పూనకాలు లోడింగ్.....

 



 పూనకాలు లోడింగ్.....

 

కాటుక మంచిదే కానీ, కన్ను పోయేటంతగా రెచ్చిపోతే ఎలా ? ఈ మధ్యకాలంలో తెలుగునాట ఏ చిన్న సంబరం కనిపించినా కాళ్ళు భూమి మీద నిలవడం లేదు, శివాలెత్తినట్టు ఊగిపోతున్నారు.  ఇల్లు అలికే సంబరంలో ఈగ తన పేరు మర్చిపోయిన కథ చిన్నప్పుడు చదువుకున్నాం... గుర్తుండే ఉంటుంది.

 

నాకు గుర్తున్నంతవరకు భోగి మంటలప్పుడు (నాదీ గ్రామీణ నేపథ్యమే)మగవారి హడావిడి ఎక్కువ. ఎండిన చెట్లకొమ్మలు, మొద్దులు, ముళ్ళకంపలు, పాడయిపోయిన, పనికిరాని ఇంటితాలూకు చెక్క సామాగ్రివంటి వాటిని ముందురోజు రాత్రినుంచే సేకరించి తెల్లవారక ముందే ... పిడకలు పెట్టి మంటపెట్టి తరువాత ఒక్కొక్కటిగా దానిమీద వేస్తుంటే, ఇరుగుపొరుగంతా  దాని చుట్టూ చేరి సంబరంగా గడపడం... పొద్దున తిన్నంత తిని చిరుతిళ్ళు జేబుల్లో కుక్కుకుని గాలిపటాలు తీసుకుని కుర్రకారు ఇల్లొదిలితే... ఎప్పుడో ఆకలేసినప్పడు వచ్చి గబగబా అంత లాగించేసి.. అప్పటికే బయట నుంచి దోస్తుల అరుపులు, కేకలు...చెయ్యికూడా సరిగా కడుక్కోకుండానే ఒక్క దూకుడు బైటికి.....

 

ఆడవాళ్ళు మాత్రం చిన్నాపెద్దా..చీకటితోనే లేచి ఇంటిముందు శుభ్రం చేసుకుని కళ్ళాపి చల్లి, ఆవుపేడ, గుమ్మడిపూలతో గొబ్బిమ్మలను సిద్ధం చేసుకుని,  పోటీలుపడి ముగ్గులు వేయడం... వేసినవాటిని ఇంటికొచ్చిన అతిథులు, పిల్లాజెల్లాతో కలిసి... పోల్చి చూసుకుంటూ ఎడతెగని ఆనందాలతో మైమరిచిపోతుంటే....  లోపల అమ్మలు, బామ్మలు పిండివంటలతో ఫుల్ బిజీ...పొద్దుగుంకి చీకటిపడేవేళకు.... చిన్న పిల్లలకు భోగిపళ్ళు, ఈడొచ్చిన పిల్లలతో కలిసి బొమ్మలకొలువులతో పేరంటాల సందడి...

 

 పెద్ద పండక్కి సెలవులియ్యంగానే  కూతుళ్ళు, అల్లుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు వస్తున్నారని ....మూడు నాలుగురోజుల ముందునుంచే ఇల్లూవాకిలి శుభ్రం చేసుకోవడాలు, సర్దుకోవడాలూ, ఇంటికి కావలసిన సరుకులు, ఇంటిల్లిపాదికీ బట్టలు కొనుక్కోవడాలు....ఒకటే హడావిడి..తీరిక దొరికేది కాదు ఎవరికీ..

 

మూడో రోజు కనుమ పండుగ. నిజంగా ఆరోజు ఎద్దులకు పండగే. అన్ని రకాల చాకిరీ నుంచి వాటికి ఫుల్ హాలిడే. శుభ్రంగా వాటిని కడిగి పసుపు కుంకుమలతో అలంకరించడం... అవి ఇష్టంగా తినేవాటిని తినిపించడం, వాటితో ఆటాపాటా... ఎడ్లపందాలు, వాటికి తోడు కోళ్లపందాలు.....వగైరా... అది పశువుల పండగగా మాత్రమే ప్రసిద్ధి. కనుమనాడు కాకయినా కదలదంటూ ఇంటికొచ్చిన వారిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఆత్మీయంగా అడ్డుకునేవారు...

