అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....


తెలుగు-4 

‘‘తెలుగు భాష అంతరించిపోతున్నది,’’ ‘భాష ప్రమాదంలో చిక్కుకున్నది’,  ‘‘తక్షణం ఏదో ఒకటి చేయకపోతే ఇది బతకదు’’....వంటి ప్రకటనలు అడపాదడపా వార్తల్లో కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల దీనికి ఉద్యమాలు కూడా చేస్తున్నట్లు  లేదా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తున్నది. విడివిడిగా కాకుండా మొత్తంగా సమీక్షించుకోవడం...ఎవరికి వారు దీనిని మొత్తంగా సింహావలోకనం చేసుకోవడం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. ఎందుకంటే... ఆ భాష ఎవరిదో కాదు, మనదే.. మనలో ప్రతి ఒక్కరిదీ కాబట్టి.

‘ప్రమాదం’ అంటున్నారు కాబట్టి, ముందు దాని సంగతి చూద్దాం. భాషపరంగా చూస్తే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ఏ ప్రమాదంలో లేవు. కానీ ఇక్కడ  ప్రమాదం జరగడానికి  అవసరమయిన ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తున్నాయి. అంటే కట్టెలు, చమురు, అగ్గిపెట్టెలు...వంటివి సిద్ధం చేసుకోవడం. కానీ తెలుగు రాష్ట్రాల బయట నివసిస్తున్నవారు... ప్రవాసాంధ్రులకు మాత్రం ఇప్పటికే  ప్రమాదం తాలూకు సెగ బాగా గట్టిగానే తగులుతున్నది. ఇంతకీ ప్రవాసాంధ్రులంటే ఎవరు ???..... ఎవరో కాదు, మనమే. మన కుటుంబ సభ్యులే..  అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు దాటి  ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు.

తెలుగుభాష – ప్రమాదం – ప్రవాసాంధ్రులు...వీటికి లంకె ఏమిటి ?  నిజానికి సమస్య ప్రవాసాంధ్రులది కూడా కాదు. వారి పిల్లలది. వారి చదువులది. పరాయి ప్రాంతాల్లో అక్కడి స్థానిక భాషలకు ప్రాధాన్యత ఉంటుంది, వాటి ప్రభావం కూడా సహజంగానే ఎక్కువ, ముఖ్యంగా విద్యాలయాల్లో...  ప్రవాసాంధ్రులు గాలిపటాల్లాగా ఎగిరేది పరాయి ప్రాంతాల్లోనే అయినా, వాటి దారం మాత్రం తెలుగు నేలకు తగులుకొని ఉంటుంది. గాలి బాగున్నంతకాలం అక్కడ బాగా ఎగరగలుగుతారు, ఏమాత్రం తేడా వచ్చినా తెలుగు నేలకు వచ్చి వాలాల్సిందే. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పిల్లల చదువులు ఆగమాగం అయిపోకూడదన్నది వారి ఆవేదన. అంతేకాదు...  పెద్దవారిలో కూడా బతుకుదెరువు కోసం పరసీమలకు వెళ్ళినా...  వారిలో పలువురు పలు రకాల కళల్లో ఆరితేరి ఉంటారు. వారికి వారి నైపుణ్యాలకు ఆదరణ కావాలి, గుర్తింపు కావాలి...  ప్రపంచ వేదికలు గుర్తించినా తమ వాళ్లు గుర్తించినప్పుడే వారికి పూర్తిగా తృప్తి, ఆనందం. అంతేకాదు, వారి కళలకు మెరుగులు దిద్దుకోవాలన్నా ... సొంత ప్రాంత అండదండలు కావాలి.. ఇది వారి సమస్యే కావచ్చు కానీ... .వాటిని తొలగించడం పుట్టింటి వారి బాధ్యత. మన ప్రభుత్వాలు, వ్యవస్థలు, సమాజం ఇప్పుడు ఆ బాధ్యతను గాలికొదిలేసాయి. లేదా వారికి అవసరమైన స్థాయిలో, వారు ఆశించిన స్థాయిలో వారికి అందచేయలేకపోతున్నాయి ... వీటిలో భాషతో ముడిపడిఉన్నవీ కూడా ఎక్కువే.

ఇక మన తెలుగుగడ్డ విషయానికొస్తే... మూడు నాలుగు దశాబ్దాలుగా క్లుప్తంగా చెప్పాలంటే... విదేశీ ఉద్యోగాల మోజు పెరిగిన తరువాత...  మనం అమ్మ చెయ్యి వదిలేసి, ప్రపంచమంతా తిరుగుతున్నది కదా అని సవతి తల్లి  చెయ్యి గట్టిగా పట్టుకున్నాం. అమ్మభాషను పూర్తిగా వదిలించుకొని, పిల్లలకు  అన్య భాషలు ఎక్కిస్తూ పోతున్నాం. దీనిలో రాజూపేదా అన్నతేడా లేకుండా అందరం అప్పుసొప్పులు చేసయినా ఉగ్గుపాలతోనే   వారికి అవి నూరిపోస్తున్నాం.

