పాత పుస్తకాలను పారేస్తున్నారా ! ! !

 


మంచి పుస్తకాలన్నీ మీ ముంగిట్లోనే.......

రోజురోజుకూ తెలుగు వెలుగులు తగ్గిపోతున్నాయని బాధపడేవారికి, మన తెలుగును మన స్థాయిలోనే దేదీప్యమానంగా వెలిగించడానికి కొన్ని చిట్కాలు.....అలాగే ఇష్టపడి కొనుక్కున్న, సేకరించుకున్న పుస్తకాలను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచుకోలేక,  ఉచితంగా ఇచ్చినా ఎవరూ తీసుకోకపోవడంతో చూస్తూ చూస్తూ రద్దీకింద అమ్మలేక క్షోభపడుతున్న పుస్తక ప్రియులకు పనికొచ్చే ఆచరణయోగ్యమైన చిట్కాలు.....

ప్రస్తుతం ఎక్కువమంది ఫ్లాట్లల్లో ఉంటున్నారు కాబట్టి....   స్థలం సమస్య కూడా వారికే ఎక్కువ కాబట్టి వారు ఈ విధంగా చేయవచ్చు.....(ఇప్పటికే కొన్ని అపార్ట్ మెంట్లలో ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అయితే  అవి నామమాత్రంగానే ఉంటున్నాయి.... తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోని అద్భుతమైన క్లాసిక్స్ కు చోటు కల్పించడం లేదు).

అపార్ట్ మెంట్ / కాంప్లెక్స్ ప్రాంగణంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు....
 
పిల్లల పార్కు, జిమ్ము, స్విమ్మింగ్ పూల్, క్లబ్బులు ఎంత ముఖ్యమో ఇది కూడా అంతేనని భావించండి... కొత్తగా ఫ్లాట్ కొనేటప్పుడు దీని కోసం డిమాండ్ చేయండి. 
 

ర్యాక్ లను ఫ్లాట్ ఓనర్లనుండి విరాళంగా తీసుకోండి... వారి పేర్లతో గుర్తింపుగా... 

    

 
పుస్తకాలు కొనకండి.. తెలుగు పాత పుస్తకాలు విరాళంగా  స్వీకరించండి. దాతల పేర్లు ప్రతి పుస్తకం మీద ప్రకటించండి.  పాత పుస్తకాలను ఉచితంగా  తీసుకుని  వాటిని శాశ్వతంగా భద్రపరుస్తామనీ, సద్వినియోగం అయ్యేట్లు చేస్తామని.. ... మీ ఫ్లాట్ నివాసితులకు, వారిద్వారా వారి బంధువులు, స్నేహితులకు చెప్పండి...  అయితే ఉచితంగా వస్తున్నాయి కదా  దానిని గోడౌన్ గా మార్చకండి...  బాగా ప్రజాదరణ పొందిన పుస్తకాలు,  ప్రసిద్ద రచయితల పుస్తకాలు...  అలా తప్పనిసరిగా ప్రతి తెలుగు వాడూ చదవవలసిన, చదివి తీరాల్సిన  పుస్తకాలను మాత్రమే సేకరించండి.
 
పిల్లలతో సహా అందరి అభిరుచులకు తగ్గట్లుగా పుస్తకాలు సేకరించండి. స్థలం లేక పాత పుస్తకాలను వదిలించుకునే వారి దృష్టిని ఆకర్షించడానికి...  ప్రభుత్వ గ్రంథాలయాల వద్ద నోటీసు బోర్డులు పెట్టండి.  వారు చూసుకుని మిమ్మల్ని సంప్రదిస్తారు. లేదా వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపులలో సమాచారం ఇవ్వండి.
 
మీరు సేకరించిన పుస్తకాలలో మంచి పుస్తకాలను ఖర్చుకు వెనకాడకుండా గట్టిఅట్టతో బైండింగ్ చేయించి భద్రపరచండి.
 
మీ దగ్గరఉన్న పుస్తకాల జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుతూ, కాపీలను నివాసితులకు పంపుతూ ఉండండి.
 
పుస్తకాలను చదువుకోవడానికి ఇచ్చినప్పుడు... ఆ పుస్తకం మీద వారి అభిప్రాయం/సమీక్ష కూడా వారిచేత రాయించండి. అలాంటి సమీక్షలు కూడా టైప్ చేయించి భద్రపరచండి. వాటిని చూసి స్ఫూర్తి పొంది ఇతరులు చదవడానికి అవకాశం ఉంటుంది. తరువాత వాటిని తక్కువ ఖర్చుతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించవచ్చు. 
 
లైబ్రరీ ఫండ్ పేరిట ప్రత్యేకంగా విరాళాలు వసూలు చేసి (వినాయక చవితికి విగ్రహాలకు, ప్రసాదాలకు వసూలు చేసినట్లు)... దానిలో 50% నిధులతో కొత్త పుస్తకాలు కొనండి.
 
పిల్లలకు తెలుగు చదవడంలో, రాయడంలో, పద్యపఠనంలో పోటీలు నిర్వహించవచ్చు, సాహితీ సమావేశాలు నిర్వహించవచ్చు. వీటికి ప్రముఖ రచయితలను పిలవవచ్చు... ఇవన్నీ అపార్ట్ మెంట్ వాతావరణాన్ని పరిమళభరితం చేస్తాయి. రేపటి తరాన్ని ఉత్సాహ పరుస్తుంటాయి... వారిలోని సృజనాత్మకతను వెలుగులోకి తెస్తాయి.


కాలనీ పార్కులు, 

బస్తీ దవాఖానాల్లాగే ఇవి కూడా........

హైదరాబాదులో నివాస  ప్రాంతాల్లో ఉన్న పార్కులను నిత్యనూతనంగా ఉంచడానికి కార్పొరేషన్ వారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యుచ్ఛక్తి, నీరు, మొక్కలవంటివి ఉచితంగా ఇచ్చి... వాచ్ మెన్ జీతం తదితర ఖర్చులకోసం పార్కు సైజును బట్టి నిర్ణీత మొత్తాన్ని ప్రతినెలా ...అక్కడి సంక్షేమం సంఘాలకు చెల్లించే ఏర్పాటు చేసారు. ఇది ఉభయతారకంగా ఉండడంతో సంఘాల వారు కూడ ఉత్సాహంగా వాటిని వారి అభిరుచిమేరకు సొంతంగా విరాళాలు కూడా జోడించి అభివృద్ది చేస్తున్నారు...  ప్రతి పార్కుకు అనుబంధంగా లేదా సమీపంలో ఈ పద్ధతిలోనే  బస్తీ గ్రంథాలయాల ఏర్పాటుకు, అభివృద్దికి ఎందుకు ప్రయత్నించకూడదు...  లేదా ఇప్పటికే ఉన్న రీడింగ్ రూములను మినీ గ్రంథాలయాలకింద అభివృద్ది చేసే పనిని కాలనీ సంఘాలకు ప్రభుత్వం/పుర/నగర పాలక సంఘాలు అప్పగించవచ్చు.

