మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి చుట్టాలు

 



మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి చుట్టాలు

ఎవరా చుట్టాలు ! ! !

 

ఇంకెవరు ! ! ! 

మన సాధువులు(నాగ సాధువులు), యోగులు, అవధూతలు, సిద్ధులు... ఇంకా నాథ్‌లు, ..


వీరిని గురించి మనం ఆ నోటా ఈ నోటా వినడమే. ఏవో పొంతనలేని గాలికబుర్లు తప్ప వారిని గురించి మనకు పెద్దగా తెలియదు. శాస్త్రాల్లో వీరిని గురించి చెప్పిన విషయాలు పండితులకు చాలామటుకు తెలుసు. కానీ అసందర్భమనో  లేక అవకాశం దొరకకనో మరే ఇతర కారణం చేతనో వారు, వారికి తెలిసిన విషయాలు ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడం లేదు. కానీ గమ్మత్తేమిటంటే  సాధారణంగా పామరుల్లో, ముఖ్యంగా పల్లెపట్టునఉండే పలువురికి మాత్రం(ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో) ఈ చుట్టాలు చిర పరిచితులే. అయినా వారు చదువుకున్న వారికి తమ అనుభవాలు చెబితే నమ్మరనో, ఎగతాళి చేస్తారనో నాగరీకులకు చెప్పడానికి జంకుతారు. ఇక మీడియా కూడా వీరికి సంబంధించిన విషయాలు శాస్త్ర సమ్మతం కాదనే అపోహతోనో లేక మూఢనమ్మకాలని భావించడంవల్లనో  లేక అసలు తెలియకనో లేదా సమగ్ర... సాధికార సమాచారం దొరకకనో అంతగా శ్రద్ధ చూపడంలేదు. మహాకుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటి ప్రపంచంలోకి వచ్చే నాగసాధువులను, అవధూతలను కలవడానికి చూడడానికి విదేశాలనుంచి పర్యాటకులు, విదేశీ పాత్రికేయులు పెద్దఎత్తున వచ్చినప్పుడు మాత్రం వీరికి సంబంధించిన కొన్ని కథనాలు బయటికి వచ్చి హల్‌చల్‌ చేస్తుంటాయి.

 నేను ఇక్కడ ఇస్తున్నది ముడి సమాచారమే. తొందరపడి ఇవ్వడంలో ఉద్దేశం- ఇక నుంచయినా దీనిమీద ఆసక్తి ఉన్న వారుగానీ, పండితులుగానీ, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులుగానీ, మీడియా గానీ, ధార్మిక పరిశోధకులుగానీ మరింత శ్రద్ధచూపి మన ప్రాచీన భాండాగారంలో నిక్షిప్తమై ఉన్న ఇటువంటి జ్ఞాన రాశులను వెలికితీసి జనసామాన్యానికి పంచుతారని ఆశిస్తూ నేను అతిస్వల్పకాలంలో సేకరించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుంచుతున్నాను.

 

యోగులు,అవధూతలు, సిద్ధులు

 యోగశాస్త్రం అన్నింటికీ మూలం. దీన్ని తొలుత రాసింది ఎవరు ? ఎప్పుడు ? అనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం దొరకదు. యోగ సూత్రాల సంకలనకర్తగా పతంజలిని పలు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అయితే పతంజలిపేరుతో వేర్వేరు కాలాల్లో వెలువడిన గ్రంథాలు మరో కొత్త సందేహాన్ని లేవనెత్తాయి. అసలు ఈ పతంజలి ఎవరు ? అని.

 సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన మహాభాష్యకర్త అయిన పతంజలి విషయంలో మాత్రం ఆయన ఏ కాలానికి చెందినవాడో స్పష్టమైన ఆధారం ఉంది. క్రీ.పూ.120 అని. సాకేత నగరాన్ని గ్రీకులు ఆక్రమించుకున్నారంటూ ఆయన తన రచనలో చేసిన ప్రస్తావనతో చరిత్రకారులు ఈ పతంజలి విషయంలో స్పష్టంగా కాలనిర్ణయం చేయగలిగారు.

