తెలుగు-7
అపార్ట్ మెంట్ సంస్కృతి బాగా పాతుకుపోయిన
తరువాత... పాత రోతవుతున్నది. అవసరానికి మించి
దేనికీ, ఎవరికీ స్థలం దొరకడం లేదు, అతిథులయినా సరే, ఆత్మీయులయినా సరే ! ఇక
జ్ఞాపకాలుగా మిగిలిన పాత వస్తువుల సంగతి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఇల్లు మారాల్సి
వస్తే..లారీలు, ట్రక్కులు అవసరమయ్యేవి. ఇప్పుడు యాత్రికుల్లాగా రెండు మూడు
సూటుకేసులు చాలు, అదీ పిల్లాజెల్లా ఉంటే. దిగాల్సిన అపార్ట్ మెంట్ లో మనం
వెళ్లేటప్పటికి అన్నీ సిద్దంగా ఉంటాయి.
దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలాగా
ఉంటున్నది... ప్రస్తుత చర్చనీయాంశం తెలుగు భాష...తెలుగు పుస్తకాలు కాబట్టి...
దాన్ని కదుపుదాం. చిన్నప్పటి నుండి కాస్తో కూస్తో ఇష్టంగా చదువుకున్న ప్రతివాడికీ..
బాగా నచ్చిన, బాగా మెచ్చిన పుస్తకాలు ఎప్పుడూ తోడుగా ఉండేవి, చిన్ననాటి
స్నేహితుల్లాగా. ఇవి కాలక్రమంలో సూక్ష్మ గ్రంథాలయాలుగా
కనపడేవి. ఈ మోజును గమనించిన
ఎమెస్కో ప్రచురణ కర్తలు 60 వ దశకంలో ‘ఇంటింటా గ్రంథాలయం’ అని ప్రకటనలు
ఇచ్చి... కావాల్సిన పుస్తకాలు తక్కువ ధరల్లో పోస్టులో పంపేవారు. దీని ప్రోత్సాహంతో
చదువుకున్న వారున్న ప్రతి ఇంటా.. ఎంత మారుమూల పల్లెయినా... పాడి ఆవులున్న కొట్టంలాగా
మినీ లైబ్రరీ మెరిసిపోయేది. ఎన్ని మంచి పుస్తకాలుంటే వారికి అంత గౌరవమర్యాదలు కూడా
ఉండేవి. ఈ విషయంగా రాకపోకలూ కొత్త స్నేహితాలూ, చర్చలూ.. సందడిగా ఉండేది.
ఇప్పుడన్నీ ... అరచేతిలోనే ... . ఆన్ లైన్లో అన్నీ ఉంటాయి. అన్నీ
చూసుకోలేం..తృప్తిగా చదువుకోలేం. అదేదో సినిమాలో అన్నట్లు... పుట్టేవాడికి
చోటేదీ... ఇంటి మనుషులకే చోటు గగనమయితే
...పుస్తకాల సంగతో ?
జ్ఞాన దాహానికి... ఒకప్పుడు కుండలుండి చెంబులతో
నీళ్ళు తాగితే, ఇప్పుడు డ్రమ్ములు, టాంకులు, టాంకర్లు (ఇంటర్నెట్) ఉండి కూడా ఉద్ధరిణెతో
గొంతు తడుపుకోవాల్సిన దౌర్భాగ్యం. ...
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే....ఇంటింటి గ్రంథాలయాలన్నీ నిన్నమొన్నటి దాకా ఫుట్ పాత్ పుస్తకాల చెంతన ఎండావానలకు వణుకుతూ ఒదిగిపోతే... ఇప్పుడు వాళ్ళు కూడా నిర్మొహమాటంగా వద్దని మొహాన్నే చెప్పేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ పాత పేపర్ల సైకిళ్లమీదికి, ఆటోల మీదికి ఎక్కి అట్నుంచి అటు కబేళాలకు చేరుకుంటున్నాయి. అక్కడ వాటికి మోక్ష ప్రాప్తి అయ్యే సమయానికి వాటిని సాగనంపిన ఇంట... మసకబారుతున్న చమురొత్తుల జ్ఞానదీపం స్థానంలో .చిటికేస్తే చాలు ... క్షణానికో రకంగా రంగులు చిమ్మే స్మా ర్ట్ బల్బులు కృత్రిమ మేధతో వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు ఇంటి పెద్ద కాలం చేస్తే... అప్పటిదాకా
ఆయన ప్రాణప్రదంగా చూసుకొన్న పుస్తకాలు, వాటికోసం ముచ్చటపడి ఖర్చుకోర్చి నగిషీలతో
చేయించుకున్న టేకు కలపతో కళకళలాడిన అద్దాల బీరువాలతో సహా విరాళంగా స్థానిక
గ్రంథాలయాలకు చేరి కొత్త శోభ తెచ్చేవి.
