పొలిటికల్ హాలిడే

 




పొలిటికల్ హాలిడే

 

పప్పుబెల్లాల పథకాల మీద,

ప్రాజెక్టుల శిలాఫలకాలు,

టీకాలు, వాక్సిన్ పత్రాల మీద కాదురా

మన వర్ణచిత్రాలు ఉండాల్సింది

 

బ్లాక్ అండ్ వైట్ లో

లక్షల్లో ప్రింటవుతున్న

డెత్ సర్టిఫికేట్ల  మీద...

 

రోగులను, శవాలను కుక్కి తీసుకుపోతున్న

అంబులెన్సులమీద...

 

నిలువుదోపిడీ చేస్తున్న

ప్రయివేటు ఆస్పత్రుల ఐసియు బెడ్లమీద

 

ప్రాణాధార మందులను దాచి

రోగులకు చుక్కలు చూపిస్తున్న

బ్లాక్ మార్కెటీర్ల టీ షర్టుల మీద

 

నేతలు, అధినేతల్లారా..!!!

మీకు మేం కనిపించడం లేదు

మాలోని ఓటరే కనిపిస్తున్నాడు

మీరు మమ్మల్ని పాలించడం లేదు

ఓటర్లనే పాలిస్తున్నారు

ఓటర్లనే పోషిస్తున్నారు

ఓటర్లస్వామ్యం తెస్తున్నారు

 

నాయకమ్మన్యులారా...

మేం మిమ్మల్ని ఎన్నుకోవడం లేదు

మీరే మమ్మల్ని ఎన్ను‘కొని’

మీ చావిట్లో కట్టేసుకుంటున్నారు

ఓట్లే కాదు, ఓటరునూ పిండేసుకుంటున్నారు

 

ఇహ చాలు తప్పుకోండి...

కొద్దిగా సైడివ్వండి...

.... 

సన్యాసం తీసుకోకపోయినా

సర్వసంగ పరిత్యాగుల్లా సంసారాలు వదిలి

వారి ప్రాణాలను పణంగాపెట్టి

కోరలు చాచిన కరోనా విషనాగుల కోనల్లో

నిర్భయంగా పనిచేసుకుపోతున్న

పోలీసులను, పాత్రికేయులను

కోర్టులను, డాక్టర్లను, నర్సమ్మలను

వీథులూడ్చే కార్మికులను

ఆశా వర్కర్లను, అలుపెరుగని డ్రైవర్లను,

కాటికాపర్లను,

వెనకాముందు చూసుకోకుండా

అన్నదానాలు చేస్తున్న దాతలను,

వీథికొకరుగా కనిపిస్తున్న

సోనూసూద్ లను...

దేశం కడుపుమాడ్చకుండా

ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలను

పిలిచి పీటేసుకుంటాం...

కిరీటాలు తొడుక్కుంటాం...

......

టాక్స్ హాలిడే లాగా

మాకు పొలిటికల్ హాలిడే కావాలి

పప్పుబెల్లాలు అందకపోయినా

కంటినిండా నిద్రయినా  ఉంటుంది.

ముప్పూటలా తిండికీ,

మా బతుకులకూ ఓ గ్యారంటీ ఉంటుంది

ఓటర్లుగాకాక...

ప్రజలుగా బతికే హక్కయినా మిగులుతుంది.

 

-        -చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 

………….

 

మిత్రమా !  కాలక్షేపం కోసమో, కీర్తికండూతితోనో రాస్తున్నవి కావు ఇవి.

చూడకూడనివిచూస్తూ, వినకూడనివి వింటూ, జరగకూడనివి  నిరాటంకంగా జరుగుతూ పోతూ ఉంటే.... 

నరనరాలన్నీ ఒక్కొక్కటిగా చిట్లిపోతుంటే.. 

రక్తాక్షరాలు ఎగదోసుకుని వస్తూ... నిమిషానికి పదిసార్లు కపాల మోక్షానుభూతిని ఇస్తూ... 

