వార్త

 జనవరి 29- భారతీయ వార్తా పత్రిక దినోత్సవం(Indian Newspaper Day ) సందర్భంగా....



వార్త

 

నాకు రాయడం తెలుసు

నాకు చదవడం తెలుసు

పట్టిపట్టి చూడడం, ఓపిగ్గా వినడం తెలుసు

 

చచ్చు విశేషాల పిచ్చి మొక్కల్లోంచి

మందు మొక్కలు పీక్కురావడం తెలుసు

నేలపొరల్లో దాచిన మందుపాతరల

వాసన పట్టేయడం  తెలుసు

 

నా ముందున్న సమాచారం కుప్పల్లోంచి

వార్తలు ఏరుకోవడం ఎక్కువగా తెలుసు

వాటి దుమ్ము దులిపి ముస్తాబు చేసి

వినువీథుల్లో విహరింపచేయడం తెలుసు

 

దార్లో ఈల వేసేవి, గోల చేసేవి

వెంటపడి వేధించేవి

కన్నుగొట్టే కల్లబొల్లి కబుర్లనుంచి

వార్తను కాపాడుకోవడం కూడా తెలుసు

 

అప్పుడు ...

వార్త నా చిటికెన వేలు పట్టుకుని నడిచేది

పక్కచూపులు చూడాలనిపించినప్పుడు

నాకేసి ఓ లుక్కేసేది, కన్నెర్రచేస్తే

నాలుక్కరుచుకొనేది..

 

ఇప్పుడు...

 

అది నా చెయ్యి వదిలేసింది

ఈలలు, గోలలకు రెచ్చిపోతున్నది

రికార్డింగ్ డాన్సులు చేసేస్తున్నది

పచ్చికుండ మీదెక్కి

పిచ్చి కూతలు కూస్తున్నది

 

ఎంగిలిపడ్డవి, దొంగిలింపబడ్డవి

కల్తీసారాబట్టీల్లో వండివార్చినవీ

కక్కుర్తిపడి కక్కిన సొల్లు స్టోరీలన్నీ

వయ్యారాలు వొలకబోస్తూ

వార్తల మేలిమి జలతారు ముసుగు లేసుకుని

సంతంతా సందడిచేస్తున్నాయి

ఈథుల్లో ఈరంగమాడుతున్నాయి

పులివేషాలతో కాగితప్పులులు

మాయా దర్పణాలు

జాతర చేసేస్తున్నాయ్

కనికట్టుతో కట్టిపడేస్తున్నాయ్

టక్కుటమారాలతో

గజకర్ణగోకర్ణాలతో కుమ్మేస్తున్నాయ్

 

పల్లీబఠానీలక్కూడా పోటీలుపడి

పైటలు  జార్చేస్తున్నాయి

పచ్చనోటు కనపడగానే

పక్కలు పరిచేస్తున్నాయి

 

అయినా ఆశ చావక...

పనికిరావని ఊరవతల పారేసిన

సమాచార కుప్పలకేసి వెడితే

ప్రాణం లేచొచ్చింది...

 

అసలు వార్తలు శోషొచ్చి అక్కడ

చచ్చిన పీనుగుల్లా పడిఉన్నాయి

పిడచకట్టిన నాలుకలు చాచి

అమృతపు చుక్కలకోసం

ఆపన్న హస్తం కోసం

అల్లాడుతున్నాయి

 

 -చినవ్యాసుడు,  మాఊరు.

chinavyasudu@gmail.com

6 కామెంట్‌లు:

  1. Mee ఆవేదన అంత చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదడమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంఖం శబ్దం వినకపడకపోవచ్చు కానీ, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న విషయం అర్థమవుతుందిగా... అది చాలు... ఎప్పుడో ఒకప్పుడు అది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు... ధన్యవాదాలు

      తొలగించండి
  2. ఇది చదివాక చాలా మంది చేత విస్తృతంగా చదివిస్తే,ముఖ్యంగా సిగ్గు వదిలేసిన సో కాల్డ్ జర్నలిస్టుల చేత,మీడియా యాజమానుల చేత చదివిస్తే ,వేలాదిమంది ప్రజలచేత తప్పనిసరిగా చదివిస్తే చైనా వ్యాసుడు సంతోషించే సమయం తప్పక వస్తుంది.మెల్లగా నైనా మార్పు రావడం తథ్యం.
    చినవ్యాసుడికి తోబుట్టువులు కూడా ఉండే ఉంటారుగా?
    వాళ్ళు వూరుకోరుగా?
    ఇది నాగుండె లోతుల్లోంచి చెప్తున్న మాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరి గుండెలోతుల్లోని మాట కూడా అదే... మనం ప్రత్యేకంగా పనిగట్టుకుని చదివించాల్సిన పనిలేదు. ‘వారు’కూడా చదువుతారు. ఎక్కడో ఒక నరం ఎప్పుడో ఒకప్పుడు మెలిక పడుతుంది, తిరగబడుతుంది. అప్పుడు మారతారు... మీ స్పందనకు ధన్యవాదాలు

      తొలగించండి

...అధినాయక జయహే !

... అధినాయక జయహే !   ( తాతా !   మన్నించు .... ఈ రోజున ఇంతకంటే ఏం చెప్పలేను )     రైతు చేతిలో ఉన్నది భూమే వ్యవసాయమూకాదు , మార్కెట...