ఇక ఒక్కటే మిగిలింది...అదీ కొట్టేస్తాం

 



‘వల’ పక్షంతో

కృష్ణపక్షాన్ని  శుక్లపక్షం చేసేసాం

రహదారుల్ని తప్పించి

ప్రతి-పక్షాన్నీ... డొంకదారుల్లోకి నెట్టేసాం

 

చతుర్విధ ఉపాయాలతో

చెప్పినట్లు ఊపేలా అధికారుల

తలా తోకా చేతుల్లోకి తీసేసుకున్నాం.

 

పశుబలంతో చట్టసభలను

చాపలాచుట్టి చంకనెట్టేసుకున్నాం

 

నిజాలు, ఇజాలంటూ

కొన్ని పత్రికలు, టీవీలు రెచ్చిపోతున్నాయి

జర్నలిస్టులు కొందరు ఒంటికాలిమీద లేస్తున్నారు

సో.మీ.ల్లో సొల్లు ఎక్కువవుతున్నది...

 

జోలపాటలు పాడడం

ప్రజల్ని జోలెలో వేసుకోవడం

వెన్నతో పెట్టిన విద్యయినప్పుడు

ఎన్ని కోళ్ళు ఎక్కడెక్కి అరిచినా ఏమవుతుంది...

కటిక అమవాసల్ని కూడా

నిండు పున్నములుగా చూపే

మన ఇంటి మీడియా కోళ్ళు మనకుండగా

 

వాటి జీవితగమనం వాటికే తెలియని

మన బిళ్ళ మెళ్ళో వేసుకున్న గొర్రెలు...

నూటొక్క జిల్లాలకు అందగాళ్ళమంటూ

ప్రపంచరాజ్యాలన్నీ మనవెనకే అంటూ

పొద్దస్తమానం వసపిట్టల్లాకూసే

వంతపాటగాళ్లున్నంతవరకూ

మనకు బేఫికరయ్యా....

 

ప్చ్..... ...భయ్యా..

ఇక అదొక్కటే మనకు  కొరకరాని కొయ్య

అసమదీయ జడ్జీలున్న బెంచీలకు వెళ్లినా

అన్నివేళలా తీర్పులు మనవి కానప్పుడు

అధికారుల్ని కవచాల్లా వాడుకుంటున్నా

కోర్టులు వాటికి తూట్లు పొడుస్తున్నప్పుడు...

 

ఇంటి కోడిలా మనకో సొంత ‘కోడ్’ ఉండాలి

మనకో సొంత కోర్టు ఉండాలి

కిందినుంచి పైదాకా అన్ని కోర్టులను

అది కాలికింద తొక్కిపెట్టేట్లుండాలి...

 

ఏ సంక్షోభం ఎలా వచ్చినా

మన పబ్బం మనం గడిపేసుకుంటున్నాం.

కరోనా, కర్ఫ్యూల తో మరోసారి

కాలం కలిసొస్తున్నప్పుడు ...

ఇంత మంచి సమయమూ.. మించినన్ దొరకదు

ఇప్పటికిదే మన ఏకైక కర్తవ్యం...

మనం చేసిందే చట్టం, చెప్పిందే ధర్మం

కొట్టేయ్..గురిపెట్టి

 

-  చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

ధరల పెరుగుదల దేశాభివృద్ధికి సూచికా....???

 



అలుపూ సొలుపూ లేకుండా

నెత్తిన జుత్తు పెరుగుతున్నట్లు

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

జనం సణుక్కుంటుంటారు

 

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

కోర్టులు విస్తుపోతూ ఫర్మానాలు జారీ చేస్తుంటాయి

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

ప్రతిపక్షాలు అప్పుడప్పడూ తలెత్తి

భౌ..భౌమంటుంటాయి

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

సమయ సందర్భాలసు చూసుకుంటూ

మీడియాకూడా కస్సుబుస్సులాడుతుంటుంది

 

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

అధికారులు సమీక్షలు నిర్వహిస్తుంటారు

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

సి.ఎం.లు, పిఎంలూ అడపాదడపా

నోటిమాటగా గాఠ్ఠిగా హెచ్చరిస్తుంటారు

 

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

వ్యాపారులు కొత్త సాకులు చెప్తుంటారు

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

సరుకులు.. తూకం, నాణ్యతలను తగ్గిస్తుంటాయి

 

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

పార్టీలకు విరాళాలు భారీగా పెరుగుతుంటాయి

అదే పనిగా ధరలన్నీ పెరుగుతూ పోతుంటే...