దీనిని గమనించిన ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని రకాల ఆకర్షణీయమైన ప్యాకేజీలతో మన పిల్లలు ఎగిరిపోవడానికి అవసరమైన రెక్కలు తొడుగుతూ ఉంటే ... చప్పట్లు కొట్టే ఉత్సాహంలో... అమ్మ- చీరకు(భాషకు) పడుతున్న చిరుగులు చూసే సమయం కూడా లేనంత తన్మయత్వంలో మునిగిపోయాం. దీని ఫలితం ...  ఇంచుమించు మూడు తరాల తెలుగు కుటుంబాల పిల్లల్లో అత్యధిక సంఖ్యాకులు... ఒక్క సబ్జెక్టుగానే  చివరి నూలుపోగులాగా  తెలుగు భాష వేలాడుతున్నా.. దాన్ని కూడా  పదో తరగతితో దాదాపు పూర్తిగా వదిలేయగా, ఇంటరులో మిగిలినకాస్తా వదిలేస్తున్నారు. (ఇంటరు లోకూడా మార్కులు, గ్రేడులకోసం అమ్మభాషను అర్థంతరంగా ఒడ్డునే వదిలేసి,  వెనక్కి తిరిగి చూడకుండా ... సంస్కృతం, హిందీ పడవలెక్కి ఏరు దాటేసి వెళ్ళిపోతున్నారు)

వీరికి తెలుగు మాట్లాడడం మాత్రమే తెలుసు. అది  కూడా ...  చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగు కాదు... అంగడి తెలుగు, సినిమా తెలుగు, సోషల్ మీడియా నేర్పిస్తున్న తెలుగు.  ఇక చదవడం, రాయడం విషయానికొస్తే ... క్రమేణా అలవాటు తగ్గి... పెళ్ళయ్యే నాటికి పెళ్ళిపత్రికలో తప్పులు కూడా దిద్దుకోలేని స్థాయికి వెళ్ళిపోతున్నారు. తెలుగు వాడు హిందీలో మాట్లాడితే వాడికి హిందీ క్షుణ్ణంగా వచ్చినట్లు కాదు కదా. పరభాషా హీరోయిన్లు మూడు, నాలుగునెలల్లోనే తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు, ఇంటర్వ్యూల్లో కూడా గలగలా తెలుగు మాట్లాడేస్తుంటే... మన తెలుగు అమ్మాయిలాగానే ఉందే.. ..  అని భ్రమపడే పరిస్థితి....  అంటే..  తెలుగు మాట్లాడడం వచ్చినంత మాత్రాన.. తెలుగు భాషను ఉద్ధరించడం కోసం అది  ఏమాత్రం పనికి రాదని తెలుసుకోవాలి..  జనాభా లెక్కలకు మాత్రమే పనికొస్తుంది.... సర్వేల్లో ఎవరు ఎంతమందని చెప్పడానికి.

కాబట్టి తెలుగు గడ్డను వదిలిన వాడు అమ్మ చెంగు కోసం అర్రులు చాస్తుంటే, పుట్టింటోళ్ళమయిన  మనం  వాడిని పట్టించుకోవడం లేదు. తెలుగు గడ్డమీదేమో...  అమ్మ స్తన్యంనుంచి బిడ్డను అమ్మే బలవంతంగా అవతలికి నెట్టేసి పోతపాలు పడుతున్నది....  ఇదీ వాస్తవ చిత్రం...  ఇంకాస్త సుళువుగా అర్థం కావాలంటే....

ఇంటింటి రామాయణం :

నా స్థాయిలో  :  నేను ఒక పుస్తకం రాసా తెలుగులో. అందరూ చదివారనే సంతోషం ఉన్నా, నా పిల్లలు దానిని చదవడానికి అంత ఆసక్తి చూపడం లేదనే బాధ ఉండేది... ఒకసారి వాళ్ళను అడిగితే వచ్చిన సమాధానం .. ‘‘నాన్నా ! నీవు దీన్ని ఇంగ్లీషులో రాసి ఉండొచ్చుగా... పోనీ ఇంగ్లీషులో ఇప్పటికయినా రాయరాదూ..’’ అని.

మీ స్థాయిలో :  మీరందరూ విపరీతంగా అభిమానించే ఒక సెలబ్రిటీకి తెలుగంటే ఎక్కడలేని మక్కువ. ప్రతివేదిక మీద చాలా స్ఫూర్తిదాయకంగా ‘తెలుగు’ గొప్పదనాన్ని చెబుతుంటాడు. చదవడం, రాయడం సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకపోయినా...  వారి పిల్లలు పూర్తి తెలుగులో ధారాళంగా మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి....

మరిప్పుడేం చేద్దాం ???

ఈ లింకుపై క్లిక్ చేయండి....  

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...