మునుగోడు ఓటర్నన్నా ! ! !

 


మునుగోడు ఓటర్నన్నా ! ! !

 

నేను

మునుగోడు ఓటర్నన్నా

ఆ సోయి ఉందన్నా

ఫికర్ చేయొద్దన్నా...

 

నెత్తురు ఇంకా వేడిగానే ఉంది

ఊపిరి సాఫీగానే ఉంది

నాడులు చురుగ్గానే ఉన్నాయ్

 

అవి కన్ఫర్మ్ చేసుకొన్నాకే

నాకు ఓటిచ్చారన్నా...

 

నాకు, నా ఊరికి, నా దేశానికి

రక్షణ కవచం నా ఓటు

ఓటుదొంగల ఆటకట్టుకు

నా వేలుతో సంధించే నాగాస్త్రం నా ఓటు

నా తలరాతను దిద్దే జాతక చక్రం నా ఓటు

నా ఆత్మ గౌరవం

నా ఇంటి దీపం నా ఓటు

...అని తెలుసన్నా

 

నన్ను టచ్ చేయగలరు

నా గుండెను టచ్ చేయలేరు

నన్ను టచ్ చేయగలరు

నా ఓటును టచ్ చేయలేరు

...అనీ తెలుసన్నా

 

కన్నుగీటుకు, నోటుకు

పడిపోయే సరుకు కాదిది

మందులు, బిర్యానీలు

నా నెత్తుటికెక్కవు

నా గుండెను చేరవు

మధ్యలోనే

మలమూత్రాల్లో రాలిపోతాయి

...అని తెలుసుకోండన్నా

 

నా  మది ...అది

అమ్మాఅయ్యలు నలిచిన  ఒత్తి

ఊరు చమురు పోసింది

దేశం వెలిగించింది

 

 

నా బొడ్డుతాడుమీద

ఒట్టేసి చెబుతున్నా

అమ్మనుగాక అమ్మనన్నా

మీ అందరికీ  మాటిస్తున్నా

నన్ను, నా ఊరిని

చుట్టిముట్టిన

దయ్యాలను, భూతాలను

తరిమికొట్టడానికి

నా ఓటు నా నుదుటిన

పెట్టిన నెత్తుటి బొట్టు

అది చెరగదు, మైలపడదు

 

ఫికర్ చేయొద్దన్నా

కసికొద్దీ వేస్తాన్నా

నాసత్తా 3న చూపుతాన్నా

 

-        చినవ్యాసుడు, మాఊరు

.......................................


 

 

వార్త N E W S

 

వార్త

 

నాకు రాయడం తెలుసు

నాకు చదవడం తెలుసు

పట్టిపట్టి చూడడం, ఓపిగ్గా వినడం తెలుసు

 

చచ్చు విశేషాల పిచ్చి మొక్కల్లోంచి

మందు మొక్కలు పీక్కురావడం తెలుసు

నేలపొరల్లో దాచిన మందుపాతరల

వాసన పట్టేయడం  తెలుసు

 

నా ముందున్న సమాచారం కుప్పల్లోంచి

వార్తలు ఏరుకోవడం ఎక్కువగా తెలుసు

వాటి దుమ్ము దులిపి ముస్తాబు చేసి

వినువీథుల్లో విహరింపచేయడం తెలుసు

 

దార్లో ఈల వేసేవి, గోల చేసేవి

వెంటపడి వేధించేవి

కన్నుగొట్టే కల్లబొల్లి కబుర్లనుంచి

వార్తను కాపాడుకోవడం కూడా తెలుసు

 

అప్పుడు ...

వార్త నా చిటికెన వేలు పట్టుకుని నడిచేది

పక్కచూపులు చూడాలనిపించినప్పుడు

నాకేసి ఓ లుక్కేసేది, కన్నెర్రచేస్తే

నాలుక్కరుచుకొనేది..

 

ఇప్పుడు...

