ఎవడ్రా ఈ రామోజీ రావ్ !!!
...అని అడిగింది ఎవరో కాదు....
ప్రఖ్యాత చలన చిత్ర నేపథ్య గాయకుడు
శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం.
1978-79 ప్రాంతంలో... నేను మద్రాసు వెళ్ళా... వారి కుటుంబంతో పరిచయం కారణంగా వారింట్లోనే బస. ఏం చేస్తున్నావు రా! (అంటే ఉద్యోగం ఎక్కడ
చేస్తున్నావు ?) అని బాలసుబ్రహ్మణ్యం అడిగినప్పుడు ‘ఈనాడు’ అని చెప్పగానే ... ఆ
మరుక్షణం అప్రయత్నంగా ఆయన నోటివెంట చాలా కుతూహలంగా వచ్చిన ప్రశ్న అది...
వివరాల్లోకి వెడితే....
తెలుగునాట అప్పటికే సంచలనం సృష్టిస్తున్నది ఈనాడు దిన పత్రిక. అధికారంలో ఉన్న
వారి నిద్ర చెడగొడుతున్నది. జర్నలిజంలో వినూత్నపోకడలు, రాజకీయంగా సంచలనాత్మక
కథనాలు, పరిశోధనాత్మక వార్తాకథనాలకంటే... ‘ఎవ్వడికీ భయపడం’... అన్న చందంగా
సాహసోపేతంగా వదులుతున్న బాణాలు... వీటితో ఈనాడు ఒక పత్రికగా అమ్మకాలు పెంచుకుంటూ,
స్థిరంగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే....
ఒక పత్రిక స్వతంత్రంగా, ధైర్యంగా వ్యవహరిస్తూ పోతూ దానికాళ్ళమీద అది నిలదొక్కుకోవాలంటే... ఆర్థికంగా అండదండలు గట్టిగా ఉండాలన్న సంకల్పం యాజమాన్యానికి ముందు నుంచీ ఉంది. దానికి సాక్ష్యమే... పత్రికకంటే ముందు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ను విజయవంతం చేయడం. ఇది ఇచ్చిన వెన్నుదన్నుతోనే ఈనాడు పురుడు పోసుకుంది. సుఖ ప్రసవం అయింది. (చెన్నారెడ్డి కాలంలో ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా ఆపేసినప్పుడు పత్రిక తట్టుకుంది. తరువాత జలగం వెంగళరావు కాలంలో ఈనాడును నియంత్రించడానికి పరోక్షంగా మార్గదర్శిపై చర్యలు తీసుకోవడానికి చిట్ ఫండ్ చట్టం పేరిట కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు... ఈనాడు మార్గదర్శికి తోడ్పడింది). అయితే కేవలం మార్గదర్శి మీద ఆధారపడకుండా ఈనాడు పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి...ఇతరత్రా వ్యాపారాలు అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటికే ‘ఇమేజెస్’ అనే హోర్డింగ్ కంపెనీ, కిరణ్ యాడ్స్ పేరిట ఒక యాడ్ ఏజన్సీ, సితార సినిమా పత్రిక ఈనాడుకు అన్నివిధాలా తోడ్పడుతూ పోతున్నా... పూర్తిగా మీడియా రంగానికి భిన్నంగా ప్రారంభమైన వ్యాపారం –‘ప్రియా ఫుడ్స్’..అనే నిల్వ పచ్చళ్ళ వ్యాపారం.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించే సమయానికి.. ఈ రంగం ఎలా ఉండేది...
హైదరాబాద్
రాజధాని కావడంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న
ఆంధ్రాప్రాంతం వారు, పనులమీద, వ్యాపార అవసరాలకొద్దీ నగరానికి వచ్చిపోయే
ఫ్లోటింగ్ జనాభా పెరుగుతూ పోతుండడంతో ...వీళ్ళ రుచులు, అభిరుచులు, అవసరాలు,
ప్రయోజనాలకోసం..‘ఆంధ్రా మీల్స్’ ‘ఆంధ్రా భోజనం’ ఆకర్షణగా హోటళ్ళు, మెస్‌లు
వెలిసాయి. పూతరేకులు, బందర్ లడ్లవంటి పక్కా ఆంధ్రా పిండివంటలు కూడా అక్కడక్కడా
దొరుకుతూ ఉండేవి. ఆ కోవలోకి కొత్తగా వచ్చి చేరినవి...ఊరగాయలు, ఇతర నిల్వ పచ్చళ్ళే
అయినా.. మిగిలిన వాటిలాగా వీటికి అంత ఆదరణ ఉండేది కాదు.