అవి  మీ ముందుకు వచ్చి వాలుతున్నాయి

 లక్షల మెదళ్ళను రగిల్చే శక్తి అక్షరాలకు ఉంది.  వీటిని చదివి వదిలేయకండి...నచ్చితే నలుగురికీ షేర్ చేయండి....కొంత మంది అభిమానులు వీటిని వారి ఫేస్ బుక్ లు, బ్లాగులూ తదితర వేదికల మీద వాడుకోవడానికి అనుమతి అడుగుతున్నారు. ఏ అనుమతీ అక్కరలేదు. మీ నిర్వహణలో ఉన్న ఏ మీడియాలోనయినా నిరభ్యంతరంగా వాడుకోండి. అయితే ఒక్క షరతు-మార్పులు చేయకండి, యథాతథంగా పూర్తిగా కాపీ పేస్ట్ చేసుకోండి. కింద పేరును తీసేయకండి... నాకు ఫీడ్ బ్యాక్ కావాలి... అందువల్ల మీరు ఎక్కడ వాడుకున్నా దాని తాలూకు లింకులు పంపండి... 

మీ-చిన వ్యాసుడు. 

........

ఊపిరి అందడం లేదు

 




ఊపిరి అందడం లేదు

 

అక్షరాలకు ఊపిర్లూదుతుంటే

అవి మాటలవుతున్నాయి

మంచినీటి చెలమలవుతున్నాయి

తేటతెల్లని ఊటలవుతున్నాయి

 

మంచునీళ్ళల్లో ముంచి తీస్తే

ముద్దూమురిపాలవుతున్నాయి

అవి ఎక్కువయితే బంధాలను

తెగ్గొట్టేసుకుపోతున్నాయి

తక్కువయితే పలచబడి చివికిపోతున్నాయి

 

బయటకు రాలేక భయంతో

బిక్క చచ్చిఎనక్కి పడిపోతున్నాయి

గొంతులోనే ఇరుక్కుపోతున్నాయి

 

ఆచితూచి వదులుతుంటే

సీతాకోక చిలుకల్ని పిలిచి

సందడి చేయిస్తున్నాయి

కందిరీగలకూ కన్నుకొడుతున్నాయి

 

కళ్ళల్లో నెత్తురు చిందితే

కోపాగ్ని కొలిమికి చేరి

మొనదేలిన ఈటెలవుతున్నాయి

వీరభద్రులను ఉసిగొల్పే ఖడ్గాలవుతున్నాయి 

.... 

చిటారు కొమ్మన ఓ పూవులా కాదు

రెమ్మ రెమ్మకూ మావి చిగుళ్ళలా

ఒళ్ళంతా విరగపూసేలా చేయాలనుంది

గుప్పిళ్ళతో పోసి అభిషేకించాలనుంది

 

అక్షరానికి అక్షరం కలిస్తే మాట

మాటకు మాట కలిస్తేనే మనిషి

ఆ సంయోగపు యోగం కరువై

ఏకాంతవాసంలోకి జారిపోతున్నాయి

వాలిపోతున్నాయి, వాడిపోతున్నాయి

పూతకు రాకుండానే రాలిపోతున్నాయి

.... 

ఊపిరి సరిగ్గా అందట్లేదేమోనని

స్కానింగ్ చేసి చూస్తే

అందమైన అల్లికల గాలి సంచులు

చీలికలు పీలికలయి కనిపిస్తున్నాయి

సమాజం తీసుకున్న సెల్ఫీచిత్రంలా

…….. 

కడుపుచించుకుంటే  కాళ్ళమీద పడుతుంది

ఎవరిముందయినా చించుకుందామంటే

వారొస్తున్నారని చెప్పడానికి

కాకులుకూడా కరువయిపోయాయి

... 

చించిపడేసిన కడుపులు

కన్నీటి వరదకు కొట్టుకు వచ్చి

ఫేస్ బుక్కులూ, వాట్సాప్పులూ,

పత్రికలు, టీవీలు,  ట్విట్టర్ల నిండా

గుట్టలుగా పడిపోతున్నాయి

ఒడ్డుకు కొట్టుకు వస్తున్న  కళేబరాల్లా

 

-        - చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com


https://chinavyasudu.blogspot.com/2021/06/blog-post_18.html

MISSING-3 దారి తప్పుతున్నారు.... గూగుల్ మ్యాపున్నా...

 


 

దారి తప్పుతున్నారు.... గూగుల్ మ్యాపున్నా... 

ü   

ü  బడికి పోకముందు మా వాడు ‘పెసలు’ అనేవాడు, ఇప్పుడు ‘ఫిసలు’ అంటున్నాడు.

