పర్మినెంట్ అడ్రస్ అంటే ...!!!

 


పర్మినెంట్ అడ్రస్...!!!

 

దరఖాస్తు నింపుతూ పోతున్నా...

పర్మినెంట్ అడ్రస్ కాలమ్...... !!!

..............................

ఏదని రాయాలి, ఏమని రాయాలి ?

కలం ఆగింది.. కాలు కదపలేకపోతున్నది..

 

జీవం పోసుకున్నప్పుడు...

అమ్మ పొట్టేకదా అనుకున్నా..

బొడ్డూడిపడినాక..

అమ్మ ఒడివీడినాక...

కాలికి బలపం కట్టినాక..

ఇళ్ళకు ఇళ్ళే వదిలినాక...

ఊళ్ళకు ఊళ్ళే మారినాక...


ఏం రాయాలో తోచక

ఆ కాలమ్ ఖాళీగా ఉంచేద్దామనుకున్నా...

కాలం మూడి ఈ లోకాన్ని కూడా వదిలేస్తుండగా....


చిత్రంగా దూతలు వచ్చారు, గుప్తంగా చిట్టాలు విప్పారు

అక్కడెక్కడో నన్నో అగాధంలో పడేసి అడ్రస్ చెప్పారు...

పోన్లే నరకమయితేనేం.. అద్దెకొంపలు అలవాటేగా !

పర్మినెంటంటూ ఒకటి దొరికిందనుకున్నా...

పాపం తాలూకు బాకీ తీరంగానే  తన్నితరిమేసారు..

 

మరీ మంచిది .. తంతే నేతిబుట్టలో పడ్డట్టు...

ఇంద్రుడింటి దగ్గర మకాం పక్కా అనుకున్నా..

పుణ్యం ఖాతా ఖాళీకాంగానే

పాతలోకంలోకి  కొత్త అడ్రసులో

బొక్కబోర్లా  దొర్లించేసారు...


మరి నా పర్మినెంట్ అడ్రస్సో...!!!!


క్షణం ఆలస్యం కాకుండా..

పుట్టలనడిగా, పిట్టలనడిగా..

పండితులనడిగా... పీఠాలనడిగా..

గుట్టుచప్పుడు కాకుండా గుళ్ళల్లో దూరి..

దేముళ్ళను కూడా అడుగుతూ కడిగా.....


ఆకాశవాణి పలికింది..

చీకటివెలుగులకు

సుఖదుఃఖాలకు

నదీనదాలకు,

ధాత్రీధరాలకు,

జీవాత్మ, పరమాత్మలకే

అవసరంలేని

ఈ ప్రశ్న

నీకంత అవసరమా !!!!


కుప్పకూలిపోయింది  కాలం ఒక్కసారిగా

నా పర్మినెంట్ అడ్రస్ కాలమ్ దగ్గర నిర్వేదంగా...

 

-చినవ్యాసుడు, మా ఊరు


......................


13 కామెంట్‌లు:

  1. మనిషి అస్తిత్వాన్ని గుర్తుచేస్తుంది ఇ కవిత, చాలా బావుంది 🙏

    రిప్లయితొలగించండి
  2. 💐👌👍👌💐
    దరఖాస్తు లోని ఒక్క వివరణ కోసం విశ్వ యానం జరిగినది.ఆలోచన బయలుదేరిన చోటునుంచే లోకాలుచుట్టి మరల బయలుదేరిన చోటికే వచ్చి ఆగినది. చాలావింతగావున్నది. ఇదీ జీవితచక్రం.
    పునరాపి జననం, పునరాపి మరణం పునరపు మారనే జఠరే శయనం.
    శ్రీ శ్రీ శ్రీ అదిశంకరాచార్య శ్లోకాలకు రూపచిత్రము లాగున్నది.
    ప్రశ్న తో మొదలై ప్రశ్నతోనే ముగిసినది.
    అభినందన మందారాలు.
    పోలవరపు లక్ష్మీ నరసింహారావు, నెల్లూరు.

    రిప్లయితొలగించండి
  3. అద్భుతంగా వున్నది.. ఇది కవిత అనకుని చదవడం మొదలు పెట్టిన .. చదివాక అది కవిత కాదు జీవన విధానంగా తోచింది. ఎవరికీ రాని ప్రశ్న మీకు ఉదయించింది. దానికి జవాబు ఇస్తూనే మళ్ళీ అదే ప్రశ్న వేసినారు. మనము అనుకునే పర్మనెంటు అడ్రస్ అంటూ ఏదీ లేనే లేదని..సతతం తాత్కాలికమేనని.. 👍

    రిప్లయితొలగించండి
  4. మానవ జీవన రహస్యం 👌

    రిప్లయితొలగించండి
  5. చిినవ్యాసుని చిరునామాయణం పరమాత్మీయం

    రిప్లయితొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...