ఊపిరి అందడం లేదు

 




ఊపిరి అందడం లేదు

 

అక్షరాలకు ఊపిర్లూదుతుంటే

అవి మాటలవుతున్నాయి

మంచినీటి చెలమలవుతున్నాయి

తేటతెల్లని ఊటలవుతున్నాయి

 

మంచునీళ్ళల్లో ముంచి తీస్తే

ముద్దూమురిపాలవుతున్నాయి

అవి ఎక్కువయితే బంధాలను

తెగ్గొట్టేసుకుపోతున్నాయి

తక్కువయితే పలచబడి చివికిపోతున్నాయి

 

బయటకు రాలేక భయంతో

బిక్క చచ్చిఎనక్కి పడిపోతున్నాయి

గొంతులోనే ఇరుక్కుపోతున్నాయి

 

ఆచితూచి వదులుతుంటే

సీతాకోక చిలుకల్ని పిలిచి

సందడి చేయిస్తున్నాయి

కందిరీగలకూ కన్నుకొడుతున్నాయి

 

కళ్ళల్లో నెత్తురు చిందితే

కోపాగ్ని కొలిమికి చేరి

మొనదేలిన ఈటెలవుతున్నాయి

వీరభద్రులను ఉసిగొల్పే ఖడ్గాలవుతున్నాయి 

.... 

చిటారు కొమ్మన ఓ పూవులా కాదు

రెమ్మ రెమ్మకూ మావి చిగుళ్ళలా

ఒళ్ళంతా విరగపూసేలా చేయాలనుంది

గుప్పిళ్ళతో పోసి అభిషేకించాలనుంది

 

అక్షరానికి అక్షరం కలిస్తే మాట

మాటకు మాట కలిస్తేనే మనిషి

ఆ సంయోగపు యోగం కరువై

ఏకాంతవాసంలోకి జారిపోతున్నాయి

వాలిపోతున్నాయి, వాడిపోతున్నాయి

పూతకు రాకుండానే రాలిపోతున్నాయి

.... 

ఊపిరి సరిగ్గా అందట్లేదేమోనని

స్కానింగ్ చేసి చూస్తే

అందమైన అల్లికల గాలి సంచులు

చీలికలు పీలికలయి కనిపిస్తున్నాయి

సమాజం తీసుకున్న సెల్ఫీచిత్రంలా

…….. 

కడుపుచించుకుంటే  కాళ్ళమీద పడుతుంది

ఎవరిముందయినా చించుకుందామంటే

వారొస్తున్నారని చెప్పడానికి

కాకులుకూడా కరువయిపోయాయి

... 

చించిపడేసిన కడుపులు

కన్నీటి వరదకు కొట్టుకు వచ్చి

ఫేస్ బుక్కులూ, వాట్సాప్పులూ,

పత్రికలు, టీవీలు,  ట్విట్టర్ల నిండా

గుట్టలుగా పడిపోతున్నాయి

ఒడ్డుకు కొట్టుకు వస్తున్న  కళేబరాల్లా

 

-        - చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com


https://chinavyasudu.blogspot.com/2021/06/blog-post_18.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...