ü  గూగుల్ మ్యాప్ పెట్టుకుని హైదరాబాద్ లో మా ఇంటికి రావాల్సిన వాడు, పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో వెతుక్కుంటున్నాడు. ....ఇలా

ఓట్లు ఎక్కువయ్యేటప్పటికి తెలివితేటలు కూడా ఎక్కువే అవుతున్నాయి........

 

*     జనరంజకంగా పాలించరా పోలిగా....అంటే....అదేగా నేను చేస్తున్నది అంటున్నాడు. జనరంజకం –అంటే ఏం చేస్తే జనానికి ఇవ్వాళ,  రేపు మంచి జరుగుతుందో అది జనరంజక పాలన కాదట...ఏం చేస్తే జనం కళ్ళు మూసుకుని చప్పట్లు కొడతారో,  తద్వారా వాళ్ళను ఎలా రంజింప చేస్తున్నామో అదట....కరెక్టే కదా..అని అనిపిస్తే...మనలో కూడా తేడా కొడుతున్నట్లేగా...

 

*     సంక్షోభ సమయాల్లో ముందుండి సేనలను, ప్రజలను సురక్షితంగా నడిపించేవాడిని రాజు, వీరుడు, నాయకుడు అంటున్నాం...ఔనా !!!  కానీ ..అది కానే కాదని  లాక్ డౌన్ – 1, లాక్ డౌన్ – 2 చూసిన తరువాత అనిపిస్తున్నది. పని జరిగితే నా మహిమ, కాకపోతే నీ కర్మ...చందంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ – 3 తరువాత  మనకు ఇంకెంత జ్ఞానోదయమవుతుందో..!!! 

 

*     ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం వేర్వేరు స్థానాల్లో కూర్చున్నా...నిత్య వ్యవహారంలో మాత్రం అవి రెండు శత్రు దేశాలే. యుద్ధాల్లో కూడా చావనంత సంఖ్యలో రోగాలబారిన పడి ప్రజలు వందలు, వేలల్లో ఛస్తున్నా పట్టదు. కలుపుకు పోరు, కలిసి సాగరు. ఒకడు దిగిరాడు, ఇంకొకడు పైకెక్కడు...శత్రు దేశాధినేతలయినా ఎక్కడో ఒక చోట ప్రపంచ వేదికలు, విందుల్లో కలుసుకోవడాలు, కరచాలనాలు ఉంటాయి...ఇక్కడ అదీ కుదరదు. 

 

*     ప్రభుత్వాన్ని ప్రజలకూ, ప్రజలను ప్రభుత్వానికి  ప్రతి క్షణం కలిపేది మీడియా..దాని ముఖం చూడడానికి కూడా ఈ రోజు ప్రభుత్వాధినేతలు ఇష్టపడడం లేదు, దరిదాపుల్లోకి రానీయడం లేదు...దీని భావమేమి తిరుమలేశా..!!! 

 

*     కోర్టులో దావా వేస్తా...నా తరఫున వకీలును పెట్టుకుంటా. ఉన్నట్లుండి ఈ వకీలును నా కక్షిదారులు లొంగదీసుకుంటారు. అప్పుడు నేనేం చేయాలి ???.....నేను ఓటేసి ఎంపిక చేసి పంపిన ప్రజాప్రతినిధే రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా గోడదూకితే...నేనేం చేసాను కనుక...నోరు మూసుకుని కూర్చోలా.. ఇదీ అంతే... అని కేసు వదిలేసుకుంటానా ???

 

*     యాచకుడు అమ్మా !! అని కేక వేస్తే...చెయ్యి ఖాళీలేదు వెళ్ళమంటుంది కోడలు...నువ్వెవతవే అలా అనడానికి అని...  వెడుతున్న యాచకుడిని వెనక్కి పిలిచి...నేను చెబుతున్నా వెళ్ళునాయనా...చెయ్యి ఖాళీలేదు అంటుంది అత్త....ఇది అందరికీ తెలిసిందే అయినా ఎందుకో ఇక్కడ గుర్తొస్తున్నది.....హైదరాబాద్ ఉన్నది ఇండియాలోనే, అమరావతి ఉన్నది ఇండియాలోనే, ఢిల్లీ కూడా ఇండియాలోనే ఉన్నా..ఒకే దేశం, ఒకే ప్రజ నినాదాలిస్తూ  గుంజుకోవడానికి మాత్రం ఒకే పన్ను ...కానీ పథకాలు అవి మావి అంటే మావి అని రోజూ స్టేట్ మెంట్లే......జనాలకు మాత్రం మొండి చెయ్యే...ఒక చేత్తో ఇస్తూ, మరొక చేత్తో తీసేసుకుంటుంటారు..ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి  ఫొటోలు, వీడియోలు, కటౌట్లతో భారీగా, విరివిగా ప్రకటనలు చేస్తారు,  ప్రజల ముక్కుపిండి వసూలు చేసేవి మాత్రం కరిమింగిన వెలగపండ్లు... 