వినాయక చవితి, దసరా ఉత్సవాలను కాలనీల్లో సంఘాలుగా ఏర్పడి విరాళాలు సేకరించి నిర్వహిస్తున్నప్పుడు,   భక్తులతో భజనబృందాలు, లలితా సహస్రనామ కీర్తన బృందాలవంటివి సునాయాసంగా లెక్కకు మించి విస్తరిస్తూ పోతున్నప్పుడు.... ఇటువంటి గ్రంథాలయాల ఏర్పాట్లకు పుస్తక ప్రియులు చొరవ తీసుకోవచ్చు.....  అయితే అది ఎవ్వరికీ భారం కాకుండా ఉండి... ఉమ్మడి వనరులు, ఉమ్మడి విధులు ఉన్నప్పుడు అందరూ ముందుకు వస్తారు. కారణం.. వ్యక్తిగతంగా మనం త్యాగం చేస్తున్నది చాలా తక్కువ, ప్రయోజనాలు పొందుతున్నది మాత్రం చాలా ఎక్కువ కాబట్టి.   

క్షేత్రస్థాయి కార్యాచరణ యువజన సంఘాలకు, లైబ్రరీల నిర్వహణ పెద్దలకు(విద్యావంతులైన  వృద్ధులకు ) అప్పగించాలి.

ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన పుస్తకాలు,  స్కూలు, కాలేజి అకాడమిక్స్ కు సంబంధించినవి  కూడా .... వార్షిక  పరీక్షలు పూర్తయిన వెంటనే  విద్యార్థులనుంచి సేకరించి (ఫుట్ పాత్ వ్యాపారులకు అయినకాడికి అమ్ముకోకుండా)... బుక్ బ్యాంకులను ప్రతి కాలనీలో   ఏర్పాటు చేయాలి...  పాతవి సేకరించి పేద విద్యార్థులకు ఉచితంగా వాటిని  పంపిణీ చేయాలి.

భాషమీది  అభిమానంతో  పుస్తకాలు ఉచితంగా ఇచ్చేవారున్నారు.. ఇస్తే పరమ ఆసక్తిగా  చదివే వారున్నారు.......  మౌలిక సదుపాయాల నిర్వహణే ఇప్పుడు సమస్య....  అయితే ప్రభుత్వాలే ... అవి నిర్వర్తించాల్సిన విధులు... రోడ్లు, బ్రిడ్జిలు, ఫైఓవర్లు, చెక్ పోస్టులు, రైల్వే స్టేషన్లవంటివాటి నిర్మాణాలను...  ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నప్పుడు....  బస్తీ గ్రంథాలయాలను, అపార్ట్ మెంట్ గ్రంథాలయాలను  ఆ పద్ధతిలో ఎందుకు అభివృద్ధి చేసుకోలేం....

దీనికి కావలసింది... ఉత్సాహంగా ముందుకు అడుగేసి అందరినీ కలపడమే.. కొంత పని చేసి వెళ్ళి కలిస్తే... కాదనే కలెక్టరుంటాడా...... నిధులు కానీ, శ్రమకానీ ఏ ఒక్కరికీ భారం కాని ఏర్పాట్లు ఇవి...  ప్రయోజనాలు మాత్రం అనంతం...

  • గృహిణులు, ఇంటిపట్టున ఉండే వృద్ధులకు ఇవి మంచి కాలక్షేపమే కాక, అందరిలో జిజ్ఞాస కలిగించడానికి ఇతోధికంగా తోడ్పడతాయి.
  • తెలుగు భాషాభివృద్ధి యజ్ఞంలో...  మీరు సైతం ఒక సమిధను ధారవోసినట్టే అవుతుంది.
  • అన్ని వయసులవారిలో పఠనాసక్తిని   పునరుజ్జీవింప చేయవచ్చు....  ఇటువంటి ఏర్పాటు లేకపోబట్టే.... గత్యంతరం లేక కుటుంబ సభ్యులు టీవీ సీరియళ్ళకు, టీవీ సినిమాలకు, స్నేహితులతో గంటల తరబడి పనికిరాని ముచ్చట్లకు అలవాటు పడుతున్నారు.

ఇళ్ళల్లో చోటు లేదేమో కానీ, మన మనసుల్లో పుస్తకానికి చాలా చోటుంది. పెంచి పెద్ద చేసిన మన పెద్దలను... మనం జాగ్రత్తగా చూసుకుంటున్నట్లే, మన వ్యక్తిత్వాలనే కాదు, ఎందరి జీవితాలనో  తీర్చి దిద్దిన పాత పుస్తకాలపట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంది. కొత్త శక్తికోసం వాటిని మధ్యమధ్యలో తిరగేస్తుండాలి. మన గురువులను మనం వెంటపెట్టుకుని జీవితాంతం తిరగలేం, కానీ ఆ స్థాయిలో మనకు మార్గదర్శనం చేయగల పుస్తకాలను మాత్రం ....ఇంట్లో కాకపోయినా అందుబాటులో ఎప్పటికీ ఉంచుకోవచ్చు కదా !

అపార్ట్ మెంట్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతున్న ఈ దశలో కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే చాలు. ప్రతి నివాస సముదాయం దగ్గర ఒక అమూల్య ఖజానా మన, భావి తరాల జీవితాలను సుసంపన్నం చేస్తూనే ఉంటుంది.

 ఇదిగో..ఇంతకు మించిన సాక్ష్యం ఉందా...  


ఇటువంటి ఒక గ్రంథాలయాన్ని న్యూ నల్లకుంటలో శ్రీధర్ ప్లాజా అండ్ నటరాజ్ రెసిడెన్సీ వెల్ఫేర్ కమిటీ చెందిన  శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు అనే ఒక ప్రముఖ స్వచ్ఛంద సేవా కార్యకర్త విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

 ఆయన మాటల్లోనే తెలుసుకోవాలంటే...


·        మా లక్ష్యం... ఎక్కువగా గడప దాటని, దాటలేని వృద్ధులకు సత్కాలక్షేపం అందిచండం, వారి అనుభూతులు అందరికీ పంచడం, పిల్లల్లో, పెద్దల్లో  పఠనాసక్తిని పెంచడం, తెలుగు సాహిత్యం విలువను అందరూ గుర్తించి, దానిని సమాదరించేటట్లు చేయడం..

·        ప్రస్తుతం  మా బ్యాంక్  బ్యాలెన్స్ : 2500 మంచి పుస్తకాలు.. వీటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, సాంఘిక నవలలు, రాజకీయ, సామాజిక ఉద్యమాలపై వచ్చిన రచనలు, విశ్లేషణలు, ప్రముఖ , వర్ధమాన కవులు, రచయితల పద్య-వచన కవితలు, కథా సంకలనాలు, చరిత్ర, బాల సాహిత్యం, దిన, మాస పత్రికలు ముఖ్యంగా  పిల్లల పత్రికలు  ఉన్నాయి. మా గ్రంథాలయం  కేవలం మా అపార్ట్ మెంట్ వాసులకే పరిమితం. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇక్కడ కూర్చుని చదువుకోవచ్చు లేదా పుస్తకాలు తగిన అనుమతితో తీసుకెళ్లి చదువుకోవచ్చు. సేవలు పూర్తిగా ఉచితం.


....

తెలుగు తాజా స్థితి కోసం...వాట్సాప్ లో తిరుగుతున్న ఈ  పోస్టులను చూడండి....


సాహిత్య అభిమాని ఒకరు తన దుకాణం వద్ద ఇలా బోర్డు పెట్టారు.
కొంచం కూడా ఆంగ్లం వాడకుండా వస్తువులు కొంటే 30శాతం రాయితీ ఇస్తాను.


