తెలుగు : 1-8
తెలుగు భాషాభిమానులయిన మిత్రులకు,
నమస్కారం. తెలుగు భాష ప్రస్తుత స్థితిగతులపట్ల
ప్రజల్లో నెలకొంటున్న ఆవేదనను, భాషాభివృద్ధికి అవసరమయిన పరిష్కారాలను
ప్రస్తావిస్తూ... మొత్తం ఏడు వ్యాసాలు రాసాను. ఇది ముగింపు కాబట్టి 8 అయింది. నిజానికి ఇవన్నీ ఒకటే వ్యాసం కింద
లెక్క. అయితే మీరు చదువుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని దానిని ఏడు చిన్న ముక్కలుగా
చేసాను. (ఇప్పటికే నాలుగు భాగాలు మీతో పంచుకున్నా. మిగిలిన మూడు చాలా ముఖ్యమైనవి. ఇప్పటివరకు చదవని
వారికోసం కింద అన్నిటికీ లింకులు ఇచ్చాను).
ఈ విషయం మీద దీనిలో ప్రస్తావించిన పలు అంశాల
మీద నాకున్న పరిమిత అవగాహనతో వాటి విశ్లేషణతోపాటూ, నాకు తోచిన పరిష్కారాలు కూడా సూచించా. ... భాషాభిమానులు, భాషా నిపుణులు, బాధితులు.. ఇలా అందరూ వీటిని
పూర్తిగా చదవండి.
ఇవి నేను కాలక్షేపానికో, కీర్తికండూతితోనో, మీ
చేత చప్పట్లు కొట్టించుకోవాలనో, ఓ అద్భుత మేధావిననిపించుకోవాలన్న తాపత్రయం కొద్దో.... ఇవి రాయలేదు.అది నా ఉద్దేశం కూడా కాదు....
నేను రాసిన దానిలోకూడా అవగాహనారాహిత్యం కొద్దీ లేదా మరోరకంగా చాలా తప్పులు దొర్లి ఉండవచ్చు. నేను కొన్ని హద్దులు కూడా దాటి ఉండొచ్చు... క్షమించండి. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకు రావడానికి, లేదా మరిన్ని వెలుగులు చిమ్మేలా చేయడానికి నావంతు కర్తవ్యం నేను కూడా మొదలు పెట్టాలి-అన్న తపనలో అక్కడక్కడా అడుగులు తడబడి ఉండొచ్చు. వీటిని మీలో ప్రతి ఒక్కరూ పూర్తిగా చదవండి. చదివి వదిలేయకండి. మీకు తోచిన పరిష్కారాలు, స్పందన మీ పరిధిలో ప్రకటించి విస్తృతంగా చర్చకు పెట్టండి.
వేయి మాటలేల... తెలుగు భాష తియ్యనిదే... జగమెరిగిన సత్యం... దానిలో కూడా తీపెక్కువగా ఉన్న పంచదార పలుకులేరి, నోటితేనెలో ఊరించి, మనసు వెన్నలో ముంచి తీస్తే... ఆ తెనుగు మాటలు వినేవాడి చెవుల్లో అమృతం చిలికిస్తాయి, వాడి కళ్ళల్లో ఇంద్ర ధనస్సులు మెరిపిస్తాయి, అనుభూతి చెందేవాడి మనస్సును వెన్నెల్లో విహరింప చేస్తాయి., ఎన్ని ఇంగ్లీష్ పదాలు కలిపి పోపు పెడితే అంత గొప్ప అని ఒక ప్రాంతం వారు, ఎన్ని హిందీ, ఉర్దూ భాషా పదాలు కలిపితే అంతగా అత్తరు వాసనలు గుబాళిస్తాయని అని మరో ప్రాంతం వారు అనుకున్నంత కాలం... తెలుగు సిగ్గుతో చచ్చి ముడుచుకుపోతుంటుంది. అందువల్ల మనకు తెలిసినదే తెలుగు అనుకుని మురిసిపోకుండా, మాట్లాడడాన్ని.. అదీ అచ్చ తెలుగులో ముచ్చటగా మాట్లాడడాన్ని ఒక కళగా అభ్యాసం చేయండి.
