రాష్ట్ర డిజిపి గారికి బహిరంగ లేఖ

 


To

The Director General Of Police.....


నమస్తే..... 

 

ü  విషయం :   మన వీథిలో, మన బస్తీలో, మన నగరంలో, మన రాష్ట్రంలో... తోపుడుబండ్లపై వాడుతున్న చిన్న మైక్ సెట్లకు సంబంధించి.....

 

చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు సంబంధించిన ఒక చిన్న చిక్కు సమస్య ఇది. సమస్య చిన్నదే అయినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటున్నది. మీరు మీ శాఖ స్థాయిలోనే కాక, ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చించి వీలయినంత త్వరగా ఒక సానుకూల పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నా....

 

*     సాంకేతికత సాయంతో మారుతున్న ఆధునిక వ్యాపార శైలిలో ఇది ఒక తాజా పరిణామం. తోపుడుబళ్ళమీద, సైకిళ్ళు, మోపెడ్లమీద కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునేవారు(కూరగాయలు, పండ్లు, పూలు, పాత పేపర్లు/ఇనుప సామాన్లు, కత్తులకు సాన పట్టేవాళ్లు, గ్యాసు స్టౌ రిపేర్లు, సోఫా రిపేర్లు, ముగ్గు, చీపుర్లు, బూజు కర్రలు, ప్లాస్టిక్ సామాన్లు, బొట్టుబిళ్ళలు, పిన్నీసులు, మొలతాళ్ళు, సవరాలు, కొబ్బరిబోండాలు, చిరుతిళ్ళు, అల్లం-ఎల్లిగడ్డ-ఉల్లిగడ్డలు...ఈ జాబితా అనంతం....) వీరంతా  బ్యాటరీతో పనిచేసే సౌండ్ బాక్స్ తో ఉన్న చిన్న మైక్ సెట్లను  పెద్ద శబ్దంతో ఉపయోగిస్తున్నారు. ముందుగా రికార్డ్ చేసుకున్న వాయిస్ తో వారి గొంతు  శ్రమను తగ్గించుకుంటూ, వారి వ్యాపార సందేశాన్ని వీలయినంతమందికి చేరవేస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. వీరంతా బడుగువర్గాలవారు... రోజువారీ కష్టాన్ని నమ్ముకుని, అమ్ముకుని బతికేవారు.. కాబట్టి ఆ కోణంలో అది సంతోషించదగిన పరిణామమే.

  

*     మారుతున్న కాలంలో అనివార్యంగా మారినవి మనం ఉండే ఇళ్ళు కూడా. సమాజంలోని అన్ని స్థాయిలవారం అపార్ట్ మెంట్ల జీవితాలకు అలవాటు పడిపోయాం. నాలుగు, ఐదు... ఆ పైన ఆకాశహార్మ్యాలదాకా  నిలువుగా, అడ్డంగా  ఇవి పెరిగి పోతున్నాయి.  రెండు, మూడు గదుల వసతికి అనుగుణంగానే చిన్నాపెద్దా కుటుంబాలు సర్దుకుపోతున్నాయి.

 

*     విశ్రాంతికి, నిద్రకు, ఆహారానికి, ఆహ్లాదానికి మాత్రమే ఉపయోగించిన మన ఇంటి గదుల్లోకి.. లాక్ డౌన్ తరువాత...  తరగతి గదులు, ఆఫీసు గదులు, వీడియో కాన్ఫరెన్స్ స్డూడియోలు, చిరు వ్యాపారుల కౌంటర్లు, చివరకు రోగుల ఆస్పత్రి గదులు  కళ్ళు మూసి తెరిచేలోపు  చొరబడ్డాయి.. ఇలా మారిన ఇళ్లల్లో ప్రశాంతంగా బతకడానికి వీల్లేకుండా..పావుగంటకు, అరగంటకు ఒకటి చొప్పున వచ్చి వాయించిపోయే మైకులు... పనులకు అంతరాయం కలిగించడమే కాక, పరమ చికాకుగా తయారయ్యాయి. ఒక్క ఫోన్ కాల్ కూడా స్పష్టంగా మాట్లాడుకోలేని పరిస్థితి

  