 

*     మన దేశంలో ఇకముందు... ఎంతమంది ఎమ్మేలేలు ఉంటే అంత మంది మంత్రులు ఉండాల్సిందే... ఎంతమంది ఎంపీలుంటే అంతమంది మంత్రులు ఉండాల్సిందే... ఎందుకంటే మంత్రులుగా ఇప్పుడున్న వారు ... అన్ని ప్రాంతాలనుంచి మెతుకు మిగల్చకుండా ఊడ్చేసుకుపోతున్నారు...బడ్జెట్ కేటాయింపులు మాత్రం వారివారి నియోజకవర్గాలకే, వారి వారి రాష్ట్రాలకే కదా !!!..మరి అటువంటప్పుడు అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే ఈ మార్పు తప్పదు....కాలజ్ఞానంలో రాద్దామనుకుని బ్రహ్మంగారు రాయడం మర్చిపోయిన పాయింటు ఇది... 

 

*     కొంతమంది చిలకలు పెంచుకుంటారు. ఎందుకు...ఎలా పలకమంటే అలా పలుకుతాయి కనుక. కొంత మంది కుక్కలుపెంచుకుంటారు..ఎందుకు ....అసమదీయులొస్తే ప్రేమగా అరవడానికి, తసమదీయులు కనబడితే కసిగా కరవడానికి....ఇప్పుడు అధికార పార్టీలు...  సోషల్ మీడియాలో ...ఇటువంటి చిలకలను, కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నాయి. అందుకే మనకు అవి బయట తక్కువగా కనిపిస్తున్నాయి. 

 

*     ఇప్పుడు మంత్రులు అంటే...లెక్కకు ఎక్కువగా కనిపించినా మనకు కనిపించేది, రోజూ వినిపించేదీ ఓ ముగ్గురు, నలుగురే....ఇక్కడయినా ఎక్కడయినా అదే సీన్. మంత్రిత్వ శాఖలూ అంతే...అయినా చాదస్తం కానీ.....‘‘ ...మొగుడు కోటలో ఉంటేనేం, తోటలో ఉంటేనేం..’’ అన్న ముతక సామెతలు గుర్తుకు రాకుండా చూసుకుందామంటే వాంతుల్లా ఆగకుండా వస్తున్నాయ్....వారి వాలకం చూస్తుంటే...

 

*     ముత్యాల ముగ్గు సినిమా గుర్తుందా...రావుగోపాల రావు పొగడ్తలకన్నింటికీ మేళం వాయిస్తుంటింది ఒక బృందం. అది  ఆయన వెంట ఎప్పుడూ ఉంటుంది. ఇపుడది ఎందుకు గుర్తుకొస్తున్నది అంటే.... ఇండియా.. రేపో ఎల్లుండో అగ్రరాజ్యం కాబోతున్నది- అని ఒక రా.గో.రావు అంటే, మరొక రావు...మన పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.. అందరూ మన తర్వాతే అంటాడు..ఇంకో రావు... ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమం పెట్టినా అది మక్కీ కి మక్కీ మనవాటికి కాపీయే...అంటాడు...అన్నిటికీ మించి ఇంత డెవలప్ మెంట్ ఏదో మనం ఇన్నాళ్ళుగా సాధించిందని కాదు, నిన్న గాక మొన్న మేము వచ్చిన తర్వాతే రాళ్ళన్నీ రత్నాలవుతున్నాయి..అంటారు ఈ రావులు..కింద అనుచర గణాలు వీటితో రికార్డింగ్ డాన్స్ లు వేసి మురిపిస్తుంటారు....వీళ్ళందరిదీ ఒకే మాట ఒకే బాట.. అవి వింటూ మనం అర్ధాకలితో ఉన్నా గుండెమీద చెయ్యేసుకుని హాయిగా , రంగుల కలలు చూస్తూ  గాఢ నిద్రలోకి జారుకుంటున్నాం. 

