబ్దాలుగా. వీరు కూడా తెంధ్రీకరణ చెందారు.

ఇప్పుడు ఇంతగా వండి విస్తట్లో వడ్డించిన తెంధ్రీ-కిచిడీ లో తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు అంటూ...పప్పులు, కాయగూరలు దేనికది వేరు చేయడం సులభం కాదు, సాధ్యం కూడా కాదు.

నిజానికి...  ఇది అసలు సమస్య అయి ఉండేది కాదు...  పబ్బం గడుపుకోవడానికి భావోద్వేగాలతో రాజకీయం సృష్టించిన రభసలో సాహిత్యకారులు కూడా వారి వారి ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులతో కలిసి కట్టెలను  ఎప్పటికప్పుడు ఎగదోస్తూ ఉండడంతో చిక్కుముడి పీటముడిగా మారిపోతున్నది.

 

ఇది ఒక్క తెలుగు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. దాదాపు అన్ని భారతీయ , ప్రపంచ భాషలదీ ఇదే పరిస్థితి. దేశంలో 1950 భాషలు/మాండలికాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు, కానీ ఇది నిజం. జాతీయ భాష హిందీనే తీసుకొంటే ప్రధానంగా అవధి, బఘేలీ, ఛత్తీస్ గఢీ, ఖడీబోలీ, మైథిలీలు కనిపించినా... అధికారికంగా గుర్తింపు పొందిన మొత్తం 48 మాండలికాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ (అంటే అవధి, భోజ్ పురి, బ్రజ్ భాష, కౌర్వీ మాండలికాలతో కలిపి..అని)

బీహార్ లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ (అంటే భోజ్ పురి, మగధి మాండలికాలతో కలిపి..అని), సెకండ్ లాంగ్వేజ్ ... మైథిలి

ఛత్తీస్ గఢ్ లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ (ఛత్తీస్ గఢీతో కలిపి)

హర్యానా లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ (హర్యాన్వీ, మేహాతీతో కలిపి)

ఝార్ఖండ్ లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ (భోజ్ పురి, మగధి, నాగ్ పురితో కలిపి)

రాజస్థాన్ లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ (రాజస్థానీతో కలిపి)


యుద్ధాలు, దాడులు, దండయాత్రల తదనంతర ఆక్రమణలు... పరపాలనలలో,  వలసలలో... రక్తమే కాదు, భాషలు కూడా నరనరాల్లో ఇంకిపోవడం, అక్కడి మట్టిలో కలిసి కొత్త మొక్కలు తలెత్తడం  సహజం.  నాగరికతా పరిణామ క్రమంలో అనివార్యమైన సహజ ప్రక్రియ ఇది.

దీనికి ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలు(పాలకులు, భాషావేత్తలు) అర్జంటుగా సరికొత్త పరిష్కారం వెతుక్కుని ఆ దిశగా కృషి చేయాలి లేదా భౌగోళికంగా మనం విడిపోయినా...  మన భాష, మన జీవనం, మన సంస్కృతి ఒక్కటేనన్న స్పష్టతనివ్వాలి.. ఇది రాజకీయంగా, సామాజికంగా ఎంత త్వరగా జరిగితే తరువాతి తరాలకు అంత ప్రశాంతత, వేల ఏళ్ళ తెలుగుకు అంత ఊరట.

 

 -      చినవ్యాసుడు, మాఊరు

    chinavyasudu@gmail.com

 

ఇప్పటిదాకా ఈ విషయంపై చేసిన విశ్లేషణలు.........

 

1. తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw

2. ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw

 3. అమ్మ ఎలాఉంది? ...హలో ! మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!! 

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw

 4. అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw

5. ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా ! 

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

6. మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw

 7. దీని తల రాతను మీ రాతే మార్చగలదు... !!!

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_2.html?spref=tw

 8. ఆచరణాత్మక సంస్కరణలు...కొన్ని సిఫార్సులు

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...