సర్కారు రాబడులు పెరుగుతూ పోతుంటాయి...

 

పెరుగుతుంటాయి..పెరుగుతూ పోతుంటాయి

ఈ పెరుగుదలంతా దేశాభివృద్ధి లెక్కల్లోకి చేరి

పెద్దదేశాల పక్క పీటలమీదికి ఎక్కించేస్తుంటాయి

అధినేతల ఛాతీల కొలతలు పెంచేస్తుంటాయి

 

సమాజ ప్రయోగశాలల్లో

ప్రజల రక్తమాంసాలనుండి తీసి

ప్రజలపైనే పరీక్షించి వదిలిన వాక్సిన్లను

ప్రజలకే అమ్మి వారి ఆరోగ్యానికి

ప్రభుత్వం పూచీ మాత్రం ఇస్తుంటుంది

ఛస్తే..అప్పుడప్పుడూ...

ఎక్స్ గ్రేషియాలు కూడా విదిలిస్తుంటుంది

 

-చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 

మిత్రమా !!!

 

నిన్న- మాత్రమే నీది,

ఈరోజు - నేను నీ దాన్నేనని

నీవింకా బతికున్నావని

గ్యారంటీ ఏమిటంటున్నది...

 

ఉలకక పలకకపోతే

రంగుల కలలు కంటున్న నీ

రేపు- నీ కళ్ళముందే రేపయిపోతుంది.....

తస్మాత్ జాగ్రత్త...జాగ్రత్త...

 

ఇవి లాక్ డౌన్ టైంపాస్ కవితలు కావు..

అవి అలారం టైంపీసులు..

 

నీ వారిని కరోనా పీడించకుండా

‘రక్ష’ తాయెత్తు కట్టుకుంటున్నట్టే...

ఓ అడుగు ముందుకేయ్

నీ జాతి రక్షణకోసం

ఈ మేల్కొలుపు కవితల్ని

నలుగురికీ షేర్ చేయ్ ...

నీ జెండా ఎగరేయ్...

 

మీ-చిన వ్యాసుడు.

............................

ఏ మందును, ఏమందును... ‘అదే మందు’... అందునా ...!!!


దేముడున్నాడా ? 

నమ్మిన వాళ్ళకు ఉన్నాడు. నమ్మని వాళ్లకు లేడు. ... 

ఇటువంటివే చాలా ప్రశ్నలు ఆదిమ సమాజాల నుంచీ ఆధునిక సమాజాల వరకు 

సరికొత్తగా పుడుతూ, రకరకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంటాయి. 

 

ఆనందయ్య మందు సందర్భంగా 
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన ప్రశ్న కూడా అటువంటిదే. 
దీనిపై పెదవి కదపని వారు లేరు. 

గీతకు కొందరు అటుంటే కొందరు ఇటు.. 
మీరెటో చెప్పే లోపల ... నేను ఎటో చెప్పాలిగా !!!


అది చెప్పడానికి నేను ‘నమ్మకం’ అనే ఒక మూలికను పట్టుకుని వస్తున్నా. ఆయుర్వేద సూత్రాల్లో ఒకానొక సూత్రం–‘రోగం దేనితో తగ్గితే అదే మందు’- అంటుంది. వినడానికి తేలిగ్గా ఉన్నా, ఇది చాలా గూఢార్థాలను దాచుకుంది. ‘ఒన్ సైజ్ ఫిట్స్ ఆల్- అన్నట్లు ఏదీ ఉండదు’-అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అంటే ఒకరి కొలతల ప్రకారం సరిగ్గా అమరేలా బట్ట కుట్టవచ్చు, కానీ అందరికీ అదే కొలతతో కుట్టడం సాధ్యం కాదు.  ఈ సామెత అక్షరాలా అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, మూలికా వైద్యం, మంత్రం....వంటివి ఏవయినా కావచ్చు..అన్ని వైద్యవిధానాలకూ వర్తిస్తుంది. ‘సర్వరోగ నివారిణి’ అన్నవి పైపైన పలకరించిపోయే తుమ్ములు, తలనొప్పులు, ఒంటినొప్పులవంటి రోగాలకు ఉండవచ్చేమో కానీ కాస్త తీవ్రత సంతరించుకున్న ఏ జబ్బుకయినా- అందరికీ ఒకే మందు –అంటూ ఏదీ ఉండదు. ఒకవేళ ఉన్నా ..రోగిని పరీక్షించి వైద్యుడు దాని మోతాదులు మారుస్తూ తన పర్యవేక్షణలో సందర్భాన్నిబట్టి చికిత్స చేస్తుంటాడు.