 

ఇక చాలు..ఆపేస్తా..ఇంకా తన్నుకొస్తున్నాయి...మీ బాధలూ మీరూ వెళ్ళగక్కండి....


 -        చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

MISSING-2 బ్రెయిన్ డెడ్ అంటే....! ! !


 


 

బ్రెయిన్ డెడ్ అంటే....! ! ! 

§      

§  మనది సంక్షేమ రాజ్యం. ప్రజా ప్రభుత్వం....అని చెప్పుకుంటూటాం కదా...అది బాగా అర్థం కావాలంటే..పండుగలు, పబ్బాలకు ప్రభుత్వం నడిపే బస్సులు, రైళ్ళ వ్యవహారం చూస్తే చాలు. రద్దీకి తగ్గట్లు నడిపే సామర్ధ్యం దానికి ఎటూ ఉండదు. ఉన్న కొన్నింటిలో  కూడా సాధారణ చార్జీలకు రెండు మూడింతలు పెంచి  వసూలు చేస్తారు...ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ...నిజానికి అప్పుడు తక్కువ చార్జీలతో సర్వీసులను పెంచాలి కదా.  అలా కాక చార్జీలు దారుణంగా పెంచేసి...  ప్రయివేటు దోపిడీకి కూడా ప్రభుత్వమే దారి చూపుతుంటుంది. వీటికి పరాకాష్ట...  లాక్ డౌన్ కష్టకాలంలో... ప్రాణాలను, సంసారాలను మూటలు కట్టి నెత్తిన పెట్టుకుని ఇంటిబాట పట్టిన వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం  వారి కోసమే అని చెప్పి నడిపిన సాధారణ  రైళ్ళలో కూడా ఇవే ఫైవ్  స్టార్  చార్జీలు ముక్కుపిండి వసూలు చేయడం...ఇదేమిటని అడిగితే పక్కా వ్యాపారుల్లాగా లాభనష్టాల లెక్కలను ప్రభుత్వం చెప్పడం...

 అదీ మనం అనుభవిస్తున్న సంక్షేమ రాజ్యం.

 

§  సహాయం ఎవరికి అవసరమో వారికి నోటికి ముద్ద అందించాలి కదా !... అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు...ఇక్కడ తినేది కేవలం నిరుపేదలే కాదు, అందరికీ ఓపెన్ ఇవి.....  అలాగే రైతు బంధు- పేద రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకని చెప్పి తెచ్చిన పథకం...మంత్రులు, కోటీశ్వరులు అందరూ లబ్డిదారులే ...ఇప్పటికీ కౌలు రైతుల దిక్కులేని చావులు మనకు మాత్రమే కనిపిస్తుంటాయి...రైతుబంధవులమంటూ ప్రకటనలు గుప్పించుకునే ప్రభుత్వాలకు మాత్రం ఇవి కనిపించవు.

 

 

§  ఆర్థికంగా కటకటగా ఉన్న ఏ కుటుంబం కూడా  ....ఉన్న ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకుంటుందా ?  ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి నేరుగా వారి పర్యవేక్షణలో ఉండే పెట్రోలు ధరలనే తగ్గించకుండా...ఎవరి వాటా పన్నులు వారు పిండుకుంటూ.. కసికొద్దీ పెంచుకుంటూ పోతూన్న ప్రభుత్వాలకు....లక్షణంగా ఉన్న సెక్రటేరియట్, పార్లమెంటు భవనాలను కూల్చి, రాజధానులను మార్చి కొత్త వాటికోసం ఆరాటపడడం....దేనికి సంకేతం ???

  బ్రెయిన్ డెడ్ కేసనే అనుమానం రావడం లేదా...!!!!

ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని నేను గుర్తు చేసాను. మరికొన్ని మీరు గుర్తు చేయండి....ఇలా చేసుకుంటూ పోతుంటే...ఎక్కడో ఒక చోట ఆ వేడి ప్రభుత్వాలకు చురుక్కుమనిపించకుండా ఉంటుందా....

