తెలుగు-3
‘అమ్మ ఎలా ఉంది’.. అని అడిగితే మీరేం చెబుతారు ? ‘‘బాగుంది..ఫరవాలేదు’’ అంటారు. ‘ఆనందంగా, ఉత్సాహంగా ఉందా’’ అని అడిగితే... సంతోషంగానే ఉంది. ఏ సమస్యా లేదు.. అంటారు.
మనం రోజూ చూస్తూనే ఉంటాం కాబట్టి మనకు తేడా పెద్దగా కనిపించదు. చాలా కాలం తరువాత మన మేనమామ ఇంటికి వస్తాడు. అమ్మను చూసి ‘ఏమిటిలా చిక్కిపోయావు.. ఒంట్లో బాగానే ఉంది కదా ?’’ అని ఆరా తీస్తాడు. కొంత కాలం తరువాత అమ్మమ్మ తన కూతురును చూసిపోదామని వచ్చినప్పుడు... ‘‘చెప్పమ్మా ! ఏం సమస్యలు లేవు కదా ! నా దగ్గర దాచొద్దు..చెప్పుతల్లీ’’ అని చాటుగా గొంతు తగ్గించి అడుగుతుంది. మనకు కనిపించని తేడా వారికి కనిపించింది.
ప్రతి క్షణం కొత్తగా ప్రవహిస్తుండే మన నెత్తురు కూడా మనలోనే ఉంటుంది. కంటికయితే కనిపించదు. తేడా ఉన్నా తెలియదు.
అమ్మభాష
‘అమ్మభాష’ పరిస్థితి కూడా
అంతే. దానికి ఏమవుతున్నదీ మనకు తెలియదు. బాగానే ఉంది కదా తెలుగు భాష.. ఏమిటీ రచ్చ ... అనుకుంటాం. మేనమామకులాగానే... తెలుగు
ఉపాధ్యాయుడికి కూడా... భాష కళ తప్పుతున్న లక్షణాలు కొంతమేర కనిపిస్తాయి. కన్నపేగు కాబట్టి అమ్మమ్మకులాగా
తెలుగు భాషా శాస్త్రవేత్తకు మాత్రం పరిస్థితి పూర్తిగా బోధపడడమే కాక, ఆయన
భవిష్యత్తును కూడా చూడగలుగుతాడు.
వారి దాకా ఎందుకు అనుకుంటే ... మన స్థాయిలో కూడా తెలుగు భాషా స్థితిగతులను చాలా సులభమైన పరిశీలన ద్వారా మనమే తెలుసుకోవచ్చు... ప్రధానంగా మూడు అంశాలతో –
·
తెలుగులో మాట్లాడడం
· తెలుగులో రాయడం
· తెలుగులో చదవడం
ఈ మూడింటిలో మీరు ఎంత
మెరుగ్గా ఉన్నారో మీరే అంచనా వేసుకోండి. మీకు మీరే మార్కులు వేసుకోండి. దానికి
ముందు కొన్ని కొన్ని చిన్న నియమాలు గుర్తు పెట్టుకోండి. మీ పరిశీలన వాటికి లోబడి
ఉండాలి. (ఇది జనసామాన్యానికి ఉద్దేశించినది. రచయితలు, భాషా పండితులకోసం కాదు.)
నియమం : 18
ఏళ్ళు దాటి ఉండాలి...రోజూ మన వ్యవహారంలో వాడే పరభాషా పదాలకు అభ్యంతరం లేదు. కానీ
పూర్తి పరభాషా వాక్యాలు మాత్రం ఉండకూడదు. అంటే..
మొత్తం వాక్యాలు పూర్తి తెలుగులోనే ఉండాలి. అంతే.
ఈ మూడింటిని మూడు తరగతులుగా భావించండి. ప్రతి తరగతిలో మూడు ప్రశ్నలుంటాయి.