 

అది నా చెయ్యి వదిలేసింది

ఈలలు, గోలలకు రెచ్చిపోతున్నది

రికార్డింగ్ డాన్సులు చేసేస్తున్నది

పచ్చికుండ మీదెక్కి

పిచ్చి కూతలు కూస్తున్నది

 

ఎంగిలిపడ్డవి, దొంగిలింపబడ్డవి

కల్తీసారాబట్టీల్లో వండివార్చినవీ

కక్కుర్తిపడి కక్కిన సొల్లు స్టోరీలన్నీ

వయ్యారాలు వొలకబోస్తూ

వార్తల మేలిమి జలతారు ముసుగు లేసుకుని

సంతంతా సందడిచేస్తున్నాయి

ఈథుల్లో ఈరంగమాడుతున్నాయి

పులివేషాలతో కాగితప్పులులు

మాయా దర్పణాలు

జాతర చేసేస్తున్నాయ్

కనికట్టుతో కట్టిపడేస్తున్నాయ్

టక్కుటమారాలతో

గజకర్ణగోకర్ణాలతో కుమ్మేస్తున్నాయ్

 

పల్లీబఠానీలక్కూడా పోటీలుపడి

పైటలు  జార్చేస్తున్నాయి

పచ్చనోటు కనపడగానే

పక్కలు పరిచేస్తున్నాయి


అయినా ఆశ చావక...

పనికిరావని ఊరవతల పారేసిన

సమాచార కుప్పలకేసి వెడితే

ప్రాణం లేచొచ్చింది...

 

అసలు వార్తలు శోషొచ్చి అక్కడ

చచ్చిన పీనుగుల్లా పడిఉన్నాయి

పిడచకట్టిన నాలుకలు చాచి

అమృతపు చుక్కలకోసం

ఆపన్న హస్తం కోసం

అల్లాడుతున్నాయి

 

 -చినవ్యాసుడు,  మాఊరు.

chinavyasudu@gmail.com





నా పబ్లిక్-నా రిపబ్లిక్

 


నా పబ్లిక్-నా రిపబ్లిక్

 

 

రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా

పబ్లిగ్గా...భేషుగ్గా...

 

ఇది నా రాజ్యం...

ఇక్కడ రాజ్యాంగమే నా రక్షణ కవచం

రాజులుండరు, బంట్లుండరు

రాజ్యాంగం ఎవడి జాగీరూ కాదు

అందరూ కౌలుదార్లే,  అందరూ చౌకీదార్లే

 

జెండా ఎగరేసి చెబుతున్నా

సహజీవనంలో

స్వేచ్ఛ నీ మోచేతికింది నీరు కాదు

రాజ్యాంగం పీల్చి వదిలే గాలులే

ఇక్కడ నా జెండాకు స్వేచ్ఛావాయువులు

  

జన్మతః నేను హిందువును

గర్వపడుతున్నా...

నన్ను చూసి నా మతమే కాదు

నా భారతీయత  గర్వపడాలి...

 

జన్మతః నేను ముసల్మానును

గర్వపడుతున్నా...

నన్ను చూసి నా మతమే కాదు

నా దేశప్రజలు  గర్వపడాలి...

  

జన్మతః నేను క్రిస్టియన్ ను

గర్వపడుతున్నా

నన్ను చూసి నా మతమే కాదు

నా  దేశ పతాకం  గర్వపడాలి...

 

జన్మతః నేను భారతీయుణ్ణి

గర్వపడుతున్నా...

నా భారతీయత ఇక

ఎవరెస్టంత ఎదగాలి...

ప్రపంచమంతటా వెలగాలి

  

భక్తి...

ఈ దేశానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ దేముడికీ మధ్య డీల్

  

కులం...

నా రాజ్యానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ సమాజానికి మధ్య డీల్

 

మతం

నా రాజ్యాంగానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ వర్గానికీ మధ్య డీల్

  

రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా

పబ్లిగ్గా...భేషుగ్గా...

