మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!

 


తెలుగు-7 

అపార్ట్ మెంట్ సంస్కృతి బాగా పాతుకుపోయిన తరువాత... పాత రోతవుతున్నది. అవసరానికి మించి  దేనికీ, ఎవరికీ స్థలం దొరకడం లేదు, అతిథులయినా సరే, ఆత్మీయులయినా సరే ! ఇక జ్ఞాపకాలుగా మిగిలిన పాత వస్తువుల సంగతి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఇల్లు మారాల్సి వస్తే..లారీలు, ట్రక్కులు అవసరమయ్యేవి. ఇప్పుడు యాత్రికుల్లాగా రెండు మూడు సూటుకేసులు చాలు, అదీ పిల్లాజెల్లా ఉంటే. దిగాల్సిన అపార్ట్ మెంట్ లో మనం వెళ్లేటప్పటికి అన్నీ సిద్దంగా ఉంటాయి.

దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలాగా ఉంటున్నది... ప్రస్తుత చర్చనీయాంశం తెలుగు భాష...తెలుగు పుస్తకాలు కాబట్టి... దాన్ని కదుపుదాం. చిన్నప్పటి నుండి కాస్తో కూస్తో ఇష్టంగా చదువుకున్న ప్రతివాడికీ.. బాగా నచ్చిన, బాగా మెచ్చిన పుస్తకాలు ఎప్పుడూ తోడుగా ఉండేవి, చిన్ననాటి స్నేహితుల్లాగా.  ఇవి కాలక్రమంలో సూక్ష్మ గ్రంథాలయాలుగా  కనపడేవి. ఈ మోజును గమనించిన  ఎమెస్కో ప్రచురణ కర్తలు 60 వ దశకంలో ‘ఇంటింటా గ్రంథాలయం’ అని ప్రకటనలు ఇచ్చి... కావాల్సిన పుస్తకాలు తక్కువ ధరల్లో పోస్టులో పంపేవారు. దీని ప్రోత్సాహంతో చదువుకున్న వారున్న ప్రతి ఇంటా..  ఎంత మారుమూల పల్లెయినా... పాడి ఆవులున్న కొట్టంలాగా మినీ లైబ్రరీ మెరిసిపోయేది. ఎన్ని మంచి పుస్తకాలుంటే వారికి అంత గౌరవమర్యాదలు కూడా ఉండేవి. ఈ విషయంగా రాకపోకలూ కొత్త స్నేహితాలూ, చర్చలూ.. సందడిగా ఉండేది. ఇప్పుడన్నీ ... అరచేతిలోనే ... .  ఆన్ లైన్లో అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకోలేం..తృప్తిగా చదువుకోలేం. అదేదో సినిమాలో అన్నట్లు... పుట్టేవాడికి చోటేదీ...  ఇంటి మనుషులకే చోటు గగనమయితే ...పుస్తకాల సంగతో ?

జ్ఞాన దాహానికి... ఒకప్పుడు కుండలుండి చెంబులతో నీళ్ళు తాగితే, ఇప్పుడు డ్రమ్ములు, టాంకులు, టాంకర్లు (ఇంటర్నెట్) ఉండి  కూడా ఉద్ధరిణెతో గొంతు తడుపుకోవాల్సిన దౌర్భాగ్యం. ...

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే....ఇంటింటి గ్రంథాలయాలన్నీ నిన్నమొన్నటి దాకా ఫుట్ పాత్ పుస్తకాల చెంతన ఎండావానలకు వణుకుతూ ఒదిగిపోతే... ఇప్పుడు వాళ్ళు కూడా నిర్మొహమాటంగా వద్దని మొహాన్నే చెప్పేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ పాత పేపర్ల సైకిళ్లమీదికి, ఆటోల మీదికి ఎక్కి అట్నుంచి అటు  కబేళాలకు చేరుకుంటున్నాయి. అక్కడ వాటికి మోక్ష ప్రాప్తి అయ్యే సమయానికి వాటిని  సాగనంపిన ఇంట...  మసకబారుతున్న చమురొత్తుల జ్ఞానదీపం స్థానంలో .చిటికేస్తే  చాలు ... క్షణానికో రకంగా  రంగులు చిమ్మే స్మా ర్ట్ బల్బులు  కృత్రిమ మేధతో  వచ్చేస్తున్నాయి.

ఒకప్పుడు ఇంటి పెద్ద కాలం చేస్తే... అప్పటిదాకా ఆయన ప్రాణప్రదంగా చూసుకొన్న పుస్తకాలు, వాటికోసం ముచ్చటపడి ఖర్చుకోర్చి నగిషీలతో చేయించుకున్న టేకు కలపతో కళకళలాడిన అద్దాల బీరువాలతో సహా విరాళంగా స్థానిక గ్రంథాలయాలకు చేరి కొత్త శోభ తెచ్చేవి.  అపార్ట్ మెంట్లలో నడిచే ఇప్పటి కాలేజీలకు రెండుమూడింతల సైజు భవనాల్లో కొలువుదీరిన అప్పటి స్థానిక గ్రంథాలయాలకు క్రమేళా ఈ విరాళాల భారం ఎక్కువయి ఇప్పుడు ఎరువుల గోడౌన్లలా మారిపోయాయి. ఇక వద్దు బాబోయ్..అని వారు కూడా  బోర్డులు పెట్టేస్తున్నారు.