*     ఇల్లిల్లూ తిరిగి వ్యాపారం చేసుకొనే చిరు వ్యాపారులకు  కూతవేటు దూరంలో కస్టమర్లు ఇప్పుడు అందుబాటులో లేరు. అపార్ట్ మెంట్ వాసులు అందనంత ఎత్తులో, దూరంలో ఉండడంతో వారిని ఆకర్షించడానికి మైకులు అనివార్యమయ్యాయి. ఇది ఒకవిధంగా ఉభయులకూ పనికివచ్చే ఏర్పాటే. అయితే ఆ వెనకున్న బ్లాకులోని ఆ పై అంతస్తులో ఉండే అపార్ట్ మెంట్ల  వరకూ...అంటే దాదాపు అరకిలోమీటరు పరిధిలోని అందరికీ వినిపించేంత పెద్దగా వీరీ మైకులను సెట్ చేస్తున్నారు. ఈ పిలుపు విని... కస్టమర్లు వచ్చే దాకా ఈ మైకులు చెవులు కోసిన మేకల్లా అరుస్తూనే ఉంటాయి.

   

*     పర్యావరణ పరిరక్షణ చట్టాలు, శబ్ద కాలుష్య చట్టాలు వీటి తాలూకు కోర్టుల తీర్పులు  అన్నీ...రాత్రి 10 గంటలనుంచీ, ఉదయం 6 గంటల లోపు పరిస్థితులను మీరు నియంత్రించడానికి మాత్రమే వీలు కల్పిస్తున్నాయి. అయితే ఈ చట్టాలు ఎక్కువగా మతపరమైన, వేడుకల సందర్భాల్లో ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావడంతో మీరు కఠినంగా వ్యవహరించినా ఇబ్బందేమీ ఉండేది కాదు. చిరు వ్యాపారులేమో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంట ల వరకు వరస కడుతున్నారు. వారి సమస్య కూడా పూర్తిగా  భిన్నమైనది. అందువల్ల వీరి జిీవికకు ఇబ్బంది కలుగకుండా ...అలాగే  ఇళ్ళ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేవిధంగా చూడాల్సి ఉంటుంది. 


 దీనిని అత్యంత ప్రాధాన్యతగల సమస్యగా పరిగణించి వెంటనే తగు చర్యలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా.

 

 

-        చినవ్యాసుడు,

Active Citizens Club

chinavyasudu@gmail.com



 

మ..మ్మ....మ్మాస్క్


మ..మ్మ....మ్మాస్క్ 


తలకు కడితే ‘తలపాగ’
కళ్ళను కప్పేస్తే ‘గంత’
ముక్కును మూసేస్తే ‘మాస్క్’
నోటికి తాళం వేస్తే ‘చిక్కం’
మెడకు చుడితే ‘స్కార్ఫ్’
ఛాతీపైకి చేరిస్తే ‘బ్రా’
మొలను దాచేస్తే ‘గోచీ’
పాదాలను పట్టేస్తే ‘సాక్స్’
చెప్పినవన్నీ చేసేస్తే ‘చేతిరుమాలు’

మూరెడు, జానెడే కదా అని 
నన్ను తేలిగ్గా తీసిపారేయకండి...
‘మాస్కో రక్షతి రక్షితః’


-   చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 


.......

ఈ హెడ్డింగులో ‘బూతు’ కనిపిస్తే అది అక్షరాలా మీ దృష్టిదోషమే..! ! !


 

సాక్షిక్లిప్పింగ్ ఇది. ఈరోజు(11జులై, 2021) పేపర్లోది. సూటిగా చూడండి.‘ కృష్ణ తులాభారం’-అందరికీ తెలిసినదే. దాన్ని ప్రస్తుత కృష్ణా జలాల వివాదానికి అన్వయిస్తూ...అత్యుత్సాహంతో ష్ణాఅని దీర్ఘం ఇచ్చేసారు. ఎందుకు..?? ? అంటే..  ఇది శ్రీకృష్ణుడికి సంబంధించినది కాదు, ‘కృష్ణానదికి సంబంధించినది అని చెప్పడానికి. హెడ్డింగును వంకర దృష్టితో చూడండి. దీర్ఘంతో బూతుపదంలాగా కనిపిస్తే అది ఎవరి తప్పు...వంకరగా చూసినోళ్ళదే తప్ప మరెవరిదీ కాదని అనుకుందాం ప్రస్తుతానికి...  రంగుల్లో తేడా చూపించారులే అని సర్దుకుపోవడానికి వీల్లేకుండా  మరో పేజీలో రంగులు లేకుండా  రిపీట్ చేసారు...కాస్తలో కాస్త ఉపశమనం...తులా’ లో ‘ల’కు దీర్ఘం తీసేయలేదు, తరువాత స్పేస్ ఇవ్వలేదు. ఓవర్ ఆల్ గా వ్యాకరణ రీత్యా తప్పా ,  రైటా ?  అన్నది కాదు,  రాయడంలో పదాల మధ్య స్పేస్ ఇస్తాం. చదివేటప్పుడు అలా  కాకుండా ఏకబిగిన చదివేస్తాం.  అందువల్ల చూడంగానే,  చదవంగానే  రకరకాల భావనలకు, అర్థాలకు, పెడర్థాలకు  అవకాశమీయకుండా ఉంటే బాగుండేది.