దీనికి కారణాలను లోతుగా విశ్లేషించిన ఒకరిద్దరు వ్యాపారులు... ప్రత్యేకంగా
ఎండాకాలంలో గుంటూరు, తెనాలి వంటి ప్రాంతాలకు వెళ్ళి, అక్కడి మహిళల సహకారంతో అక్కడే
శుచి, శుభ్రతలతో వారి చేత పచ్చళ్ళు పెట్టించి(కొద్ది మొత్తాల్లోనే) జాడీలతో తెచ్చి
హైదరాబాద్ లోని ఒకటి రెండు చోట్ల అమ్ముతుండేవాళ్ళు. ఇది ఆదరణకు నోచుకున్నది (జయా
ఫుడ్స్/పికిల్స్ వంటివి).
ఔత్సాహిక వ్యాపారి అయిన ఒక తెలుగు
న్యాయమూర్తి కుమారుడు ఈ వ్యాపారంపట్ల కుతూహలం కనబరిచాడు. అయితే స్థానికంగాకంటే...
అప్పటికే విదేశాల్లో గణనీయంగా పెరుగుతున్న భారతీయులకు సంప్రదాయ రుచులు
అందించడానికి ‘స్పెన్సర్’ కంపెనీ పచ్చళ్ళ ఎగుమతి వ్యాపారంలోకి దిగింది. అయితే దాని
పచ్చళ్ళలో ఆంధ్రా స్పెషల్స్ ఉండేవి కావు. అందువల్ల ఈ ఔత్సాహిక వ్యాపారి వారి
వెనుకే పోతూ ఎగుమతులకు ప్రయత్నిస్తున్న రోజుల్లో...
పచ్చళ్ళ ఎగుమతులమీద కన్నేసి ‘ప్రియా ఫుడ్స్’ రంగప్రవేశం చేసింది. రామోజీరావు అండ్ టీమ్ ఏది
చేసినా దానిలో చాలా విశిష్ఠతలు ఉండేటట్లు చూడడం వారి ప్రత్యేకత. స్వచ్ఛత, శుభ్రతల
కోసం .. పాలరాతి వంటశాలలు (లాబ్స్ అనేవారు..అప్పటికి ఇటువంటి ఏర్పాటు కొత్త), రేటు
గిట్టుబాటు కావడానికి కారం, పసుపు వంటివి బయట కొనకుండా స్వంతంగా తయారు చేసుకోవడం(వారి
అవసరాలకు పోను, మిగిలినది ప్రియా బ్రాండ్ పేరుమీదే విడిగా అమ్ముకోవడం), ఊరగాయలకు
అవసరమైన మామిడి తదితర కాయలు కూడా స్వంత తోటల(లేదా కౌలు ఏర్పాటుతో) నుండి
సేకరించడంవంటి ఏర్పాట్లు ఘనంగా చేసి... మొత్తానికి ప్రాడక్ట్ బయటికి తెచ్చారు.
స్వంతంగా ఉన్న పబ్లిసిటీ సంస్థలు, స్వంత మీడియాను(ఈనాడు, సితార, చతుర, విపుల)
గరిష్ఠంగా ఉపయోగించుకుంటే అమ్మకాలకు తిరుగుండదనే మొండి ధైర్యం.....
అనుకున్నదొకటి, అయిందొకటి... అన్నట్లు.. ప్రియాఫుడ్స్ మార్కెట్ లోకి
ప్రవేశించినా, ప్రచారం ఆర్భాటంగా హోరెత్తించినా ముఖ్యంగా ప్రవాసాంధ్రులకోసం
ఎగుమతులకు ప్రాధాన్యం ఇచ్చి ఆ దిశగా కదిలినా. .. అప్పటికే స్పెన్సర్ వంటి కంపెనీలు
క్యూలో నిలబడి కళ్ళు తేలేయడం చూసి ఖంగుతిన్నారు. దానిమీద భారీగా పెట్టిన పెట్టుబడులు,
శ్రమ.. దిక్కు తోచని స్థితి.
