అది ఆరాధ్య సంప్రదాయం

 



అది ఆరాధ్య సంప్రదాయం

 

జగమెరిగిన సకల జన ఆరాధ్యుడికి జందెంతో కానీ, ఖననం, దహనం లాంటి కుల, మత సంబంధ ఆచారాలతో కానీ పని లేదు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కుల, మత, జాతి, భాషలకు, ప్రాంతాలకు, దేశాలకు అతీతుడు. ఆయనకు తొలి దశలో కులం, శాఖ, గోత్రం వంటి పట్టింపులేమీ లేవు. కానీ కుటుంబ, సామాజిక అవసరాల కోసం కొన్నింటిని ఆపద్ధర్మంగా ఆవాహన చేసుకున్నారు.

 

దిగ్గజ గాయకుడే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా అయిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గతించి రేపటికి ఏడాది. ఆయన పార్థివ దేహాన్ని దహనం చేయకుండా ఖననం చేయడంపై అనేక వ్యాఖ్యానాలు వినవచ్చాయి, చర్చలు నడిచాయి. అది సంప్రదాయాలపై అవగాహన లేనివారు రేకెత్తించిన చర్చ.  బాలసుబ్రహ్మణ్యంది జన్మతః శ్రౌత శైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబం. ఈ సంప్రదాయంలో దహన సంస్కారం ఉండదు. ఖననం (పూడ్పు) ఉంటుంది. అలా ఎందుకో తెలుసుకోవాలంటే - ఆ సంప్రదాయం గురించి క్లుప్తంగానయినా అవగాహన చేసుకోవాలి.

 

ద్వాదశారాధ్యులు... పండిత త్రయం

మన దేశంలో... శైవంలో కాలానుగుణంగా  పాశుపతం, కాశ్మీర శైవం, కాపాలికం, వీరశైవం లాంటి పలు శాఖలు పుట్టాయి. వీరశైవంలో ఆరాధ్య శైవం ఒక విభాగం. ఇది వేదాలను, ఆగమాలను ప్రామాణికంగా భావిస్తుంది కాబట్టి ఆచారాలు వాటికి అనుగుణంగా ఉంటాయి. (మరొక విభాగం- వర్ణాశ్రమ ధర్మాలను విశ్వసించదు. దీనిని  బసవణ్ణ స్థాపించి, బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు. కులరహిత సమాజ సృష్టిలో ఆయనది విప్లవాత్మక విజయం. ఆయన కూడా శివదీక్షాపరులైన లింగధారులే.

 

12 శతాబ్దానికి చెందిన పండితారాధ్య చరిత్రగ్రంథకర్త పాల్కురికి సోమనాథుడు రాసిన తెలుగు కావ్యం బసవ పురాణంలింగాయత్‌లకు పవిత్ర గ్రంథం.) శ్రౌత శైవాన్ని ప్రచారంలోకి తెచ్చి స్థిరత్వం కల్పించినవారు ద్వాదశారాధ్యులు (12 మంది). వీరిలో పండిత త్రయంగా పిలిచే ముగ్గురిలో శ్రీపతి పండితుడు ఒకరు. పదకొండవ శతాబ్దికి చెందిన శ్రీపతి పండితుడి తల్లితండ్రులైన మల్లికార్జునుడు, భ్రమరాంబ శ్రీశైలవాసులు. చంద్రజ్ఞానోత్తర ఆగమంపేర్కొన్న ఎనిమిది శైవ శాఖల్లో వీర శైవం ఒకటి. అది పూర్వ శైవం.

 

ఉత్తర శైవంగా పిలిచే శ్రౌత శైవంలోనూ ఆగమ శాస్త్రాలు, భస్మం, రుద్రాక్షలు, శివ పూజ ఉమ్మడిగా ఉన్నా... శాంభవ దీక్ష ద్వారా చేసే లింగధారణ ఉత్తర శైవం విశిష్టత. శాంభవ దీక్షలో - వైదిక దీక్ష’, ‘పౌరాణిక దీక్షఅని రెండు రకాలు ఉన్నాయి. ద్విజులలో... అంటే ఉపనయన సంస్కారం ఉన్న కులాలు అవలంబించేది వైదిక దీక్ష. ఇతరులు స్వీకరించే శాంభవ దీక్షను పౌరాణిక దీక్షఅంటారు.

