త్ తు త్తు థూఫానులు..




త్ తు త్తు  థూఫానులు..

 

అప్పుడు ...

 

నేనే నా దేశపు జెండాను

కొయ్య విరిగినా, ఒరిగినా

నా చెయ్యే ఆకాశానికి ఎగిసేది

హోరుగాలికి జెండా చిరిగితే,

జోరువానలకది చివికితే..

పైశాచిక తుఫాను పీకేసుకుపోతే

చర్మాన్ని ఒలిచి ఆరేసి

రెపరెపలాడిస్తూ ఎగరడానికి

నా శరీరం  తహతహలాడేది

 

అప్పుడు నేనే ఓ చట్టాన్ని

ఎవరయినా చుట్టరికం కలిపితే

నివురు దులుపుకుని నిప్పులు కక్కేవాణ్ణి

నిలువునా కాల్చేసేవాణ్ణి

 

అప్పుడు నేనే ఓ నినాదాన్ని

దిక్కులను దడదడలాడించిన గళాన్ని

ఎవడయినా నోరునొక్కితే

ఉరుముల్లా గర్జిస్తూ

నవనాడుల్ని సంధిస్తూ

పట్టిన వేళ్ళనే కాదు,

చుట్టిన చేతుల్ని కూడా

మొదలంటా పెటపెటమని విరిచేసేవాణ్ణి

 

అప్పుడు నేనే ఓ పత్రికను

సమాజాన్ని మోసే నాలుగో బోయీని

భుజాలు పల్లకీ మోస్తుంటే

చేతిలో కలాన్ని కత్తిని చేసి బాధితులకిచ్చే వాణ్ణి

నా జటల్లోంచి రాలిపడిన

అక్షరాలనే అక్షౌహిణులుగా మార్చేసే వాణ్ణి

 

కదనరంగాన  కన్నబిడ్డను

కడుపులో దాచుకుని కత్తెత్తిన వీరవనితలా

నా కుటుంబాన్ని బొడ్లోనే దాచేసుకునేవాణ్ణి...

 

మరి ఇప్పుడో...

 

నా పాదాలకు మేకులు దిగ్గొడుతున్నట్లున్నది

కాళ్ళ కింద భూమిని గుంజుకుపోతున్నట్లున్నది

నా చేతి నరాలను తెంపేసినట్లున్నది

నా జెండా రంగులను మార్చేస్తున్నట్లున్నది

 

నిటారుగా వెన్నెముకలా నిలిచిన కొయ్యతోనే

గుండెల్ని నిలువునా చీల్చేస్తున్నట్లున్నది

తలకు చుట్టుకుని మురిసిన పతాకాన్నే

నా నోట్లో కుక్కి

నినాదాల శబ్దపేటికను

మందుపాతరలా పేల్చేస్తున్నట్లున్నది

 

బోయీల  పరుగు లయను తప్పించినట్లున్నది

మోస్తున్న పల్లకినే నాకు పాడెను చేసినట్లున్నది

చట్టాలను చితక్కొట్టి చితికి కట్టెలుగా పేరుస్తున్నట్లున్నది

నా పత్రికతోనే తలకొరివి పెడుతున్నట్లున్నది

 

పొద్దుపొడుపున.....

 

కొడిగడుతున్న ఆశలన్నీ కూడదీసుకుని

తూరుపు వాకిలి నుంచి తొంగి చూస్తే....

అవిగో నే విత్తిన మొక్కలు

శరభ శరభ..దశ్శరభ శరభ అని నినదిస్తూ

ఒక్కొక్కటిగా భూములను బద్దలుకొట్టుకుంటూ

శివాలెత్తిన తరువుల్లా ఊగుకుంటూ

గట్లను తెగ్గొట్టుకుంటూ వచ్చేస్తున్నాయి

 

తుఫానులకే తొడకొడుతున్నాయి

తీరం దాటితే ఖబడ్దారంటున్నాయ్

జడలు విప్పి జంఝామారుతాలపైన

మూడోఅడుగు మోపడానికి

మేఘాలను చీల్చుకుని పైపైకి ఎదుగుతున్నాయి

చీకట్లను చీలుస్తూ

చుక్కలుగా మెరుస్తున్నాయ్

 

అల్లరి చిల్లర చేష్ఠలతో,

గిల్లికజ్జాలతో, అక్కసుతో 

అసూయాద్వేషాల వరదల్లో ముంచి

అల్లకల్లోలం చేస్తాయనుకున్న

అల్ప పీడన ద్రోణులన్నీ

తీరం చేరకుండానే

అలలతో గొంతుకు ఉరి బిగించుకుంటున్నాయి

శత్రువు కోసం సిద్దం చేసిన  సుడిగుండాల్లో

సజీవ జల సమాధికి సిద్దపడుతున్నాయి

 

-చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...