నేపథ్య గాయకుడి నేపథ్యం
(ఈ వ్యాసంలో కొంతభాగం ఆంధ్రజ్యోతిలో సెప్టెంబరు24, 2021న నవ్యలో
ప్రచురితమయింది. .. అది చూడనివారికి దానిని సమగ్రంగా అందిస్తున్నా....)
శ్రీపతి
పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబరు 25, 2020న పరమపదించారు. కాబట్టి ఆ తేదీ
ప్రకారం 25.9.21న ఆయనను యావత్ ప్రపంచం స్మరించుకున్నది. కానీ తెలుగు పంచాంగాల
ప్రకారం అధికమాసం రావడంతో ఆయన సంవత్సరీకాలను ఆయన కుమారుడు చరణ్ అక్టోబరు 12, 13,
14 తేదీల్లో చెన్నైలో నిర్వహిస్తున్నారు.
ఇదేమిటి
!!! శ్రీపతి పండితారాథ్యుల
బాలసుబ్రహ్మణ్యం అన్న పేరు వినగానే సదాచార సద్బ్రాహ్మణుడు అని స్ఫురిస్తున్నది కదా
!! మరి హైందవ సంప్రదాయ ప్రకారం దహనం జరుపకుండా ఖననమా ?...అంటే ఆయన బ్రాహ్మణేతరుడా
? హైందవేతరుడా ? ఏమో !!! ఆయనది నెల్లూరా, కోనేటమ్మ పేటా !!! ఆయన తమిళుడా,
ఆంధ్రుడా !!! ఏమో...మీకేమయినా తెలుసా
..!!!
సెప్టెంబరు27, 2020 ఆదివారం ఉదయం 9.30 గంటలకు అంత్యక్రియల
ప్రక్రియ ప్రారంభంఅయన నాటి నుంచీ ఇప్పటివరకు టీవీల్లో దీని తాలూకు ప్రసారాలు చూస్తున్న, దేశవిదేశాల్లోని భారతీయుల్లో, మరీ ముఖ్యంగా కుల స్పృహ ఎక్కువగా ఉన్న
దక్షిణాదివారిలో మొలకలెత్తిన అనుమానాలు భయంకర పిశాచాలుగా మారి సామాజిక మాధ్యమాల్లో
ఇప్పటికీ కరాళనృత్యం చేసుకుంటూ పోతున్నాయి. ‘ఎస్.పి.బి ఆరోగ్యం మరింత విషమం’ అన్న
వార్తలు వెలువడినప్పటినుండి బాలుకు సంబంధించిన పలు విషయాలు, మరీ ముఖ్యంగా ఆయన
వ్యక్తిగత, కుటుంబం తాలూకు సమాచారం..జన్మస్థలం వంటివి ఎవరికి తోచినట్టు వారు
చెప్పుకుంటూ పోతున్నారు.
సమకాలీన
చరిత్రను రాసేటప్పడు కూడా సమాచారాన్ని ధృవీకరించుకునే అవకాశం ఉన్నా అలా చేసే సమయం,
సహనం, అన్నిటికీ మించి ఆసక్తి లేకపోవడం వల్ల అంతా పైపై పూతలతోనే
అలంకరించేస్తున్నారు. దీనికి మంచి ఉదాహరణ బాలసుబ్రహ్మణ్యం తండ్రి కీ.శే.సాంబమూర్తి
జీవిత విశేషాలపై రాసిన ఒక పుస్తకం. దీని
రచన బాలసుబ్రహ్మణ్యం కనుసన్నలలోనే జరగడమే కాక ఆయన సమక్షంలోనే ఆవిష్కృతమయింది. దీనిలో కూడా సమాచారం చారానా(తక్కువ),
వ్యాఖ్యానం బారానా(ఎక్కువ)గా సాగింది. ఆ కొద్దిపాటి సమాచారం కూడా నోటిమాటలు విని
రాసిందే గానీ, మూలాలతో ధృవీకరించుకున్నది కాదు. ఆ సమాచారం ఇచ్చిన బాలుకు, ఆయన కుటుంబ
సభ్యులకు తండ్రి, తాతల కుటుంబాల నేపథ్యం (సమాచారం)ఈనాటికీ.. వారికి పూర్తిగా కానీ, అరాకొరాగా కూడా కానీ తెలియదు.
పైపైన మాత్రమే తెలుసు. అదీ కచ్చితంగా కాదు.
