చిత్రం... భళారే విచిత్రం. చిత్రం...అయ్యారే విచిత్రం

                                                                                                                             

       

‘దెబ్బ తగిలితే కానీ తత్త్వం బోధపడదు’ అన్నది ఆర్యోక్తి. 

అంటే ఏదయినా మన స్వానుభవంలోకి వస్తే తప్ప దాని మంచీచెడులు మనకు అంత సులభంగా అర్థం కావు. ఈ సామెతలో కొంత తాత్వికత కూడా ఉంది. ‘తత్త్వం’ అంటే – ‘‘అసలుసిసలు స్వరూపం, నిజ స్వభావం’’ అని.  ‘దేముడు’ అని కూడా...అంటే కష్టాలు కమ్ముకొచ్చినప్పుడుతప్ప సుఖాల్లో దైవచింతన స్ఫురించదు-అని.  

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే- 

కరోనా కొట్టిన దెబ్బకు... మనకు తత్త్వం బోధపడి ఇన్నాళ్ళనుంచీ గుడ్డిగా నమ్మకం పెంచుకున్న 

మన జీవనశైలి అసలు స్వరూప స్వభావాలను, వ్యవస్థల స్థితిగతులను 

స్పష్టంగా చూసుకుంటూ అవాక్కయిపోతున్నాం.


ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, వాటి సిబ్బంది విలువను గుర్తించడమే కాక, నిజంగా మనకున్న ఆస్పత్రులు, వాటిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, లేబరేటరీలవంటి మౌలిక వైద్య సదుపాయాల కొరతతోపాటూ... పరాకాష్ఠగా-మన శ్మశానాల దైన్య స్థితిని కూడా చూస్తున్నాం. అలాగే ప్రైవేటు, కార్పొ‘రేటు’ ఆస్పత్రుల పట్ల ఉన్న భ్రమలు తొలగి భయాలు కొత్తగా వచ్చి చేరాయి. అంబులెన్సులను ఆపద్బంధువుల్లాగా చూసిన మన కళ్ళకు ఇప్పుడవి రక్తపింజర్లలాగా కనిపిస్తున్నాయి.

విద్యారంగంలో కూడా ఇదే జ్ఞానోదయం మనకు కలుగుతున్నది. బడులు, గురువుల అవసరంతోపాటూ ప్రైవేటు విద్య, కార్పొ‘రేటు’విద్యపట్ల, కంప్యూటర్ బోధన, ఆన్ లైన్ టీచింగ్ వంటి అధునాతన సాంకేతికతలపట్ల ఉన్న అంచనాలు కూడా తప్పుతున్నాయి. చుక్కల్లో విహరిస్తున్న ఐటి రంగంలో... పనిచేసే పద్ధతులే అనూహ్యంగా మారిపోవడం, దూసుకుపోతున్న వాటి ప్రగతి-ఉద్యోగుల బ్యాంకు బ్యాలెన్సులను ఇష్టానురీతిగా పెంచుతుండడంతో... హద్దూపద్దూ లేకుండా సాగుతూ పోతున్న వారి జీవనవిధానాలు, వాటిని తృప్తిపరచడానికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనుబంధ వ్యాపారాలు ఉన్నట్లుండి సుడిగుండాల్లో చిక్కుకుపోవడం సమాజాన్నే ఒక్క కుదుపు కుదిపేసింది. ఐటి మోజులో నిర్లక్ష్యానికి గురయిన పరిశ్రమలు, ఇతర ఉపాధిరంగాల విలువ ఏమిటో లక్షలాది వలసకూలీలు ఇంటిముఖం పడితే కానీ బోధపడలేదు. మహమ్మారి దెబ్బతో ప్రపంచంలో అన్ని ఉత్పత్తి వ్యవస్థలు చచ్చుపడినా, ప్రకృతి ఆధారంగా సాగే వ్యవసాయం మానవాళికి ప్రాణాధారంగా నిశ్చింతగా  నిలదొక్కుకోవడం చిత్రాతిచిత్రం.