 https://epaper.sakshi.com/c/61734507

 

ఇటువంటివి వార్తాపత్రికల్లో మామూలే... కాలంతో పోటీపడి పనిచేసేటప్పుడు ఆ సమయానికి తోచనివి ఇలా ప్రింటయి బయటికి వచ్చినప్పుడు ....ఎబ్బెట్టుగా కనిపిస్తాయి....అయితే దురుద్దేశంతో చేసినవి కావు కాబట్టి పాఠకులు సహృదయంతో సూటిగానే చూస్తారు తప్ప చూడమన్నా వంకరదృష్టితో చూడరు. ఒకవేళ చూపు ఆ వైపుకు వాలినా...కొద్దిసేపు ముసిముసిగా నవ్వుకుని క్షమించేస్తారు....సందర్భం వచ్చింది కాబట్టి వీరిని సమర్ధించడానికి ఇటువంటిదే  వెనకటి సంఘటన  ఒకటి ప్రస్తావిస్తా...

 

కంప్యూటర్లు లేని రోజులవి..  లెడ్ తో(సీసం-లోహం) చేసిన అక్షరాలను చేత్తో కూర్పు చేసే పని ( కంపోజింగ్ )అమల్లో ఉన్న రోజుల్లో...ఒక ప్రముఖ దిన పత్రిక ‘‘శ్రీశైలం  జల విద్యుచ్ఛక్తి....అని ఇలాగే తాటికాయంత అక్షరాల్లో 84 పాయింట్లో...బ్యానర్ వార్త (మొదటి పేజీ పైభాగంలో) సిద్ధం చేసింది. అర్ధరాత్రి ఫైనల్ గా మిషిన్ ప్రూఫ్ కూడా చూసేసిన న్యూస్ ఎడిటర్ -ప్రింటింగ్ కు ఆర్డరిచ్చి వెళ్ళిపోయాడు. ముద్రణా యంత్రాల దగ్గర సిబ్బంది... ఆ పేజీని ప్రింటింగ్ కు రెడీ చేస్తున్న క్రమంలో శ్రీశైలంతరువాత స్పేస్ గా ఉంచిన లెడ్ జారిపడిపోయింది. అక్కడి సహాయకుడు  వెంటనే అది గమనించి ప్రింటింగ్ కు ఆలస్యం అవుతున్నదన్న హడావిడిలో దాన్ని తీసుకెళ్ళి ‘శ్రీశైలం’ అనే పదంలో ... లంతరువాత ఉంచాల్సిన దాన్ని  శ్రీశైతరువాత గుచ్చేశాడు. దానితో.. తరువాత ఉన్న లంకాస్తా పక్కనే ఉన్న జలపదంతో కలిసిపోయింది. మొత్తంగా చూస్తే ఎలా కనిపిస్తుందో మీరే చూసుకోండి..సభ్యత అడ్డొస్తున్నది... 

ముద్రణలో జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టే...ఇటువంటి వాటిని ముద్రారాక్షసాలు అంటాం.

వెనకటివి ఇంకా చాలా గుర్తుకొస్తున్నాయి....దీన్ని సాకుగా చేసుకుని అవన్నీ  ఇక్కడ ఏకరువు పెట్టడం భావ్యం కాదు...

అందుకే ఇటువంటివి జరగకుండా మరింత జాగ్రత్తపడాలని మీడియా మిత్రులను మృదువుగా హెచ్చరిస్తున్నా....

.................

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...