వ్యక్తి... సూక్ష్మాతి సూక్ష్మ విషాణు రాక పోక నియంత్రణ ముఖోష్ట నాసికాది రక్షణార్ధం కర్ణ ధ్వయ సమర్థిత ద్వివస్త్రం ఇవ్వండి అన్నాడు. 


యజమాని... బాబు 50 శాతం రాయితీ ఇస్తాను, ఆంగ్లంలోనే చెప్పండి.


మాస్క్ ఇవ్వండి అన్నాడు

.....................................


శ,ష,స  అనే అక్షరాలు ఎక్కడ పలకాలో తెలియని కొందరు యాంకర్లు దీనిని గమనిస్తారని ఆశ.


    యద్యపి బహునాధీషే

        తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |

    స్వజనః శ్వజనో మా భూత్

        సకలం శకలం సకృత్ శకృత్ ||


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా ఫర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలము) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు. 

      వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోలేరు. ఉచ్చరణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.

......

ఈ పరిస్థితిని నివారించాలంటే... మనమూ ఒక అడుగు ముందుకు వెయ్యాలి.

దీని ‘తల రాత’ను మీ రాతే మార్చగలదు... !!!

 


తెలుగు : 1-8


తెలుగు భాషాభిమానులయిన మిత్రులకు,

నమస్కారం. తెలుగు భాష ప్రస్తుత స్థితిగతులపట్ల ప్రజల్లో నెలకొంటున్న ఆవేదనను, భాషాభివృద్ధికి అవసరమయిన పరిష్కారాలను ప్రస్తావిస్తూ... మొత్తం ఏడు వ్యాసాలు రాసాను.  ఇది ముగింపు కాబట్టి 8 అయింది.  నిజానికి ఇవన్నీ ఒకటే వ్యాసం కింద లెక్క. అయితే మీరు చదువుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని దానిని ఏడు చిన్న ముక్కలుగా చేసాను. (ఇప్పటికే నాలుగు భాగాలు  మీతో పంచుకున్నా. మిగిలిన మూడు చాలా ముఖ్యమైనవి. ఇప్పటివరకు చదవని వారికోసం కింద అన్నిటికీ లింకులు ఇచ్చాను).

ఈ విషయం మీద దీనిలో ప్రస్తావించిన పలు అంశాల మీద నాకున్న పరిమిత అవగాహనతో వాటి విశ్లేషణతోపాటూ, నాకు తోచిన పరిష్కారాలు కూడా సూచించా. ...   భాషాభిమానులు, భాషా నిపుణులు, బాధితులు..  ఇలా అందరూ వీటిని పూర్తిగా చదవండి.

ఇవి నేను కాలక్షేపానికో,  కీర్తికండూతితోనో, మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలనో, ఓ అద్భుత  మేధావిననిపించుకోవాలన్న తాపత్రయం కొద్దో.... ఇవి రాయలేదు.అది నా ఉద్దేశం  కూడా కాదు....

నేను రాసిన దానిలోకూడా అవగాహనారాహిత్యం కొద్దీ లేదా మరోరకంగా చాలా తప్పులు దొర్లి ఉండవచ్చు. నేను కొన్ని హద్దులు కూడా దాటి ఉండొచ్చు...  క్షమించండి.  తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకు రావడానికి, లేదా మరిన్ని వెలుగులు చిమ్మేలా చేయడానికి  నావంతు కర్తవ్యం నేను కూడా మొదలు పెట్టాలి-అన్న తపనలో  అక్కడక్కడా అడుగులు తడబడి ఉండొచ్చు.  వీటిని మీలో ప్రతి ఒక్కరూ పూర్తిగా చదవండి. చదివి వదిలేయకండి. మీకు తోచిన పరిష్కారాలు, స్పందన మీ పరిధిలో ప్రకటించి విస్తృతంగా చర్చకు పెట్టండి. 

వేయి మాటలేల... తెలుగు భాష తియ్యనిదే... జగమెరిగిన సత్యం...  దానిలో కూడా తీపెక్కువగా ఉన్న పంచదార పలుకులేరి, నోటితేనెలో ఊరించి, మనసు వెన్నలో ముంచి తీస్తే...   ఆ తెనుగు మాటలు వినేవాడి చెవుల్లో అమృతం చిలికిస్తాయి,  వాడి కళ్ళల్లో ఇంద్ర ధనస్సులు మెరిపిస్తాయి,  అనుభూతి చెందేవాడి మనస్సును వెన్నెల్లో విహరింప చేస్తాయి.,  ఎన్ని ఇంగ్లీష్ పదాలు కలిపి పోపు పెడితే అంత గొప్ప అని ఒక  ప్రాంతం వారు, ఎన్ని హిందీ, ఉర్దూ భాషా పదాలు కలిపితే అంతగా అత్తరు వాసనలు గుబాళిస్తాయని అని మరో ప్రాంతం వారు అనుకున్నంత కాలం... తెలుగు సిగ్గుతో చచ్చి ముడుచుకుపోతుంటుంది. అందువల్ల మనకు తెలిసినదే తెలుగు అనుకుని మురిసిపోకుండా, మాట్లాడడాన్ని..  అదీ అచ్చ తెలుగులో ముచ్చటగా మాట్లాడడాన్ని ఒక కళగా అభ్యాసం చేయండి. 

అలాగే  చదవడం. మంచి సాహిత్యం..  పాతదయినా, కొత్తదయినా చదవడాన్ని తప్పనిసరి వ్యాపకాల్లో ఒకటిగా చేసుకోండి. ఇక రాయడం - ఇంటికి కావలసిన సరుకుల జాబితా కావచ్చు, ప్రియురాలికి  ప్రేమలేఖ కావచ్చు,  పై అధికారికి ఒక నివేదిక కావచ్చు,  ఒక సమస్యపై ఫిర్యాదుగా పత్రికల్లో పాఠకుల పేజిీకి రాసేది కావచ్చు. ..  మన మనోభావాలను కాగితం పై  అర్థవంతంగా పెట్టగల నేర్పు సంపాదించుకోవాలి, ఉన్నదానికి మెరుగులు దిద్దులు కోవాలి.  ఇవి ఎక్కువగా చేసినప్పుడే తెలుగు ‘తలరాత’ బాగుపడుతుంది.  అది విజయవంతంగా జరిగితే  మన అమ్మభాష  ఇప్పుడున్నంత దీనంగా అయితే ఉండదుగాక ఉండదు.... ఆ విజయ రహస్యం మాత్రం మరెవరి చేతుల్లోనో లేదు.... అక్షరాలా మన చేతుల్లోనే ఉంది..  మన పిల్లల చేతుల్లోనే  ఉంది.

ఏదో ఒక గడువు తేదీ అనేది ఎదురుగా కనిపిస్తుంటే, మన అడుగులు సక్రమంగా, వేగంగా పడతాయి కాబట్టి – వచ్చేసంవత్సరం ...2022  ఉగాది నాటికి  చర్చలన్నీ ఒక కొలిక్కి వచ్చి- తెలుగు భాష మరో వెయ్యేళ్ళు వెలగడానికి అవసరమయిన నిర్ణయాలు వచ్చేలా అందరం కృషి చేద్దాం. కనీస కర్తవ్యంగా వీటిని వీలయినంత మందికి చేరవేయండి, షేర్ చేయండి.

