మంచి పుస్తకాలన్నీ మీ ముంగిట్లోనే.......
రోజురోజుకూ తెలుగు వెలుగులు తగ్గిపోతున్నాయని
బాధపడేవారికి, మన తెలుగును మన స్థాయిలోనే దేదీప్యమానంగా వెలిగించడానికి కొన్ని
చిట్కాలు.....అలాగే ఇష్టపడి కొనుక్కున్న, సేకరించుకున్న పుస్తకాలను ఇంట్లో ఎక్కువ
కాలం ఉంచుకోలేక, ఉచితంగా ఇచ్చినా ఎవరూ
తీసుకోకపోవడంతో చూస్తూ చూస్తూ రద్దీకింద అమ్మలేక క్షోభపడుతున్న పుస్తక ప్రియులకు
పనికొచ్చే ఆచరణయోగ్యమైన చిట్కాలు.....
ప్రస్తుతం ఎక్కువమంది ఫ్లాట్లల్లో ఉంటున్నారు కాబట్టి.... స్థలం సమస్య కూడా వారికే ఎక్కువ కాబట్టి వారు ఈ విధంగా చేయవచ్చు.....(ఇప్పటికే కొన్ని అపార్ట్ మెంట్లలో ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అయితే అవి నామమాత్రంగానే ఉంటున్నాయి.... తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోని అద్భుతమైన క్లాసిక్స్ కు చోటు కల్పించడం లేదు).
పిల్లల పార్కు, జిమ్ము, స్విమ్మింగ్ పూల్, క్లబ్బులు ఎంత ముఖ్యమో ఇది కూడా అంతేనని భావించండి... కొత్తగా ఫ్లాట్ కొనేటప్పుడు దీని కోసం డిమాండ్ చేయండి.
ర్యాక్ లను ఫ్లాట్
ఓనర్లనుండి విరాళంగా తీసుకోండి... వారి పేర్లతో గుర్తింపుగా...
కాలనీ పార్కులు,
బస్తీ దవాఖానాల్లాగే ఇవి కూడా........
హైదరాబాదులో నివాస ప్రాంతాల్లో ఉన్న పార్కులను నిత్యనూతనంగా ఉంచడానికి కార్పొరేషన్ వారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యుచ్ఛక్తి, నీరు, మొక్కలవంటివి ఉచితంగా ఇచ్చి... వాచ్ మెన్ జీతం తదితర ఖర్చులకోసం పార్కు సైజును బట్టి నిర్ణీత మొత్తాన్ని ప్రతినెలా ...అక్కడి సంక్షేమం సంఘాలకు చెల్లించే ఏర్పాటు చేసారు. ఇది ఉభయతారకంగా ఉండడంతో సంఘాల వారు కూడ ఉత్సాహంగా వాటిని వారి అభిరుచిమేరకు సొంతంగా విరాళాలు కూడా జోడించి అభివృద్ది చేస్తున్నారు... ప్రతి పార్కుకు అనుబంధంగా లేదా సమీపంలో ఈ పద్ధతిలోనే బస్తీ గ్రంథాలయాల ఏర్పాటుకు, అభివృద్దికి ఎందుకు ప్రయత్నించకూడదు... లేదా ఇప్పటికే ఉన్న రీడింగ్ రూములను మినీ గ్రంథాలయాలకింద అభివృద్ది చేసే పనిని కాలనీ సంఘాలకు ప్రభుత్వం/పుర/నగర పాలక సంఘాలు అప్పగించవచ్చు.
వినాయక చవితి, దసరా ఉత్సవాలను కాలనీల్లో సంఘాలుగా ఏర్పడి విరాళాలు సేకరించి నిర్వహిస్తున్నప్పుడు, భక్తులతో భజనబృందాలు, లలితా సహస్రనామ కీర్తన బృందాలవంటివి సునాయాసంగా లెక్కకు మించి విస్తరిస్తూ పోతున్నప్పుడు.... ఇటువంటి గ్రంథాలయాల ఏర్పాట్లకు పుస్తక ప్రియులు చొరవ తీసుకోవచ్చు..... అయితే అది ఎవ్వరికీ భారం కాకుండా ఉండి... ఉమ్మడి వనరులు, ఉమ్మడి విధులు ఉన్నప్పుడు అందరూ ముందుకు వస్తారు. కారణం.. వ్యక్తిగతంగా మనం త్యాగం చేస్తున్నది చాలా తక్కువ, ప్రయోజనాలు పొందుతున్నది మాత్రం చాలా ఎక్కువ కాబట్టి.
క్షేత్రస్థాయి కార్యాచరణ యువజన
సంఘాలకు, లైబ్రరీల నిర్వహణ పెద్దలకు(విద్యావంతులైన వృద్ధులకు ) అప్పగించాలి.
ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి
వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన పుస్తకాలు,
స్కూలు, కాలేజి అకాడమిక్స్ కు సంబంధించినవి కూడా .... వార్షిక పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులనుంచి
సేకరించి (ఫుట్ పాత్ వ్యాపారులకు అయినకాడికి అమ్ముకోకుండా)... బుక్
బ్యాంకులను ప్రతి కాలనీలో ఏర్పాటు చేయాలి... పాతవి సేకరించి పేద విద్యార్థులకు ఉచితంగా వాటిని పంపిణీ చేయాలి.