 

మరిప్పుడో...

అడితినుంచి వంట చెరుకుగా ఉపయోగించే కట్టెలను కొనుక్కొచ్చి త్రికోణాకారంలో పేర్చి, దానికి పూలు చుట్టి, దండలు వేసి, దాని చుట్టూ ఆడవారే ఎక్కువగా చేరి చప్పట్లు కొడుతూ ఆడడం పాడడం... అన్ని పండగలకు బతకమ్మ ఫార్మాటే... మధ్యలో డాండియా కూడా... ఫ్లాట్ల సెటప్ లో ముగ్గులకు చోటుండదు.. అగ్గిపెట్టెలాంటి ఇంటిముందు మరో చిన్న కుంకుమ భరిణంత ముగ్గు... ఎంత ఖర్చుపెట్టినా, ఎంత సందడి చేసినా అంతవరకే... (అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అందరూ కలిసి అది వేరే విషయం...)

 

పిండివంటలకు ప్రాంతీయ భావోద్వేగాల వైరస్ సోకి తెలంగాణ పిండివంటలు, ఆంధ్రా పిండివంట లంటూ రెండు కుంపట్లు వెలుగుతున్నాయి...అటూ ఇటూ ఒకటో అరో తప్ప అన్నీ అవే ఐటమ్స్.... భావోద్వేగాలను... అమ్మేవారు సొమ్ము చేసుకుందామనుకున్నా...కొనేవారిలో మాత్రం ... నోటికి నచ్చింది, కంటికి నప్పింది కొనేసుకుంటూ పోతున్నారు, ఏ కుంపటిదని చూడకుండా.....ఇంటిపట్టున చిరుతిళ్ళు తయారు చేసుకునే అలవాటును మనం ఎప్పుడో వదులుకున్నా... పండగలప్పుడు కూడా వాటి తాలూకు ప్రత్యేక వంటల వాసనలు ఏ వంటింట్లోనూ కనిపించడం లేదు. స్వగృహ, స్విగ్గీల సంస్కృతి బాగా ప్రబలిన తరువాత పండగ రోజుల్లో పొయ్యి వెలగడం లేదు. దీనికి మేము కూడా మినహాయింపేమీ కాదు. మొన్ననే అరిసెలు, చక్కిలాలవంటివి కొని తెచ్చేసుకున్నాం. నిన్న పొద్దున మా పనిమనిషి.. లంబాడీ పిల్లను ...‘ఏం రజితా ! కూతురు హాస్టల్ నుంచి వచ్చింది కదా... పండక్కి పిండివంటలు ఏ కొంటున్నావ్’ అనడిగితే... చెంప చెళ్ళుమనే జవాబిచ్చింది... ‘అరిసెలు, సకినాలు నేనే చేస్తున్నా సారూ... అయి కూడా బైటినుంచి కొంటామా...’’ అంది అమాయకంగా... అంటే ఆచారాలను, సంస్కృతిని... అవి కొన ఊపిరితో ఉన్నా.... వాటిని ఇంకా ఎవరు బతికిస్తున్నారు... ఈ రజితలే... మనం కాదు.

 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....

పైన చెప్పిన దాంట్లో ఆక్షేపించాల్సినదేమీ లేదు. ఎవరినీ తప్పుపట్టాలసిన అవసరమేమీ లేదు... కాలం మారుతున్నది. దానికి తగ్గట్టు జీవనశైలి కూడా మారుతున్నది. ఓ 20 ఏళ్ళ తరువాత ఈ అనుభవాలే... ఇప్పటి తరానికి అప్పుడు... ఆపాత మధురాలు......