మౌనంగా ఉంటే వారి పాలనా సామర్థ్యాన్ని మనం అంగీకరించినట్లుగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి... గల్లీ స్థాయి ఎన్నికల తాలూకు ఓట్ల మెజారిటీని చూపి ప్రజలు ఆమోదించేసారంటూ ...ఢిల్లీస్థాయిలో చట్టాలను మారుస్తున్న కాలం ఇది.....


 -        చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

MISSING-1

 



‘కనిపించుట లేదు’

మన దేశంలో అక్కడ కానీ, ఇక్కడ కానీ ప్రభుత్వాలు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందేమో అంతటా, ఉప ఎన్నికలకు ముందు మాత్రం ఆయా ప్రాంతాల్లో తప్ప ఇతర సమయాల్లో కనిపించడం లేదు. ఆ తరువాత...  అంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్త మోజులో వద్దన్నా కనిపించి మురిపించాయి, అదీ అతి కొద్ది కాలం మాత్రమే. ఆ తరువాత వాటి జాడ లేదు.

తాత్వికంగా మాట్లాడాలంటే – ప్రభుత్వమే మిథ్య లేదా అది ఒక బ్రహ్మ పదార్థం. మాంస నేత్రాలకు కనిపించనిది. అసలు ప్రభుత్వం అంటూ ఉంటే అది ఉండేది ఎక్కడ ? అన్న ప్రశ్న వస్తుంది. సచివాలయంలోనా, శాసనసభలోనా, కలెక్టరు ఆఫీసుల్లోనా, తహశ్శీల్దారు కార్యాలయాల్లోనా, పోలీసు స్టేషన్లలోనా,  మునిసిపాల్టీ ఆఫీసుల్లోనా ...ఇలా ఎక్కడ ? ...అంటే సర్వేసర్వత్రా వ్యాపించి ఉంటుందనేది మీ జవాబు. కానీ అది అక్కడే ఉన్నట్లు ఎలా తెలుసుకోవడం..??? అనేది నా ప్రశ్న. దీనికి సమాధానంగా...‘‘అవి ఉన్నాయి. సజావుగానే, చురుగ్గానే ఉన్నాయి’’ అని అధికారులు, అధికార పార్టీ ప్రముఖులు వంద కారణాలు, వెయ్యి రుజువులతో వారి ఘోష వినిపించవచ్చు.

కానీ ‘‘లేవు’’... ఉన్నా ‘‘కనిపించడం లేదు’’ అనడానికి మన వద్ద... అంటే ప్రజల వద్ద ఉన్న బలమైన ఆధారాలేమిటో చూద్దాం ఒక్కొక్కటిగా....

నాకు వెంటనే తోచినవి, స్థలాభావంవల్ల, సమయాభావం వల్ల వెంటనే నేను తెలియచేయలేకపోయినవి,  నాకు స్ఫురించనివి, మీరు స్వతహాగా అనుభవిస్తున్నవి మీరు కూడా చెప్పవచ్చు...

మనకు ఒక సమస్య ఎదురవుతుంది. వ్యక్తిగతం కానీ, కుటుంబపరంగా కానీ లేదా ఎక్కువ మంది ప్రజలకు సంబంధించినది గానీ... కింద నుండి మొదలుపెట్టి పైదాకా అన్ని స్థాయిల్లో మనం అర్జీలు పెట్టుకుంటాం. అధికార యంత్రాంగానికి అర్జీ సమర్పించడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే... సవాలక్ష కొర్రీలు వేసి, మరో అర డజను ఆఫీసుల చుట్టూ తిప్పి చివరకు దానిని బుట్టదాఖలా చేసే అవకాశాలు ఎక్కువ. అయినా అష్టకష్టాలు భరించి పెట్టుకుంటాం. ఎవరూ పట్టించుకోరు. విసుగెత్తిపోతాం. నేరుగా ప్రభుత్వాధినేతకు.. ఆయన మన అభిమాన నాయకుడు కదా...ప్రజలకోసమే జీవితాన్ని అంకితం చేసినట్లు తరచూ ప్రకటించుకుంటుంటారు కదా అని ..అయినా అలా వారికి మన సమస్య విన్నవించుకోవడం మన హక్కు అన్న భ్రమలో నేరుగా ఆయన ఇంటికి కానీ, లేదా ఆయన కార్యాలయానికి కానీ పోయి చెప్పుకోవాలనుకుంటాం

·        కానీ ఆ దరిదాపుల్లోకి మనకు రానీయరు.