ఉప రాష్ట్రపతి గౌ. శ్రీ వెంకయ్య నాయుడు గారు భాష విషయంలో తన ఆవేదన అందరితో పంచుకుంటూనే, కేవలం మాటలతో మురిపించి ఊరుకోకుండా   తన పరిధిలో తాను చేయగలిగినంత ఏకపక్షంగా ఒంటిచేత్తో చేసుకుంటూ పోతున్నా.....  దాన్ని తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా సానుకూలంగా స్పందించాల్సిన పెద్దలు కానీ, వేడి పుట్టించి  ఒత్తిడి తీసుకురాగల భాషా నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కానీ అందిపుచ్చుకోకపోవడం బాధాకరం. 

 అందరిలో చైతన్యం తీసుకురావడానికి మీ వంతు మీరు కూడా కృషి చేయాలనేదే నా సవినయ విన్నపం.

- చినవ్యాసుడు, మాఊరు

.....................................

ఈ కింద ఇచ్చిన క్రమంలో చదవండి (1, 2, 3, 7 ఇప్పటికే చదివి ఉంటే....)

 

తెలుగు - 4: అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw

…………………………….

తెలుగు - 5: ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా ! 

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

………………………

తెలుగు - 6: ఆచరణాత్మక సంస్కరణలు...కొన్ని సిఫార్సులు

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw

…………………………..


(ఇప్పటివరకు వీటిలో ఏవీ  చదవకపోతే 1,2,3,4...క్రమంలో  అన్నీ చదవండి)


తెలుగు - 1: తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw

……..

తెలుగు - 2: ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw

……………………………….

తెలుగు - 3: అమ్మ ఎలాఉంది? ...హలో ! మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!! https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw

……………………

తెలుగు – 7: మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!

https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw

 

..............

అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....


తెలుగు-4 

‘‘తెలుగు భాష అంతరించిపోతున్నది,’’ ‘భాష ప్రమాదంలో చిక్కుకున్నది’,  ‘‘తక్షణం ఏదో ఒకటి చేయకపోతే ఇది బతకదు’’....వంటి ప్రకటనలు అడపాదడపా వార్తల్లో కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల దీనికి ఉద్యమాలు కూడా చేస్తున్నట్లు  లేదా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తున్నది. విడివిడిగా కాకుండా మొత్తంగా సమీక్షించుకోవడం...ఎవరికి వారు దీనిని మొత్తంగా సింహావలోకనం చేసుకోవడం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. ఎందుకంటే... ఆ భాష ఎవరిదో కాదు, మనదే.. మనలో ప్రతి ఒక్కరిదీ కాబట్టి.

‘ప్రమాదం’ అంటున్నారు కాబట్టి, ముందు దాని సంగతి చూద్దాం. భాషపరంగా చూస్తే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ఏ ప్రమాదంలో లేవు. కానీ ఇక్కడ  ప్రమాదం జరగడానికి  అవసరమయిన ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తున్నాయి. అంటే కట్టెలు, చమురు, అగ్గిపెట్టెలు...వంటివి సిద్ధం చేసుకోవడం. కానీ తెలుగు రాష్ట్రాల బయట నివసిస్తున్నవారు... ప్రవాసాంధ్రులకు మాత్రం ఇప్పటికే  ప్రమాదం తాలూకు సెగ బాగా గట్టిగానే తగులుతున్నది. ఇంతకీ ప్రవాసాంధ్రులంటే ఎవరు ???..... ఎవరో కాదు, మనమే. మన కుటుంబ సభ్యులే..  అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు దాటి  ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు.

తెలుగుభాష – ప్రమాదం – ప్రవాసాంధ్రులు...వీటికి లంకె ఏమిటి ?  నిజానికి సమస్య ప్రవాసాంధ్రులది కూడా కాదు. వారి పిల్లలది. వారి చదువులది. పరాయి ప్రాంతాల్లో అక్కడి స్థానిక భాషలకు ప్రాధాన్యత ఉంటుంది, వాటి ప్రభావం కూడా సహజంగానే ఎక్కువ, ముఖ్యంగా విద్యాలయాల్లో...  ప్రవాసాంధ్రులు గాలిపటాల్లాగా ఎగిరేది పరాయి ప్రాంతాల్లోనే అయినా, వాటి దారం మాత్రం తెలుగు నేలకు తగులుకొని ఉంటుంది. గాలి బాగున్నంతకాలం అక్కడ బాగా ఎగరగలుగుతారు, ఏమాత్రం తేడా వచ్చినా తెలుగు నేలకు వచ్చి వాలాల్సిందే. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పిల్లల చదువులు ఆగమాగం అయిపోకూడదన్నది వారి ఆవేదన. అంతేకాదు...  పెద్దవారిలో కూడా బతుకుదెరువు కోసం పరసీమలకు వెళ్ళినా...  వారిలో పలువురు పలు రకాల కళల్లో ఆరితేరి ఉంటారు. వారికి వారి నైపుణ్యాలకు ఆదరణ కావాలి, గుర్తింపు కావాలి...  ప్రపంచ వేదికలు గుర్తించినా తమ వాళ్లు గుర్తించినప్పుడే వారికి పూర్తిగా తృప్తి, ఆనందం. అంతేకాదు, వారి కళలకు మెరుగులు దిద్దుకోవాలన్నా ... సొంత ప్రాంత అండదండలు కావాలి.. ఇది వారి సమస్యే కావచ్చు కానీ... .వాటిని తొలగించడం పుట్టింటి వారి బాధ్యత. మన ప్రభుత్వాలు, వ్యవస్థలు, సమాజం ఇప్పుడు ఆ బాధ్యతను గాలికొదిలేసాయి. లేదా వారికి అవసరమైన స్థాయిలో, వారు ఆశించిన స్థాయిలో వారికి అందచేయలేకపోతున్నాయి ... వీటిలో భాషతో ముడిపడిఉన్నవీ కూడా ఎక్కువే.

ఇక మన తెలుగుగడ్డ విషయానికొస్తే... మూడు నాలుగు దశాబ్దాలుగా క్లుప్తంగా చెప్పాలంటే... విదేశీ ఉద్యోగాల మోజు పెరిగిన తరువాత...  మనం అమ్మ చెయ్యి వదిలేసి, ప్రపంచమంతా తిరుగుతున్నది కదా అని సవతి తల్లి  చెయ్యి గట్టిగా పట్టుకున్నాం. అమ్మభాషను పూర్తిగా వదిలించుకొని, పిల్లలకు  అన్య భాషలు ఎక్కిస్తూ పోతున్నాం. దీనిలో రాజూపేదా అన్నతేడా లేకుండా అందరం అప్పుసొప్పులు చేసయినా ఉగ్గుపాలతోనే   వారికి అవి నూరిపోస్తున్నాం.