 

ఆధ్మాత్మికతకు క్రియాశీలతను జోడించి...

మోక్షప్రాప్తికి (జన్మరాహిత్యానికి) ఈ దీక్ష సులభ మార్గం. శివపూజ చేయాలంటే సాధకుడు మొదట రుద్రుడిగా మారాలన్న భావనకు అనుగుణంగా... ఈ దీక్ష ద్వారా శివలింగాన్ని శరీరంలో ఒక భాగం చేసుకుంటారు. గురువు ఉపదేశం చేస్తూ శివలింగాన్ని మూర్త రూపంలో శిష్యుని చేతిలో ఉంచుతాడు. ఇది ఆధ్యాత్మికతకు క్రియాశీలతను జోడించడం. ఆ రోజు నుండి సాధకుడి నిత్యపూజలో హస్తలింగార్చన కూడా ఒక భాగమవుతుంది.

 

తాను స్వీకరించే ఆహార పానీయాలన్నీ ముందుగా ప్రాణలింగానికి నివేదించి ప్రసాదంగా పుచ్చుకోవడం అలవాటవుతుంది. ఇష్టలింగ (శరీరం), ప్రాణలింగ (సూక్ష్మ శరీరం), భావలింగ (శివైక్య భావన) పూజలతో సాధకుడు చివరగా శివైక్యంచెందుతాడు. అంటే కాలధర్మం చెందినప్పుడు ఈ సంప్రదాయంలో మరణించాడుఅని అనకూడదు. శివసాయుజ్యంలేక శివైక్యంచెందాడు అనాలి. 

 

అంతిమ యాత్రలో పాడె స్థానంలో వెదురు కర్రలతో చేసిన గూడు లాంటి నిర్మాణాన్ని వినియోగిస్తారు. దాన్ని విమానంఅంటారు. పార్థివ దేహాన్ని ధ్యానముద్రలో ఉన్నట్లుగా దానిలో కూర్చోబెట్టి తీసుకెళతారు. (పీఠాధిపతుల అంతిమ యాత్రలో కూడా దాదాపు ఇలాగే ఉంటుంది). ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో పార్థివ దేహం చాలా సేపు ఫ్రీజర్‌లో ఉండడం వల్ల గట్టిగా అయిపోయింది. కాబట్టి ఇలా ధ్యానముద్రలో కూర్చుండబెట్టడం సాధ్యపడలేదు. అందుకే విమానం కట్టలేదు. ఖననం కోసం తవ్విన గుంటలో కూడా పడుకున్నట్టు ఉన్న స్థితిలో కాకుండా... ఒక గోడకు గూడులాగా తవ్వి ధ్యానముద్రలో కూర్చుండబెట్టి ఖననం చేయడం ఈ ప్రక్రియలో భాగం. శాంభవ దీక్షను నాల్గవ ఆశ్రమమయిన సన్యాసం కంటే శ్రేష్ఠమైనదని భావిస్తారు. అంత్యక్రియల అనంతరం జరిగే మాస, సంవత్సరాది క్రతువుల్లో పిండ ప్రదానాల లాంటివి ఉండవు. దాన్ని తద్దినం అనరు, ‘ఆరాధనఅంటారు. 

 

భోక్తల స్థానంలో  మహేశ్వరులుంటారు. పితృదేవతలను వారి వారి స్థానాల్లో ఆవాహన చేసి... మహేశ్వర పూజ/ఆరాధన (హస్తపూజ, పాదపూజ) చేస్తారు. శివలింగం శరీరంలో భాగంగా ఉంటుంది కనుక... ఆరాధ్యుల్లో దహన సంప్రదాయం ఉండదు. 

 

చంద్రజ్ఞానోత్తర ఆగమంపేర్కొన్న ఎనిమిది శైవ శాఖల్లో వీర శైవం ఒకటి. అది పూర్వ శైవం. ఉత్తర శైవంగా పిలిచే శ్రౌత శైవంలోనూ ఆగమ శాస్త్రాలు, భస్మం, రుద్రాక్షలు, శివ పూజ ఉమ్మడిగా ఉన్నా... శాంభవ దీక్ష ద్వారా చేసే లింగధారణ ఉత్తర శైవం విశిష్టత.

 

-          చినవ్యాసుడు


(ఆంధ్రజ్యోతి-24.9.2021 సౌజన్యంతో)

……

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...