భాషమీది అభిమానంతో పుస్తకాలు ఉచితంగా ఇచ్చేవారున్నారు.. ఇస్తే పరమ ఆసక్తిగా చదివే
వారున్నారు....... మౌలిక సదుపాయాల నిర్వహణే ఇప్పుడు సమస్య.... అయితే ప్రభుత్వాలే ... అవి నిర్వర్తించాల్సిన విధులు... రోడ్లు, బ్రిడ్జిలు, ఫైఓవర్లు, చెక్ పోస్టులు,
రైల్వే స్టేషన్లవంటివాటి నిర్మాణాలను... ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నప్పుడు.... బస్తీ
గ్రంథాలయాలను, అపార్ట్ మెంట్ గ్రంథాలయాలను ఆ పద్ధతిలో ఎందుకు అభివృద్ధి చేసుకోలేం....
దీనికి కావలసింది... ఉత్సాహంగా ముందుకు అడుగేసి అందరినీ కలపడమే.. కొంత పని చేసి వెళ్ళి కలిస్తే... కాదనే కలెక్టరుంటాడా...... నిధులు కానీ, శ్రమకానీ ఏ ఒక్కరికీ భారం కాని ఏర్పాట్లు ఇవి... ప్రయోజనాలు మాత్రం అనంతం...
- గృహిణులు, ఇంటిపట్టున ఉండే వృద్ధులకు ఇవి మంచి కాలక్షేపమే కాక, అందరిలో జిజ్ఞాస కలిగించడానికి ఇతోధికంగా తోడ్పడతాయి.
- తెలుగు భాషాభివృద్ధి యజ్ఞంలో... మీరు సైతం ఒక సమిధను ధారవోసినట్టే అవుతుంది.
- అన్ని వయసులవారిలో పఠనాసక్తిని పునరుజ్జీవింప చేయవచ్చు.... ఇటువంటి ఏర్పాటు లేకపోబట్టే.... గత్యంతరం లేక కుటుంబ సభ్యులు టీవీ సీరియళ్ళకు, టీవీ సినిమాలకు, స్నేహితులతో గంటల తరబడి పనికిరాని ముచ్చట్లకు అలవాటు పడుతున్నారు.
ఇళ్ళల్లో చోటు లేదేమో కానీ, మన మనసుల్లో పుస్తకానికి చాలా చోటుంది. పెంచి పెద్ద చేసిన మన పెద్దలను... మనం జాగ్రత్తగా చూసుకుంటున్నట్లే, మన వ్యక్తిత్వాలనే కాదు, ఎందరి జీవితాలనో తీర్చి దిద్దిన పాత పుస్తకాలపట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంది. కొత్త శక్తికోసం వాటిని మధ్యమధ్యలో తిరగేస్తుండాలి. మన గురువులను మనం వెంటపెట్టుకుని జీవితాంతం తిరగలేం, కానీ ఆ స్థాయిలో మనకు మార్గదర్శనం చేయగల పుస్తకాలను మాత్రం ....ఇంట్లో కాకపోయినా అందుబాటులో ఎప్పటికీ ఉంచుకోవచ్చు కదా !
అపార్ట్ మెంట్ సంస్కృతి
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతున్న ఈ దశలో కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే చాలు.
ప్రతి నివాస సముదాయం దగ్గర ఒక అమూల్య ఖజానా మన, భావి తరాల జీవితాలను సుసంపన్నం
చేస్తూనే ఉంటుంది.
ఇదిగో..ఇంతకు మించిన సాక్ష్యం ఉందా...
ఇటువంటి ఒక గ్రంథాలయాన్ని న్యూ నల్లకుంటలో శ్రీధర్ ప్లాజా అండ్ నటరాజ్ రెసిడెన్సీ వెల్ఫేర్ కమిటీ చెందిన శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు అనే ఒక ప్రముఖ స్వచ్ఛంద సేవా కార్యకర్త విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఆయన మాటల్లోనే
తెలుసుకోవాలంటే...
·
మా లక్ష్యం... ఎక్కువగా గడప దాటని, దాటలేని
వృద్ధులకు సత్కాలక్షేపం అందిచండం, వారి అనుభూతులు అందరికీ పంచడం, పిల్లల్లో, పెద్దల్లో
పఠనాసక్తిని పెంచడం, తెలుగు సాహిత్యం
విలువను అందరూ గుర్తించి, దానిని సమాదరించేటట్లు చేయడం..
·
ప్రస్తుతం
మా బ్యాంక్ బ్యాలెన్స్ : 2500 మంచి
పుస్తకాలు.. వీటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, సాంఘిక నవలలు, రాజకీయ, సామాజిక ఉద్యమాలపై
వచ్చిన రచనలు, విశ్లేషణలు, ప్రముఖ , వర్ధమాన కవులు, రచయితల పద్య-వచన కవితలు, కథా
సంకలనాలు, చరిత్ర, బాల సాహిత్యం, దిన, మాస పత్రికలు ముఖ్యంగా పిల్లల పత్రికలు ఉన్నాయి. మా గ్రంథాలయం కేవలం మా అపార్ట్ మెంట్ వాసులకే పరిమితం. ఉదయం
11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇక్కడ కూర్చుని చదువుకోవచ్చు లేదా పుస్తకాలు తగిన
అనుమతితో తీసుకెళ్లి చదువుకోవచ్చు. సేవలు పూర్తిగా ఉచితం.