అందువల్ల
దారి తప్పుతున్న ఈ సమాచారాన్ని కొంతమేర గాడిలో పెట్టడం బాధ్యతగా భావించి నాకు
కచ్చితంగా తెలిసిన సమాచారాన్ని మాత్రం మీతో పంచుకుంటున్నాను.
సకలజన
‘ఆరాధ్యుడు’
జగమెరిగిన
సకలజన ‘ఆరాధ్యుడి’కి జందెంతో కానీ, ఖననం, దహనంవంటి కుల, మత సంబంధ ఆచారాలతో కానీ
పని లేదు. బాలు- కుల, మత, జాతి, భాషలకు, ప్రాంతాలకు, దేశాలకు అతీతుడైన సంగీత
విరాట్పురుషుడు. ఆయనకు తొలి దశలో కులం, శాఖ, గోత్రంవంటి పట్టింపులేమీ లేవు. కానీ
కుటుంబ, సామాజిక అవసరాలకోసం కొన్నింటిని ఆపద్ధర్మంగా ఆవాహన చేసుకున్నారు.
శ్రీపతి
పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యంది జన్మతః శ్రౌతశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబం. ఈ
సంప్రదాయంలో దహన సంస్కారం ఉండదు. ఖననం(పూడ్పు) ఉంటుంది.అలా ఎందుకో తెలుసుకోవాలంటే –
ఆ సంప్రదాయం క్లుప్తంగానయినా అవగాహన చేసుకోవడం అవసరం.
మనదేశంలో
శైవంలో కాలానుగుణంగా పాశుపతం,
కాశ్మీరశైవం, కాపాలికం, వీరశైవం వంటి పలు శాఖలు పుట్టాయి. ఆరాధ్యశైవం వీరశైవంలో ఒక
భాగం. ఇది వేదాలను, ఆగమాలను ప్రామాణికంగా భావిస్తుంది కాబట్టి ఆచారాలు వాటికి
అనుగుణంగా ఉంటాయి. (మరొక భాగం-వర్ణాశ్రమ ధర్మాలను విశ్వసించదు. దీనిని బసవణ్ణ స్థాపించి, బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు.
కులరహిత సమాజ సృష్టిలో ఈయనది విప్లవాత్మక విజయం. వీరు కూడా శివదీక్షాపరులైన
లింగధారులే. ‘పండితారాధ్య చరిత్ర’ గ్రంథకర్త 12 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి
సోమనాథుడు రాసిన తెలుగు కావ్యం ‘బసవ పురాణం’ లింగాయత్ లకు పవిత్ర గ్రంథం.)
శ్రౌతశైవాన్ని
ప్రచారంలోకి తెచ్చి స్థిరత్వం కల్పించినవారు ద్వాదశారాధ్యులు(12 మంది). వీరిలో
పండితత్రయంగా పిలవబడే ముగ్గురిలో శ్రీపతి పండితుడు ఒకరు. 11వ శతాబ్దికి చెందిన
శ్రీపతి పండితుడి తల్లిదండ్రులు మల్లికార్జునుడు, భ్రమరాంబ శ్రీశైలవాసులు. ‘‘చంద్రజ్ఞానోత్తర
ఆగమం’’ పేర్కొన్న 8 శైవ శాఖల్లో వీర శైవం ఒకటి. పూర్వ శైవం, ఉత్తర శైవంగా పిలవబడే
శ్రౌత శైవంలో ఆగమ శాస్త్రాలు, భస్మం, రుద్రాక్షలు, శివ పూజ ఉమ్మడిగా ఉన్నా...శాంభవ
దీక్ష ద్వారా లింగధారణ ఉత్తర శైవం విశిష్టత. శాంభవ దీక్ష లో – వైదిక దీక్ష,
పౌరాణిక దీక్ష అని రెండురకాలు. ద్విజులలో... అనగా ఉపనయన సంస్కారం ఉన్న కులాలు
అవలంబించేది వైదిక దీక్ష. ఇతరులు స్వీకరించే శాంభవ దీక్షను పౌరాణిక దీక్ష అంటారు.
మోక్షప్రాప్తికి
(జన్మరాహిత్యానికి) ఈ దీక్ష సులభ మార్గం. శివపూజ చేయాలంటే సాధకుడు మొదట రుద్రుడిగా
మారాలన్న భావనతో ఈ దీక్ష ద్వారా శివలింగాన్ని శరీరంలో ఒక భాగంగా చేసుకుంటారు.