ప్రతి తరగతికి 100 మార్కులుంటాయి. కనీస
ఉత్తీర్ణత -35 మార్కులు/100కు...ప్రశ్నలకు జవాబులు రాయాల్సిన పనిలేదు. మీ
సామర్ధ్యాన్ని అంచనా వేసుకుని దానికి మీకు మీరే నిజాయితీగా మార్కులు వేసుకోండి.
అంతే....
1. తెలుగులో మాట్లాడడం : (మొత్తం 100 మార్కులకు)
·
రోజువారీ వ్యవహారాల్లో మీరు పూర్తి తెలుగులోనే
ఎంత వరకు మాట్లాడగలుగుతున్నారు ? (30 మార్కుల ప్రశ్న ఇది..దీనికి మీరెన్ని
మార్కులు వేసుకుంటారో వేసుకోండి)
·
నలుగురు కొత్త వాళ్ళతో లేదా సభలో మాట్లాడవలసి
వేస్తే మీరు పూర్తిగా తెలుగులోనే ఎంతవరకు
మాట్లాడగలరు ? (30 మార్కుల ప్రశ్న ఇది..ఎన్ని మార్కులు వేసుకుంటారు )
· నలుగురు కొత్త వాళ్ళతో లేదా సభలో ఒక విషయంపై
వాదించవలసి వస్తే మీరు పూర్తిగా తెలుగులో ఎంతవరకు వాదించగలరు ? (60 మార్కుల ప్రశ్న ఇది.. ఎన్ని మార్కులు
వేసుకుంటారు )
2. తెలుగులో రాయడం : (మొత్తం 100 మార్కులకు)
·
అమ్మానాన్నలకు, స్నేహితులకు ఉత్తరాలు పూర్తిగా
తెలుగులో రాయవలసి వస్తే ఎంతవరకు రాయగలరు ? (30 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )
·
పై అధికారులకు, యజమానులకు పూర్తి తెలుగులో ఒక
లేఖ రాయవలసి వస్తే ఎంతవరకు రాయగలరు ? (30 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు
వేసుకుంటారు )
·
ఒక పత్రికకు లేదా ఒక రచనల పోటీలో పాల్గొనాలంటే
పూర్తి తెలుగులో మీ రచనా సామర్ధ్యం ఎంత ?
(60 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )
3. తెలుగులో చదవడం : (మొత్తం 100 మార్కులకు)
·
తెలుగు దినపత్రికను మనసులో కాకుండా పైకి
ఎటువంటి తడబాటు లేకుండా ఉన్నది ఉన్నట్లు చదవడంలో మీ సామర్ధ్యం ఎంత ? (30 మార్కుల
ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )
·
వేమన శతకం, సుమతీ శతకం వంటి శతకాల్లో కొన్ని
కొత్త పద్యాలను (మీకు నోటికి వచ్చినవి గాక మిగిలినవి) ఉన్నది ఉన్నట్లు భావయుక్తంగా సాఫీగా పైకి చదివి అర్థం చెప్పడంలో
మీ సామర్ధ్యం ఎంత ? (30 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )
·
పూర్తి తెలుగులో పద్యాలతో సహా ఉన్న భారత
భాగవతాదులకు సంబంధించిన (టీకా తాత్పర్యాలు లేని) ఒక పుస్తకం తీసుకొని ధారాళంగా చదువుతూ వాటికి అర్థం చెప్పడంలో మీ సామర్ధ్యం
ఎంత ? (60 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు
వేసుకుంటారు )
మీకు మీరుగా మార్కులు వేసుకున్న తరువాత ఈ కింది
ప్రశ్నకు జవాబివ్వండి....
మొదటి తరగతి వదిలేయండి. రెండు మూడు తరగతుల్లో మీ మార్కులు కనీస
ఉత్తీర్ణత స్థాయి దాటాయా ?
తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం జనాభాలో లేదా కనీసం మీ బంధుమిత్ర పరివారంలో పైన తెలిపిన వాటిలో రెండవ, మూడవ తరగతుల్లో ఎంత (%) మంది కనీస ఉత్తీర్ణత సాధించగలరని మీరు అనుకుంటున్నారు ? అంచనా వేయండి....