యోగసూత్రాల సంకలనకర్తగా తర్వాత పలుకాలాల్లో , పలు సందర్భాల్లో పతంజలి పేరును పేర్కొన్నారు. క్రీ.శ. 5వ శతాబ్దంలో భర్తృహరి తన గ్రంథాల్లో యోగ, వ్యాకరణ, ఆయుర్వేద శాస్త్రాల నిపుణుడిగా పతంజలిని అభివర్ణించారు. 11వ శతాబ్దంనాటి భోజుడు తన యోగ సూత్రాల పీఠికలో పతంజలిని ఇలాగే ప్రస్తావించాడు. అలాగే తమిళ సిద్ధ(శైవ) సాంప్రదాయంలోని 18మంది సిద్ధులలో పతంజలి పేరుతోఒకరు కన్పిస్తారు. పతంజలి’- ఒక వైద్యశాస్త్ర గ్రంథకర్తనికూడా తెలిపారు.

 ఇక మహాభాష్యకర్త పతంజలి అనంత శేషనాగు అవతారమని భట్టోజీ దీక్షిత, హరిదీక్షిత, నాగేశ్‌ భట్టవంటి పలువురు వ్యాకరణ గ్రంథకర్తలు తెలిపారు.

 యోగశాస్త్రం... ముఖ్యంగా శైవసంబంధమైన యోగ శాస్త్రానికీ, పతంజలికీ చాలా దట్టమైన బంధం ఆద్యంతం కనిపిస్తూ ఉంటుంది. యోగసూత్రాలను వాటికి భాష్యాన్ని కూడా ఆయనే రాశారని ఎక్కువమంది అభిప్రాయం. యోగ సూత్రాలు, వాటికి భాష్యాలు వేర్వేరు రచయితలు రాసారని అన్నా, వ్యాఖ్యానకర్తగా వ్యాసుడి పేరే చెప్పేవారు. ఇటీవల ఉద్దండపండితులంతా క్రీ.శ 1000వ శతాబ్దానికి ముందు నాటి ప్రామాణిక గ్రంథాలను తిరగదోడి రెండు విషయాలు తేల్చారు. మొదటిది సూత్రాలు, వ్యాఖ్యానం ఒక్కరే రాశారని, రెండోది.. ఇది రాసింది క్రీ.పూ 400వ శతాబ్దంలో అని.

 ఇక మరికొన్ని కథనాల ప్రకారం అత్రిమహాముని, అనసూయలకు త్రిమూర్తులు ఇచ్చిన వరప్రసాదంగా ముగ్గురు కుమారులు పుట్టారు, వారిలో ఒకడు పతంజలి (సోమ స్కంధుడు). మిగిలిన ఇద్దరు దత్తాత్రేయులు, దుర్వాసులు. శంకరాచార్యులకు  కూడా వారి గురువు పతంజలిని గురించి చెప్పి ఆయన గోవింద భగవత్పాదులుగా అవతరించి సమాధిస్థితిలో ధ్యానం చేసుకుంటున్నారని సూచించినట్లు మనకు చాలా గ్రంథాలు తెలుపుతున్నాయి.

 మహాభారతం, గీతలో కూడా మూడు రకాల యోగను ప్రస్తావించారు. ఇవన్నీకూడా చంచల స్వభావమైన మనస్సును నియంత్రించి చిత్తాన్ని ఏకోన్ముఖంగా నడపడానికి ఉద్దేశించినవి. అయితే తర్వాత కాలంలో వచ్చిన హఠయోగం వీటికి భిన్నంగా ఉంటుంది. ఇది మానసిక బలంతోపాటూ శారీరక పుష్ఠిని చేకూర్చుకోవడానికి సాధకుడికి తోడ్పడుతుంది.

 15వశతాబ్దంనాటి హఠయోగ ప్రదీపిక, 17వ శతాబ్దం నాటి శివసంహిత, ఇదేకాలానికి చెందిన ఘేరండ సంహితలు హఠ యోగాన్ని లేదా హఠవిద్యను విపులంగా తెలియచేసాయి. 11వశతాబ్దంనాటి గోరక్షానాథ్‌ రాసిన గోరక్ష సంహితనుకూడా కొందరు పండితులు ఈజాబితాలో చేర్చారు. 20వశతాబ్దం నుండీ యోగాప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు మనం చూస్తున్న, చేస్తున్న ఆసనాలవంటి అభ్యాసాలు హఠయోగం లోనివే. చాలా శాస్త్రాలు హఠయోగం శివుడి తోనే ప్రారంభమయిందని చెబుతున్నాయి.

 దీనికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఎవరూ చూడకుండా, వినకుండా ఉండడానికి శివుడు ఒక ఒంటరి దీవిని ఎంచుకుని హఠయోగ రహస్యాలను పార్వతీదేవికి ఏకాంతంలో బోధిస్తాడు. అయితే ఇదంతా ఒక చేప నిశ్చలచిత్తంతో విని సిద్ధపురుషునిగా మారుతుంది. ఆయనే మత్స్యేంద్ర నాథుడు. ఆయన తన శిష్యుడు గోరక్షానాథ్‌కు, చౌరంగి అనే మరొక కాళ్ళూచేతులూ లేని వ్యక్తికి బోధిస్తాడు. ఇక ఆ తరువాత గురుశిష్యపరంపరలో చాలామంది హఠ యోగులు దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. అయితే దీనికి అధిక ప్రజాదరణ కల్పించిన ఘనత మాత్రం గోరక్షానాథ్‌దే. ఆయన దీని మీద చాలా గ్రంథాలు రాశారు. అవి..గోంరక్ష సంహిత, సిద్ధ సిద్ధాంత పద్ధతి, గోరక్షాటక, యోగ మార్తాండ, యోగ చింతామణి. వీటిలో సంస్కృతంలో వెలువడిన సిద్ధసిద్ధాంత పద్ధతి గ్రంథంలో అవధూతఅంశానికి సంబంధించి చాలా సమాచారం ఉంది.

 హఠయోగ సంహిత, ఘేరండ సంహితల్లో 35మంది అద్భుత హఠయోగసిద్ధుల ప్రస్తావన ఉంది. వారిలో ఆదినాథ్‌, మత్య్సేంద్రనాథ్‌, గోరక్షానాథ్‌ ఉన్నారు. అంతేకాక షట్కర్మ, ఆసన, చక్ర, కుండలిని, బంధ, క్రియ, శక్తి, నాడి, ముద్రలతోపాటూ ఇతర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంది.

 ఇక ఇప్పుడు పాశ్చాత్యదేశాలలో అనుసరిస్తున్న ఆధునిక హఠయోగఅభ్యాసాల ఘనత తిరుమలై కృష్ణమాచార్య గారిది. ఆయన 1924నుంచీ 1989 వరకూ దీనిని బహుళవ్యాప్తి లోకి తెచ్చారు.  ఆయన శిష్యులలో ప్రముఖులు కె.పట్టాభి జాయిస్‌(అష్టాంగవిన్యాస యోగ), బి.కె. ఎస్‌ అయ్యంగార్‌, ఇంద్రాదేవి, టికెవి దేశికాచార్‌(కృష్ణమాచారిగారి కుమా రుడు).

 అలాగే విదేశాల్లో దీని వ్యాప్తికి 1887నుండీ 1963 వరకు హృషీకేశ్‌కు చెందిన స్వామి శివానంద చేసిన కృషి కూడా అమోఘం. ఆయన శిష్యుల్లో ప్రముఖులు స్వామి విష్ణు దేవానంద(శివానంద యోగ కేంద్రాల వ్యవస్థాపకులు), స్వామి సత్యానంద(బీహార్‌), స్వామి సచ్చిదానంద ప్రముఖులు. 21వ శతాబ్దంలో మన దేశంలో దీనికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారిలో బాబా రామ్‌దేవ్‌ ప్రముఖుడు.

 2008లో యోగా జర్నల్‌అమెరికాలో యోగా భ్యాసంపై ఒక సర్వే నిర్వహించింది. 1కోటి58లక్షల మంది దీనిని అభ్యసిస్తునట్లు, మరో ఏడాదిలోగా 94లక్షలమంది దీన్ని అభ్యసించడానికి ఉత్సుకత చూపినట్లు ఈ సర్వే వెల్లడిరచింది.

 

అవధూత:

 బ్రహ్మనిర్వాణతంత్రంఅనే గ్రంథం నాలుగు రకాల అవధూతలను గురించి విపులీకరించింది.

 1.           బ్రహ్మావధూత: జన్మతః అవధూత. సమాజంలోని ఏ వర్గానికి చెందినవాడయినా కావచ్చు. ప్రాపంచిక విషయాలేవీ పట్టకుండా బతికేవాడు.

