ఇక ఒక్కటే మిగిలింది...అదీ కొట్టేస్తాం

 



‘వల’ పక్షంతో

కృష్ణపక్షాన్ని  శుక్లపక్షం చేసేసాం

రహదారుల్ని తప్పించి

ప్రతి-పక్షాన్నీ... డొంకదారుల్లోకి నెట్టేసాం

 

చతుర్విధ ఉపాయాలతో

చెప్పినట్లు ఊపేలా అధికారుల

తలా తోకా చేతుల్లోకి తీసేసుకున్నాం.

 

పశుబలంతో చట్టసభలను

చాపలాచుట్టి చంకనెట్టేసుకున్నాం

 

నిజాలు, ఇజాలంటూ

కొన్ని పత్రికలు, టీవీలు రెచ్చిపోతున్నాయి

జర్నలిస్టులు కొందరు ఒంటికాలిమీద లేస్తున్నారు

సో.మీ.ల్లో సొల్లు ఎక్కువవుతున్నది...

 

జోలపాటలు పాడడం

ప్రజల్ని జోలెలో వేసుకోవడం

వెన్నతో పెట్టిన విద్యయినప్పుడు

ఎన్ని కోళ్ళు ఎక్కడెక్కి అరిచినా ఏమవుతుంది...

కటిక అమవాసల్ని కూడా

నిండు పున్నములుగా చూపే

మన ఇంటి మీడియా కోళ్ళు మనకుండగా

 

వాటి జీవితగమనం వాటికే తెలియని

మన బిళ్ళ మెళ్ళో వేసుకున్న గొర్రెలు...

నూటొక్క జిల్లాలకు అందగాళ్ళమంటూ

ప్రపంచరాజ్యాలన్నీ మనవెనకే అంటూ

పొద్దస్తమానం వసపిట్టల్లాకూసే

వంతపాటగాళ్లున్నంతవరకూ

మనకు బేఫికరయ్యా....

 

ప్చ్..... ...భయ్యా..

ఇక అదొక్కటే మనకు  కొరకరాని కొయ్య

అసమదీయ జడ్జీలున్న బెంచీలకు వెళ్లినా

అన్నివేళలా తీర్పులు మనవి కానప్పుడు

అధికారుల్ని కవచాల్లా వాడుకుంటున్నా

కోర్టులు వాటికి తూట్లు పొడుస్తున్నప్పుడు...

 

ఇంటి కోడిలా మనకో సొంత ‘కోడ్’ ఉండాలి

మనకో సొంత కోర్టు ఉండాలి

కిందినుంచి పైదాకా అన్ని కోర్టులను

అది కాలికింద తొక్కిపెట్టేట్లుండాలి...

 

ఏ సంక్షోభం ఎలా వచ్చినా

మన పబ్బం మనం గడిపేసుకుంటున్నాం.

కరోనా, కర్ఫ్యూల తో మరోసారి

కాలం కలిసొస్తున్నప్పుడు ...

ఇంత మంచి సమయమూ.. మించినన్ దొరకదు

ఇప్పటికిదే మన ఏకైక కర్తవ్యం...

మనం చేసిందే చట్టం, చెప్పిందే ధర్మం

కొట్టేయ్..గురిపెట్టి

 

-  చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...