అలాగే చదవడం. మంచి సాహిత్యం.. పాతదయినా, కొత్తదయినా చదవడాన్ని తప్పనిసరి వ్యాపకాల్లో ఒకటిగా చేసుకోండి. ఇక రాయడం - ఇంటికి కావలసిన సరుకుల జాబితా కావచ్చు, ప్రియురాలికి ప్రేమలేఖ కావచ్చు, పై అధికారికి ఒక నివేదిక కావచ్చు, ఒక సమస్యపై ఫిర్యాదుగా పత్రికల్లో పాఠకుల పేజిీకి రాసేది కావచ్చు. .. మన మనోభావాలను కాగితం పై అర్థవంతంగా పెట్టగల నేర్పు సంపాదించుకోవాలి, ఉన్నదానికి మెరుగులు దిద్దులు కోవాలి. ఇవి ఎక్కువగా చేసినప్పుడే తెలుగు ‘తలరాత’ బాగుపడుతుంది. అది విజయవంతంగా జరిగితే మన అమ్మభాష ఇప్పుడున్నంత దీనంగా అయితే ఉండదుగాక ఉండదు.... ఆ విజయ రహస్యం మాత్రం మరెవరి చేతుల్లోనో లేదు.... అక్షరాలా మన చేతుల్లోనే ఉంది.. మన పిల్లల చేతుల్లోనే ఉంది.
ఏదో ఒక గడువు తేదీ అనేది ఎదురుగా కనిపిస్తుంటే, మన అడుగులు సక్రమంగా, వేగంగా పడతాయి కాబట్టి – వచ్చేసంవత్సరం ...2022 ఉగాది నాటికి చర్చలన్నీ ఒక కొలిక్కి వచ్చి- తెలుగు భాష మరో వెయ్యేళ్ళు వెలగడానికి అవసరమయిన నిర్ణయాలు వచ్చేలా అందరం కృషి చేద్దాం. కనీస కర్తవ్యంగా వీటిని వీలయినంత మందికి చేరవేయండి, షేర్ చేయండి.
ఉప రాష్ట్రపతి గౌ. శ్రీ వెంకయ్య నాయుడు గారు భాష విషయంలో తన ఆవేదన అందరితో పంచుకుంటూనే, కేవలం మాటలతో మురిపించి ఊరుకోకుండా తన పరిధిలో తాను చేయగలిగినంత ఏకపక్షంగా ఒంటిచేత్తో చేసుకుంటూ పోతున్నా..... దాన్ని తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా సానుకూలంగా స్పందించాల్సిన పెద్దలు కానీ, వేడి పుట్టించి ఒత్తిడి తీసుకురాగల భాషా నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కానీ అందిపుచ్చుకోకపోవడం బాధాకరం.
అందరిలో చైతన్యం తీసుకురావడానికి మీ వంతు మీరు కూడా కృషి చేయాలనేదే నా సవినయ విన్నపం.
- చినవ్యాసుడు, మాఊరు
.....................................
ఈ కింద
ఇచ్చిన క్రమంలో చదవండి (1, 2, 3, 7 ఇప్పటికే చదివి ఉంటే....)
తెలుగు - 4: అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw
…………………………….
తెలుగు - 5: ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా !
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw
………………………
తెలుగు - 6: ఆచరణాత్మక సంస్కరణలు...కొన్ని సిఫార్సులు
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw
…………………………..
(ఇప్పటివరకు వీటిలో ఏవీ చదవకపోతే 1,2,3,4...క్రమంలో అన్నీ చదవండి)
తెలుగు - 1: తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw
……..
తెలుగు - 2: ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw
……………………………….
తెలుగు - 3: అమ్మ ఎలాఉంది? ...హలో ! మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!! https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw
……………………
తెలుగు – 7: మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw
..............