దీనిని గమనించిన ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని రకాల ఆకర్షణీయమైన ప్యాకేజీలతో మన పిల్లలు ఎగిరిపోవడానికి అవసరమైన రెక్కలు తొడుగుతూ ఉంటే ... చప్పట్లు కొట్టే ఉత్సాహంలో... అమ్మ- చీరకు(భాషకు) పడుతున్న చిరుగులు చూసే సమయం కూడా లేనంత తన్మయత్వంలో మునిగిపోయాం. దీని ఫలితం ...  ఇంచుమించు మూడు తరాల తెలుగు కుటుంబాల పిల్లల్లో అత్యధిక సంఖ్యాకులు... ఒక్క సబ్జెక్టుగానే  చివరి నూలుపోగులాగా  తెలుగు భాష వేలాడుతున్నా.. దాన్ని కూడా  పదో తరగతితో దాదాపు పూర్తిగా వదిలేయగా, ఇంటరులో మిగిలినకాస్తా వదిలేస్తున్నారు. (ఇంటరు లోకూడా మార్కులు, గ్రేడులకోసం అమ్మభాషను అర్థంతరంగా ఒడ్డునే వదిలేసి,  వెనక్కి తిరిగి చూడకుండా ... సంస్కృతం, హిందీ పడవలెక్కి ఏరు దాటేసి వెళ్ళిపోతున్నారు)

వీరికి తెలుగు మాట్లాడడం మాత్రమే తెలుసు. అది  కూడా ...  చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగు కాదు... అంగడి తెలుగు, సినిమా తెలుగు, సోషల్ మీడియా నేర్పిస్తున్న తెలుగు.  ఇక చదవడం, రాయడం విషయానికొస్తే ... క్రమేణా అలవాటు తగ్గి... పెళ్ళయ్యే నాటికి పెళ్ళిపత్రికలో తప్పులు కూడా దిద్దుకోలేని స్థాయికి వెళ్ళిపోతున్నారు. తెలుగు వాడు హిందీలో మాట్లాడితే వాడికి హిందీ క్షుణ్ణంగా వచ్చినట్లు కాదు కదా. పరభాషా హీరోయిన్లు మూడు, నాలుగునెలల్లోనే తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు, ఇంటర్వ్యూల్లో కూడా గలగలా తెలుగు మాట్లాడేస్తుంటే... మన తెలుగు అమ్మాయిలాగానే ఉందే.. ..  అని భ్రమపడే పరిస్థితి....  అంటే..  తెలుగు మాట్లాడడం వచ్చినంత మాత్రాన.. తెలుగు భాషను ఉద్ధరించడం కోసం అది  ఏమాత్రం పనికి రాదని తెలుసుకోవాలి..  జనాభా లెక్కలకు మాత్రమే పనికొస్తుంది.... సర్వేల్లో ఎవరు ఎంతమందని చెప్పడానికి.

కాబట్టి తెలుగు గడ్డను వదిలిన వాడు అమ్మ చెంగు కోసం అర్రులు చాస్తుంటే, పుట్టింటోళ్ళమయిన  మనం  వాడిని పట్టించుకోవడం లేదు. తెలుగు గడ్డమీదేమో...  అమ్మ స్తన్యంనుంచి బిడ్డను అమ్మే బలవంతంగా అవతలికి నెట్టేసి పోతపాలు పడుతున్నది....  ఇదీ వాస్తవ చిత్రం...  ఇంకాస్త సుళువుగా అర్థం కావాలంటే....

ఇంటింటి రామాయణం :

నా స్థాయిలో  :  నేను ఒక పుస్తకం రాసా తెలుగులో. అందరూ చదివారనే సంతోషం ఉన్నా, నా పిల్లలు దానిని చదవడానికి అంత ఆసక్తి చూపడం లేదనే బాధ ఉండేది... ఒకసారి వాళ్ళను అడిగితే వచ్చిన సమాధానం .. ‘‘నాన్నా ! నీవు దీన్ని ఇంగ్లీషులో రాసి ఉండొచ్చుగా... పోనీ ఇంగ్లీషులో ఇప్పటికయినా రాయరాదూ..’’ అని.

మీ స్థాయిలో :  మీరందరూ విపరీతంగా అభిమానించే ఒక సెలబ్రిటీకి తెలుగంటే ఎక్కడలేని మక్కువ. ప్రతివేదిక మీద చాలా స్ఫూర్తిదాయకంగా ‘తెలుగు’ గొప్పదనాన్ని చెబుతుంటాడు. చదవడం, రాయడం సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకపోయినా...  వారి పిల్లలు పూర్తి తెలుగులో ధారాళంగా మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి....

మరిప్పుడేం చేద్దాం ???

ఈ లింకుపై క్లిక్ చేయండి....  

https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా...

 


తెలుగు-5 

తెలుగు చచ్చిపోతున్నదని ఆవేదన చెందుతున్న బహుకొద్దిమంది వీరాభిమానులు, తమ పిల్లలకు తెలుగు ఊపిరి అందట్లేదని ఆవేదనచెందుతున్న  ప్రవాసాంధ్రులు మాత్రం ...  ఏదో ఒకటి అర్జంటుగా చేసేయాలని ఉవ్వీళ్ళూరుతున్నారు. అలా వీరినుంచి ఎక్కువగా వినిపించే తక్షణ కర్తవ్యం – భాషోద్యమం. దీనికి తెలుగు రాష్ట్రాల్లోకూడా .. వారివారి కారణాల కొద్దీ కొందరు తహతహలాడుతున్నారు.

ఉద్యమమా !!!

తెలుగు భాషకు ఉద్యమం దేనికి ? దాని అంతిమ లక్ష్యం ఏమిటి ?  దాని నిర్మాణ, నిర్వహణ సంగతులేమిటి ? దీనిని ఎవరు చేయాలి ? ...  వంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా లేవు.

‘లేవు’ అని చెప్పడానికి ఆధారాలేమిటి...?

ఏ ఉద్యమం అయినా స్క్రిప్టు రాసుకుని సినిమాగా తీసి విడుదల చేసేలా ఉండదు. బాధితుల్లో నుంచి ఆ ఆకాంక్ష బలంగా రావాలి. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే...  ఆ ఆకాంక్ష ఎంతమందిలో బలంగా ఉంది ? సామాన్య ప్రజానీకం సంగతి పక్కనబెట్టినా...  తెలుగు ఉపాథ్యాయులు, రచయితలు, పాత్రికేయులు, పిల్లల తల్లిదండ్రులవంటి వారి సంగతేమిటి ? వీరు బలంగా కోరుకునేది ఒక్కటే. తెలుగు భాషా ప్రమాణాలు పడిపోతున్నాయి. వాటిని కాపాడుకుంటే చాలు. ... అన్న దగ్గరే వీరు ఆగిపోతారు. దానిని సరిదిద్దడానికి ‘ఉద్యమం’ వంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు.

తెలుగు భాషా శాస్త్రవేత్తలు, తెలుగు పండితుల వంటి వారు కోరుకొనేది... భాషా ప్రమాణాలతో పాటూ, తెలుగు భాషకు జవసత్వాలు కలిగించే సాహిత్యం కొత్తగా, పుంఖానుపుంఖంగా, ప్రామాణికంగా పుట్టుకురావాలనీ, ఇప్పటిదాకా ఉన్న మంచి సాహిత్యం బహుళ ప్రాచుర్యం పొందాలనీ...అంతే... దానికి కూడా  ‘ఉద్యమం’ పెద్ద పదమే అవుతుంది. అయినా ఉద్యమాలతో ఈ అవసరాలు నెరవేరవు కూడా.  ప్రభుత్వం విద్యా విధానంలో  చేర్చడంతోపాటూ, దాని అమలుకు సరిపడా నిధులు కేటాయిస్తే సరిపోతుంది. మంచి రచయితలను, విద్మావేత్తలను,  చేవకలిగిన ఉపాధ్యాయులను, భాషా శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సలహాలు స్వీకరిస్తూ, వారి  ప్రతిభను ఇతోధికంగా ప్రోత్సహిస్తుంటే  చాలు.

