‘తెలుగు..గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం’ అన్న శీర్షికన జులై 20న నా బ్లాగులో ప్రచురించిన వ్యాసానికి అందిన స్పందన చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు నాతో ఏకీభవిస్తూ కొన్ని సూచనలు, సలహాలు కూడా చేసారు. వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో .. హెడ్డింగ్ ఘాటుగా ఉండడంతో కొరపోయి.. వ్యాసం లోపలికి కూడా తొంగి చూడకుండా బాధతో, నిరాశతో మెలికలు తిరిగిపోయిన సున్నిత మనస్కులు అయిన వీర భాషాభిమానులు కూడా తారసపడ్డారు. ఇలాంటివారు ముగ్గురు నలుగురే అయినా అలా బాధపడి స్పందించకుండా ఉండిపోయినవారు ఇంకా కొందరు ఉండవచ్చనే అనుమానం కొద్దీ ఈ వివరణ ఇస్తున్నా...
కాగితపు పడవలు, కొయ్యగుర్రాలు...
ఇప్పటికిప్పుడు కానీ, సమీప భవిష్యత్తులోకానీ తెలుగు భాషకు
వచ్చిన ప్రమాదమేదీ లేదు. ఇంటాబయటా దాదాపు 15 కోట్ల మంది తెలుగు వారు ప్రతి రోజూ ప్రతి క్షణం నోరారా తెలుగును హాయిగా మాట్లాడుకుంటున్నప్పుడు
తక్షణం ముంచుకొచ్చిన ఉపద్రవం ఏదీ లేదు. నిండు గోదావరిలా సజీవంగా ప్రస్తుతానికి
ప్రవహిస్తూనే ఉంది. ఇంకా కొంతకాలం కూడా కచ్చితంగా ప్రవహిస్తుంది. అయితే
గుర్తించాల్సింది ఏమిటంటే... ఎంతటి మహానది అయినా, మహా పర్వతం అయినా
పట్టించుకోకపోతే ఏదో ఒకనాటికి కనుమరుగయిపోతుంది-అని. ఇది చరిత్ర చెపుతున్న సత్యం.
ఎప్పటిలాగే కాలం మారుతున్నా.... జీవన శైలి
మాత్రం మునుపటిలాగా మందకొడిగా సాగడం లేదు. పెను మార్పులు అతి తక్కువ సమయంలో చోటు
చేసుకోవడాన్ని కళ్ళారా చూస్తూనే ఉన్నాం.
కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ఎవడి గొడ్డలి వాడు తీసుకుని వాడు కూర్చున్న
కొమ్మను కాపాడుకోవడానికి మిగతా కొమ్మలను నరికేసుకుపోతుంటే... కొంత కాలానికి ఆ చెట్టు పరిస్థితి ఏమవుతుందో
చెప్పడానికి కొంత కటువుగా ఆ వ్యాసంలో హెచ్చరించాల్సి వచ్చింది, ఆ క్రమంలోనిదే ఆ శీర్షిక కూడా...
కాలక్షేపానికో, ప్రచారానికో, గుర్తింపుకో ‘తెలుగు భాష’ను
గురించి ఆవేదనతోనో, ఆవేశంతోనో, ఆక్రోశించో నాలుగు మాటలు
జనాల్లోకి వదులుతుంటే అవి కాగితపు పడవల్లా కాసేపు మురిపిస్తాయి.
ముద్దుముద్దు మాటలతోనో, మీసాలు
మెలేయడంతోనో భాష బాగుపడదు. దానికి ఎదురయ్యే ప్రమాదాలు తొలగిపోవు.
ఎవడో వచ్చి ఏదో చేయాలనో, ప్రభుత్వాలు వాటంతట అవి, రాజకీయ నాయకులు వారంతట వారు పూనుకుని ఎర్ర
తివాచీలు అడుగడుగునా పరుస్తూ పోవాలనో కోరుకుంటున్నంతకాలం ప్రయాణం
‘కొయ్య గుర్రం’ మీద స్వారీలా ఉంటుంది...పైన ఎక్కినవాడు మాత్రం ఫుల్ జోష్ తో
ఊగిపోతుంటాడు.
భాషపట్ల అభిమానం కానీ, ప్రమాదం ముంచుకొచ్చినప్పడు చూపాల్సిన
తెగువ కానీ, అభివృద్ధి పట్ల ఆకాంక్షగానీ ఎలా ఉండాలో చెప్పడానికి ఒక అద్భుత
ఉదాహరణ....
బాబుల్ గాడి దెబ్బంటే.. గోల్కొండ అబ్బా...అనాలి
అది 1970 వ దశకం. అప్పట్లో ‘రేడియో’ ప్రధాన సమాచార ప్రసార సాధనం. వార్తలు, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేసే వ్యవస్థ-ఆలిండియా రేడియో...ఆకాశవాణి. జాతీయ వార్తలు కానీ, ప్రాంతీయ వార్తలు కానీ పొద్దస్తమానం ఉండేవి కావు. వాటి నిర్ణీత వేళల్లో అవి ప్రసారమయ్యేవి. వాటిలో కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎక్కువగా చూసేది...రాత్రి 9గంటలకు ఆంగ్లంలో ప్రసారమయ్యే వార్తలు.. అప్పుడు దేశ ప్రధాని ఇందిరాగాంథీ....ఇదీ నేపథ్యం.
ఆ రోజు.. రాత్రి కచ్చితంగా 9 గంటలకు...ఎప్పటిలాగే
ప్రారంభవాక్యం-This is All India Radio giving you the news..అని అప్పటివరకు సంవత్సరాలుగా వినడానికి అలవాటుపడిన శ్రోతలకు...ఒక మైల్డ్
షాక్...ఓ ఝలక్...This is Akashvani giving you the news…అని
వినపడింది. దేశమంతా కొద్దిక్షణాల్లోనే
తేరుకుని ముసిముసిగా నవ్వుకుంటూ వార్తల్లోకి చెవులు దూర్చారు...ఒక్క మద్రాసు
రాష్ట్రంలో (ప్రస్తుత తమిళనాడు) తప్ప....ఆ క్షణంలో అక్కడ రాజుకున్న చిచ్చు
తెల్లవారేటప్పటికి దావానలమయింది, మిన్నూమన్నూ ఏకమయ్యాయి. రాష్ట్ర (భాషా) ప్రయోజనాలకోసం
ప్రభుత్వం, ప్రతిపక్షం అన్న తేడా అక్కడ మాత్రం ఉండదు కాక ఉండదు. అందరిదీ ఒకే గొంతు. ర్యాలీలు, సభలు,
ఢిల్లీకి టెలిగ్రాములు, ఫోన్లు, పోస్ట్ కార్డులు...దీక్షలు..హోరెత్తుతున్నాయి.
..ఎంతగా అంటే పక్కనే ఉన్న సముద్రఘోష కూడా వినపడనంతగా......
ఆ రాత్రి... మళ్ళీ 9 గంటలకు వార్తలు ...మద్రాసులో
అకస్మాత్తుగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధంకాక ... తెలుసుకోవడానికి దేశమంతా
వాటికోసం ఎదురు చూస్తున్నది.... 8.58.. 8.59... 9.00.. సిగ్నేచర్ ట్యూన్... This is All India Radio giving you the news … అని వినపడింది. అంతే మళ్ళీ దేశం షాక్స్.. మద్రాస్ రాక్స్... అన్నట్లు .. మిన్నంటిన
మంటలు ఆనందబాష్పాలై తమిళులను జల్లులతో తడిపేసాయి.
ఒక్కసారి డిసైడ్ అయిపోతే నా మాట నేనే వినను.. అనే టైపు... రాక్షసి,
ఐరన్ లేడీ, ఓన్లీ మ్యాన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్... వంటి పలు బిరుదులు
తగిలించుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ .. 24 గంటల్లోనే నిర్ణయాన్ని వాపసు తీసేసుకున్నారు.
కాదు..తీసుకోక తప్పని పరిస్థితి.. కారణం ఆమెకు తెలుసు ... తమిళుల హిందీ వ్యతిరేకత,
తమిళుల సంకల్పబలం ఎంత గట్టిగా ఉంటుందో... హిందీ వ్యతిరేక ఉద్యమం మంటలు చల్లారినా, పౌరుషాల
సెగలు మాత్రం బుసలు కొడుతూనే ఉంటాయి అక్కడ.
(ఇక్కడ ఆకాశవాణిలో పేరు మార్పుకు దేశ ప్రధానికి సంబంధం ఏమిటన్న సందేహం రావచ్చు. ఆ మార్పు ఆమె జోక్యంతోనే జరిగింది..ఆకాశవాణి అనేది వ్యవస్థ పేరు...దానికి మళ్ళీ అనువాదమేమిటి.. నాన్సెన్స్... ఏ భాషలో చెప్పినా... ఎక్కడ చెప్పినా అది ఆకాశవాణే..అనేది ఆమె వాదన అయి ఉంటుంది. తరువాత ఉపసంహరణ కూడా ఆమెదే)
-
చినవ్యాసుడు, మాఊరు
గమనిక : తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలి, ఎలా సుసంపన్నం
చేసుకోవాలి...అన్న విషయంపై మరిన్ని వ్యాసాలు త్వరలో ...
అలాగే మీరు కూడా మీ అభిప్రాయాలను, మీ సూచనలను, ఇదే బ్లాగులో వ్యాఖ్యల బాక్స్ లో నమోదు చేస్తే... భాషాభిమానుల, సాహిత్యాభిమానుల స్పందన అంతా ఒక్కచోటే చూసుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. మీ వ్యాఖ్యతోపాటూ, మీ ఇ-మెయిల్, అభ్యంతరం లేకపోతే ఫోన్ నంబరు జత చేయవచ్చు, తప్పనిసరి కాదు
తెలుగు భాషాభిమానులు అందరికీ షేర్ చేయండి
.................