అయినా ఓటమిని లేదా వైఫల్యాన్ని ఒకపట్టాన అంగీకరించడానికి ఇష్టపడని రామోజీ
బృందం ... పబ్లిసిటీతో స్పీడు పెంచి స్ధానిక జనాలకు దగ్గర కావడానికి ఒక కొత్త
వ్యూహాన్ని ఎంచుకున్నది. ఇన్ స్టంట్ స్పందన.. క్షణాల్లో జనాలను ఆకర్షించడానికి
షార్ట్ కట్ రూట్ –సినిమా గ్లామర్. ఎలాగూ ‘సితార’ చేతిలో ఉంది. ఇతర సినిమా
పత్రికలంత అమ్మకాలు దీనికి ఎప్పుడూ ఉండేవి కావు. పైగా (కాస్తంత పొగరుగా ఉండే) డైలీ
పేపర్ జర్నలిజం, కొద్దిగా వంగమంటే ఏకంగా
సాష్టాంగపడే సినిమా జర్నలిజం ..రెండూ భిన్న ధృవాలు. కానీ సితార కూడా ఈనాడు పొగరును
పుణికి పుచ్చుకుని నడుస్తుండడంతో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం దానిని అక్కున
చేర్చుకోలేదు... కొంత దూరంలోనే ఉంచింది. కానీ ‘కింగ్ మేకర్’ మైండ్ సెట్ తో ఉండే
రామోజీ బృందం సితారను అడ్డుపెట్టుకుని సినిమా గ్లామర్ ను ఉపయోగించుకోవడానికి కొత్త
వ్యూహాన్ని అమల్లో పెట్టింది.
నీరాజనం.....
అప్పట్లో ‘ఆకాశవాణి’లో ‘నీరాజనం’ అని ఒక ప్రాయోజిత కార్యక్రమం వారంలో ఓ అరగంటపాటూ రాత్రి 9.30 గంటలకు(సమయం సరిగా గుర్తు లేదు) ప్రసారమయ్యేది. దానిని ప్రముఖులు సమర్పించేవారు. మధ్యలో తాజా సినిమా హిట్ సాంగ్స్ ఉండేవి. ఇది బాగా పాపులర్ అయింది. కిరణ్ యాడ్స్ దీనిని చాలా వారాలపాటు ముందుగానే బుక్ చేసుకున్నది. రామోజీ టీమ్ ఎంపిక చేసిన ప్రముఖుల వద్దకు... సితార విలేకరులు స్వయంగా వెళ్ళి, వారి డీల్ ను వివరించేవారు... ‘‘ఈ కార్యక్రమాన్ని మీరు సమర్పించాలనేది మా బాస్ అభీష్ఠం. మీరు దీనిని సమర్పిస్తే ప్రతిఫలంగా సితార కవర్ పేజీ మీద ఫొటో, లోపల మీ ఇంటర్వ్యూలు, ఫొటోలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ప్రచురిస్తుంటాం....’’ అని చెప్పేవారు. పవర్ ఫుల్ మీడియా(ఈనాడు).. అదీగాక సినిమా పత్రికలో పబ్లిసిటీ అంటున్నారు... అవి ఉన్నా లేకపోయినా, ఈ డీల్ ఒప్పుకోకపోతే...వారు పగ పడతారేమోనన్న భయం కొద్దీ.. దాదాపు అందరూ ఒప్పుకునేవారు. టాప్ లో ఉన్న కొంత మంది సినీ తారలు మాత్రం లెక్కలు వేసి చూసుకుని ...గిట్టుబాటు కాదనుకున్నప్పుడు ముఖాన్నే ‘నో’అని చెప్పి మీడియా వారితో లేనిపోని గొడవలు కొని తెచ్చుకోవడం ఎందుకని... ఏవో కారణాలు చెప్పి లౌక్యంగా తప్పుకునేవారు.
ఇదీ నేపథ్యం... ఇక ఆ తరువాత...
ఇలాంటి సమయంలో ఒకనాడు మద్రాస్ లో ఉన్న సితార బృందం...బాలసుబ్రహ్మణ్యం గారి
అపాయింట్ మెంట్ అడిగారు. అప్పుడు ... రోజుకు ఆరేడుపాటల రికార్డింగులతో జోరుమీదున్న
ఆయన కొంత వెసులుబాటు చేసుకుని వీరికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. .. ఇంటిదగ్గర
కలవడానికి.
వారు వస్తూనే ఐదారు రకాల ప్రియ పచ్చళ్ళు ప్యాక్ చేసి ఉన్న కార్టన్లను తెచ్చి
ఆయనకు అందచేసారు. ఇతర ప్రముఖులకు చెప్పినట్లుగానే ..మా బాస్ మీ పాటల అభిమాని.
