రాష్ట్ర డిజిపి గారికి బహిరంగ లేఖ

 


To

The Director General Of Police.....


నమస్తే..... 

 

ü  విషయం :   మన వీథిలో, మన బస్తీలో, మన నగరంలో, మన రాష్ట్రంలో... తోపుడుబండ్లపై వాడుతున్న చిన్న మైక్ సెట్లకు సంబంధించి.....

 

చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు సంబంధించిన ఒక చిన్న చిక్కు సమస్య ఇది. సమస్య చిన్నదే అయినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటున్నది. మీరు మీ శాఖ స్థాయిలోనే కాక, ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చించి వీలయినంత త్వరగా ఒక సానుకూల పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నా....

 

*     సాంకేతికత సాయంతో మారుతున్న ఆధునిక వ్యాపార శైలిలో ఇది ఒక తాజా పరిణామం. తోపుడుబళ్ళమీద, సైకిళ్ళు, మోపెడ్లమీద కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునేవారు(కూరగాయలు, పండ్లు, పూలు, పాత పేపర్లు/ఇనుప సామాన్లు, కత్తులకు సాన పట్టేవాళ్లు, గ్యాసు స్టౌ రిపేర్లు, సోఫా రిపేర్లు, ముగ్గు, చీపుర్లు, బూజు కర్రలు, ప్లాస్టిక్ సామాన్లు, బొట్టుబిళ్ళలు, పిన్నీసులు, మొలతాళ్ళు, సవరాలు, కొబ్బరిబోండాలు, చిరుతిళ్ళు, అల్లం-ఎల్లిగడ్డ-ఉల్లిగడ్డలు...ఈ జాబితా అనంతం....) వీరంతా  బ్యాటరీతో పనిచేసే సౌండ్ బాక్స్ తో ఉన్న చిన్న మైక్ సెట్లను  పెద్ద శబ్దంతో ఉపయోగిస్తున్నారు. ముందుగా రికార్డ్ చేసుకున్న వాయిస్ తో వారి గొంతు  శ్రమను తగ్గించుకుంటూ, వారి వ్యాపార సందేశాన్ని వీలయినంతమందికి చేరవేస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. వీరంతా బడుగువర్గాలవారు... రోజువారీ కష్టాన్ని నమ్ముకుని, అమ్ముకుని బతికేవారు.. కాబట్టి ఆ కోణంలో అది సంతోషించదగిన పరిణామమే.

  

*     మారుతున్న కాలంలో అనివార్యంగా మారినవి మనం ఉండే ఇళ్ళు కూడా. సమాజంలోని అన్ని స్థాయిలవారం అపార్ట్ మెంట్ల జీవితాలకు అలవాటు పడిపోయాం. నాలుగు, ఐదు... ఆ పైన ఆకాశహార్మ్యాలదాకా  నిలువుగా, అడ్డంగా  ఇవి పెరిగి పోతున్నాయి.  రెండు, మూడు గదుల వసతికి అనుగుణంగానే చిన్నాపెద్దా కుటుంబాలు సర్దుకుపోతున్నాయి.

 

*     విశ్రాంతికి, నిద్రకు, ఆహారానికి, ఆహ్లాదానికి మాత్రమే ఉపయోగించిన మన ఇంటి గదుల్లోకి.. లాక్ డౌన్ తరువాత...  తరగతి గదులు, ఆఫీసు గదులు, వీడియో కాన్ఫరెన్స్ స్డూడియోలు, చిరు వ్యాపారుల కౌంటర్లు, చివరకు రోగుల ఆస్పత్రి గదులు  కళ్ళు మూసి తెరిచేలోపు  చొరబడ్డాయి.. ఇలా మారిన ఇళ్లల్లో ప్రశాంతంగా బతకడానికి వీల్లేకుండా..పావుగంటకు, అరగంటకు ఒకటి చొప్పున వచ్చి వాయించిపోయే మైకులు... పనులకు అంతరాయం కలిగించడమే కాక, పరమ చికాకుగా తయారయ్యాయి. ఒక్క ఫోన్ కాల్ కూడా స్పష్టంగా మాట్లాడుకోలేని పరిస్థితి

  

*     ఇల్లిల్లూ తిరిగి వ్యాపారం చేసుకొనే చిరు వ్యాపారులకు  కూతవేటు దూరంలో కస్టమర్లు ఇప్పుడు అందుబాటులో లేరు. అపార్ట్ మెంట్ వాసులు అందనంత ఎత్తులో, దూరంలో ఉండడంతో వారిని ఆకర్షించడానికి మైకులు అనివార్యమయ్యాయి. ఇది ఒకవిధంగా ఉభయులకూ పనికివచ్చే ఏర్పాటే. అయితే ఆ వెనకున్న బ్లాకులోని ఆ పై అంతస్తులో ఉండే అపార్ట్ మెంట్ల  వరకూ...అంటే దాదాపు అరకిలోమీటరు పరిధిలోని అందరికీ వినిపించేంత పెద్దగా వీరీ మైకులను సెట్ చేస్తున్నారు. ఈ పిలుపు విని... కస్టమర్లు వచ్చే దాకా ఈ మైకులు చెవులు కోసిన మేకల్లా అరుస్తూనే ఉంటాయి.

   

*     పర్యావరణ పరిరక్షణ చట్టాలు, శబ్ద కాలుష్య చట్టాలు వీటి తాలూకు కోర్టుల తీర్పులు  అన్నీ...రాత్రి 10 గంటలనుంచీ, ఉదయం 6 గంటల లోపు పరిస్థితులను మీరు నియంత్రించడానికి మాత్రమే వీలు కల్పిస్తున్నాయి. అయితే ఈ చట్టాలు ఎక్కువగా మతపరమైన, వేడుకల సందర్భాల్లో ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావడంతో మీరు కఠినంగా వ్యవహరించినా ఇబ్బందేమీ ఉండేది కాదు. చిరు వ్యాపారులేమో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంట ల వరకు వరస కడుతున్నారు. వారి సమస్య కూడా పూర్తిగా  భిన్నమైనది. అందువల్ల వీరి జిీవికకు ఇబ్బంది కలుగకుండా ...అలాగే  ఇళ్ళ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేవిధంగా చూడాల్సి ఉంటుంది. 


 దీనిని అత్యంత ప్రాధాన్యతగల సమస్యగా పరిగణించి వెంటనే తగు చర్యలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా.

 

 

-        చినవ్యాసుడు,

Active Citizens Club

chinavyasudu@gmail.com



 

2 కామెంట్‌లు:

  1. నిజమేనండీ అవసరం లేకపోయినా సరే అరుపులు కేకలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి

    రిప్లయితొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...