ఏ డాక్టరు దగ్గరికెళ్ళినా...రోగిని చూడంగానే ఆయనకు అర్థమయ్యేది కొంతే...మిగిలినదంతా రోగిమీద ప్రయోగం, పరిశీలనలతోనే నిర్ధారిస్తాడు. అందుకే ఇది వాడు... మూడు రోజుల తరువాత రా, అప్పుడు చూద్దాం అంటాడు... అంతే తప్ప 100% గ్యారంటీ ఏ డాక్టరూ ఇవ్వడు...

 కొన్నేళ్ళ క్రితం..కొంత కాలంపాటు దగ్గుతో నిద్రలేని రాత్రుళ్ళు గడిపా. అన్ని పరీక్షలూ చేయించా. డాక్టర్లిచ్చిన మందులు వాడుతున్నప్పటికీ తరచుగా మళ్ళీ తిరగబెడుతుండేది. ఏ రాత్రీ ప్రశాంతంగా గడిచేది కాదు. కార్టన్లకు కార్టన్లు కాఫ్ సిరప్ లు తాగేసా...ఆ సమయంలో అనుకోకుండా బాగా ఆత్మీయుడైన ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసా..ఆయన ఆయుర్వేద కళాశాలలకు ప్రిన్సిపాలుగా కూడా చాలాకాలం వ్యవహరించారు. మాటల మధ్యలో నా సమస్య ప్రస్తావించా. లోపలికివెళ్ళి.. చేతిలో చిన్న పొట్లాలతో వచ్చారు. రాత్రి పడుకునే ముందు పాలల్లో ఒక ప్యాకెట్ పొడి కలిపి తాగు..అన్నారు. సరే అని ఆ రాత్రి పాలగ్లాసు ముందు పెట్టుకుని పొట్లం విప్పితే... పొడి కనిపిస్తేగా. కళ్ళు తాటికాయలంత చేసుకుని చూస్తే.. ఓ మూలన ధనియపు గింజంత పొడి కనిపించింది. చేసేది లేక అదే కలుపుకుని తాగి పడుకున్నా.

అంతే..రోజూ ఆరింటికే లేచేసేవాణ్ణి..  తొమ్మిదయినా లేవకపోతే ఇంట్లో అనుమానం వచ్చి గట్టిగా కుదిపి లేపారు. అంత నిద్ర.. అంత గాఢ నిద్ర, అంత మొద్దు నిద్ర, అంత ప్రశాంత నిద్ర, బ్రేకులు లేని నిద్ర అంతకుముందు ఎన్నడూ ఎరగను. ఆ మందే పనిచేసి ఉంటుందని అనుమానం..మరో రెండు మూడు రోజులు చూసి నిస్సందేహంగా అదేనని నిర్ధారించుకుని కోర్సు పూర్తయిన తరువాత డాక్టరు దగ్గరకెళ్ళి ‘అద్భుతం’ అంటూ విషయం చెప్పి.. ‘ఈ పొట్లాలే నెలకో, ఆర్నెల్లకో సరిపడా కట్టి ఇవ్వండి సార్’ అనడిగా. ‘వద్దు. ఆపేస్తా’అని ఆయన మందు మార్చి ఇచ్చారు. కానీ ఆ పొడి లాగా ఈ కొత్త లేహ్యం ప్రభావం చూపలేదు.  ఈ అయోమయం ఏమిటో అర్థం కాక, మిత్రుడయిన ఒక అలోపతి డాక్టరును అడిగితే...‘అది నల్లమందేమో !!!’ అని గుండెల్లో ఢాం అని ఓ బాంబు పేల్చాడు. ఆ దెబ్బకు మళ్ళీ నేరుగా తలతిప్పకుండా వెళ్ళి ఆయుర్వేద పండితుడి కాళ్ళమీద పడి ‘నాకు అప్పుడు మీరిచ్చిన పొడి నల్లమందా!’ అని అడిగా. నా గాభరాకు కారణం.. నేను ఆ మత్తుమందుకు బానిసయిపోతానేమోననే భయం...