పాతపుస్తకాలు అమ్మే ఫుట్ పాత్ వ్యాపారులకు అప్పుడు ‘ఉప్పు’ అందితే చాలు... వెతుక్కుంటూ ఇంటికొచ్చి ఇంతిస్తాం..అంతిస్తాం అని మన ఔదార్యాన్ని చౌకగా కొల్లగొట్టుకుపోయినా ...పేరున్న రచయితలను, పాత గ్రంథాలను వాటి విలువను నిరక్షరాస్యుడయినా ఇట్టే పసిగట్టి వెలకట్టడం చూసి ముచ్చటేసేది. మన చేయి జారిపోయినా మరో ముత్యపు చిప్పలో పడుతుందనే ఆశ ... బేరం కోసం పట్టుబట్టకుండా చేసేది. వాళ్ళు ఇప్పుడు ‘మీరే ఆటోలో వేసి పంపించండి.’ అని మొన్న చెప్పి...  ఇప్పుడు అదీ వద్దంటూ ‘రద్దీ’కిపంపండని ఉచిత సలహా పారేస్తున్నారు. అయితే ఫోన్ పెట్టేసే లోపల..  హలో.. హలో అని అందుకుని...‘‘సార్ ! ఇంజనీరింగ్, మెడిసిన్ పుస్తకాలుంటే మాత్రం పంపండి.. వాటికి కూడా పెద్ద రేటేమీ రాదు. ఆటో పైసలు మాత్రం మేం పెట్టుకుంటాం.... అని,  ‘వ్యక్తిత్వ వికాసం’ పుస్తకాలుంటే పోయేవి సార్... ఇప్పుడవి కూడా వద్దు... పోవడం లేదు...వంటల పుస్తకాలుంటే చెప్పండి.. చాలా గిరాకీ ఉంది.. పిల్లలు ఆడామగా అందరూ కొనుక్కుపోతున్నారు. మేమే వచ్చి తీసుకుంటాం...’’ అని చెప్పడం కొసమెరుపు.

ఉమ్మడి రాష్ట్రంలో తుర్లపాటి కుటుంబరావు గారు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయిన కొత్తల్లో   ఓసారి ఆయనకు ఓ ప్రతిపాదన చేస్తూ... ‘‘ఇంజనీరింగ్, మెడిసిన్ తో సహా తెలుగు లో మంచి పేరున్న రచయితల పుస్తకాలు, నవలలు, కథలు, డిక్షనరీల వంటి వాటిని ఉచితంగా ఇస్తామన్న వారి నుండి అన్ని గ్రంథాలయాలు స్వీకరించే ఏర్పాట్లు చేయండి. వేలల్లో, లక్షల్లో వస్తాయి. వాటిని వేటికవి వేరు చేసి ...పేద పిల్లలకు, పాఠశాలలకు, కొనే స్తోమత లేని పుస్తక ప్రియులకు ఉచితంగా అందివ్వండి,  దానికి నిధులేమీ అక్కర్లేదు. నిర్వహణ ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. దీనివల్ల  పుస్తకాలు సద్వినియోగం కావడమే కాక, పేద పిల్లలను ఆదుకున్న వారవుతారు’’ అని చెబితే ఆయనకు కూడా విపరీతంగా నచ్చేసింది ఈ ప్రతిపాదన. అయితే  ఆయన అక్కడ  కూర్చోవడానికి, తిరగడానికి అవసరమయిన ఏర్పాట్లకోసం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతుండగానే... రాష్ట్రం విడిపోయింది... ఆయన పదవి కోమాలోకి వెళ్లిపోయింది.

ఇప్పటికీ ఇంకా ఆశ చావట్లేదు... రసజ్ఞుడయిన, సాహితీ ప్రియుడు కూడా అయిన మనసున్న మారాజు...  తోటలో నుంచి తొంగి చూస్తే చాలు.. ... మరు క్షణంలో అంగన్ వాడీలనుంచీ మొదలు పెట్టి ... హైదరాబాద్ దాకా  పాత పుస్తకాల కోసం ఎగబడేలా చేయగలడు...ఒక్క నోటిమాటతో....

దింపుడు కళ్ళెం ఆశ ఫలిస్తుందా....ఏమో!  గుర్రం ఎగరావచ్చు.....

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

 

 


అమ్మ ఎలాఉంది? ...హలో ! మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!!

 


తెలుగు-3

 

‘అమ్మ ఎలా ఉంది’.. అని అడిగితే మీరేం చెబుతారు ?  ‘‘బాగుంది..ఫరవాలేదు’’ అంటారు. ‘ఆనందంగా, ఉత్సాహంగా ఉందా’’ అని అడిగితే... సంతోషంగానే ఉంది. ఏ సమస్యా లేదు.. అంటారు.

