
శాస్త్రం(మత గ్రంథం)
స్టాటిక్. అంటే ఎటువంటి మార్పులకు అవకాశం లేకుండా స్థిరంగా ఉంటుంది, శిలా శాసనం లాగా. కానీ శాస్ర్తి(మతాచార్యుడు /ప్రవక్త/ గురువు /బోధకుడు / ప్రవచనకర్త) అలాకాదు
డైనమిక్, కాలానుగుణంగా మారుతుండేవాడు, మార్పులు సూచించగల యోగ్యతకలవాడు. శాస్ర్తి అంటే ఒక నిర్దిష్ట కులంవాడని
కాదు లేదా వంశానుగతంగా ఆ టైటిల్ ను తగిలించుకున్నవాడు అసలే కాదు.శాస్త్రి అంటే
శాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, నిష్పాక్షికంగా,
విశాల హృదయంతో, ధార్మికంగా వాటిని
విశ్లేషించగల, వ్యాఖ్యానించగల సత్తా, సామర్ధ్యాలున్నవాడు. సైన్స్ (విజ్ఞాన
శాస్త్రం) విషయంలో కూడా సైంటిస్టు చేసే కొత్త కొత్త ఆవిష్కరణలనుబట్టి సైంటిస్టే ప్రమాణం,
సైన్సు ప్రమాణం కాదు.

మనదేశం, మన ధర్మ శాస్త్రాల విషయానికొస్తే-గతంలో రాజులు, రాజ్యాలు
మారినప్పుడల్లా వారి పాలనకు తగిన నియమాలు, శాసనాలు అవసరం
అయ్యేవి. ఇప్పటి భాషలో చెప్పాలంటే రాజ్యాంగం అవసరమయ్యేది. అప్పటికి వారికి
అందుబాటులో ఉన్న ఋషుల సాయంతో అలా వారు రాయించుకున్న రాజ్యాంగ నియమాలే
ధర్మశాస్త్రాలు లేదా స్మృతులు. మనుస్మృతి, కాత్యాయన స్మృతి,
పరాశర స్మృతివంటివి.లేదా సమాజగతిని నియంత్రించడానికి, సన్మార్గంలో పెట్టడానికి అప్పటి రుషులే(మేధావులే) ధర్మశాస్త్రాలను
కాలానుగుణంగా రూపొందిస్తూ వచ్చారు.
సనాతన ధర్మాన్ని
ముక్కలు చెక్కలుగా చీల్చి...శైవులు, వైష్ణవులు,
శాక్తేయులు, గాణపత్యులు...ఇలా ఎవరి వాటా
గొప్పదనివారు కీచులాడుకుంటున్న నేపథ్యంలో ఆదిశంకరాచార్య ఒక వ్యూహాన్ని అమలు
చేసాడు. ఛాందసంగా ఎవరి పట్టు వారు వదలకుండా ఉండడాన్ని గమనించి ఒక సాధనాన్ని
ముందుకు తెచ్చాడు. దాని పేరు వాదన. వాదనలో ఎవరు ఓడితే వారు ప్రత్యర్థుల
సిద్ధాంతానికి తలవంచి దానిని భుజానికెత్తుకోవాలి, తనను
ఓడించిన పాత సిద్ధాంతానికి(వాదానికి) నీళ్ళు వదలాలి. ఇదీ షరతు. దానికి దేశమంతా
తిరిగి అందరినీ వాదనల్లో ఓడించి తన దారికి తెచ్చుకుని...అందరూ ఒక తల్లి బిడ్డలే
అని హైందవధర్మానికి పుట్టిన కొమ్మలు, రెమ్మలే అని ఒప్పించి ‘హైందవం-
మతం కాదు, జీవన విధానం’ అని
ప్రకటించాడు.
మరి ఈ జీవన విధానం
స్టాటిక్ గా ఉంటుందా ? ఉండదు. అది చలనశీలం కలది కదా
! అయితే చలనం కూడా అడ్డదిడ్డంగా ఉండకుండా ఒక నదిలాగా ప్రవహించేలా, అది జనసామాన్యానికి ఉపయోగపడడానికి వీలుగా దాని ప్రచారానికి, ఆచరణకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసాడు. అంటే దీని మూల సూత్రం...చలనశీలత.