అప్పడు సదరు పండితుడు కూల్ గా ....‘‘రోగంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు... నీకు ఉపశమనం కలిగించే మందు డాక్టర్ ఇచ్చినప్పుడు... అది ఏది అన్నది నీకు అనవసరం. అల్లోపతా, ఆయుర్వేదమా... గాడిదగుడ్డా...అని చూడకూడదు. డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. మందు మీద గురి ఉండాలి. తగిన మోతాదులో ఇస్తే.. విషం కూడా అమృతం అవుతుంది. అమృతమే కదా అని మోతాదు పెంచితే అది విషం అవుతుంది. ఇది మనసులో పెట్టుకుని చికిత్స చేయించుకో నా దగ్గరయినా, మరెక్కడయినా, మరెప్పుడయినా...’ అని హితబోధ చేసాడు.

ఇప్పడు చెప్పండి మీరు ఆనందయ్య గీతకు ఎటువైపున్నారో !!!

 

-చిన వ్యాసుడు, మా ఊరు,

chinavyasudu@gmail.com

........

చిత్రం... భళారే విచిత్రం. చిత్రం...అయ్యారే విచిత్రం

                                                                                                                             

       

‘దెబ్బ తగిలితే కానీ తత్త్వం బోధపడదు’ అన్నది ఆర్యోక్తి. 

అంటే ఏదయినా మన స్వానుభవంలోకి వస్తే తప్ప దాని మంచీచెడులు మనకు అంత సులభంగా అర్థం కావు. ఈ సామెతలో కొంత తాత్వికత కూడా ఉంది. ‘తత్త్వం’ అంటే – ‘‘అసలుసిసలు స్వరూపం, నిజ స్వభావం’’ అని.  ‘దేముడు’ అని కూడా...అంటే కష్టాలు కమ్ముకొచ్చినప్పుడుతప్ప సుఖాల్లో దైవచింతన స్ఫురించదు-అని.  

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే- 

కరోనా కొట్టిన దెబ్బకు... మనకు తత్త్వం బోధపడి ఇన్నాళ్ళనుంచీ గుడ్డిగా నమ్మకం పెంచుకున్న 

మన జీవనశైలి అసలు స్వరూప స్వభావాలను, వ్యవస్థల స్థితిగతులను 

స్పష్టంగా చూసుకుంటూ అవాక్కయిపోతున్నాం.


ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, వాటి సిబ్బంది విలువను గుర్తించడమే కాక, నిజంగా మనకున్న ఆస్పత్రులు, వాటిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, లేబరేటరీలవంటి మౌలిక వైద్య సదుపాయాల కొరతతోపాటూ... పరాకాష్ఠగా-మన శ్మశానాల దైన్య స్థితిని కూడా చూస్తున్నాం. అలాగే ప్రైవేటు, కార్పొ‘రేటు’ ఆస్పత్రుల పట్ల ఉన్న భ్రమలు తొలగి భయాలు కొత్తగా వచ్చి చేరాయి. అంబులెన్సులను ఆపద్బంధువుల్లాగా చూసిన మన కళ్ళకు ఇప్పుడవి రక్తపింజర్లలాగా కనిపిస్తున్నాయి.

విద్యారంగంలో కూడా ఇదే జ్ఞానోదయం మనకు కలుగుతున్నది. బడులు, గురువుల అవసరంతోపాటూ ప్రైవేటు విద్య, కార్పొ‘రేటు’విద్యపట్ల, కంప్యూటర్ బోధన, ఆన్ లైన్ టీచింగ్ వంటి అధునాతన సాంకేతికతలపట్ల ఉన్న అంచనాలు కూడా తప్పుతున్నాయి. చుక్కల్లో విహరిస్తున్న ఐటి రంగంలో... పనిచేసే పద్ధతులే అనూహ్యంగా మారిపోవడం, దూసుకుపోతున్న వాటి ప్రగతి-ఉద్యోగుల బ్యాంకు బ్యాలెన్సులను ఇష్టానురీతిగా పెంచుతుండడంతో... హద్దూపద్దూ లేకుండా సాగుతూ పోతున్న వారి జీవనవిధానాలు, వాటిని తృప్తిపరచడానికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనుబంధ వ్యాపారాలు ఉన్నట్లుండి సుడిగుండాల్లో చిక్కుకుపోవడం సమాజాన్నే ఒక్క కుదుపు కుదిపేసింది. ఐటి మోజులో నిర్లక్ష్యానికి గురయిన పరిశ్రమలు, ఇతర ఉపాధిరంగాల విలువ ఏమిటో లక్షలాది వలసకూలీలు ఇంటిముఖం పడితే కానీ బోధపడలేదు. మహమ్మారి దెబ్బతో ప్రపంచంలో అన్ని ఉత్పత్తి వ్యవస్థలు చచ్చుపడినా, ప్రకృతి ఆధారంగా సాగే వ్యవసాయం మానవాళికి ప్రాణాధారంగా నిశ్చింతగా  నిలదొక్కుకోవడం చిత్రాతిచిత్రం.

