ఏ దేశమేగినా, ఎందుకాలిడినా
అదే మట్టి కాలికంటుతున్నప్పడు
ఆ మట్టిలోంచి పుట్టిన మనిషి
కంటికోరకంగా కనిపిస్తే ఎట్లా !
మానవత్వం పీక పిసికి
స్వార్థపు సంచుల్లో కుక్కి చెప్పే
మత ఇతిహాసాలు, ఘనతలు
కులపురాణాలు, వర్గ చరితలు
పరిశుద్ధత, పాతివ్రత్యాల
వల్లెవేతలు
ఇక ఆపు...
ఆ కారుకూతలు ఇంకా ఎందుకు
ఆ రంగుటద్దాలు తీసిపారేయ్
పో..పోయి నీ డిఎన్ ఏ చూసుకో
చరిత్రలోంచి పొడుచుకొచ్చిన
కొమ్ములతో, గిట్టలతో
తల్లి భూమిని కుళ్ళబొడిచి
లంకె బిందెలు తీయొద్దు
వారసత్వ హక్కులు చాటొద్దు
....
ఓ రాక్షసుడి రాజ్యంలో
కొద్దికాలంపాటూ ఒంటరిగా
కోటకు దూరంగా ఉంటేనే...
అగ్ని పరీక్షలు అవసరమనిపిస్తే....
ఏ దేశ చరిత్ర చూసినా
పరపీడన పరాయణత్వం అయినప్పుడు
శతాబ్దాల పరాయిపాలనలో
నలిగిన తాతముత్తాతలకు, మనకు
ఎన్ని శల్య పరీక్షలు చేయించాలో,
ఎన్ని డిఎన్ ఏలు తీయించాలో
లెక్కగట్టకుండా
ఇంకా
ఆ కూతలెందుకు, రాతలెందుకు
ఇంకా ఆ రంగుటద్దాలెందుకు,
తీసెయ్....
పెత్తందార్ల కాళ్ళకింద
పాశవికంగా నలిగిన
ఏ తోలుసంచీనుంచి జారి పడిన
ఏ జీవపు చుక్క
ఏ నెత్తుటి మొక్కయి
ఎంత పెద్ద మానయిపోయిందో
ఎన్నేసి ఊడలు దింపిందో
ఏ ఎఱుకల సానో చెప్పాలి...
సూదీ వద్దు సోదీ వద్దు
సోదికత్తెలను కదిలించకు
జాతక చక్రాలన్నీ తిరగబడతాయి
రాక్షసరూప నరుడివై
చరిత్రలో చీటికీమాటికీ తలదూర్చొద్దు
చరిత్రలు మార్చొద్దు
....
ఏ నెత్తురు ఎటు పారుతోందో
సూర్యచంద్రులే చూడలేరు
అన్ని మొక్కల్లో పారే నెత్తుటి
చుక్కలు
ఒక్కటే అనుకో
ఏ మొక్క అన్నది చూడకు
ఓ గుక్కెడు నీళ్ళుపోస్తుండు చాలు
కొత్త చిగుళ్లు తొడుగుతుంది,
కులమతాల కుళ్ళు,
వర్గ, ప్రాంతాల చీడలు లేని
కల్పవృక్షాల తోటవుతుంది
మానవత్వంతో మాగబెట్టి
రసాలూరే ఫలాలను
రాశులుగా నింపుతుంది
- చినవ్యాసుడు మాఊరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి