వార్త N E W S

 

వార్త

 

నాకు రాయడం తెలుసు

నాకు చదవడం తెలుసు

పట్టిపట్టి చూడడం, ఓపిగ్గా వినడం తెలుసు

 

చచ్చు విశేషాల పిచ్చి మొక్కల్లోంచి

మందు మొక్కలు పీక్కురావడం తెలుసు

నేలపొరల్లో దాచిన మందుపాతరల

వాసన పట్టేయడం  తెలుసు

 

నా ముందున్న సమాచారం కుప్పల్లోంచి

వార్తలు ఏరుకోవడం ఎక్కువగా తెలుసు

వాటి దుమ్ము దులిపి ముస్తాబు చేసి

వినువీథుల్లో విహరింపచేయడం తెలుసు

 

దార్లో ఈల వేసేవి, గోల చేసేవి

వెంటపడి వేధించేవి

కన్నుగొట్టే కల్లబొల్లి కబుర్లనుంచి

వార్తను కాపాడుకోవడం కూడా తెలుసు

 

అప్పుడు ...

వార్త నా చిటికెన వేలు పట్టుకుని నడిచేది

పక్కచూపులు చూడాలనిపించినప్పుడు

నాకేసి ఓ లుక్కేసేది, కన్నెర్రచేస్తే

నాలుక్కరుచుకొనేది..

 

ఇప్పుడు...

 

అది నా చెయ్యి వదిలేసింది

ఈలలు, గోలలకు రెచ్చిపోతున్నది

రికార్డింగ్ డాన్సులు చేసేస్తున్నది

పచ్చికుండ మీదెక్కి

పిచ్చి కూతలు కూస్తున్నది

 

ఎంగిలిపడ్డవి, దొంగిలింపబడ్డవి

కల్తీసారాబట్టీల్లో వండివార్చినవీ

కక్కుర్తిపడి కక్కిన సొల్లు స్టోరీలన్నీ

వయ్యారాలు వొలకబోస్తూ

వార్తల మేలిమి జలతారు ముసుగు లేసుకుని

సంతంతా సందడిచేస్తున్నాయి

ఈథుల్లో ఈరంగమాడుతున్నాయి

పులివేషాలతో కాగితప్పులులు

మాయా దర్పణాలు

జాతర చేసేస్తున్నాయ్

కనికట్టుతో కట్టిపడేస్తున్నాయ్

టక్కుటమారాలతో

గజకర్ణగోకర్ణాలతో కుమ్మేస్తున్నాయ్

 

పల్లీబఠానీలక్కూడా పోటీలుపడి

పైటలు  జార్చేస్తున్నాయి

పచ్చనోటు కనపడగానే

పక్కలు పరిచేస్తున్నాయి


అయినా ఆశ చావక...

పనికిరావని ఊరవతల పారేసిన

సమాచార కుప్పలకేసి వెడితే

ప్రాణం లేచొచ్చింది...

 

అసలు వార్తలు శోషొచ్చి అక్కడ

చచ్చిన పీనుగుల్లా పడిఉన్నాయి

పిడచకట్టిన నాలుకలు చాచి

అమృతపు చుక్కలకోసం

ఆపన్న హస్తం కోసం

అల్లాడుతున్నాయి

 

 -చినవ్యాసుడు,  మాఊరు.

chinavyasudu@gmail.com





ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...