 

అయితే... ప్రతి పండగకూ ఒక ప్రత్యేకత ఉంటుంది... దానిని తీసేసి పండగ జరుపుకుంటున్నాం. ఒఠ్ఠిగా కూడా కాదు... పూనకాలు లోడింగ్ చేసుకుంటున్నాం....

 

బతకమ్మనృత్యాలు బతకమ్మ పండక్కి ప్రత్యేకం.. అన్నిటికీ  అవే స్టెప్పులేస్తే... బతకమ్మ ప్రత్యేకత పోతుంది కదా !  అది మంచిదా !!! దాని విశిష్ఠతను కాపాడుకోవాలి కదా !   అలాగే మనకంటూ ప్రత్యేకంగా కోలాటాలున్నాయి,  కోలాటం పాటలున్నాయి.. జడకోలాటం వంటి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ప్రక్రియలున్నాయి. వాటిని వదిలేసి, వాటిని కాపాడుకోకుండా, వాటిని అభివృద్ది చేసుకోకుండా దాండియాలు దిగుమతి చేసుకోవడం అవసరమా !

 

అన్నింటా మన ప్రత్యేకతను కోల్పోతున్నాం.. చివరకు మన వస్త్ర ధారణ కూడా....మన ప్రత్యేకత-అడ్డ పంచె కాదు, కానే కాదు. ధోవతి మన సొంతం. శుభకార్యం అయినా, అశుభం అయినా.. ధోవతితోనే తంతు నడపాలి... తప్పదు కాబట్టి అంతవరకు నడుపుతున్నాం. ఇంత ప్రబలమైన సంస్కృతి ఉన్నా... అడ్డపంచెతో ‘రామరాజ్’ అడ్వర్టయిజ్మెంట్ చూపి ఇదీ మన తెలుగు సంస్కృతి అని ఓ సినీ నటుడు చెప్పంగానే ... ఇదేమన సంస్కృతి అనుకుని ఫంక్షన్లలో యువత అడ్డపంచెలతో సంబరాలు చేస్తుంటే మురిసిపోతున్నాం.

 

ఏతావాతా చెప్పేదేమిటంటే... తెలుగువారిగా మనకున్న ప్రత్యేకతలన్నీ మనం ఒక్కొక్కటిగా వదిలేసుకుంటున్నాం. మన ఉనికిని మనమే పోగొట్టుకుంటున్నాం.

 

ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు... ఇవన్నీ మన ఆస్తి, మన పెద్దలు మనకిచ్చిన అమూల్యమైన సంపద. మన ఆత్మగౌరవానికి ప్రతీకలు. వీటిని ప్రభుత్వాలు నిలపవు. వ్యక్తిగత, సామాజిక చిత్తశుద్ధిమీద ఆధారపడి ఉంటాయి.  ఒకప్పుడు వీటికి అవసరమైన మార్గదర్శనం సమాజం నుండే అంతర్లీనంగా అందేది...

 

ఇప్పుడు ఆ లింక్ మిస్సింగ్....మనుషులు, కుటుంబాల మధ్య చాలా లింకులు ఇప్పటికే... అలాగే ఇది కూడా....

 

ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న తరువాత ఇప్పుడు ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉత్సాహం పెరిగింది. ఏ చిన్న అవకాశం వచ్చినా, ముఖ్యంగా సంబరాలకు సంబంధించినది... చిన్నాపెద్దా ముసలీ ముతకా అందరూ ఒక రేంజ్ లో ఊగిపోతున్నారు.... అది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దానికి ఆలోచన, మన ఆచార వ్యవహారాలు ఏవో తెలుసుకోవాలన్న ఆరాటం, వాటిని నాలుగు కాలాలు నిలుపుకోవాలన్న ఆసక్తి  ఉంటే...

 

ఆ మిస్సింగ్ లింక్ దొరికనట్టే....

 

-చినవ్యాసుడు

.....................



జడకోలాటం

https://www.youtube.com/watch?v=vCPusgz3RDM

https://hydnews-net.translate.goog/2021/06/jadakoppu-kolatam-an-art-to-celebrate-laboured-folklore-in-telangana/?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...