ఏ మందును, ఏమందును... ‘అదే మందు’... అందునా ...!!!


దేముడున్నాడా ? 

నమ్మిన వాళ్ళకు ఉన్నాడు. నమ్మని వాళ్లకు లేడు. ... 

ఇటువంటివే చాలా ప్రశ్నలు ఆదిమ సమాజాల నుంచీ ఆధునిక సమాజాల వరకు 

సరికొత్తగా పుడుతూ, రకరకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంటాయి. 

 

ఆనందయ్య మందు సందర్భంగా 
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన ప్రశ్న కూడా అటువంటిదే. 
దీనిపై పెదవి కదపని వారు లేరు. 

గీతకు కొందరు అటుంటే కొందరు ఇటు.. 
మీరెటో చెప్పే లోపల ... నేను ఎటో చెప్పాలిగా !!!


అది చెప్పడానికి నేను ‘నమ్మకం’ అనే ఒక మూలికను పట్టుకుని వస్తున్నా. ఆయుర్వేద సూత్రాల్లో ఒకానొక సూత్రం–‘రోగం దేనితో తగ్గితే అదే మందు’- అంటుంది. వినడానికి తేలిగ్గా ఉన్నా, ఇది చాలా గూఢార్థాలను దాచుకుంది. ‘ఒన్ సైజ్ ఫిట్స్ ఆల్- అన్నట్లు ఏదీ ఉండదు’-అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అంటే ఒకరి కొలతల ప్రకారం సరిగ్గా అమరేలా బట్ట కుట్టవచ్చు, కానీ అందరికీ అదే కొలతతో కుట్టడం సాధ్యం కాదు.  ఈ సామెత అక్షరాలా అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, మూలికా వైద్యం, మంత్రం....వంటివి ఏవయినా కావచ్చు..అన్ని వైద్యవిధానాలకూ వర్తిస్తుంది. ‘సర్వరోగ నివారిణి’ అన్నవి పైపైన పలకరించిపోయే తుమ్ములు, తలనొప్పులు, ఒంటినొప్పులవంటి రోగాలకు ఉండవచ్చేమో కానీ కాస్త తీవ్రత సంతరించుకున్న ఏ జబ్బుకయినా- అందరికీ ఒకే మందు –అంటూ ఏదీ ఉండదు. ఒకవేళ ఉన్నా ..రోగిని పరీక్షించి వైద్యుడు దాని మోతాదులు మారుస్తూ తన పర్యవేక్షణలో సందర్భాన్నిబట్టి చికిత్స చేస్తుంటాడు.

ఏ డాక్టరు దగ్గరికెళ్ళినా...రోగిని చూడంగానే ఆయనకు అర్థమయ్యేది కొంతే...మిగిలినదంతా రోగిమీద ప్రయోగం, పరిశీలనలతోనే నిర్ధారిస్తాడు. అందుకే ఇది వాడు... మూడు రోజుల తరువాత రా, అప్పుడు చూద్దాం అంటాడు... అంతే తప్ప 100% గ్యారంటీ ఏ డాక్టరూ ఇవ్వడు...

 కొన్నేళ్ళ క్రితం..కొంత కాలంపాటు దగ్గుతో నిద్రలేని రాత్రుళ్ళు గడిపా. అన్ని పరీక్షలూ చేయించా. డాక్టర్లిచ్చిన మందులు వాడుతున్నప్పటికీ తరచుగా మళ్ళీ తిరగబెడుతుండేది. ఏ రాత్రీ ప్రశాంతంగా గడిచేది కాదు. కార్టన్లకు కార్టన్లు కాఫ్ సిరప్ లు తాగేసా...ఆ సమయంలో అనుకోకుండా బాగా ఆత్మీయుడైన ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసా..ఆయన ఆయుర్వేద కళాశాలలకు ప్రిన్సిపాలుగా కూడా చాలాకాలం వ్యవహరించారు. మాటల మధ్యలో నా సమస్య ప్రస్తావించా. లోపలికివెళ్ళి.. చేతిలో చిన్న పొట్లాలతో వచ్చారు. రాత్రి పడుకునే ముందు పాలల్లో ఒక ప్యాకెట్ పొడి కలిపి తాగు..అన్నారు. సరే అని ఆ రాత్రి పాలగ్లాసు ముందు పెట్టుకుని పొట్లం విప్పితే... పొడి కనిపిస్తేగా. కళ్ళు తాటికాయలంత చేసుకుని చూస్తే.. ఓ మూలన ధనియపు గింజంత పొడి కనిపించింది. చేసేది లేక అదే కలుపుకుని తాగి పడుకున్నా.

అంతే..రోజూ ఆరింటికే లేచేసేవాణ్ణి..  తొమ్మిదయినా లేవకపోతే ఇంట్లో అనుమానం వచ్చి గట్టిగా కుదిపి లేపారు. అంత నిద్ర.. అంత గాఢ నిద్ర, అంత మొద్దు నిద్ర, అంత ప్రశాంత నిద్ర, బ్రేకులు లేని నిద్ర అంతకుముందు ఎన్నడూ ఎరగను. ఆ మందే పనిచేసి ఉంటుందని అనుమానం..మరో రెండు మూడు రోజులు చూసి నిస్సందేహంగా అదేనని నిర్ధారించుకుని కోర్సు పూర్తయిన తరువాత డాక్టరు దగ్గరకెళ్ళి ‘అద్భుతం’ అంటూ విషయం చెప్పి.. ‘ఈ పొట్లాలే నెలకో, ఆర్నెల్లకో సరిపడా కట్టి ఇవ్వండి సార్’ అనడిగా. ‘వద్దు. ఆపేస్తా’అని ఆయన మందు మార్చి ఇచ్చారు. కానీ ఆ పొడి లాగా ఈ కొత్త లేహ్యం ప్రభావం చూపలేదు.  ఈ అయోమయం ఏమిటో అర్థం కాక, మిత్రుడయిన ఒక అలోపతి డాక్టరును అడిగితే...‘అది నల్లమందేమో !!!’ అని గుండెల్లో ఢాం అని ఓ బాంబు పేల్చాడు. ఆ దెబ్బకు మళ్ళీ నేరుగా తలతిప్పకుండా వెళ్ళి ఆయుర్వేద పండితుడి కాళ్ళమీద పడి ‘నాకు అప్పుడు మీరిచ్చిన పొడి నల్లమందా!’ అని అడిగా. నా గాభరాకు కారణం.. నేను ఆ మత్తుమందుకు బానిసయిపోతానేమోననే భయం...

అప్పడు సదరు పండితుడు కూల్ గా ....‘‘రోగంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు... నీకు ఉపశమనం కలిగించే మందు డాక్టర్ ఇచ్చినప్పుడు... అది ఏది అన్నది నీకు అనవసరం. అల్లోపతా, ఆయుర్వేదమా... గాడిదగుడ్డా...అని చూడకూడదు. డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. మందు మీద గురి ఉండాలి. తగిన మోతాదులో ఇస్తే.. విషం కూడా అమృతం అవుతుంది. అమృతమే కదా అని మోతాదు పెంచితే అది విషం అవుతుంది. ఇది మనసులో పెట్టుకుని చికిత్స చేయించుకో నా దగ్గరయినా, మరెక్కడయినా, మరెప్పుడయినా...’ అని హితబోధ చేసాడు.

ఇప్పడు చెప్పండి మీరు ఆనందయ్య గీతకు ఎటువైపున్నారో !!!

 

-చిన వ్యాసుడు, మా ఊరు,

chinavyasudu@gmail.com

........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...