ఇక వాడుక భాషకు సంబంధించి... ప్రభుత్వఉత్తర్వులు, కోర్టు తీర్పులవంటివి తెలుగులో తీసుకు రావడానికి కూడా ఉద్యమాలు అవసరం లేదు. పాలకుల్లో చితశుద్ది ఉంటే... అతి స్వల్పకాలంలో (రాత్రికి రాత్రి) ఆ మేరకు ఏర్పాట్లు చేయవచ్చు.  ఇక బయట దుకాణాల సైన్ బోర్డులు, బస్సుల మీదవంటి....  వాటి విషయానికొస్తే....  అవి ఇప్పుడు ప్రపంచీకరణ రోజుల్లో మాట్లాడాల్సిన మాటలు కావు..  భాషపట్ల అభిమానం వేరు, దురభిమానం వేరు.... ఆ తేడా గుర్తించాలి. తెలుగులో బోర్డు రాయకపోతే వ్యాపారం జరగదు అనుకుంటే వ్యాపారులు రాయకుండా ఉంటారా... ‘‘సారా ఆదాయం కావాలి’ అదీ కరెక్టే, ‘సారా నిషేధం ఉండాలి’ అదీ కరెక్టే... లాంటిదే ఇది. బయటి నుంచి పెట్టుబడులు కావాలి,  పర్యాటకం కావాలి... నిధులు వరదలా పారాలి, వారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి... కానీ మా ఊర్లోకి అడుగుపెట్టే ప్రతివాడూ మా భాష నేర్చుకుని తరువాత కాలు మోపాలి... అంటే ఎలా...?

ఇవి చిన్నవి. ఇంతకంటే ఎక్కువగా  భాష అభివృద్ధికి చేయాల్సింది చాలా ఉంది. అది కూడా ఉద్యమాలతో నెరవేరేది కాదు. అసలు ఇప్పుడున్నట్లు చెప్పుకుంటున్న ఉద్యమాల లక్ష్యాల్లో కూడా ఇవి లేవనే చెప్పాలి. అలాగే ప్రాధాన్యతాపరంగా ఆలోచించి వెంటనే ఆచరించాల్సిన అంశం మాత్రం – ప్రవాసాంధ్రుల తెలుగు భాషా సమస్యలు. వీటిని పరిష్కరించడానికి ‘ఉద్యమం’ ఎందుకు ? పైన చెప్పుకున్న ప్రభుత్వ విద్యా విధానాల్లో దీనిని ఒక భాగం చేస్తే సరిపోతుంది. అలా చేయడానికి అవసరమైన ఒత్తిడి రాజకీయంగా  తీసుకు రావాలి.

పెళ్ళికూతురుగానీ, పెళ్ళికొడుకు గానీ లేకుండా పెళ్లి ఎలా జరగదో, ప్రజలు  లేదా నాయకులు లేకుండా ఒక ఉద్యమం కూడా అలా జరగదు. తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమం... విజయాలకు నాయకులు ప్రధాన  కారణం కాదు. బాధితులుగా ఒక ఆకాంక్ష, ఒక కసి గాఢంగా ఉండబట్టే జనసామాన్యంలో  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. నాయకుల ఉపన్యాసాలకు, ప్రవచనాలకు లేదా ప్రలోభాలకు లొంగి ప్రజలు ముందడుగు వేయలేదు. వారి ఆకాంక్షలు, వారి కసి సునామీలా  నిశ్శబ్దంగా పొంగడానికి సిద్దంగా ఉంటున్నదని  తెలిసి  నాయకులు పైన  కెరటాలమీద నిలబడి వాటిని నడిపారు. నాయకులు నోటితో గట్టిగా ఊదుతూ కెరటాలను సృష్టించలేరు కదా !

భాషను ఉద్ధరించడానికి  ఉద్యమాలు వద్దు సరే... మరి కేవలం భాషకు మరమ్మతులు చేసి కాస్త హంగూ ఆర్భాటం అద్దితే చాలా ! తెలుగు భాష మొత్తంగా పూర్వ వైభవం లేదా అంతకంటే గొప్పగా వెలిగి పోతుందా ???

వెలగదు గాక వెలగదు. మరి అలా వెలగాలంటే ఏం చేయాలి ...

లింక్ చూడండి     https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

ఇది నా నూలుపోగు... మరి మీదో...!!!




మిత్రులకు,

నమస్కారం... తెలుగు భాషకు ఏదో అయిపోతున్నదని అందరం ఏదో ఒక సందర్భంలో విపరీతంగా ఆందోళన పడిపోవడం.. ఆ తరవాత మన బతుకుపోరాటంలో దానిని పక్కనబెట్టడం ఎన్నో ఏళ్ళుగా జరుగుతూ పోతున్నది. కొంతమంది మాత్రం ఉడతాభక్తిగా మాటలతోనో, ఆవేదనను ప్రకటించో సరిపెట్టకుండా... వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత పదవుల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లు వారికి చేతనయినంత వారు చేస్తుంటే... మిగిలిన వాళ్లు ... గడ్డిపోచంతయినా వారి పరిధిలో వారు వారి ప్రయత్నాలు చేసుకుపోతున్నారు, మా వెనుక ఎంత మంది వస్తున్నారని చూడకుండా ముందుకెడుతున్నారు..... వారి నుంచి స్ఫూర్తిపొంది నేను కూడా నా వంతుగా వారి శ్రమలో వెంట్రుకవాసంత చేసినా మంచిదని  దీనికి పూనుకున్నా... ఈ క్రమంలో నేను ముందు ప్రస్తుతం  భాషగా తెలుగు ఎదుర్కొంటున్న పరిస్థితిని విశ్లేషించి, నాకు తోచిన పరిష్కారాలు సూచించాను...

 ఇప్పటికే నా బ్లాగు ద్వారా వీటిని మీ ముందుంచినప్పడు... పలువురు నన్ను అభినందించారు... కానీ నేను ఆశించింది అభినందనలు కాదు... ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దీనిని చర్చిస్తూ... వాటికి ఒక మంచి ఆచరణాత్మక ముగింపు ఇస్తే బాగుంటుందని ఆశించాను...  పొద్దున లేస్తే పనికి వచ్చే అంశాలతో పాటూ, ఎన్నో పనికిమాలిన వ్యాపకాలకు కూడా మనం అలవాటు పడి ఉన్నాం... వాటిలో భాగంగా... దీనిమీద కూడా మనలో ప్రతి ఒక్కరం ఎంతో కొంత శ్రద్ధ చూపితే... అది క్రమేణా వ్యవస్థీకృతం అయి మనకు సానుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది....

నాకు తోచిన పరిష్కారాలు ఇవిగో....పూర్తిగా చదవండి... మీ అభిప్రాయాలు కూడా తెలపండి. 

తెలుగు భాషాభివృద్ధికి మౌలికంగా మూడు స్థాయిల్లో సంస్కరణలకు తక్షణం శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది.

  1. తెలుగులో తెలుగు తగ్గి పరాయి భాషలు ఎక్కువగా జొరబడడాన్ని తగ్గించడం ... ... అంటే ... తెలుగులో తెలుగు పదాల వాడకాన్ని పెంచడం.
  2. వీలయినంత త్వరగా కనీస ప్రమాణాలతో (భాషా దోషాలు, వ్యాకరణ దోషాలు తగ్గించుకుంటూ) తెలుగు రచనలు, ప్రచురణల్లో ...ముఖ్యంగా తెలుగు పత్రికలు, ప్రచార సాధనాల్లో  భాష  సవ్యంగా సాగేటట్లు చూడడం.
  3. తెలుగు భాష, సాహిత్యం సుసంపన్నంగా, నిత్య నూతనంగా ప్రవహించడానికి అవసరమయిన జవసత్వాలు  శాశ్వత ప్రాతిపదికన చేకూర్చడం.