సంకుచితత్త్వానికి అవకాశం లేని- ‘వాదన’( చర్చ)తో జీవన విధానాన్ని వికసింపచేసుకుంటూ ముందుకు సాగడం. అంటే ఓపెన్
మైండ్ తో ఉండడం. అలాకాక, శాస్త్రమే(హిందూ ధర్మశాస్త్రాలే)
ప్రమాణం అన్నప్పుడు మనం ఓపెన్ మైండ్ తో ఉండం, అది-‘ క్లోజ్డ్’ అని బోర్డ్ పెట్టినట్లవుతుంది. జీవన విధానం అని
ప్రకటించుకున్న హైందవానికి, చాలా ఇతర మతాలకు
తేడా ఎక్కడుందీ అంటే..వందల ఏళ్ళనాటి ఇతర మత గ్రంథాలు శిలా శాసనాలు. యథాతథంగా తప్ప
మరోవిధంగా చెప్పకూడదు, వాటితో విభేధించకూడదు-అని వాళ్ళు మేకులు
దిగ్గొట్టారు. అది అంతే. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. Open minded fool is better than a closed
minded scientist. అంటే చెవుల్లో సీసం పోసుకుని.. చెప్పింది వినడానికి
ఇష్టపడని శాస్త్రవేత్తకంటే చెప్పింది వినే మూర్ఖుడు ఎంతో మేలు-అని. వినగా వినగా
మూర్ఖుడు ఏదో ఒకనాటికి వివేకవంతుడవుతాడని నమ్మకంగా చెప్పగలం కానీ, చెవులు మూసుకున్న శాస్త్రవేత్త తన మూర్ఖత్వానికి తాను సజీవ సమాధి అయిపోవడం
తప్ప తనకు గానీ తనను నమ్ముకున్న వారిని గానీ ఉద్ధరిస్తాడన్న గ్యారంటీ ఇవ్వలేం.
కాలం మారుతున్నది.
జీవన విధానం మారుతున్నది. అయినా మనం శాస్త్రమే ప్రమాణం అనడం ఆదిశంకరాచార్యులవారి
వాదన, చర్చ అనే మౌలిక సూత్రాలను వ్యతిరేకించడమే
అవుతుంది. చార్వాకులనుకూడా గౌరవించి, వారికి కూడా తట్టని
సందేహాలు లేవనెత్తి తన ధర్మాన్ని ఎలా ప్రశ్నించి నిలదీయవచ్చో సనాతన ధర్మమే
నేర్పింది కదా ! ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లోకసాధారణం. ప్రశ్నించడాన్ని నేర్పడం
అసాధారణం. అది ఒక్క సనాతనధర్మానికే చెల్లింది. నిజానికి అదే దాని
బలం. వేల సంవత్సరాల మనుగడకు అదే ఆధార శిల. మరి ఆ సాధనాన్ని మనమే మూలనపడేస్తే ఎలా ? కాలానుగుణంగా జీవన శైలిలో వచ్చిన మార్పులు చర్చకు పెట్టి, సనాతన ధర్మ మౌలికతకు, భారతీయ ఆత్మకు హాని కలగకుండా
ధర్మశాస్ర్తాలను తిరగ రాయడం తక్షణ కర్తవ్యం. ఈ విధమైన కాలానుగుణ సంస్కరణ కేవలం
హిందూ మతానికే కాదు, అన్ని మతాల మనుగడకు, ప్రశాంత సామాజిక జీవనానికి, అభ్యున్నతికి
అత్యావశ్యకం. తరం మారినప్పుడు స్వరం కూడా మారుతుంటుంది. స్వరానికి తగ్గట్టు తరం
మారకపోతే, అపశ్రుతులతో వ్యవస్థంతా అస్తవ్యస్తమవుతుంది,
దీనికేం చేయాలి ?
దేశవ్యాప్తంగా హైందవ
ధర్మానికి చెంది, ప్రజల విశ్వసనీయత
పొందిన అన్ని పీఠాలు, మఠాలు, సంస్థల
అధిపతులు లేదా ప్రతినిధులతో ఒక విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ
ఏర్పాటు చేసి మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయినా అదే ఫైనల్ అని
తీర్మానించకుండా ఎప్పటికప్పడు దానికి సవరణలు చేసుకుంటున్నాం. మౌలికతకు భంగం వాటిల్లకుండా
ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్పులు చేసుకుంటూనే, ముందు
తరాలవారు సవరణలు చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలి. ఒకే పదానికి ఉన్న పలు
మాండలికార్థాలతో మనం నిఘంటువును రూపొందించుకుంటున్నట్టు గానే విశాల భారతావని లోని
పలు రకాల స్థానిక ఆచార వ్యవహారాలకు సరిపోయేవిధంగా సూత్రీకరణలు చేయాలి. ఒకే పండుగకు
భిన్న తేదీలను ప్రకటించడం, శుభముహూర్తాలు మరో
మూణ్ణెల్లు లేవని ఒకడంటే మరొకడు దాన్ని ఖండించేటటువంటి, సామాన్య ప్రజానీకాన్ని అయోమయానికి గురి చేసే పరిస్థితులు పోవాలంటే ఇటువంటి
కృషి జరగాలి.
వృత్తులనుబట్టి కులాలు
ఏర్పడిన మాట అందరూ అంగీకరించేదే. కానీ బిడ్డ చచ్చినా పురిటికంపు చావనట్లు, వృత్తులు అంతరించినా కులవ్యవస్థ కొనసాగుతుండటం, బలపడుతూ
ఉండడం విడ్డూరం. ఇది సున్నితమైన సమస్యే కానీ, పరిష్కరించడానికి
అసాధ్యమయిన సమస్యేమీ కాదు. రాజకీయస్పర్శ తగలకుండా జాగ్రత్తపడితే దీర్ఘకాల
పరిష్కారదిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయవచ్చు.