2.     శైవావధూత: సన్యాసాశ్రమం ద్వారా సామాజిక జీవితాన్ని త్యజించి జటలతో, విభూతిస్నానాలతో, శివాలంకరణలతో వుంటూ ఎక్కువ భాగం సమాధిలో(ధ్యానంలో) గడిపేవాడు.

3.          వీరావధూత: సాధువు వేషధారి. ఎర్రచందనాన్ని పులుముకుని, కాషాయవస్త్రాలు ధరించి, బాగా పెంచి విరబోసుకున్న జుట్టుతో ఎముకల దండలు, రుద్రాక్ష మాలలతో, దండాయుధం, గొడ్డలి లేదా డమరుకం చేతపట్టి తిరిగేవాడు.

4.         కులావధూత: కౌల సంప్రదాయానికి చెందినవాడు. మామూలు ప్రజానీకంతో కలిసే ఉంటాడు. కనుక వీరిని ప్రత్యేకంగా గుర్తించడం కష్టం.

వీరుకాక మహారాష్ట్రలో మాత్రం కనిపించే ఒక అవధూత వర్గంవారున్నారు. అమరావతి(మహారాష్ట్ర) దగ్గర కార్లాలో ఉన్న ఒక సమాధిని పూజిస్తారు. ఇంటిదగ్గర కూడా సమాధిపూజ చేస్తారు. అయితే వీరు విగ్రహారాధనకు వ్యతిరేకులు. పూజా ప్రదేశాన్ని బంగళా అని పిలుస్తారు. గుళ్ళకుపోరు.వీరి భజనలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సమాధి దగ్గర కర్పూరం వెలిగిస్తారు. అది వెలిగినంతసేపు ధ్యానంలో ఉండి ప్రార్థనలు చేస్తారు. వీరిని షిద్‌లని కూడా అంటారు(కొందరు షిండేగా కూడా వ్యవహరిస్తారు)

 

నాథ్‌

      అవధూత పంథాలో నాథ్‌ సంప్రదాయంకూడా ఉంది. అవధూతగీతదీనిని విపులంగా చర్చించింది. వీరికి కూడా గోరక్షానాథ్‌ ఆదర్శం. సిద్ధ సాంప్రదాయంలోనే మతాచారంపట్ల నమ్మకంలేని వర్గం నాథ్‌లు. వీరిలో కూడా చాలా శాఖలున్నాయి. మూల పురుషుడు మత్స్యేంద్రనాథ్‌ లేదా మచ్ఛేంద్రనాథ్‌. దీనిని ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవాడు గోరక్షానాథ్‌. వీరిద్దరినీ టిబెట్‌ బౌద్ధగ్రంథాలు మహాసిద్ధులుగా, అనంత శక్తిమంతులుగా కీర్తించాయి.

నాథ్‌లలో ఆదినాథ్‌ అంటే మహాశివుడు. మహాదేవుడే తొలి నాథ్‌. నవనాథ్‌లు గురుపరంపరలో తొమ్మిదిమంది. దత్తాత్రేయ మహర్షితో ఈ సంప్రదాయం మొదలవుతుంది. 1.మత్స్యేంద్రనాథ్‌ 2. గోరక్షానాథ్‌ (గోరఖ్‌ నాథ్‌) 3. జలంధర్‌ నాథ్‌ (జన్‌ పీర్‌) 4. కనీఫ్‌ నాథ్‌ 5. గెహనీ నాథ్‌ (గైబీ పీర్‌) 6.భార్తరీ నాథ్‌ (రాజా భార్తరీ) 7. రేవణా నాథ్‌ 8. చార్‌పతినాథ్‌ 9. నాగ్‌ నాథ్‌ (నాగేష్‌ నాథ్‌). వీరిని నవ నారాయణులని కూడా అంటారు. ప్రాపంచిక కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీకృష్ణుడు నవ నారాయణులను పిలిచి వారితో నాథ్‌ సంప్రదాయాన్ని ప్రారంభించాడని మరొక కథనం.

 నాథ్‌ సాంప్రదాయం..గురుశిష్య పరంపరానుగతంగా కొనసాగుతుంది. దీక్షా గురువు నుండి దీక్ష తీసుకున్ననాటి నుంచే ఈ సాంప్రదాయంలో చేరినట్లు లెక్క. గురువు శిష్యుడి శరీరాన్ని తాకి తన ఆధ్యాత్మిక శక్తిలో కొంత భాగాన్ని మంత్ర సహితంగా ధారపోస్తాడు.తద్వారా కొత్తగా నాథ్‌ అయిన శిష్యుడికి కొత్తపేరు పెడతారు. ఈ ప్రక్రియలో గురుశిష్యులు దిగంబరులుగానే ఉంటారు. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత జీవితాంతం అతను నాథుడే.దాన్ని స్వయంగా వదిలించు కోలేరు. వేరొకరికి అప్పగించడంకూడా కుదరదు.