    తెలుగు పదాల వాడకం :

    సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ ప్రజల జీవనశైలి కూడా వేగం పుంజుకుంటున్నది. ఆ వేగానికి తగ్గట్టుగా ప్రజలు తమ పంథాను మార్చుకుంటున్నట్లే... భాష కూడా ఆ వేగానికి తగ్గట్లుగా తనను తాను మలచుకోవాలి. భాషలో ఈ మార్పు రావాలంటే....

    ఇది ఎంత పండితుడయినా  ఏ ఒక్క వ్యక్తి ద్వారానో,  ఓ చిన్న నిపుణుల సమూహాల ద్వారానో,  సంస్కరాణాభిలాష ఉన్న ఏ ఒక్క సంస్థ ద్వారానో ...  భాషలో ఆశించిన  మార్పులు ఏకపక్షంగా రావు, రాకూడదు కూడా.

    తెలుగు భాషలోకి పర భాషా పదం స్థానంలో  అనువాదంగా కానీ, అనుసరణగా కానీ, లేదా నిర్దిష్టమైన ఒక ప్రయోజనానికి/భావనకు ఇప్పటి వరకు వాడని  ఒక కొత్త తెలుగు పదం వచ్చి చేరాలంటే దానికి ప్రజల ఆమోదం ఉండాలి. భాషా నిపుణుల ఆమోదం ఉండాలి, సమాజంలోని , ప్రభుత్వంలోని వ్యవస్థలు సమ్మతించాలి. అప్పుడే అది సాధికారికంగా కరెన్సీ నోట్లలాగా చలామణిలోకి వస్తుంది.

    ఇవీ ఆచరణాత్మకమైన శాశ్వత పరిష్కారాలు.......

    ఓం ప్రథమం గా   రెండు రాష్ట్రాల్లో తెలుగు భాషకు ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ స్థాయి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.

    తెలుగు భాషకు సంబంధించి సంస్కరణలను ప్రభుత్వం తరఫున తీసుకు రావచ్చు. కానీ దానికంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమం - రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ప్రభుత్వ -  ప్రైవేటు భాగస్వామ్యం లో శాశ్వత ప్రాతిపదికన ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనికి అవసరమయిన మౌలిక వసతులు ఉచితంగా కల్పించాలి. దీని నిర్వహణ ప్రైవేటురంగానికి అప్పచెప్పాలి. (నిర్వహణకు నిధులు కూడా విరాళాలరూపంలో వసూలు చేయవచ్చు) ఐఐఐటి, హైదరాబాదుని...  ప్రభుత్వం, ఐటి పరిశ్రమలు కలిసి నెలకొల్పాయి. చాలా విజయవంతంగా నడుస్తున్నది. 

    ఒకవేళ రాజకీయ జోక్యం అనివార్యమయినా, ప్రభుత్వాలు ముందుకు రాకపోయినా ప్రైవేటులోనే దీనిని స్వతంత్ర వ్యవస్థగా ఏర్పాటు చేయవచ్చు. నిధులకు కొరత ఉండదు కూడా. ఎన్నో మాండలికాలు  ఉన్న ఇంగ్లండ్ లో.... బిబిసి... స్వతంత్ర సంస్థ. ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రజలనుండి సేకరించిన నిధులతో పని చేస్తున్నది. దాని భాషా ప్రామాణికతను అక్కడి ప్రభుత్వాలు కూడా అంగీకరిస్తాయి.

    స్వతంత్ర వ్యవస్థ ఎలా ఉండాలంటే.....

    తెలుగు భాష మాధ్యమంగా నడిచే  ప్రైవేటు రంగ సంస్థలు, నిపుణులు  – పత్రికలు, రేడియో, టివీలు, ప్రచురణ సంస్థలు, ముద్రణ సంస్థలు, సినిమా, సోషల్ మీడియా, తెలుగు భాషకోసం ప్రత్యేకంగా ఏర్పడిన విద్యాలయాలు, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య, వృత్తి విద్య వంటి వాటికి సంబంధించిన సంస్థలకు,  ...  రచయితలు, కవులు, ఉపాధ్యాయుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మండళ్ళు (బోర్డు) ఏర్పాటు చేయాలి. అలాగే దీనికి అనుబంధంగా ఒక సాంకేతిక మండలి ఏర్పాటు చేయాలి. దాని నిర్వహణను ఐఐఐటి హైదరాబాదుకు గానీ, ఐఐటి, హైదరాబాదు కుగానీ, ఎన్.ఐ.టి, వరంగల్ వంటి విద్యాసంస్థలకు గానీ అప్పగించవచ్చు.

    మండలి సభ్యుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా ఉండాలి. సభ్యుల పదవీకాలం కనీసం18 నెలలుండాలి, గరిష్టంగా మూడేళ్ళుండాలి. ప్రభుత్వ ప్రతినిధులు(సంబంధిత శాఖ మంత్రి, ప్రధాన/ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి తప్పనిసరిగా ఉండాలి).

    ఈ వ్యవస్థ మూడు స్థాయిల్లో పనిచేయాలి. అత్యున్నత స్థాయి, మధ్యమ స్థాయి, కింది స్థాయి. అత్యున్నత స్థాయిలో ఉండేది – తెలుగు సర్వజ్ఞ పీఠం(సుప్రీంకోర్టులాగా), మధ్య స్థాయిలో ఉండేది – సంస్కరణల పీఠం(రాష్ట్ర సచివాలయం లాగా), కింద స్థాయిలో ఉండేది(జిల్లా కలెక్టరు కార్యాలయం లాగా) – పరిశీలన, నిఘా, అమలు పీఠం. ఇది ప్రతి జిల్లాలో ఉండాలి.

    సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషులకు (తమిళం, కన్నడలు కూడా అవసరమనుకుంటే తరువాత స్థాయిలో చేర్చవచ్చు)  సంబంధించిన భాషా నిపుణులతో ఉప పీఠాలు ఉండాలి. అనువాదాలకు, రెఫరెన్స్ లకు ఇది తప్పనిసరి. ఇది కూడా సంస్కరణల పీఠం స్థాయిలో దాదాపు అదే హోదాతో ఉండాలి.

    అధికార భాషాసంఘం, సాహిత్య అకాడెమీ వంటి పలు రకాల దుకాణాలను రెండు రాష్ట్రాల్లో రద్దు చేయాలి. తెలుగు విశ్వ విద్యాలయాన్ని కూడా రద్దు చేసి దాని ఆస్తులను దీనికి బదలాయించాలి.

    తెలుగు పదాల సంస్కరణ

    అత్యంత ప్రాధాన్యతా ప్రాతిపదికపై మొదట తెలుగు భాష ప్రమాదంలో పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అదెలాగంటే...

    సంస్కరణల పీఠం  ఆధ్వర్యంలో భాషా నిపుణులతో  ఒక  కమిటీ వేయాలి. ప్రతివారం కచ్చితంగా ఇది సమావేశం నిర్వహించాలి.  సమావేశాల మధ్య వారానికి మించి గడువుండకూడదు. అప్పుడే అందరిలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. మార్పులు కూడా ఒక క్రమపద్దతిలో చోటు చేసకుంటాయి. 