రాజకీయాలకు అతీతంగా, ఛాందస మతవాదులకు, వారి సిద్ధాంతాలకు అతీతంగా,
సనాతన ధర్మపరిధిలో, విశాల దృక్పథంతో, ప్రగతిశీల, ఆధ్యాత్మిక చట్రంలో పకడ్బందీగా దీని సంకలనం సాగాలి.
దొంగస్వాములు, దొంగబాబాలు, కపట
సన్నాసులకు అవకాశంలేకుండా, క్షుద్రవిద్యలు, మూఢనమ్మకాలతో అమాయకజనాన్ని మోసపుచ్చే వారిని నియంత్రించే విధంగా ఉండాలి.
ప్రాచీనకాలంనాటి
గురుకుల విద్యాభ్యాసం, ఉంఛవృత్తిలాంటి
పద్ధతులను పునర్నిర్వచించాలి. అన్ని సంస్కృత, వేదపాఠశాలలవంటి
విద్యాలయాలన్నింటిలో అక్షరాభ్యాసంనుండీ పిహెచ్ డి వరకు సంస్కృతంతోపాటూ ఇంగ్లీష్ ను
కూడా పూర్తిస్థాయిలో బోధించాలి. ఇటువంటి చోట్ల విద్యార్థులను చేర్చడానికి తల్లిదండ్రులు
సుముఖంగా ఉంటారు, అదికూడా పెద్దసంఖ్యలోనే. కానీ సమస్యంతా
బోధకుల దగ్గరే వస్తుంది. దీనికి మంచి పరిష్కారం – రామకృష్ణమఠం
నమూనాను అనుసరించడమే. శిక్షణ ద్వారా వారు చాలామంది స్వామీజీలను సిద్ధం చేస్తుంటారు. అధునాతన
సాంకేతికను విరివిగా ఉపయోగించుకుని ఆన్ లైన్ వంటి వాటి ద్వారా రీచ్ పెంచుకోవాలి. సనాతన ధర్మం, భారతీయతను అధ్యయనం చేయడానికి విశ్వవిద్యాలయాల్లో పీఠాల(Seat of
Higher learning) ఏర్పాటును ప్రోత్సహించాలి.
అన్ని జాడ్యాలకు
మూలవేరు ఆర్థికం. కాబట్టి రాజకీయ పార్టీల ఫండింగ్ విషయంలో మన రాజ్యాంగం చేసిన
తప్పులు, కప్పదాట్లవంటి వాటికి అవకాశంలేకుండా మనిషి,
సమాజాల వికాసం (ఆధ్యాత్మికంగా) సకలజన సమ్మతంగా(సనాతన ధర్మపరిధిలో)
సాగే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థల భాగస్వామ్యం, , నియంత్రణ, నిర్దేశకత్వం ఉండేవిధంగా ఈ వ్యవస్థ
రూపుదిద్దుకోవాలి.
పండుగలు, పెళ్ళిళ్ళవంటి శుభకార్యాల్లోగానీ, చావులవంటి
కర్మకాండల్లోగానీ ఇప్పటికే నగరాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆచారాలు,
వ్యవహారాల్లో మార్పులు ఏవయినప్పటికీ వాటిని గాలివాటానికి
వదిలేసేబదులు, ధర్మబద్ధంగా, ఆచరణయోగ్యంగా
క్రమబద్ధీకరిస్తూ సూత్రీకరణలు జరగాలి. అయితే ఇక్కడ ప్రస్తావించినవన్నీ సులభసాధ్యంకాదని తెలుసు.
అందుకే కొండను తవ్వాలంటే శిఖరంపైకెక్కి కాదు గునపం దించాల్సింది. ఒక పక్కనుంచి
కొద్దికొద్దిగా తొలుస్తూ పోవాలి. అంటే ప్రత్యక్ష సంస్కరణలకు పూనుకోకుండా, ఆదేశిక సూత్రాలవంటివి జారీచేయకుండా, మినహాయింపులు,
సర్దుబాట్లతో శ్రీకారం చుడితే ఆశించిన లక్ష్యాలు తరం మారే లోపే చూడొచ్చు.
- - చినవ్యాసుడు, మాఊరు
chinavyasudu@gmail.com
చిరు విన్నపం :
మిత్రమా ! కాలక్షేపం కోసమో, కీర్తికండూతితోనో ఇవి రాయడం లేదు
చూడకూడనివిచూస్తూ, వినకూడనివి వింటూ, జరగకూడనివి నిరాటంకంగా జరుగుతూ పోతూ ఉంటే.... నరనరాలన్నీ
ఒక్కొక్కటిగా చిట్లిపోతుంటే.. మౌనంగా ఉండలేక చేస్తున్న ప్రయత్నాలు ఇవి. లక్షల
మెదళ్ళను రగిల్చే శక్తి అక్షరాలకు ఉంది. వీటిని
చదివి వదిలేయకండి...నచ్చితే నలుగురికీ షేర్ చేయండి(మార్పులు చేయకుండా)....వీలయినంత
త్వరగా పరిష్కారం కోసం దీనికి విస్తృత ప్రచారం కల్పించండి, మీ పరిధిలో.. మీ-చిన
వ్యాసుడు.