ఇంత నిర్వేదంలోనూ సాధారణ జీరోవాట్ బల్బుల లాంటి  సామాన్యులు- వారి దానధర్మాలు, సేవలతో బాథాతప్తులను, అన్నార్తులను ఆదుకుంటూ వెయ్యి సూర్యుళ్ళ కాంతి విరజిమ్మడం.. అపూర్వం. అంతటితో ఆగకుండా...మానవత్వం దైవత్వంగా మారుతున్న పరిణామక్రమాన్ని కూడా విస్పష్టంగా చూస్తున్నాం. అంత్యక్రియలకే కాదు, కడచూపుకుకూడా అయినవారు, కడుపుచించుకు, పేగు తెంచుకు పుట్టినవారు కాలు కదపలేని జడత్వం ఆవరించిన క్షణాల్లో... దిక్కూమొక్కూలేని వందలాది శవాలకు తామే సర్వస్వమై సగౌరవంగా సాగనంపడానికి ముందుకొచ్చిన వారిని చూసి సాష్టాంగపడకుండా ఉండలేని విభ్రమగొలిపే చిత్రం ..భళారే విచిత్రం.

నివ్వెరపాటుగొలిపే మరో చిత్రాతి చిత్రం... రాజూ-పేద, ధనికులు-దళితులు, అగ్రదేశాలు-అట్టడుగు దేశాలను కరోనా సమానదృష్టితో చూడడంతో...కులం, మతం, వర్గం, ప్రాంతాలు.. హద్దులు, వైషమ్యాలు మరచి వసుధైక కుటుంబమై పరస్పర ఓదార్పులతో గడపడం కనీవినీ ఎరుగని అబ్బురం.

భూతద్దాలకు కూడా దొరకని, మందులకు, చికిత్సలకు కూడా కొరుకుడుపడని ఒక సూక్ష్మాతిసూక్ష్మజీవి.... ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న రాక్షసిగా చాలా మందికి దర్శనమిస్తే- ఆధ్యాత్మిక చింతనాపరులకు.. మనసుల్లో ఎక్కడో ఓ మూలన ‘‘పవిత్రాణాయ సాధూనాం....’’అంటూ ధర్మసంస్థాపనకు ప్రతియుగంలోనూ నేను అవతరిస్తుంటాను అన్న గీతాచార్యుడి మాటలు మెసలడం యాదృచ్ఛికం.

ఇదంతా మనం ఇప్పటిదాకా చూసిన చిత్రాతిచిత్రమైన విచిత్ర చరిత్ర.

దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలానే ఉన్నా, ముఖ్యమైన వాటిని స్మరించుకుంటూ ముందుకు సాగుదాం... సరికొత్త జీవన శైలితో నూతన ప్రపంచం దిశగా....


·        తలచినదే జరిగినదా దైవం ఎందులకూ, జరిగినదే తలచితివా శాంతిలేదు నీకూ... అనుకుంటూ ఉండడం.

·        ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా...అని మనకు మనం హెచ్చరికలు చేసుకుంటూ స్వశక్తిని నమ్ముకుని జాగ్రత్తపడడం.

·        గృహమే స్వర్గసీమ...అన్న నమ్మకాన్ని ఆచరణలో చూపడం..

వాక్సిన్లు, మందులు పుష్కలంగా రాబోతున్న ఈ తరుణంలో ....

ü  జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా, జంకుగొంకులేక ముందు సాగిపొమ్మురా... అనుకుంటూ హుషారుగా సాగడం.

 

-      చినవ్యాసుడు, మా ఊరు

chinavyasudu@gmail.com

........

1 కామెంట్‌:

  1. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం వ్యవసాయ రంగం,మౌలిక పరిశ్రమలు, లౌకిక వాదం,, ప్రజాస్వామ్య వ్యవస్థ పై దృష్టి పెట్టింది.తప్ప ప్రజారోగ్యం, వైద్యం, విద్య పై శ్రద్ధ పెట్టలేదు. ప్రాధాన్యత ల విషయంలో దార్శినికత లోపించడం ప్రస్తుత పరిస్థితి కి కారణం. జనాభా నియంత్రణ విషయం లో తీసుకోవలసిన చర్యలపై కూడా నిర్లక్ష్యం వహించారు.‌ఇలాంటి లోపాలెన్నో.

    రిప్లయితొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...