MISSING-1

 



‘కనిపించుట లేదు’

మన దేశంలో అక్కడ కానీ, ఇక్కడ కానీ ప్రభుత్వాలు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందేమో అంతటా, ఉప ఎన్నికలకు ముందు మాత్రం ఆయా ప్రాంతాల్లో తప్ప ఇతర సమయాల్లో కనిపించడం లేదు. ఆ తరువాత...  అంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్త మోజులో వద్దన్నా కనిపించి మురిపించాయి, అదీ అతి కొద్ది కాలం మాత్రమే. ఆ తరువాత వాటి జాడ లేదు.

తాత్వికంగా మాట్లాడాలంటే – ప్రభుత్వమే మిథ్య లేదా అది ఒక బ్రహ్మ పదార్థం. మాంస నేత్రాలకు కనిపించనిది. అసలు ప్రభుత్వం అంటూ ఉంటే అది ఉండేది ఎక్కడ ? అన్న ప్రశ్న వస్తుంది. సచివాలయంలోనా, శాసనసభలోనా, కలెక్టరు ఆఫీసుల్లోనా, తహశ్శీల్దారు కార్యాలయాల్లోనా, పోలీసు స్టేషన్లలోనా,  మునిసిపాల్టీ ఆఫీసుల్లోనా ...ఇలా ఎక్కడ ? ...అంటే సర్వేసర్వత్రా వ్యాపించి ఉంటుందనేది మీ జవాబు. కానీ అది అక్కడే ఉన్నట్లు ఎలా తెలుసుకోవడం..??? అనేది నా ప్రశ్న. దీనికి సమాధానంగా...‘‘అవి ఉన్నాయి. సజావుగానే, చురుగ్గానే ఉన్నాయి’’ అని అధికారులు, అధికార పార్టీ ప్రముఖులు వంద కారణాలు, వెయ్యి రుజువులతో వారి ఘోష వినిపించవచ్చు.

కానీ ‘‘లేవు’’... ఉన్నా ‘‘కనిపించడం లేదు’’ అనడానికి మన వద్ద... అంటే ప్రజల వద్ద ఉన్న బలమైన ఆధారాలేమిటో చూద్దాం ఒక్కొక్కటిగా....

నాకు వెంటనే తోచినవి, స్థలాభావంవల్ల, సమయాభావం వల్ల వెంటనే నేను తెలియచేయలేకపోయినవి,  నాకు స్ఫురించనివి, మీరు స్వతహాగా అనుభవిస్తున్నవి మీరు కూడా చెప్పవచ్చు...

మనకు ఒక సమస్య ఎదురవుతుంది. వ్యక్తిగతం కానీ, కుటుంబపరంగా కానీ లేదా ఎక్కువ మంది ప్రజలకు సంబంధించినది గానీ... కింద నుండి మొదలుపెట్టి పైదాకా అన్ని స్థాయిల్లో మనం అర్జీలు పెట్టుకుంటాం. అధికార యంత్రాంగానికి అర్జీ సమర్పించడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే... సవాలక్ష కొర్రీలు వేసి, మరో అర డజను ఆఫీసుల చుట్టూ తిప్పి చివరకు దానిని బుట్టదాఖలా చేసే అవకాశాలు ఎక్కువ. అయినా అష్టకష్టాలు భరించి పెట్టుకుంటాం. ఎవరూ పట్టించుకోరు. విసుగెత్తిపోతాం. నేరుగా ప్రభుత్వాధినేతకు.. ఆయన మన అభిమాన నాయకుడు కదా...ప్రజలకోసమే జీవితాన్ని అంకితం చేసినట్లు తరచూ ప్రకటించుకుంటుంటారు కదా అని ..అయినా అలా వారికి మన సమస్య విన్నవించుకోవడం మన హక్కు అన్న భ్రమలో నేరుగా ఆయన ఇంటికి కానీ, లేదా ఆయన కార్యాలయానికి కానీ పోయి చెప్పుకోవాలనుకుంటాం

·        కానీ ఆ దరిదాపుల్లోకి మనకు రానీయరు.

·        అందుకని మనం ఎన్నుకున్న మన ప్రాంత ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటాం. వారిని పంపుతాం. వీరికి కూడా రాజుగారి కోటలోకి  ప్రవేశం ఉండదు. అసలు వీరు పోవడానికి సాహసించరు.... లాగులు తడుస్తాయనే భయం.