గురువు ఉపదేశం చేస్తూ శివలింగాన్ని మూర్తరూపంలో శిష్యుని చేతిలో ఉంచుతాడు. ఇది ఆధ్యాత్మికతకు
క్రియాశీలతను జోడించడం. ఆ రోజు నుండి
సాధకుడి నిత్యపూజలో హస్తలింగార్చన కూడా ఒక భాగమవుతుంది. తాను స్వీకరించే
ఆహారపానీయాలన్నీ ముందుగా ప్రాణలింగానికి నివేదించి ప్రసాదంగా పుచ్చుకోవడం
అలవాటవుతుంది. ఇష్టలింగ(శరీరం), ప్రాణలింగ(సూక్ష్మ శరీరం), భావలింగ(శివైక్య
భావనతో)పూజలతో సాధకుడు చివరగా శివైక్యం చెందుతాడు. అంటే కాలధర్మం చెందినప్పుడు ఈ
సంప్రదాయంలో మరణించాడు... అనకూడదు. శివసాయుజ్యం లేక శివైక్యం చెందాడు ..అనాలి. అంతిమ
యాత్రలో పాడె స్థానంలో వెదురు కర్రలతో చేసిన గూడు లాంటి నిర్మాణం- దానిని విమానం
అంటారు. పార్థివ దేహాన్ని ధ్యానముద్రలో ఉన్నట్లుగా దానిలో కూర్చోబెట్టి
తీసుకెడతారు.(పీఠాధిపతుల అంతిమ యాత్రలో కూడా దాదాపు ఇలానే ఉంటుంది). బాలు విషయంలో
పార్థివ దేహం చాలా సేపు ఫ్రీజర్ లో ఉండడం వల్ల గట్టిగా అయిపోయి, ఇలా ధ్యానముద్రలో
కూర్చుండబెట్టడం సాధ్యపడలేదు... కనుక విమానం కట్టలేదు. ఖననం కోసం తవ్విన గుంటలో కూడా
పడుకున్నట్టు ఉన్న స్థితిలో కాకుండా... ఒక గోడకు గూడులాగా తవ్వి ధ్యానముద్రలో
కూర్చుండబెట్టి ఖననం చేయడం ఈ ప్రక్రియలో భాగం. శాంభవ దీక్ష –నాల్గవ ఆశ్రమమయిన
సన్యాసం కంటే శ్రేష్ఠమైనదని భావిస్తారు. అంత్యక్రియల అనంతరం జరిగే మాస, సంవత్సరాది
క్రతువుల్లో పిండప్రదానాలవంటివి ఉండవు. తద్దినం అనరు, ఆరాధన అంటారు. భోక్తల స్థానంలో మహేశ్వరులుంటారు. పితృదేవతలను
వారివారి స్థానాల్లో ఆవాహన చేసి మహేశ్వర పూజ/ఆరాధన (హస్తపూజ, పాదపూజ) చేస్తారు. అందువల్ల
శివలింగం శరీరంలో భాగంగా ఉంది కనుక
ఆరాధ్యులకు దహన సంప్రదాయం ఉండదు.
ఆంధ్రపత్రిక,
అమృతాంజన్ సంస్థ వ్యవస్థాపకులు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, ప్రముఖ
ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు, సినిమా రంగానికి చెందిన
ప్రముఖులు శ్రీయుతులు కాశీనాథుని విశ్వనాథ్, చంద్రమోహన్, ప్రముఖ సాహితీవేత్త
మల్లంపల్లి శరభయ్య తదితరులు ఆరాధ్యులే.
బాలు
జన్మస్థలం నెల్లూరు పట్టణమే...
బాలసుబ్రహ్మణ్యం
తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి మొదటి భార్యకు ఒక మగ, ఒక ఆడ సంతానం(వారిప్పుడు
కీర్తిశేషులు). ఆయన నెల్లూరు పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రెండవ భార్య
అయిన శకుంతలమ్మ(వీరిది ఆరాధ్య శాఖ కాదు, నియోగులు) స్వస్థలం బాదూరు
గ్రామం(చిత్తూరు). దానికి దగ్గరలోని కోనేటంపేటలో(ఒకప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో,
ఇప్పుడు తమిళనాడులో ఉంది) ఆమె కుటుంబం స్థిరపడింది. ఈమెకు తొలి సంతానం బాలు.
సంప్రదాయం ప్రకారం తొలి కాన్పు పుట్టింటి వారు చేయడం ఆనవాయితీ కనుక ఆమె అక్కడ
బాలుకి జన్మనిచ్చారు. మిగిలిన పిల్లలందరూ నెల్లూరు పట్టణంలోనే పుట్టారు.
సాంబమూర్తి స్థిర నివాసం ఏర్పరచుకున్నది నెల్లూరు కనుక బాలు స్వస్థలం ముమ్మాటికీ
నెల్లూరు పట్టణమే.
ఇకపోతే
బాలు తాత లింగమూర్తి. తండ్రి, తాతల స్వస్థలం తెనాలి దగ్గరలోని ఈమని గ్రామం. అయితే లింగమూర్తి
తరువాత కాలంలో స్థిరపడింది మాచవరం
గ్రామం(ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర). (ఈ విషయంలో కూడా స్పష్టత లేదు. తన
పర్యవేక్షణలో బాలు రాయించుకున్న పుస్తకంలో తన పూర్వీకులది మాచవరం అని
నిర్ధారించేసారు. కానీ తెనాలికి సమీపంలోని ఈమనిలో ఇప్పటికీ లింగమూర్తి ఇల్లు ఇదే
నని, సాంబమూర్తి చిన్నప్పుడు ఇక్కడే ఉన్నారని ఆ ప్రదేశాలను చూపించేవారు అక్కడ ఇప్పటికీ
ఉన్నారు. అసలు మాచవరానికే సాంబమూర్తిగారి
కుటుంబం రాకపోకలు 1960 తరువాత దాదాపుగా నిలిచిపోయాయి)
లింగమూర్తి
మొదటి భార్య సంతానం సాంబ మూర్తికాగా,
రెండవ భార్య సంతానం వేంకట శేషమ్మ. లింగమూర్తి సంతానం వీరిద్దరే. ఈమె వివాహం అదే
జిల్లాలోని ఈతముక్కల గ్రామానికి చెందిన ములుగు జ్వాలా సుబ్రహ్యణ్యంతో జరిగింది.
తరువాత కాలంలో సాంబమూర్తి నెల్లూరు పట్టణంలో స్థిరపడ్డారు.
గురు పీఠం
బాలు
తాత లింగమూర్తి గారిది... తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని గాండ్ల కులస్థులకు(గానుగల్లో
నూనె ఆడించేవారు) చెందిన గురు పీఠం. దానికి వారసుడు సాంబమూర్తి. ఆ కులంలోని వారి
మంచిచెడులన్నీ గురువుగారి కనుసన్నలలో జరిగేవి. ఉన్నత విద్యావంతులు ఉన్నా, చివరకు వివాదాలు కూడా కోర్టులకు ఎక్కేవి కావు.
గురువు తీర్పే శిరోధార్యం. శిష్యులను కలిసి రావడానికి ఒకటి, రెండు సంవత్సారాలకొకసారి
సకుటుంబంగా గురువుగారు సంచారం చేసేవారు. గురుదక్షిణలు, ఇతర వ్యవసాయాదాయమే వారి
ఆర్థిక వనరు. సాంబమూర్తి హయాంలోనే కారణాంతరాలవల్ల గురుపీఠం సక్రమంగా కొనసాగలేదు.
ఆయనతోనే ఆ గురుపీఠం ఆగిపోయినట్లు.
హరికథలు చెప్పడం సాంబమూర్తి కులవృత్తి కాదు. అది ఆయన సరదా వ్యాపకం.
(అయినప్పటికీ ఆరోజుల్లో ఆయన స్టార్ స్టేటస్ ఉన్న హరికథా భాగవతార్. ఆయన డేట్ల కోసం
చాలా ముందుగా బుక్ చేసుకోవాల్సి వచ్చేది). సామాజిక మాథ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లు ఆయన ఎక్కడా అర్చకత్వం
చేయలేదు.1960 దశకం చివరన సాంబమూర్తి ఒకరిద్దరు స్నేహితులతో కలిసి ప్రజల
భాగస్వామ్యంతో ఆరంభించిన భిక్షాటనా పూర్వక త్యాగరాజ ఆరాధనోత్సవాలు కొన్నేళ్ళపాటు అత్యంత
వైభవోపేతంగా సాగి ఆయన జీవితానికి పరిపూర్ణతను చేకూర్చాయి. ఆయనకు, నెల్లూరు
పట్టణానికి దక్షిణాది సంగీత చరిత్రలో ఒక విశిష్టస్థానాన్ని సైతం సంపాదించి
పెట్టాయి.
-చినవ్యాసుడు,
మాఊరు.
(దీనిలో
శాంభవ దీక్ష సమాచారం- ఆరాథ్య బ్రాహ్మణులకు చెందిన
శ్రీశైవ మహాపీఠం వారినుండి సేకరించినది..)
………