ఒకవేళ మీ అంచనాలు తక్కువగా ఉంటే... మీరేమీ నిరాశపడకండి. చాలా భాషల్లో పరిస్థితి దాదాపు మీ లెక్కలకు సరిపోతుంది. నిజానికి ఈ భాషలు రోజురోజుకూ బక్కచిక్కుతుంటాయి... వీటికి భిన్నంగా బాగా వెలిగిపోతున్న కొన్ని భాషలుంటాయి. అవి మిగతా వత్తులను ఆర్పేసుకుంటూ, ఉన్న చమురును మొత్తం పీల్చుకుంటూ కాంతులు విరజిమ్ముతుంటాయి. ఒక భాష ... కేవలం మాట్లాడుకునే భాషగా మిగిలిపోకూడదు...నాలుగుకాలాలపాటూ పచ్చగా మనుగడ సాగించాలంటే.. ..అధిక సంఖ్యాకులు చదవడం, రాయడంలో కూడా చురుగ్గా ఉండాలి. అంటే తెలుగు సాహిత్యం పుష్ఠి గా ఉండాలి. ఏ రోజుకారోజు సాహిత్యం కొత్త రక్తాన్ని ఎక్కించుకుంటూ ఉండాలి.
ఇప్పుడు మన తెలుగుకు మనం ఇస్తున్న ఆదరణ ఎంతో మీ అంచనాలకు అందింది కదా ! ఎందుకిలా...?
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఐశ్వర్యం నేలమాళిగల్లో మూలుగుతున్నది కదా. బయట మనకు అందుబాటులో లేని, అక్కరకు రాని, మనకు ఉపయోగపడని ఐశ్వర్యం ఎంతుంటే ఏమిటి.... గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక స్థితే చివరగా మనకు లెక్కలోకి వస్తుంది. ఔనా !!!
అలాగే.... వెయ్యేళ్ళ క్రితం ఉన్నట్లు, మూడు
వందల ఏళ్ల క్రితం ఉన్నట్లు, 70 ఏళ్ళ క్రితం ఉన్నట్లు తెలుగు భాష ఇప్పుడు
లేదు...అన్నది వాస్తవం. అయితే అప్పటిది కూడా మన భాషే. మన ఐశ్వర్యమే. పోతన మన తాతే. ఆయన వాడిన తెలుగు
అంతా మొత్తంగా మనదే. ఆ తాతకు ముందు తరువాత...చాలా మంది తాతలు వారు కూర్చి పేర్చిన ఐశ్వర్యాన్ని మనకు ఇస్తూ...వాటి మీద అన్ని వారసత్వ హక్కులు కూడా
ఇచ్చేసారు....దాన్ని అనుభవించే హక్కు కానీ, అభివృద్ధి చేసే హక్కుకానీ, ధ్వంసం చేసే
హక్కు కానీ ...అన్నీ మనవే..
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది...తాతలు నగిషీలు చెక్కి అందమైన ఆభరణాలుగా చేసి నేలమాళిగల్లో దాచిన సాహితీ సంపదను మనం ఏం చేస్తున్నాం...కాపాడుతున్నామా ?అభివృద్ధి చేస్తున్నామా?నాశనం చేస్తున్నామా ? ...అన్నది .
మనం చేసిన, చేస్తున్న తప్పు తెలుసుకుంటే చాలు...ప్రస్తుతానికి.....
శ్రద్ధ చూపకపోతే- రాజుల సొమ్ము రాళ్లపాలు, దేవుళ్ల సొమ్ము నేలమాళిగల పాలు లేదా కబ్జాదారులు, అక్రమార్కుల పాలవుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. అయినా మన తాతలు ఇచ్చిన భాషాసంపదకు చెదలు పడుతుంటే మనం కళ్ళప్పగించి చూస్తున్నాం.
మన అమ్మ చిక్కిపోవడానికి... తాతల ఆస్తి ఎక్కడో
మూలుగుతూ ఉండడం కారణం కాకూడదు. మన తెలుగు
భాష చిక్కిపోవడానికి, కళ తప్పడానికి కారణం- ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృతం, హిందీ,
తమిళం... వంటి భాషలు ప్రధాన కారణం కానే కాదు. మన దగ్గర ఎంత భాషా సంపద ఉన్నదో మనం
గుర్తించకపోవడం... మన భోషాణం పెట్టెను మనం
తెరవకపోవడం... దుమ్మ దులిపి వాడుకలోకి తెచ్చుకోకపోవడమే అసలు కారణం... అంతే...
దీనికి కావలసింది మనందరి సంకల్పం...
తెలుగువారిగా మనకు శ్రద్ద ఉండాలేకానీ..
ఫుట్ పాత్ లపై దొరికే పాత పుస్తకాలు చాలవా.. మన తెలుగును వెలిగించడానికి....
తెలుగు భాషకు సంబంధించిన బ్యాంకులో పదాల బ్యాలెన్సును పెంచుకుంటూ పోవడానికి....
-
చినవ్యాసుడు, మాఊరు
(తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలి, ఎలా సుసంపన్నం
చేసుకోవాలి...అన్న విషయంపై మరిన్ని ఆచరణాత్మక సలహాలు..త్వరలో ...)
అలాగే మీరు కూడా మీ అభిప్రాయాలను, మీ సూచనలను, ఇదే బ్లాగులో వ్యాఖ్యల దగ్గర తెలియపరిస్తే... భాషాభిమానుల, సాహిత్యాభిమానుల స్పందన అంతా ఒక్కచోటే చూసుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. మీ వ్యాఖ్యతోపాటూ (అభ్యంతరం లేకపోతే) మీ ఇ-మెయిల్, ఫోన్ నంబరు జత చేయవచ్చు
తెలుగు భాషాభిమానులు అందరికీ షేర్ చేయండి, వీలయినంత ఎక్కువ మంది ఈ చర్చలో పాల్గొనేటట్లు చూడండి.
నిజమే. నేల మాళిగలోని మణి మాణిక్యాల గురించి చెప్పుకొని మురిసి పోతే జీవనయానానికి కావలసిన జవసతాత్వలు రావు. అనుభవించి, ఆస్వాదించాలి. మాతృభాష లో మాటలు మనసులో కి వెళ్తాయి
రిప్లయితొలగించండిరాజేంద్ర ప్రసాద్ గారూ...‘మాతృభాషలో మాటలు మనసులోకి వెళ్తాయి’..అన్న మాటలు అక్షర సత్యం. అమ్మ-అమ్మభాష-మనసు పర్యాయపదాలేమో !
తొలగించండిగ్రాంధికం లేదా జానపదం / వ్యావహారికం ఏదైనా కానివ్వండి. తెలుగు చక్కగా మాట్లాడండి. సామాజిక మాధ్యమాల్లో కూడా తెలుగును వినియోగించేందకు ప్రయత్నించండి. శ్రీశ్రీ కవిత్వం చదవండి. తిలక్ సాహిత్యాన్ని సృజించండి.వేమనను వల్లేవేయండి. మరల మన తెలుగు వైభవాన్ని అంతర్జాతీయంగా చాటుదాం.
రిప్లయితొలగించండిరెడ్డిగారూ...మీ సూచనను ప్రతివ్యక్తీ, ప్రతి కుటుంబం అనుసరించాలని కోరుకుందాం. దానికి మార్గాన్ని సుగమం చేయాల్సిన పని మాత్రం ఎక్కువగా సమాజం మీద, వ్యవస్థల మీద ఉంది. వ్యక్తిగతంగా కూడా ఆ ఆకాంక్ష బలపడాలి.. కానీ అలా బలపడాలంటే పరిసరాలు దానికి బలం చేకూర్చాల్సి ఉంటుంది.
తొలగించండి