 నాథ్‌ సంప్రదాయాన్ని కూడా 12 పంథాలుగా విభజించారు. 1. సత్య నాథ 2. ధరమ్‌నాథ 3. దారియానాథ 4. ఆయినాథ 5. వైరాగ కీయా 6. రామాకే 7.కపిలాని 8. గంగానాథీ 9. మన్నాథీ 10. రావల్‌కే 11.పావాపంథ్‌ 12.పాగ్‌లా పంథీ. మరో వర్గీకరణ ప్రకారం మచ్ఛీంద్రనాథ్‌, ఆదినాథ్‌, మీనా నాథ్‌, గోరఖ్‌నాథ్‌, ఖపర్‌నాథ్‌, సత్‌నాథ్‌, బాలక్‌నాథ్‌, గోలక్‌ నాథ్‌, బిరూపాక్ష్‌నాథ్‌, భర్తృహరినాథ్‌, ఐనాథ్‌, ఖేచార్‌నాథ్‌, రామచంద్రనాథ్‌ అని ఉంది. 

వైష్ణవ సంప్రదాయంలో..

 అవధూత అనగానే చాలామటుకు శైవసాంప్రదాయానికి చెందినవారే ఉంటారు. అయితే వైష్ణవ సాంప్రదాయంలో కనిపించే అవధూతలను తురీయతీత్‌ అవధూతలంటారు. నారద పరివ్రాజక ఉపనిషత్‌’, ‘తురీయతీత్‌`అవధూత్‌ ఉపనిషత్‌గ్రంథాల్లో వీరికి సంబంధించి సమాచారం సమగ్రంగా లభిస్తుంది.

 

సిద్ధులు

దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ప్రాచీన తమిళ గ్రంథాల్లో వీరి ప్రస్తావన ఎక్కువగా కనబడుతుంది. దాదాపు 10వేల ఏళ్ళ క్రితం నుంచి ఈ సాంప్రదాయం ఉందనీ, తొలి సిద్ధపురుషుడు శివుడేనని అంటారు. దక్షిణభారత సిద్ధులను దురాక్రమణదారులైన ఆర్యులు బహిష్కరించారని కొన్ని పుస్తకాలు పేర్కొంటున్నాయి. సిద్ధులను తమిళంలో సిత్తార్‌లని అంటారు. కాశ్మీర్‌ శైవంలో సిద్ధుడు అంటే సిద్ధగురువని భావిస్తారు. ఇతరత్రా సిద్ధులు అని చెప్పినప్పుడల్లా  సిద్ధార్‌లు, నాథ్‌లు, సాధువులు, యోగులని కూడా వీరిని ప్రస్తావించారు. వీరందరూ సాధనా ప్రక్రియను అనుసరిస్తూన్నందువల్ల ఇలా ప్రస్తావించి ఉండవచ్చని  చరిత్రకారుల అభిప్రాయం.

తమిళ సిద్ధులు(సిద్ధార్‌ లేదా సిత్తార్‌) దీర్ఘకాల తపస్సుకు అనుగుణంగా తమ శరీరాలను సిద్ధంచేసుకోవడానికి రహస్య రసాయనాలను వాడతారనీ, దానివల్ల వీరి ఉఛ్వాసనిశ్వాసల వేగం బాగా తగ్గుతుందనీ, వీరికి ఎగిరే శక్తితో సహా 8 శక్తులున్నాయని(అష్టాంగ సిద్ధింగళ్‌) వీరి గ్రంథాలు తెలుపుతున్నాయి. వాటిప్రకారం 18మంది సిద్ధార్‌ లున్నారు. వీరి నాయకుడు శ్రీకగపుళందర్‌. మిగిలిన వారు.. అగస్తియార్‌, కమలాముని, తిరుమూలార్‌, కుతాంబాయి, కోరక్కర్‌, దన్వంద్రి, కొంగనార్‌, సత్తముని, వాన్మీగర్‌, రామ్‌దేవర్‌, నందీశ్వరర్‌(నందిదేవర్‌), ఎడాయిక్కదర్‌, మచ్ఛముని, కరువూరార్‌, బోగార్‌, పాంబట్టి  సిద్ధార్‌, సుందరందర్‌, పతంజలి.