ఇంత నిర్వేదంలోనూ సాధారణ జీరోవాట్ బల్బుల లాంటి  సామాన్యులు- వారి దానధర్మాలు, సేవలతో బాథాతప్తులను, అన్నార్తులను ఆదుకుంటూ వెయ్యి సూర్యుళ్ళ కాంతి విరజిమ్మడం.. అపూర్వం. అంతటితో ఆగకుండా...మానవత్వం దైవత్వంగా మారుతున్న పరిణామక్రమాన్ని కూడా విస్పష్టంగా చూస్తున్నాం. అంత్యక్రియలకే కాదు, కడచూపుకుకూడా అయినవారు, కడుపుచించుకు, పేగు తెంచుకు పుట్టినవారు కాలు కదపలేని జడత్వం ఆవరించిన క్షణాల్లో... దిక్కూమొక్కూలేని వందలాది శవాలకు తామే సర్వస్వమై సగౌరవంగా సాగనంపడానికి ముందుకొచ్చిన వారిని చూసి సాష్టాంగపడకుండా ఉండలేని విభ్రమగొలిపే చిత్రం ..భళారే విచిత్రం.

నివ్వెరపాటుగొలిపే మరో చిత్రాతి చిత్రం... రాజూ-పేద, ధనికులు-దళితులు, అగ్రదేశాలు-అట్టడుగు దేశాలను కరోనా సమానదృష్టితో చూడడంతో...కులం, మతం, వర్గం, ప్రాంతాలు.. హద్దులు, వైషమ్యాలు మరచి వసుధైక కుటుంబమై పరస్పర ఓదార్పులతో గడపడం కనీవినీ ఎరుగని అబ్బురం.

భూతద్దాలకు కూడా దొరకని, మందులకు, చికిత్సలకు కూడా కొరుకుడుపడని ఒక సూక్ష్మాతిసూక్ష్మజీవి.... ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న రాక్షసిగా చాలా మందికి దర్శనమిస్తే- ఆధ్యాత్మిక చింతనాపరులకు.. మనసుల్లో ఎక్కడో ఓ మూలన ‘‘పవిత్రాణాయ సాధూనాం....’’అంటూ ధర్మసంస్థాపనకు ప్రతియుగంలోనూ నేను అవతరిస్తుంటాను అన్న గీతాచార్యుడి మాటలు మెసలడం యాదృచ్ఛికం.

ఇదంతా మనం ఇప్పటిదాకా చూసిన చిత్రాతిచిత్రమైన విచిత్ర చరిత్ర.

దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలానే ఉన్నా, ముఖ్యమైన వాటిని స్మరించుకుంటూ ముందుకు సాగుదాం... సరికొత్త జీవన శైలితో నూతన ప్రపంచం దిశగా....


·        తలచినదే జరిగినదా దైవం ఎందులకూ, జరిగినదే తలచితివా శాంతిలేదు నీకూ... అనుకుంటూ ఉండడం.

·        ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా...అని మనకు మనం హెచ్చరికలు చేసుకుంటూ స్వశక్తిని నమ్ముకుని జాగ్రత్తపడడం.

·        గృహమే స్వర్గసీమ...అన్న నమ్మకాన్ని ఆచరణలో చూపడం..

వాక్సిన్లు, మందులు పుష్కలంగా రాబోతున్న ఈ తరుణంలో ....

ü  జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా, జంకుగొంకులేక ముందు సాగిపొమ్మురా... అనుకుంటూ హుషారుగా సాగడం.

 

-      చినవ్యాసుడు, మా ఊరు

chinavyasudu@gmail.com

........

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...