ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా...

 


తెలుగు-5 

తెలుగు చచ్చిపోతున్నదని ఆవేదన చెందుతున్న బహుకొద్దిమంది వీరాభిమానులు, తమ పిల్లలకు తెలుగు ఊపిరి అందట్లేదని ఆవేదనచెందుతున్న  ప్రవాసాంధ్రులు మాత్రం ...  ఏదో ఒకటి అర్జంటుగా చేసేయాలని ఉవ్వీళ్ళూరుతున్నారు. అలా వీరినుంచి ఎక్కువగా వినిపించే తక్షణ కర్తవ్యం – భాషోద్యమం. దీనికి తెలుగు రాష్ట్రాల్లోకూడా .. వారివారి కారణాల కొద్దీ కొందరు తహతహలాడుతున్నారు.

ఉద్యమమా !!!

తెలుగు భాషకు ఉద్యమం దేనికి ? దాని అంతిమ లక్ష్యం ఏమిటి ?  దాని నిర్మాణ, నిర్వహణ సంగతులేమిటి ? దీనిని ఎవరు చేయాలి ? ...  వంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా లేవు.

‘లేవు’ అని చెప్పడానికి ఆధారాలేమిటి...?

ఏ ఉద్యమం అయినా స్క్రిప్టు రాసుకుని సినిమాగా తీసి విడుదల చేసేలా ఉండదు. బాధితుల్లో నుంచి ఆ ఆకాంక్ష బలంగా రావాలి. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే...  ఆ ఆకాంక్ష ఎంతమందిలో బలంగా ఉంది ? సామాన్య ప్రజానీకం సంగతి పక్కనబెట్టినా...  తెలుగు ఉపాథ్యాయులు, రచయితలు, పాత్రికేయులు, పిల్లల తల్లిదండ్రులవంటి వారి సంగతేమిటి ? వీరు బలంగా కోరుకునేది ఒక్కటే. తెలుగు భాషా ప్రమాణాలు పడిపోతున్నాయి. వాటిని కాపాడుకుంటే చాలు. ... అన్న దగ్గరే వీరు ఆగిపోతారు. దానిని సరిదిద్దడానికి ‘ఉద్యమం’ వంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు.

తెలుగు భాషా శాస్త్రవేత్తలు, తెలుగు పండితుల వంటి వారు కోరుకొనేది... భాషా ప్రమాణాలతో పాటూ, తెలుగు భాషకు జవసత్వాలు కలిగించే సాహిత్యం కొత్తగా, పుంఖానుపుంఖంగా, ప్రామాణికంగా పుట్టుకురావాలనీ, ఇప్పటిదాకా ఉన్న మంచి సాహిత్యం బహుళ ప్రాచుర్యం పొందాలనీ...అంతే... దానికి కూడా  ‘ఉద్యమం’ పెద్ద పదమే అవుతుంది. అయినా ఉద్యమాలతో ఈ అవసరాలు నెరవేరవు కూడా.  ప్రభుత్వం విద్యా విధానంలో  చేర్చడంతోపాటూ, దాని అమలుకు సరిపడా నిధులు కేటాయిస్తే సరిపోతుంది. మంచి రచయితలను, విద్మావేత్తలను,  చేవకలిగిన ఉపాధ్యాయులను, భాషా శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సలహాలు స్వీకరిస్తూ, వారి  ప్రతిభను ఇతోధికంగా ప్రోత్సహిస్తుంటే  చాలు.

ఇక వాడుక భాషకు సంబంధించి... ప్రభుత్వఉత్తర్వులు, కోర్టు తీర్పులవంటివి తెలుగులో తీసుకు రావడానికి కూడా ఉద్యమాలు అవసరం లేదు. పాలకుల్లో చితశుద్ది ఉంటే... అతి స్వల్పకాలంలో (రాత్రికి రాత్రి) ఆ మేరకు ఏర్పాట్లు చేయవచ్చు.  ఇక బయట దుకాణాల సైన్ బోర్డులు, బస్సుల మీదవంటి....  వాటి విషయానికొస్తే....  అవి ఇప్పుడు ప్రపంచీకరణ రోజుల్లో మాట్లాడాల్సిన మాటలు కావు..  భాషపట్ల అభిమానం వేరు, దురభిమానం వేరు.... ఆ తేడా గుర్తించాలి. తెలుగులో బోర్డు రాయకపోతే వ్యాపారం జరగదు అనుకుంటే వ్యాపారులు రాయకుండా ఉంటారా... ‘‘సారా ఆదాయం కావాలి’ అదీ కరెక్టే, ‘సారా నిషేధం ఉండాలి’ అదీ కరెక్టే... లాంటిదే ఇది. బయటి నుంచి పెట్టుబడులు కావాలి,  పర్యాటకం కావాలి... నిధులు వరదలా పారాలి, వారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి... కానీ మా ఊర్లోకి అడుగుపెట్టే ప్రతివాడూ మా భాష నేర్చుకుని తరువాత కాలు మోపాలి... అంటే ఎలా...?

ఇవి చిన్నవి. ఇంతకంటే ఎక్కువగా  భాష అభివృద్ధికి చేయాల్సింది చాలా ఉంది. అది కూడా ఉద్యమాలతో నెరవేరేది కాదు. అసలు ఇప్పుడున్నట్లు చెప్పుకుంటున్న ఉద్యమాల లక్ష్యాల్లో కూడా ఇవి లేవనే చెప్పాలి. అలాగే ప్రాధాన్యతాపరంగా ఆలోచించి వెంటనే ఆచరించాల్సిన అంశం మాత్రం – ప్రవాసాంధ్రుల తెలుగు భాషా సమస్యలు. వీటిని పరిష్కరించడానికి ‘ఉద్యమం’ ఎందుకు ? పైన చెప్పుకున్న ప్రభుత్వ విద్యా విధానాల్లో దీనిని ఒక భాగం చేస్తే సరిపోతుంది. అలా చేయడానికి అవసరమైన ఒత్తిడి రాజకీయంగా  తీసుకు రావాలి.

పెళ్ళికూతురుగానీ, పెళ్ళికొడుకు గానీ లేకుండా పెళ్లి ఎలా జరగదో, ప్రజలు  లేదా నాయకులు లేకుండా ఒక ఉద్యమం కూడా అలా జరగదు. తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమం... విజయాలకు నాయకులు ప్రధాన  కారణం కాదు. బాధితులుగా ఒక ఆకాంక్ష, ఒక కసి గాఢంగా ఉండబట్టే జనసామాన్యంలో  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. నాయకుల ఉపన్యాసాలకు, ప్రవచనాలకు లేదా ప్రలోభాలకు లొంగి ప్రజలు ముందడుగు వేయలేదు. వారి ఆకాంక్షలు, వారి కసి సునామీలా  నిశ్శబ్దంగా పొంగడానికి సిద్దంగా ఉంటున్నదని  తెలిసి  నాయకులు పైన  కెరటాలమీద నిలబడి వాటిని నడిపారు. నాయకులు నోటితో గట్టిగా ఊదుతూ కెరటాలను సృష్టించలేరు కదా !

భాషను ఉద్ధరించడానికి  ఉద్యమాలు వద్దు సరే... మరి కేవలం భాషకు మరమ్మతులు చేసి కాస్త హంగూ ఆర్భాటం అద్దితే చాలా ! తెలుగు భాష మొత్తంగా పూర్వ వైభవం లేదా అంతకంటే గొప్పగా వెలిగి పోతుందా ???

వెలగదు గాక వెలగదు. మరి అలా వెలగాలంటే ఏం చేయాలి ...

లింక్ చూడండి     https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...