·        అందుకని మనం ఎన్నుకున్న మన ప్రాంత ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటాం. వారిని పంపుతాం. వీరికి కూడా రాజుగారి కోటలోకి  ప్రవేశం ఉండదు. అసలు వీరు పోవడానికి సాహసించరు.... లాగులు తడుస్తాయనే భయం.

·        ఇక మనకు మిగిలింది మంత్రులు.. వీరు క్షేత్రస్థాయిలో ..అంటే మన ఇలాఖాలో పులులు. ఆ గాండ్రింపులు వింటే అడవి పులులు కూడా భయపడతాయి. కానీ గుహకు ఆమడ దూరంలోనే తోక ముడిచేస్తారు. అటెండరుకు మస్కా కొట్టి మన అర్జీ కాగితపు ముక్కలను లోపల రాజుగారి మేజా మీదకు చేర్చే ఏర్పాటు మాత్రం ...నిజాయితీగా చేస్తారు. కానీ అక్కడ గుట్టలుగా ఇలా పేరుకుపోయిన ఫైళ్ళ అడుగున ఇవి కూడా అతుక్కుపోతాయి. గుట్టలు కరిగితే కానీ వీటికి మోక్షం దొరకదు. ఎన్నికల ఎండలకు తప్ప వాటికి మరోవిధంగా కరిగే గుణం ఉండదు.

·        ఇక మనకు మిగిలిన ఏకైక దిక్కు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. వీరికి నోరు ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువే. అయితే అధికార పార్టీ లాగా వీరికి నాటకాలాడాల్సిన పని లేదు. కోటకు కిలోమీటరు దూరం వరకు వీరి గాలికూడా సోకకూడదనే ఆజ్ఞలు వీరికి తెలుసు కాబట్టి... అవకాశం కోసం చూసి అది దొరకగానే ఈ అర్జీ సాకుతో లోపల దూరతారు... ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న స్వంత పనులు.. దొరికిన ఆ కొద్ది పుణ్యకాలంలోనే వీలయినన్ని చక్కబెట్టుకుని వచ్చేస్తారు. మన దరఖాస్తు అక్కడే ఎవరో ఒకరి చేతికి ఇచ్చి దులిపేసుకుంటారు.

చివరాఖరుకు జరిగేది ఏమిటంటే... మన అర్జీలు...తెగిన గాలిపటాల్లా ఏ చెట్టుకో, ఏ శాఖకో(మంత్రిత్వ) చిక్కుకుని వేలాడు తుంటాయి.

 

·      పెట్రో ధరలే కాదు, ఉప్పులు, పప్పులు, వంటనూనెలవంటి నిత్యావసరాలు, మందులు అందునా ప్రాణాధార మందులు, ...క్లుప్తంగా చెప్పాలంటే ప్రజలు ఎక్కువగా వాడే ప్రతి వస్తువు, ప్రతి సేవల ధరలు మామూలుగా పెరగడం కాదు, సంపన్నులు కూడా నోరెళ్ళబెట్టే స్థాయిలో పెరుగుతూ పోతూనే ఉన్నాయి.  మామూలు రోజుల్లో జనం అలవాటు పడిపోయారు-అని అనుకున్నా...లాక్ డౌన్ మొదలయిన నాటి నుంచీ ఈ రోజు వరకూ అన్ని రకాల వస్తువుల ధరలు చుక్కలకేసే చూస్తున్నాయి. కూరగాయల విషయాన్నే తీసుకుంటే ... రైతు బజార్లో రు.10-20లకు దొరికేవి వినియోగదారులకు వారివారి  ప్రాంతాల్లో రు.50-60లకు బహిరంగంగానే ప్రతి రోజూ అమ్ముతూనే ఉన్నారు...నెలల తరబడి, సంవత్సరాల తరబడి..