ఇదే నా మతం, నా ప్రజల అభిమతం

ఇదే నా దేశం, ఇదే నా పతాకం

జన్మజన్మల బంధం

ఇదే నా భారతీయం

  

- చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 

(ఆంధ్రజ్యోతి 26.1.2022)



నా దేవుడు


నా దేవుడు

 

 

నా దేవుడికి కులం ఉంది, బలం ఉంది

గోత్రం ఉంది, శాస్త్రం ఉంది

మతం ఉంది, గతం ఉంది

ఆస్తిఉంది, అంతస్తూ ఉంది 

బ్యాంకుల్లో ఖాతా ఉంది

 

ఆటా ఉంది పాటా ఉంది

ఊరేగడానికి వెహికలుంది

ఊగడానికో ఉయ్యాలుంది

 

కుళ్లు ఉంది, కుతంత్రం ఉంది

ద్వేషం ఉంది, రాజకీయం ఉంది

ప్రాంతం ఉంది, రాష్ట్రం ఉంది

వేషం ఉంది, రిజర్వేషన్ ఉంది

 

చలి ఉంది, గిలి ఉంది

కామం ఉంది,  కోరిక ఉంది

జెండా ఉంది, జెండర్ ఉంది

 

అందుకే వీడు నా దేవుడయ్యాడు

నేను తినేదే వాడు తింటాడు

డబ్బయినా, గడ్డయినా

ప్యూర్ వెజ్జయినా, నాన్వెజ్జయినా

 

ఇవేవీ లేనివాడు

దేవుడెట్లయితడు

అందుకే వాడు నా ఇష్టదైవం

నా కుల దైవం, నా గుల దైవం

 

 

-   చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

…………….

మంచిగంధం మొగ్గలు

మంచిగంధం మొగ్గలు


 

తాతల కాలంలో...

 

అభయారణ్యపు మొక్కలం

ఆకలిదప్పులు మరిచి ఆటలతో అలరారిన

అడవమ్మ కొమ్మలచాటు జింకలం

పొలాలు, నదులు, కొండలు, గుట్టలపై

అలుపెరుగక ఎగిరిన పక్షులం

 


తండ్రుల కాలంలో...

 

తోటల్లో  మొలకలం

లంకంత ఇళ్ళల్లో ఆడిన లేగదూడలం

బడులూ దడులూ ఉన్నా

దోస్తులదండుతో కలిసి

ఊళ్ళూపూళ్ళూ ఏలినవాళ్ళం

 


నడుస్తున్న కాలంలో...

 

కుండీల్లో మెరిసే పూలగుత్తులం

బాల్కనీ పంజరాన ఆడిపాడే చిలకలం

పౌల్ట్రీ పక్షులం, ఈతకొలను బాతులం

చదువుల సరోవరాల్లో

విరామమెరుగక విహరించే హంసలం

అమ్మానాన్నలు ఎగరేస్తున్న గాలిపటాలం

 

ముంగిట ముగ్గులం

ముడుచుకుపోతున్న సిగ్గులం

వికసించని మొగ్గలం

 

ఆకాశమార్గాన తిరుగాడే గంధర్వులం

ఇంటర్ నెట్లో... సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న

విశ్వామిత్ర వారసులం


కుండల్లో గుర్రాలు తోలగలం

అన్ని చిక్కుముళ్ళనూ ఆన్ లైన్లో విప్పగలం  

 

ఆఫ్ లైన్ బతుకంటే అలర్జీ ఉన్నా

ఆన్ లైన్లో దానవీరశూర కర్ణులం

సకలకళా వల్లభులం

 

వైఫైతో కాపురం చేస్తూ

సంసార నౌకను నడిపే 

రోబో నావికులం

 

గడపదాటకుండా

కాలు కదపకుండా 

మునివేళ్ళ స్పర్శతోనే

ముల్లోకాలను నియంత్రిస్తున్న

విరాట్ స్వరూపులం 

 

విద్యాలక్ష్మి బిడ్డలం

అంతర్జాలాన మెరిసే హరివిల్లులం

విరిసీ విరియని సిగ్గులం 

మంచిగంధం వెదజల్లే మొగ్గలం

 

        - చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...