మిమ్మల్ని స్వయంగా కలిసి ఇవి ఇమ్మనమని పంపారు... అంటూ డీల్ చెప్పారు. అసలు నీరాజనం
పాపులర్ అవుతున్నదే లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో.. అందునా బాలసుబ్రహ్మణ్యమే వాటిని
సమర్పిస్తే.. ఇంకేం.. సూపర్ డూపర్ హిట్... ఆ ప్రోగ్రాం మాత్రమే కాదు, ప్రియా
పచ్చళ్ళ అమ్మకాలు కూడా ఆకాశమార్గం పడతాయి. .. ఇలాటి భావనామృతంలో తేలియాడుతున్న
రామోజీ బృందానికి పరోక్షంగానూ, వచ్చి స్వయంగా కలిసిన సితార బృందానికి ప్రత్యక్షంగానూ
దిమ్మతిరిగే షాకిచ్చారు... తియ్యటి మాటలతో పైకి చాలా సౌమ్యంగా, ఆత్మీయంగా కనిపించే
ఆ నేపథ్య గాయకుడు.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే...
‘‘చూడు బ్రదర్ ! నాకు ఆ రామోజీరావు గారు ఎవరో తెలియదు. పరిచయం లేదు. ఈనాడు,
సితారల గురించి వింటున్నా..నేను ఇంటికి హిందూ పత్రిక వేయించుకుంటా.. అది చదవడానికే
సమయం దొరక్క ఎప్పుడో ఒకసారి చదువుతుంటా వీలు చిక్కినప్పుడు(ఎక్కువగా వాష్ రూములో).
మీ పత్రికలు అక్కడక్కడా చూస్తున్నా. ఇక మీరు చెప్పిన దానిని బట్టి... నాకు రెండు
విషయాలు అర్థమయ్యాయి.
ఒకటి – మీరు నాకు కవరేజి ఇస్తాననడం, నాఫొటోలు వేస్తాననడం. సరే.. మీ పాఠకులకు
అవి అవసరమనుకుంటేనే వేయండి. వద్దనుకుంటే వేయకండి. మీడియాలో నాకు మిత్రులు చాలా
మంది ఉన్నా... నా ఫొటోలు, నా వార్తలు వేయమని ఇప్పటివరకు నేను ఎవరినీ అడగలేదు. అలా
అడిగి వేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల ...అవి వేయాలా వద్దా... అనేది
మీరు, మీ సిబ్బంది, మీ యాజమాన్యం నిర్ణయించుకోవలసిన విషయం.
ఇకపోతే... నీరాజనం కార్యక్రమం నేను సమర్పించాలన్నారు. అది వాణిజ్య కార్యక్రమం.
ఒక ఉత్పత్తి అమ్మకాలు పెంచుకోవడానికి మీరు చేసుకుంటున్న పబ్లిసిటీ. మీ బ్రాండ్ విలువ
పెంచుకోవడానికి చేసుకుంటున్న ప్రయత్నం. మంచిదే. మంచి వ్యాపార వ్యూహమే. అయితే నేను
సినిమారంగంలో చేస్తున్నది కూడా వ్యాపారమే. పాటలు ఉచితంగా పాడడం లేదు. కచ్చేరీలు
కూడా ఉచితంగా చేయడం లేదు. డబ్బులు తీసుకుని పాడుతున్నా. నాది కూడా వ్యాపారమే.
ఇటువంటి కార్యక్రమాలకు నేను బ్రాండ్
అంబాసిడర్ గా లేదా యాంకర్ గా లేదా ప్రజెంటర్ గా ఉండాలంటే... దానికి నా టర్మ్స్ నాకున్నాయి. అవి మా పిఏ ను అడిగితే వివరిస్తాడు.
మీరు చేసేది, నేను చేసేది వ్యాపారమే అయినప్పుడు మనం వ్యాపార భాషలోనే మాట్లాడుకుంటే
బాగుంటుందేమో’ అని ముగించాడు.
ముఖాలు పాలిపోయాయి. బాస్ కు ఏమని చెప్పాలి ? ఎలా చెప్పాలి ? ఈ ఆందోళనతో గేటు దాటుతున్న
వారిని బాలసుబ్రహ్మణ్యం వెనక్కి పిలిచి...‘‘మీ కార్టన్లు ఇక్కడే మర్చిపోయి
పోతున్నారు. తీసుకెళ్ళండి. మాకు ఇంటి పచ్చళ్ళు ఉన్నాయి. అవి సరిపోతాయి. ప్లీజ్.. మరోలా
అనుకోవద్దు... క్షమించండి’’
ఇంకేమనాలో తెలియక వాటిని కూడా వెనక్కి మోసుకెళ్ళిపోయింది ఆ బృందం.
ఇది జరిగిన నెలా రెండునెలల లోపే నేను మద్రాస్ కు వెళ్ళడం.. అది కూడా నేను
‘ఈనాడు’లో పనిచేస్తున్నానని చెప్పడంతో నిజంగానే అప్పటివరకు రామోజీరావు గురించి
తెలియని బాలసుబ్రహ్మణ్యానికి – ప్రియా పచ్చళ్ళ డీల్ దరిమిలా ఏర్పడిన కుతూహలం ఆపుకోలేక... నేను
సాధికారికంగా, ఉన్న వాస్తవాలను చెప్పగలనన్న నమ్మకంతో నన్నడిగిన ప్రశ్న...
‘‘ఎవడ్రా ఈ రామోజీ రావ్ ! నాకు ఇంటికి పచ్చళ్ళు పంపిస్తానంటాడు. నీరాజనం
చేయాల్ట.. దానికి నా ఫొటోలు, ఇంటర్వ్యూలు, వాళ్ళ పత్రికల్లో ప్రామినెంట్ గా
వేస్తారట..’ అని
....
కొసమెరుపు : కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ‘పాడుతా తీయగా’ సీరీస్ మొదటి విడత బ్రేక్ (సుమన్
హయాంలో) వచ్చే వరకూ – కమర్షియల్ టర్మ్స్
లోనే ఉన్నారు వారిద్దరూ. ఆ తరువాత బాలసుబ్రహ్మణ్యం వెంటనే జెమినీ ఛానల్ లో ఎందరో
మహానుభావులు(13 ఎపిసోడ్స్), ఆ వెనువెంటనే మాటివిలో ‘పాడాలని ఉంది’ సీరీస్ కు(దాదాపు
నాలుగైదేళ్ళు నడిచింది) ఒప్పుకున్నప్పుడు.. రామోజీ రావు బృందం అభ్యంతరం లేవదీసింది..
నిర్మొహమాటంగానే (కొంత కటువుగానే) మాటలు పేలాయి. అప్పుడు కూడా కమర్షియల్ టర్మ్స్ లోనే... అయినా
తగ్గని బాలసుబ్రహ్మణ్యం ఇతర ఛానల్సులో తన
ప్రోగ్రాములను కంటిన్యూ చేసారు.... ఆ
తరువాత (సంధి ఎక్కడో కుదిరి.... ఇద్దరికీ
ఒకరి అవసరం మరొకరికి బాగా ఎక్కువయిన నేపథ్యంలో) మళ్ళీ ‘ఈనాడు’ లో పాడుతా తీయగా సీరీస్ మొదలయింది. నిర్విరామంగా నడుస్తున్నది..
పాపులారిటీ రేటింగ్ లు పెంచుతూ.... అలా రోజులు గడుస్తున్న క్రమంలో...
ఒక వేడుకలో రామోజీరావుకు
బాలసుబ్రహ్మణ్యం అకస్మాత్తుగా పాదాభివందనం (అంత భారీ శరీరంతో కూడా సాష్టాంగ
దండ ప్రమాణం /అష్టాంగ నమస్కారం) చేయడాన్ని టివీలో చూసి అవాక్కయ్యా ....అప్పుడు
తెరుచుకున్న నోరు ఇప్పటికీ మూతపడలేదు.
-చినవ్యాసుడు, మాఊరు.
...........................
ఈ సంగతి ప్రపంచానికి చాటిన మీకు అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ...
తొలగించండిఓడలఉబండ్లమఈదబండ్లఉఓడలమఈద రావటం అవసరం,వ్యాపారలక్షణం.అదేచివరికార్యక్రమంగా.బాలుగారికికైలాసయాత్రవాహమనంకావటంయాదృచ్ఛికం.
రిప్లయితొలగించండిఔనండీ...
తొలగించండిచాలా ఆసక్తికరమైన... విలువైన, అరుదైన సమాచారం.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ.
తొలగించండిరాజకీయాల్లో నే కాదు, జీవితం లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండ కూడదు కదా!
రిప్లయితొలగించండిబాగుంది రాజేశ్వరరావు గారు. కానీ, అవతలి వారి గురించి ఎక్కువ తెలిసేకొద్ది మన అభిప్రాయం మారుతుంది
రిప్లయితొలగించండిఅది సహజమేకదా అవధానిగారూ... తెలిసిన తరువాత కూడా ప్రభావం కనిపించలేదంటే.... అది ఆలోచించాల్సిన విషయం...
తొలగించండిఎవరి అవసరాలు వారివి. ఇద్దరిదీ వ్యాపార దృక్పథమే. కనుక అవగాహన వచ్చే వరకే విభేదించడం . ఏమైనా
రిప్లయితొలగించండి' పాడుతా తీయగా ' ఇప్పటికీ జన రంజకంగానే సాగుతోంది వారసుడి తో.
ఊహకందని విషయాలు తెలిపారు.
బాగుంది.
ధన్యవాదాలండీ.
తొలగించండి