·      తూనికలు, కొలతలు, నాణ్యత(కల్తీ)తనిఖీలకు, అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి ఒక శాఖ ఉన్నదనే విషయం చాలా మందికి తెలియదు. ..ఎంతగా అంటే ప్రభుత్వాలకే గుర్తుండనంత.. ఏళ్ళ తరబడి అక్కడ  కంటితుడుపుగా పనిచేస్తున్న నామమాత్రం ఉద్యోగులే...ఉద్యోగ ధర్మంగా సంవత్సరంలో కొన్ని కేసులు నామమాత్రంగా బుక్ చేస్తుంటారు....అంతే...గరిష్ఠ చిల్లర ధర మీద వారానికో కొత్త స్టిక్కర్ వెలుస్తూనే ఉంటుంది. రేటు ఎక్కువ, తూకం తక్కువ, ఏది చూసినా నాసి రకం, కల్తీలు....

ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి ...అంటే మనం బతికే ఉన్నాం...అని అర్థం.

ప్రభుత్వాలకు మాత్రం  కనిపించడం లేదంటే దానర్థం...

? ? ? ? ? ? ?

దానికి ప్రత్యేకించి రుజువులు కూడా కావాలా..?


-        చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

సూదికోసం సోదికెడుతున్నావా ? ? ?

 



ఏ దేశమేగినా, ఎందుకాలిడినా

అదే మట్టి కాలికంటుతున్నప్పడు

ఆ మట్టిలోంచి పుట్టిన మనిషి

కంటికోరకంగా కనిపిస్తే ఎట్లా !

 

మానవత్వం పీక పిసికి

స్వార్థపు సంచుల్లో కుక్కి చెప్పే

మత ఇతిహాసాలు, ఘనతలు

కులపురాణాలు, వర్గ చరితలు

పరిశుద్ధత, పాతివ్రత్యాల వల్లెవేతలు

ఇక ఆపు...

ఆ కారుకూతలు ఇంకా ఎందుకు

ఆ రంగుటద్దాలు తీసిపారేయ్

పో..పోయి నీ డిఎన్ ఏ చూసుకో

 

చరిత్రలోంచి పొడుచుకొచ్చిన

కొమ్ములతో, గిట్టలతో

తల్లి భూమిని కుళ్ళబొడిచి

లంకె బిందెలు తీయొద్దు

వారసత్వ హక్కులు చాటొద్దు

....

ఓ రాక్షసుడి రాజ్యంలో

కొద్దికాలంపాటూ ఒంటరిగా

కోటకు దూరంగా ఉంటేనే...

అగ్ని పరీక్షలు అవసరమనిపిస్తే....

 

ఏ దేశ చరిత్ర చూసినా

పరపీడన పరాయణత్వం అయినప్పుడు

శతాబ్దాల పరాయిపాలనలో

నలిగిన తాతముత్తాతలకు, మనకు

ఎన్ని శల్య పరీక్షలు చేయించాలో,

ఎన్ని డిఎన్ ఏలు తీయించాలో

లెక్కగట్టకుండా

ఇంకా

ఆ కూతలెందుకు, రాతలెందుకు

ఇంకా ఆ రంగుటద్దాలెందుకు,

తీసెయ్....

  

పెత్తందార్ల కాళ్ళకింద

పాశవికంగా నలిగిన

ఏ తోలుసంచీనుంచి జారి పడిన

ఏ జీవపు చుక్క

ఏ నెత్తుటి మొక్కయి

ఎంత పెద్ద మానయిపోయిందో

ఎన్నేసి  ఊడలు దింపిందో

ఏ ఎఱుకల సానో చెప్పాలి...

 

సూదీ వద్దు సోదీ వద్దు

సోదికత్తెలను కదిలించకు

జాతక చక్రాలన్నీ తిరగబడతాయి

 

రాక్షసరూప నరుడివై

చరిత్రలో చీటికీమాటికీ తలదూర్చొద్దు

చరిత్రలు మార్చొద్దు

....

ఏ నెత్తురు ఎటు పారుతోందో

సూర్యచంద్రులే చూడలేరు

అన్ని మొక్కల్లో పారే నెత్తుటి చుక్కలు

ఒక్కటే అనుకో

 

ఏ మొక్క అన్నది చూడకు

ఓ గుక్కెడు నీళ్ళుపోస్తుండు చాలు

కొత్త చిగుళ్లు తొడుగుతుంది,

కులమతాల కుళ్ళు,

వర్గ, ప్రాంతాల చీడలు లేని

కల్పవృక్షాల తోటవుతుంది

మానవత్వంతో మాగబెట్టి

రసాలూరే ఫలాలను

రాశులుగా నింపుతుంది

 

-  చినవ్యాసుడు  మాఊరు


ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...