పొలిటికల్ హాలిడే
పప్పుబెల్లాల పథకాల మీద,
ప్రాజెక్టుల శిలాఫలకాలు,
టీకాలు, వాక్సిన్ పత్రాల మీద కాదురా
మన వర్ణచిత్రాలు ఉండాల్సింది
బ్లాక్ అండ్ వైట్ లో
లక్షల్లో ప్రింటవుతున్న
డెత్ సర్టిఫికేట్ల
మీద...
రోగులను, శవాలను కుక్కి తీసుకుపోతున్న
అంబులెన్సులమీద...
నిలువుదోపిడీ చేస్తున్న
ప్రయివేటు ఆస్పత్రుల ఐసియు బెడ్లమీద…
ప్రాణాధార మందులను దాచి
రోగులకు చుక్కలు చూపిస్తున్న
బ్లాక్ మార్కెటీర్ల టీ షర్టుల మీద…
నేతలు, అధినేతల్లారా..!!!
మీకు మేం కనిపించడం లేదు
మాలోని ఓటరే కనిపిస్తున్నాడు
మీరు మమ్మల్ని పాలించడం లేదు
ఓటర్లనే పాలిస్తున్నారు
ఓటర్లనే పోషిస్తున్నారు
ఓటర్లస్వామ్యం తెస్తున్నారు
నాయకమ్మన్యులారా...
మేం మిమ్మల్ని ఎన్నుకోవడం లేదు
మీరే మమ్మల్ని ఎన్ను‘కొని’
మీ చావిట్లో కట్టేసుకుంటున్నారు
ఓట్లే కాదు, ఓటరునూ పిండేసుకుంటున్నారు
ఇహ చాలు తప్పుకోండి...
కొద్దిగా సైడివ్వండి...
....
సన్యాసం తీసుకోకపోయినా
సర్వసంగ పరిత్యాగుల్లా సంసారాలు వదిలి
వారి ప్రాణాలను పణంగాపెట్టి
కోరలు చాచిన కరోనా విషనాగుల కోనల్లో
నిర్భయంగా పనిచేసుకుపోతున్న
పోలీసులను, పాత్రికేయులను
కోర్టులను, డాక్టర్లను, నర్సమ్మలను
వీథులూడ్చే కార్మికులను
ఆశా వర్కర్లను, అలుపెరుగని డ్రైవర్లను,
కాటికాపర్లను,
వెనకాముందు చూసుకోకుండా
అన్నదానాలు చేస్తున్న దాతలను,
వీథికొకరుగా కనిపిస్తున్న
సోనూసూద్ లను...
దేశం కడుపుమాడ్చకుండా
ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలను
పిలిచి పీటేసుకుంటాం...
కిరీటాలు తొడుక్కుంటాం...
......
టాక్స్ హాలిడే లాగా
మాకు పొలిటికల్ హాలిడే కావాలి
పప్పుబెల్లాలు అందకపోయినా
కంటినిండా నిద్రయినా
ఉంటుంది.
ముప్పూటలా తిండికీ,
మా బతుకులకూ ఓ గ్యారంటీ ఉంటుంది
ఓటర్లుగాకాక...
ప్రజలుగా బతికే హక్కయినా మిగులుతుంది.
- -చినవ్యాసుడు, మాఊరు
………….
మిత్రమా ! కాలక్షేపం
కోసమో, కీర్తికండూతితోనో రాస్తున్నవి కావు ఇవి.
చూడకూడనివిచూస్తూ, వినకూడనివి వింటూ, జరగకూడనివి నిరాటంకంగా జరుగుతూ పోతూ ఉంటే....
నరనరాలన్నీ ఒక్కొక్కటిగా చిట్లిపోతుంటే..
రక్తాక్షరాలు ఎగదోసుకుని వస్తూ... నిమిషానికి పదిసార్లు కపాల మోక్షానుభూతిని ఇస్తూ...
అవి మీ ముందుకు వచ్చి వాలుతున్నాయి
మీ-చిన వ్యాసుడు.
........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి