తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !


 

తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

 

తెలుగును బతికించుకుందాం’.. ‘మన తెలుగును కాపాడుకుందాం’... అంటూ అత్యున్నత పదవులలోని, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల నుండి సాధారణ తెలుగు అభిమాని వరకు చేస్తున్న ప్రకటనలను దశాబ్దాలుగా విసుగూ విరామం లేకుండా వింటునే ఉన్నాం. రెండో చెవినుండి క్షణం ఆలస్యం చేయకుండా వదిలేస్తూనూ ఉన్నాం. పనిలో పనిగా టైం దొరికినప్పుడు  ప్రభుత్వాలను చెరిగేస్తున్నాం, నిప్పులతో కడిగేస్తున్నాం. భాషాభిమానం ఉండి మాతృదేశానికి దూరంగా బతుకుతున్నవారు...ఆర్థికంగా కాస్తంత నిలదొక్కుకున్న తరువాత తమ పిల్లలకు తెలుగు-పేగుబంధం తెగిపోతున్నదన్న ఆవేదనతో నిజాయితీగా వారి స్థాయిలో వారు మాత్రం ఉడతా భక్తి ప్రదర్శిస్తున్నారు, మాటలలో కాదు చేతలలో.

 

 

ఆ ఉడత ఊపులు ఇక్కడ పాతుకుపోయిన వృక్షాల కొమ్మలనే కాదు, రెమ్మలను కూడా ఏ మాత్రం కదిలించలేకపోతున్నాయి.  అంతటితో ఆ మాన్లు సరిపెట్టుకుంటే సంతోషమే. ఏ రెండు రెమ్మలు కలిసినా నీ తెలుగు వేరు, నా తెలుగు వేరు... నీ జిల్లా వేరు, నా జిల్లా వేరు...నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు...నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు... అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఎక్కడిదాకా తీసుకెళ్ళాయంటే...నీ తల్లి వేరు, నా తల్లి వేరు... ... ఇంతగా తల్లివేరుకు తెగులు ముదిరిన తరువాత, తెలుగు వృక్ష ఆత్మ క్షోభించకుండా ఉంటుందా ? సజీవ సమాధికి సిద్దం కాకుండా ఉంటుందా ?

 

 

అసలు సిసలు ఉద్యమకారుడయిన ఓ మహానుభావుడి నోటినుండి అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా (ఓరీ తెలుగువాడా..అని అంతే తప్ప ఆంధ్రోడు కాదు) చావవెందుకురా...అన్న పదాలు ఊడిపడినా... ‘‘ఆంధ్ర’’ పదం మాత్రం ఉద్యమ సేనలకు, సేనానులకు అంటరానిది అయిపోయింది, ఓ పచ్చి బూతయిపోయింది. పోతన మా వాడేఅని చంకలో ఇరికించుకున్నప్పటి సంబంరం... ఆయన రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతంతాలూకు ప్రస్తావనల్లో కూడా ఆంధ్రశబ్దాన్ని పలకడంలో మాయమయి పైగా అపచారంగా భావిస్తున్నారు. ఉచ్చరిస్తే నోటిని ఫినాయిలు వేసి కడుక్కోవాలన్నంత స్థాయిలో దూరం పెట్టేస్తున్నారు.

 

 

ఒక మతం వారికి తీన్ తేరా ఆఠ్ అఠారా (3,13,8,18 అంకెలు) నిషిద్ధాలు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండుఅంకె పాపం చేసుకుంది. ఆ రెండుపత్రికలు, రెండుజిల్లాలు, రెండువేళ్ళు...కనకూడనివి, వినకూడనివి. ముఖ్యంగా   రెండు జిల్లాల భాషనుఅందరూ మోయడమేమిటి ? అని రాగాలు తీసేవాళ్లు, ఇప్పుడు తమ ప్రాంత తెలుగే అచ్చ తెలుగు..అని మురిసిపోతూ... వారికి కూడా తెలియకుండానే వారి ప్రాబల్యం ఉన్న  రెండు జిల్లాల తెలుగుకే చీరెసారె పెట్టి  తన్మయత్వంతో మెలికలు తిరిగి పోతున్నారు. ఇక మీదట రెండు రాష్ట్రాలవారు- వారికున్న 46 జిల్లాల్లో...జిల్లాకో, పట్టణానికో ఒక దుకాణం తెరిచి ఎవడి తల్లి వాడిదే,  ఎవడి నాలుక వాడిదే, ఎవడి భాష వాడిదే, ఎవడి సంస్కృతి వాడిదే .... అని మొగసాలకెక్కే రోజులు ఎక్కువ దూరంలో లేవనిపిస్తుంది.

 

 

రెండు రాష్ట్రాలుగా విడిపోయింది భౌగోళికంగా, రాజకీయంగానే... అని ఒకవంక అవసరార్థం ప్రకటిస్తూనే..  భాష, కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కూడా విడిపోవలసిందేనని మరోవంక అడ్డ గీతలు, హద్దు గీతలు గీస్తున్నంత కాలం.. తెలుగు భాష ఇంకా చిక్కి శల్యమయిపోయి గోదాట్లో కొట్టుకుపోయి... చివరగా బంగాళాఖాతంలో కలిసిపోకుండా ఉంటుందా..?.

 

 

అలా కాకూడదు అనుకుంటే...

 

మొట్టమొదటగా ఒప్పుకోవలసింది...  కాపురాలు వేరయినా... మనం ఒకే ఒక భాషామతల్లి బిడ్డలం-అని. ఆంధ్రశబ్దాన్ని అపశబ్దజాబితానుంచి తొలగించాలి-అని. 46 జిల్లాల్లోని  ప్రతి మాండలికానికి ఇతర మాండలికాల వారు పెద్దపీట వేసి గౌరవించాలి-అని.

 

 

అందరం విధిగా గుర్తుంచుకోవలసిన అంశం భాషా ప్రయుక్త రాష్ట్రాలు: భాషల పేరుతో దేశంలో రాష్ట్రాల ఏర్పాటు జరగక ముందు భాషల మనుగడ ఎలా ఉండేదో తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి.

 

మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే......

 

తెలుగు మాట్లాడేవారితో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రం ఏర్పడక పూర్వం తెలుగు భాష పరిస్థితి ఏమిటి ? – ఏర్పడిన తరువాత  తెలుగు భాష పరిస్థితి ఏమిటి ?  అభివృద్ది చెందిందా !!! దిగజారిందా !!! ... అంటే.. ఒకే భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కట్టెలెగదోసి దేశమంతా చిచ్చును విజయవంతంగా రగిలించిన తెలుగు వాడు ...తీరా తెలుగు రాష్ట్రం ఏర్పడిన తరువాత ...భాషాపరంగా తెలుగుకు చేసిన మేలు ఏమిటి ? తవ్వి నెత్తికెత్తిందేమిటి ? కొత్తగా మొలిపించిన కొమ్ములేమిటి ?

 

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

  

మీకు నచ్చితే తెలుగు వీరాభిమానులకు షేర్ చేయండి....కలిసి బతికించడం కష్టమని అందరం తీర్మానిస్తే , కలిసి చంపేద్దాం  తేలిగ్గా.....నొప్పి తెలియకుండా......అదీ త్వరగా....ఇంకా నానబెట్టకుండా.....



6 కామెంట్‌లు:

  1. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని 2 గ చెల్చి యాసకూడ మార్చుకున్నారు. మరీ ఓట్లు వస్తె పంటితో ముండ్లు theesta mantaaru, ఓట్లైపోయినంక వాడెవడు వీడేవడు కు వస్తుంది... కలికాలం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజకీయ నాయకుల శైలి జగమెరిగిన సత్యం....కానీ సామాన్య జనం, సాహితీవేత్తలు కూడా అదే శైలిలో ఉంటే ఎలా.....

      తొలగించండి
  2. నమస్కారమండీ 🙏🏻
    తెలుగు భాష కు సంబంధించినంతవరకు రాజకీయాలు,
    లేదా ప్రాంతాలో కులంలో భాషమీద పెత్తనం చేస్తున్నంత కాలం తెలుగు భాష బ్రతుకు గాలి లో దీపం లానే ఉంటుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యస్...మౌలికంగా జనంలో మార్పు రావాలి. మన భాషను మనం కాపాడుకోవాలి...అని ... పైపై ప్రకటనలతో సరిపోదు... ప్రజలలో ఈ అభిమానం ప్రబలంగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులే కాదు..ప్రతి ఒక్కరూ అదే బాటలో నడవక తప్పని పరిస్థితి....తమిళనాడే పెద్ద ఉదాహరణ...

      తొలగించండి
  3. పెద్దలందరికి నమస్సులు.
    తెలుగు భాష ఎల్లకాలం నవనవోన్మేషంగా విరాజిల్లుతుంది.చిన్న చిన్న ఆటంకాలు,ఇబ్బందులున్నప్పటికీ భాష తెలుగు వారున్నంతకాలం ఆనందంగా జీవిస్తుంది. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న భాష తెలుగు భాష.
    నాయక రాజుల యుగంలో తంజావూరు వెళ్ళి , సంతోషంగా ఉండి మళ్ళీ ఆనందంగా తిరిగి వచ్చింది.
    కాలం మారినా అప్పుడప్పుడూ భాషకి కూడా చెడు కాలం దాపురిస్తుందేమో! ఏలిన నాటి శని వంటిది. మంచికాలం వస్తుంది . ఎవరి బాధ్యత వారు నెరవేర్చండి.
    ఇప్పటికే కొంతమంది సహృదయుల మనస్సులలో ఆలోచనలు కార్యసాధనకు పరుగులు తీస్తున్నాయి.కవులు, రచయితలు,వ్యాఖ్యాతలు మీ సాధన మీరు నెరవేర్చండని మీకు చెప్పేటంతటివాన్ని కాను. జయం మీకు అనుకూలం, శుభం మీ చిరునామా....జయం జయం తెలుగు భాష జయం... ఖండాపు మన్మథరావు, విజయవాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్మథరావుగారూ ! నమస్తే...మీ ‘పాజిటివ్ థింకింగ్’ దృక్పథానికి నమస్సులు. నూటికి నూరు శాతం మీరు కోరుకున్నట్లు నిస్సందేహంగా అంతిమ విజయం తెలుగు భాషదే... అయినా ఇంటాబయటా దాదాపు 15 కోట్లమంది నోరారా మాట్లాడుకునే తెలుగుమాట ...మృత భాషల లెక్కల దరిదాపుల్లోకి రానేరాదు. అయితే...
      అందరూ పల్లకి ఎక్కితే మోసేది ఎవరు ? ప్రతి వారూ... అంటే కాస్తోకూస్తో కార్యాన్ని సాధించగల అవకాశం, అధికారం ఉన్నవారు కూడా .... ఇది బాగుపడాలి, దీనిని బతికించుకోవాలి...అని జనరంజకంగా మాట్లాడి ఊరుకోవడం ఒకరకంగా బాధయితే... రచయితలు, కవులు, పాత్రికేయులవంటి క్రియాశూలురు.. దీనిని నిత్యం నవనవోన్మేషంగా ఉంచి, కానీ ఖర్చులేకుండా కొత్తకొత్తగా ఉత్సాహ పరచగల సత్తా ఉండి కూడా...వారు కూడా భాషని అభివృద్ది పరచడంలో క్రియాశూన్యత కనపరచడం, భాషలోకి కుల, మత, ప్రాంత కుళ్ళు చొప్పిస్తూ పోతున్నందువల్ల ....ఆ బాధకొద్దీ కటువుగా రాయాల్సి వచ్చింది. ఇంటి బాధలు ఎక్కువయినప్పుడు.... ‘పోయి ఏట్లో దూకి ఛస్తా’ వంటి మాటలు కడుపు చించుకుని వచ్చేస్తాయి..అంతే తప్ప అక్కడ ఏరూ ఉండదు, చావూ ఉండదు...తెలుగు భాషాభివృద్ధికి సంబంధించి మరిన్ని ‘ఆచరణాత్మ పరిష్కారాలు’ సూచించుకుంటూ ముందుకు పోదాం..కొన్ని ఇదే వేదిక మీద త్వరలో..చూస్తూనే ఉండండి...ధన్యవాదాలు...

      తొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...