 జైనమతంలో కూడా సిద్ధుల ప్రస్తావన ఉంది. వీరు కర్మబంధాలను తెంచుకుని, జననమరణ చక్రంనుండి విముక్తిపొందినవారనీ, భూ ప్రపంచానికి అగ్రభాగంలో ఉండే శైవశైల అనే ప్రాంతంలో నివసిస్తారని వారి గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. వీరికి కొత్త కర్మలేవీ అంటవు. మోక్షప్రాప్తి పొందుతారు. వీరికి రూపంలేదు. అన్నిరకాల కోరికలు, ఆకర్షణలను జయించారు. వీరికి 8 రకాల గుణాలున్నాయని తమిళ జైన గ్రంథం చూడామణి నిగండుపేర్కొంటున్నది.

 హిందూ ఖగోళ శాస్త్రాలలో సిద్ధలోక ప్రస్తావన ఉన్నది. వైదిక గ్రంథాలు తరచూ ప్రస్తావించే సిద్ధాశ్రమంఅనేది హిమాలయాలలోని ఒక రహస్యప్రదేశంలో ఉన్నట్లు తెలిపారు. ఇంచుమించు ఇటువంటి ప్రస్తావనే శంభారాపేరుతో టిబెట్‌ గ్రంథాల్లో కనిపిస్తుంది. రామాయణ, మహాభారతాలతో సహా ప్రాచీన హైందవ సాహిత్యంలో సిద్ధాశ్రమ ప్రస్తావన అక్కడక్కడా వస్తుంది. రాక్షసులనుంచి రక్షణకు రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకెళ్లిన సందర్భంలోనూ, విష్ణుమూర్తి వామనావతార సందర్భం లోనూ దీని ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది.

 1300-1321 మధ్య మిథిలరాజ్యాన్ని పాలించిన హరసింహదేవుడి ఆస్థాన పండితుడు కవి శేఖరాచార్య జ్యోతిరీశ్వర ఠాకూర రచించిన వర్ణ రత్నాకరగ్రంథంలో 84మంది సిద్ధుల జాబితా ఇచ్చారు.15వ శతాబ్దం నాటి హఠయోగ ప్రదీపికలో 32మంది మహాసిద్ధులజాబితా ఉంది. ఈ రెండింటిలో కొన్ని పేర్లు ఉమ్మడిగా కనిపిస్తున్నాయి. వీరిలో నాథ్‌లుకూడా ఉన్నారు.

సిద్ధ చికిత్స :

ఆయుర్వేద, యునానీలతో పాటూ సిద్ధచికిత్సకూడా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఉంది. సిద్ధ చికిత్సా విధానం దాదాపు 2500 సంవత్సరాల నాటిదని తమిళ గ్రంథాలు చాటుతున్నాయి.

 

నాగసాధువులు :

సాధుఅనే సంస్కృత శబ్దానికి లక్ష్యాన్ని చేరుకోవడం’, ‘అధీనంలోకి తీసుకోవడంవంటి అర్థాలున్నాయి. దీన్నుంచే సాధనవచ్చింది. సాధువు అంటే ఉత్తమ పురుషుడు, సాధ్వి అంటే ఉత్తమ స్త్రీ. మనదేశంలో దాదాపు 40-50 లక్షల మంది సాధువులున్నట్లు కొన్ని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. వీరిని పవిత్రులుగా హిందూమతం గౌరవిస్తుంది. వీరిలో కూడా శైవ, వైష్ణవ, శాక్త సాధువు లున్నారు.మహిళలు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి సాధ్విలుగా మారతారు (ఆనందమాయిమా, అమృతానంద మాయి, కరణామాయి).

 ఇక నాగసాధువుల విషయానికొస్తే 12ఏళ్లకొకసారి వచ్చే కుంభమేళాలు, మహాకుంభమేళాల్లో వీరు వచ్చి తొలిస్నానాలు చేసిన తరువాతనే అవి అధికారికంగా ప్రారంభమవుతాయి. దీన్నిబట్టి వీరి ప్రాముఖ్యత ఊహించవచ్చు.

 వీరిది రహస్యజీవితం. ప్రత్యేక సందర్భాల్లోనే జనం మధ్యకు వస్తారు. నాగ్‌అంటే దిగంబరం అనికూడా అర్థముందట. వీరుపూర్తి దిగంబరులుగానే తిరుగుతారు. వీరిని నాగ్‌బాబాలనికూడా అంటారు.

 నాగ సాధువుల సాంప్రదాయాన్ని దత్తాత్రేయుడు ప్రారంభించారని చెబుతారు. అయితే సనాతన ధర్మ రక్షణకు వీరిని సైనికదళాలుగా మలిచినదిమాత్రం శంకరాచార్యుడే. మతాన్ని కాపాడుకోవడానికి(అప్పటి దేశకాల పరిస్థితుల్లో) రెండింటి అవసరం బాగా ఉందని ఆయన గుర్తించాడు. ఒకటి శాస్త్ర(జ్ఞానం), రెండవది అస్త్ర(ఆయుధం). జ్ఞానవ్యాప్తి ఆచార్యులకు(శాస్త్రధారులకు), మతరక్షణ నాగ్‌లకు (అస్త్రధారులకు) అప్పగించాడని చెబుతారు.

 దానికి తగ్గట్టుగానే నాగ సాధువుల ప్రవర్తన కూడా అరివీర భయంకరంగా ఉంటుంది. త్రిశూలం, కత్తి, దండం వీరి ఆయుధాలు. 1950కి ముందయితే మతగౌరవానికి, వారి సాంప్రదాయానికి ఎవరయినా భంగం కలిగిస్తే దాడి చేసేవారు, చంపడానికి కూడా వెనుకాడేవారు కారు, అది కుంభమేళాఅయినా సరే. వీరికి చావంటే భయం లేదు.(అప్పటి చట్టాలు కూడా వీరిని ఉపేక్షించేవని అంటారు.)

 ఒంటినిండా విభూతిని అలముకుంటారు. శంఖం, డమరుకం, రుద్రాక్షలుంటాయి. చిల్లుంతో ధూమపానం చేస్తారు. వీరు గుంపులు, గుంపులుగాతిరుగుతారు. బయటసమాజంతో సంబంధాలే కాదు, సంభాషణలుకూడా ఉండవు. వీరు తరచుగా పలికే శ్లోకం..

‘‘శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం

సూత్రభాష్య కటోబందే భగవత్‌ పునః పునః’’

 

(శివుణ్ణిఅయిన నేను ప్రపంచాన్ని కాపాడడానికి ప్రతి యుగంలో పుడుతూ ఉంటాను)... ధర్మసంస్థాప నార్ధాయ ..లాంటిది ఇది.

వీరు నివసించే ప్రాంతాలను అఖాడాలంటారు. 

 సాధువులు, యోగులు, అవధూతలు, సిద్ధులు, నాథ్‌లు తదితరులు పవిత్రులుగా హిందూ సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటున్నా, మనదేశ చట్టాల్లో మాత్రం ప్రత్యేకంగా వీరికి ఎటువంటి గుర్తింపులేదు.

-      ములుగు రాజేశ్వర రావు,

సీనియర్ జర్నలిస్ట్

 

(శ్రీరామదూత స్వామివారి శిష్యులు వారి మాసపత్రిక వందేహం రామదూతం` ప్రత్యేక సంచిక(ఏప్రిల్, 2014)-

ప్రచురించే సందర్భంలో వృత్తిపరంగా నా సహాయ సహకారాలకోసం వచ్చి కలిసినప్పుడు 

వృత్తి బాధ్యతగా జిజ్ఞాసను పెంచుకుని ఆరాతీస్తే నాకు కొంత సమాచారం లభించింది. 

అదే ఈ  వ్యాసం... ఆ సంచికలో ప్రచురితమైంది.)

(ఈ అంశం మీద.. మరీ ముఖ్యంగా నాగసాధువుల మీద మరింత అవగాహన కోసం, సమాచార సేకరణకోసం త్వరలో గోరఖ్‌పూర్ వెడుతున్నా...  ఈ ప్రయత్నంలో నాకు తోడ్పడగల మిత్రులు, పాఠకుల నుంచి మరింత సమాచారం, మార్గదర్శకత్వం కోరుకుంటున్నా..   నా ఇ-మెయిల్-mideabox@gmail.com )



ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...