అపార్ట్ మెంట్లలో నడిచే ఇప్పటి కాలేజీలకు రెండుమూడింతల సైజు భవనాల్లో
కొలువుదీరిన అప్పటి స్థానిక గ్రంథాలయాలకు క్రమేళా ఈ విరాళాల భారం ఎక్కువయి ఇప్పుడు
ఎరువుల గోడౌన్లలా మారిపోయాయి. ఇక వద్దు బాబోయ్..అని వారు కూడా బోర్డులు పెట్టేస్తున్నారు.
పాతపుస్తకాలు అమ్మే ఫుట్ పాత్ వ్యాపారులకు అప్పుడు
‘ఉప్పు’ అందితే చాలు... వెతుక్కుంటూ ఇంటికొచ్చి ఇంతిస్తాం..అంతిస్తాం అని మన
ఔదార్యాన్ని చౌకగా కొల్లగొట్టుకుపోయినా ...పేరున్న రచయితలను, పాత గ్రంథాలను వాటి
విలువను నిరక్షరాస్యుడయినా ఇట్టే పసిగట్టి వెలకట్టడం చూసి ముచ్చటేసేది. మన చేయి
జారిపోయినా మరో ముత్యపు చిప్పలో పడుతుందనే ఆశ ... బేరం కోసం పట్టుబట్టకుండా చేసేది.
వాళ్ళు ఇప్పుడు ‘మీరే ఆటోలో వేసి పంపించండి.’ అని మొన్న చెప్పి... ఇప్పుడు అదీ
వద్దంటూ ‘రద్దీ’కిపంపండని ఉచిత సలహా పారేస్తున్నారు. అయితే ఫోన్
పెట్టేసే లోపల.. హలో.. హలో అని అందుకుని...‘‘సార్ ! ఇంజనీరింగ్, మెడిసిన్ పుస్తకాలుంటే
మాత్రం పంపండి.. వాటికి కూడా పెద్ద రేటేమీ రాదు. ఆటో పైసలు మాత్రం మేం
పెట్టుకుంటాం.... అని, ‘వ్యక్తిత్వ వికాసం’
పుస్తకాలుంటే పోయేవి సార్... ఇప్పుడవి కూడా వద్దు... పోవడం లేదు...వంటల
పుస్తకాలుంటే చెప్పండి.. చాలా గిరాకీ ఉంది.. పిల్లలు ఆడామగా అందరూ కొనుక్కుపోతున్నారు.
మేమే వచ్చి తీసుకుంటాం...’’ అని చెప్పడం కొసమెరుపు.
ఉమ్మడి రాష్ట్రంలో తుర్లపాటి కుటుంబరావు గారు
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయిన కొత్తల్లో
ఓసారి ఆయనకు ఓ ప్రతిపాదన చేస్తూ... ‘‘ఇంజనీరింగ్, మెడిసిన్ తో సహా తెలుగు లో
మంచి పేరున్న రచయితల పుస్తకాలు, నవలలు, కథలు, డిక్షనరీల వంటి వాటిని ఉచితంగా
ఇస్తామన్న వారి నుండి అన్ని గ్రంథాలయాలు స్వీకరించే ఏర్పాట్లు చేయండి. వేలల్లో,
లక్షల్లో వస్తాయి. వాటిని వేటికవి వేరు చేసి ...పేద పిల్లలకు, పాఠశాలలకు, కొనే
స్తోమత లేని పుస్తక ప్రియులకు ఉచితంగా అందివ్వండి, దానికి నిధులేమీ అక్కర్లేదు. నిర్వహణ ఖర్చు
నామమాత్రంగానే ఉంటుంది. దీనివల్ల
పుస్తకాలు సద్వినియోగం కావడమే కాక, పేద పిల్లలను ఆదుకున్న వారవుతారు’’ అని
చెబితే ఆయనకు కూడా విపరీతంగా నచ్చేసింది ఈ ప్రతిపాదన. అయితే ఆయన అక్కడ కూర్చోవడానికి, తిరగడానికి అవసరమయిన
ఏర్పాట్లకోసం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతుండగానే... రాష్ట్రం
విడిపోయింది... ఆయన పదవి కోమాలోకి వెళ్లిపోయింది.
ఇప్పటికీ ఇంకా ఆశ చావట్లేదు... రసజ్ఞుడయిన,
సాహితీ ప్రియుడు కూడా అయిన మనసున్న మారాజు... తోటలో
నుంచి తొంగి చూస్తే చాలు.. ... మరు క్షణంలో అంగన్ వాడీలనుంచీ మొదలు పెట్టి ... హైదరాబాద్
దాకా పాత పుస్తకాల కోసం ఎగబడేలా
చేయగలడు...ఒక్క నోటిమాటతో....
దింపుడు కళ్ళెం ఆశ ఫలిస్తుందా....ఏమో! గుర్రం
ఎగరావచ్చు.....
-
చినవ్యాసుడు, మాఊరు