·        ఇక మనకు మిగిలింది మంత్రులు.. వీరు క్షేత్రస్థాయిలో ..అంటే మన ఇలాఖాలో పులులు. ఆ గాండ్రింపులు వింటే అడవి పులులు కూడా భయపడతాయి. కానీ గుహకు ఆమడ దూరంలోనే తోక ముడిచేస్తారు. అటెండరుకు మస్కా కొట్టి మన అర్జీ కాగితపు ముక్కలను లోపల రాజుగారి మేజా మీదకు చేర్చే ఏర్పాటు మాత్రం ...నిజాయితీగా చేస్తారు. కానీ అక్కడ గుట్టలుగా ఇలా పేరుకుపోయిన ఫైళ్ళ అడుగున ఇవి కూడా అతుక్కుపోతాయి. గుట్టలు కరిగితే కానీ వీటికి మోక్షం దొరకదు. ఎన్నికల ఎండలకు తప్ప వాటికి మరోవిధంగా కరిగే గుణం ఉండదు.

·        ఇక మనకు మిగిలిన ఏకైక దిక్కు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. వీరికి నోరు ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువే. అయితే అధికార పార్టీ లాగా వీరికి నాటకాలాడాల్సిన పని లేదు. కోటకు కిలోమీటరు దూరం వరకు వీరి గాలికూడా సోకకూడదనే ఆజ్ఞలు వీరికి తెలుసు కాబట్టి... అవకాశం కోసం చూసి అది దొరకగానే ఈ అర్జీ సాకుతో లోపల దూరతారు... ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న స్వంత పనులు.. దొరికిన ఆ కొద్ది పుణ్యకాలంలోనే వీలయినన్ని చక్కబెట్టుకుని వచ్చేస్తారు. మన దరఖాస్తు అక్కడే ఎవరో ఒకరి చేతికి ఇచ్చి దులిపేసుకుంటారు.

చివరాఖరుకు జరిగేది ఏమిటంటే... మన అర్జీలు...తెగిన గాలిపటాల్లా ఏ చెట్టుకో, ఏ శాఖకో(మంత్రిత్వ) చిక్కుకుని వేలాడు తుంటాయి.

 

·      పెట్రో ధరలే కాదు, ఉప్పులు, పప్పులు, వంటనూనెలవంటి నిత్యావసరాలు, మందులు అందునా ప్రాణాధార మందులు, ...క్లుప్తంగా చెప్పాలంటే ప్రజలు ఎక్కువగా వాడే ప్రతి వస్తువు, ప్రతి సేవల ధరలు మామూలుగా పెరగడం కాదు, సంపన్నులు కూడా నోరెళ్ళబెట్టే స్థాయిలో పెరుగుతూ పోతూనే ఉన్నాయి.  మామూలు రోజుల్లో జనం అలవాటు పడిపోయారు-అని అనుకున్నా...లాక్ డౌన్ మొదలయిన నాటి నుంచీ ఈ రోజు వరకూ అన్ని రకాల వస్తువుల ధరలు చుక్కలకేసే చూస్తున్నాయి. కూరగాయల విషయాన్నే తీసుకుంటే ... రైతు బజార్లో రు.10-20లకు దొరికేవి వినియోగదారులకు వారివారి  ప్రాంతాల్లో రు.50-60లకు బహిరంగంగానే ప్రతి రోజూ అమ్ముతూనే ఉన్నారు...నెలల తరబడి, సంవత్సరాల తరబడి..

·      తూనికలు, కొలతలు, నాణ్యత(కల్తీ)తనిఖీలకు, అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి ఒక శాఖ ఉన్నదనే విషయం చాలా మందికి తెలియదు. ..ఎంతగా అంటే ప్రభుత్వాలకే గుర్తుండనంత.. ఏళ్ళ తరబడి అక్కడ  కంటితుడుపుగా పనిచేస్తున్న నామమాత్రం ఉద్యోగులే...ఉద్యోగ ధర్మంగా సంవత్సరంలో కొన్ని కేసులు నామమాత్రంగా బుక్ చేస్తుంటారు....అంతే...గరిష్ఠ చిల్లర ధర మీద వారానికో కొత్త స్టిక్కర్ వెలుస్తూనే ఉంటుంది. రేటు ఎక్కువ, తూకం తక్కువ, ఏది చూసినా నాసి రకం, కల్తీలు....

ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి ...అంటే మనం బతికే ఉన్నాం...అని అర్థం.

ప్రభుత్వాలకు మాత్రం  కనిపించడం లేదంటే దానర్థం...

? ? ? ? ? ? ?

దానికి ప్రత్యేకించి రుజువులు కూడా కావాలా..?


-        చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...