    సమావేశానికి ముందు - ఆ వారంలో తెలుగులోకి కొత్తగా వచ్చి చేరిన పరభాషా పదాలను కమిటీ కార్యాలయం గుర్తించి ఒక జాబితా తయారు చేసి అజెండా సిద్ధం చేయాలి. వాటి పై వారాంతపు సమావేశం (గుర్తు కోసం దీనిని 1వ సమావేశం అనుకుందాం) సూత్రప్రాయంగా చర్చించాలి. 2వ సమావేశం లోగా సభ్యులందరూ వాటిని అధ్యయనం చేసి వారి వారి సిఫార్సుమేరకు పదాల జాబితాను ఆ సమావేశం ముందుంచాలి. పరభాషా పదానికి కొత్త తెలుగు పదం సృష్టించడం అవసరమనుకుంటే పరిశీలించి సృష్టించాలి. లోగడ తెలుగు సాహిత్యం లో ఇప్పటికే ఉపయోగించి ఉన్న  పాత పదాలను కానీ, సమానార్థకాలను గానీ పరిశీలించాలి.  (రెండవ ) సమావేశంలో - సభ్యులు వ్యక్తిగతంగా  ప్రతి పదానికి సూచించిన కొత్త పదాలను లేదా సమానార్థకాలను వడగట్టి అత్యుత్తమ పదాన్ని ఎంపిక చేయాలి. అలా వడగట్టి ఎంపిక చేసిన పదాల జాబితాను అదే రోజు( సర్వజ్ఞ పీఠంలో సభ్యత్వం ఉన్న) పత్రికలకు, ప్రచురణకర్తలకు, ముద్రణాలయాలకు, రచయితలకు, కవుల సంఘాలకు పంపాలి. వారం రోజుల వ్యవధి ఇచ్చి వారి అభిప్రాయాలు, ఆమోదం తీసుకుని కమిటీ 3వ  సమావేశంలో చర్చించి .. మరింత అవగాహనతో 4వ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలి. (కొన్ని దశాబ్దాల క్రితమే తమిళనాడులో  ఇంచువించు ఇటువంటి పద్ధతినే అక్కడి పత్రికలు విజయవంతంగా అమలు చేసాయి)

    ఒకవేళ అభ్యంతరాలు ఎక్కువగా వస్తే వాటిని పెండింగులో ఉంచి మరో సారి సునిశితంగా పరిశీలించాలి.  మిగిలిన వాటిని ...అలా ఆమోదింపబడిన  పదాల జాబితాను అధికారికంగా మంత్రిత్వ శాఖ తరఫున  – ప్రభుత్వ, ప్రైవేటురంగంలోని సంబంధిత సంస్థలు, శాఖలు, అన్నింటికీ ప్రభుత్వ ముద్రతో పంపాలి. ఆరోజు నుంచి అదే ఫైనల్. వాటికే గుర్తింపు.

    సమాంతరంగా నిఘంటువుల నిర్మాణం చేపట్టాలి. వాటిలో ఈ పదాలను చేరుస్తూ పోవాలి.

    ఆ తుది జాబితాలోని పదాలకు బాగా  ప్రచారం కల్పించాలి. పత్రికలు, రచయితలు, ప్రభుత్వ పత్రికా ప్రకటనలు.. ఇలా అన్నిటా.. అందరూ ఆరోజు నుండి ఆ పదాలనే వాడాల్సి ఉంటుంది. అలా వాటికి విస్తృత ప్రచారం కల్పించి వాడకంలోకి తీసుకురావాలి.(కొత్త పదాల జాబితాను వారం వారం పత్రికల్లో ప్రకటించి ప్రజాభిప్రాయం కూడా కోరవచ్చు. కానీ అనవసర కాలయాపన, గందరగోళానికి దారితీయవచ్చు) ఈ జాబితాలోని పదాలపై తదనంతర కాలంలో ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని సర్వజ్ఞ పీఠానికి నివేదించాలి. దాని తీర్పే అంతిమం. శిరోధార్యం చేయాలి.

    ప్రచారం : తెలుగు పత్రికలన్నీ స్వచ్ఛందంగా ప్రతి సంచికలో (దినపత్రికలయితే ప్రతిరోజూ)  తెలుగు భాషను, వ్యాకరణాన్ని  నేర్పే, మెరుగు పరిచే సమాచారాన్ని నిపుణులచే ఇప్పించేవిధంగా చర్యలు తీసుకోవాలి. అలా చేసిన వాటికే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సౌకర్యాలు వర్తింపచేయాలి.

    ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఉద్దేశించిన తెలుగు పుస్తకాలను ప్రభుత్వం అధికారికంగా విద్యాలయాల్లో ప్రవేశపెట్టడానికి ముందు...  భాషాపరంగా, విషయపరంగా  మొదట సంస్కరణల పీఠం సంపూర్ణ ఆమోదం,  తరువాత  అధికార ధృవీకరణ కోసం సర్వజ్ఞ పీఠం ఆమోదం పొందాలి.

    సందేహాలు :

    Ask Me/Quora నమూనాలో....తెలుగులో భాషకు, వ్యాకరణానికి, ఇతరత్రా సందేహాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో నిపుణులతో ఇప్పించడానికి సర్వజ్ఞ పీఠం ఆధ్వర్యంలో, సాంకేతిక పీఠం తోడ్పాటుతో  ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇది నిజానికి ఖర్చు తక్కువ. నిర్వహణ చాలా  సులభం. సాంకేతికంగా సాఫ్ట్ వేర్  చక్కగా పనిచేస్తే చాలు... కాల్ సెంటర్లలో లాగా ఇద్దరు ముగ్గురు సమన్వయ కర్తలుంటే చాలు ( ఫీడ్ బ్యాక్ పెరిగిన తరువాత సిబ్బందిని తదనుగుణంగా పెంచుకోవచ్చు)....తెలుగు భాషా నిపుణులతో ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ఉంచుకోవాలి. సందేహం అందిన వెంటనే సమన్వయ కర్తలు దానిని నిపుణులకు పంపి సమాధానాన్ని సేకరించి ఆన్ లైన్ లో ప్రచురిస్తే చాలు.... ఈ వ్యవస్థ బాగా పనిచేస్తే అధికార భాషగా తెలుగును అమలు చేసే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు, కోర్టులకు, విద్యాలయాలకు...అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.

     

    -      చినవ్యాసుడు, మాఊరు

    chinavyasudu@gmail.com

    ........................................

    ఇప్పటిదాకా  చేసిన విశ్లేషణలు ఇవి...

     

    తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

    https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw

     

    .

    ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!

               https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw

     

    అమ్మ ఎలాఉంది? ...హలో ! మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!! 

               https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw

     

    అమ్మను వదిలేసి, సవతి తల్లి చంకెక్కబట్టే....

               https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw

     

    ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని సినిమా తీయడం కాదు కదా ! 

                https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw

     

    మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!

                 https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw

     

    దీని తల రాతను మీ రాతే మార్చగలదు... !!!

                             https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_2.html?spref=tw

    .....................



    నిత్యనూతన భ్రాంతి

      మా తాతకు...  పుట్టిపెరిగిన ఊరు కైలాసానికి కోసుదూరం పిల్లల కాలానికి అది కరతుమ్మలు , జిల్లేళ్ళమయం   మా నాన్నకు...  పుట్టిపెరిగిన ఊరు వైకుంఠా...