....
తెలుగు తాజా స్థితి కోసం...వాట్సాప్ లో తిరుగుతున్న ఈ పోస్టులను చూడండి....
సాహిత్య అభిమాని ఒకరు తన దుకాణం వద్ద ఇలా బోర్డు పెట్టారు.
కొంచం కూడా ఆంగ్లం వాడకుండా వస్తువులు కొంటే 30శాతం రాయితీ ఇస్తాను.
వ్యక్తి... సూక్ష్మాతి సూక్ష్మ విషాణు రాక పోక నియంత్రణ ముఖోష్ట నాసికాది రక్షణార్ధం కర్ణ ధ్వయ సమర్థిత ద్వివస్త్రం ఇవ్వండి అన్నాడు.
యజమాని... బాబు 50 శాతం రాయితీ ఇస్తాను, ఆంగ్లంలోనే చెప్పండి.
మాస్క్ ఇవ్వండి అన్నాడు
.....................................
శ,ష,స అనే అక్షరాలు ఎక్కడ పలకాలో తెలియని కొందరు యాంకర్లు దీనిని గమనిస్తారని ఆశ.
యద్యపి బహునాధీషే
తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |
స్వజనః శ్వజనో మా భూత్
సకలం శకలం సకృత్ శకృత్ ||
భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా ఫర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలము) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.
వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోలేరు. ఉచ్చరణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.
......
ఈ పరిస్థితిని నివారించాలంటే... మనమూ ఒక అడుగు ముందుకు వెయ్యాలి.
బాగుంది సర్! నేను హుడా కాంప్లెక్స్ లో ప్లాట్ నంబర్ 10 లో వున్నప్పుడు ఈ పని చేశాము. దాదాపు 28 ఏళ్ల క్రితం. ఇటీవల మళ్లీ పుస్తకాలు పెరిగిపోయి మా అబ్బాయిని కూచోబెట్టి "ఇవాళ కాకపోతే, రేపైనా వీటిలో నువ్వు చదివే పుస్తకాలు ఎంపిక చేయి" అని చెబితే కొన్ని ఎంపిక చేసుకున్నాడు. వాటిని, నాకు పరిపూర్ణంగా అవసరం అయినవి వుంచి, మిగిలినవి మా మిత్రుడు కోవెల సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న "స్వాధ్యాయ" పరిశోధనా గ్రంథాలయానికి అందించాను.
రిప్లయితొలగించండిథాంక్యూ.... మీ లాగానే చాలా మంది చెబుతున్నారు వారి వారి అనుభవాలు... వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థీకృతం అయిన ఏ ఏర్పాటయినా పదిమందికీ పనికొస్తుంది... ఆచార్య డా. ఎన్.గోపీ గారయితే...ఏకంగా విద్యార్థులకోసం ఉచితంగా అధ్యయనం చేసుకోవడానికి వీలుగా ఒక పరిశోధనా గ్రంథాలయాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు... తుది దశలో ఉందని చెప్పారు... A beginning should be made somewhere…
తొలగించండిఅందరికీ నమస్కారములు 🙏🙏
రిప్లయితొలగించండిచాలా మంచి ప్రయత్నం.
ఇది అందరిలో స్ఫూర్తిని కలిగించాలని కోరుతున్నాను. శ్రీలక్ష్మి చివుకుల
థాంక్యూ లక్ష్మిగారు...ఇటువంటి కార్యక్రమాల్లో మీరు బాగా చురుగ్గా ఉంటారు కదా.... మీ పరిధిలో మీరు ప్రయత్నించవచ్చు....
తొలగించండిచాలా ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టారు.
రిప్లయితొలగించండిశుభాభినందనలు 💐 🙏🏻
థాంక్సండీ...మంచి పుస్తకం ఫుట్ పాత్ మీద అమ్మకానికి ఉంటే... సర్లే ఎవరో ఒక యోగ్యుడి/యోగ్యురాలి చేతికి చేరకుండా ఉంటుందా అన్న ఆశ ఉండేది... రానురాను నేరుగా అవి రద్దీకి(చెత్త ఫ్యాక్టరీలకు) పొతున్నాయి... వేదాల నుంచి మొదలు పెడితే...ఇప్పటి వరకు మన శ్రద్ధలో లోపం కారణంగా ఎంతో అమూల్యమైన సాహిత్యాన్ని కోల్పోయాం.. మిగిలిన కొద్దిగా కూడా పోతే...??? అదే బాధ... చిన్న చిన్న సర్దుబాట్లతో మనం వీటిని చక్కదిద్దవచ్చు... కావల్సింది చిరు ప్రయత్నం...
తొలగించండి