మనం రోజూ చూస్తూనే ఉంటాం కాబట్టి మనకు తేడా పెద్దగా కనిపించదు.  చాలా కాలం తరువాత మన మేనమామ ఇంటికి వస్తాడు. అమ్మను చూసి ‘ఏమిటిలా చిక్కిపోయావు.. ఒంట్లో బాగానే ఉంది కదా ?’’ అని ఆరా తీస్తాడు. కొంత కాలం తరువాత  అమ్మమ్మ తన కూతురును చూసిపోదామని వచ్చినప్పుడు... ‘‘చెప్పమ్మా ! ఏం సమస్యలు లేవు కదా ! నా దగ్గర దాచొద్దు..చెప్పుతల్లీ’’ అని చాటుగా గొంతు తగ్గించి అడుగుతుంది. మనకు కనిపించని తేడా వారికి  కనిపించింది.

ప్రతి క్షణం  కొత్తగా ప్రవహిస్తుండే మన నెత్తురు కూడా మనలోనే ఉంటుంది. కంటికయితే కనిపించదు. తేడా ఉన్నా తెలియదు. 

 

అమ్మభాష

‘అమ్మభాష’ పరిస్థితి కూడా అంతే.  దానికి ఏమవుతున్నదీ మనకు తెలియదు.  బాగానే  ఉంది కదా తెలుగు భాష.. ఏమిటీ రచ్చ ... అనుకుంటాం. మేనమామకులాగానే...  తెలుగు ఉపాధ్యాయుడికి కూడా...  భాష కళ తప్పుతున్న లక్షణాలు కొంతమేర  కనిపిస్తాయి. కన్నపేగు కాబట్టి అమ్మమ్మకులాగా తెలుగు భాషా శాస్త్రవేత్తకు మాత్రం పరిస్థితి పూర్తిగా బోధపడడమే కాక, ఆయన భవిష్యత్తును కూడా చూడగలుగుతాడు.

 

వారి దాకా ఎందుకు అనుకుంటే ... మన స్థాయిలో కూడా  తెలుగు భాషా స్థితిగతులను  చాలా సులభమైన పరిశీలన ద్వారా మనమే  తెలుసుకోవచ్చు... ప్రధానంగా మూడు అంశాలతో – 

·        తెలుగులో మాట్లాడడం

·        తెలుగులో రాయడం

·        తెలుగులో చదవడం

 

ఈ మూడింటిలో మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో మీరే అంచనా వేసుకోండి. మీకు మీరే మార్కులు వేసుకోండి. దానికి ముందు కొన్ని కొన్ని చిన్న నియమాలు గుర్తు పెట్టుకోండి. మీ పరిశీలన వాటికి లోబడి ఉండాలి. (ఇది జనసామాన్యానికి ఉద్దేశించినది. రచయితలు, భాషా పండితులకోసం కాదు.)  

 

నియమం : 18 ఏళ్ళు దాటి ఉండాలి...రోజూ మన వ్యవహారంలో వాడే పరభాషా పదాలకు అభ్యంతరం లేదు. కానీ పూర్తి పరభాషా వాక్యాలు మాత్రం ఉండకూడదు. అంటే..  మొత్తం వాక్యాలు పూర్తి తెలుగులోనే ఉండాలి. అంతే.

 

ఈ మూడింటిని మూడు తరగతులుగా  భావించండి. ప్రతి తరగతిలో మూడు ప్రశ్నలుంటాయి. ప్రతి తరగతికి  100 మార్కులుంటాయి.  కనీస ఉత్తీర్ణత -35 మార్కులు/100కు...ప్రశ్నలకు జవాబులు రాయాల్సిన పనిలేదు. మీ సామర్ధ్యాన్ని అంచనా వేసుకుని దానికి మీకు మీరే నిజాయితీగా మార్కులు వేసుకోండి. అంతే....

 

1.      తెలుగులో మాట్లాడడం : (మొత్తం 100 మార్కులకు) 

·        రోజువారీ వ్యవహారాల్లో మీరు పూర్తి తెలుగులోనే ఎంత వరకు మాట్లాడగలుగుతున్నారు ? (30 మార్కుల ప్రశ్న ఇది..దీనికి మీరెన్ని మార్కులు వేసుకుంటారో వేసుకోండి)

·        నలుగురు కొత్త వాళ్ళతో లేదా సభలో మాట్లాడవలసి వేస్తే  మీరు పూర్తిగా తెలుగులోనే ఎంతవరకు మాట్లాడగలరు ? (30 మార్కుల ప్రశ్న ఇది..ఎన్ని మార్కులు వేసుకుంటారు )

·       నలుగురు కొత్త వాళ్ళతో లేదా సభలో ఒక విషయంపై వాదించవలసి వస్తే మీరు పూర్తిగా తెలుగులో ఎంతవరకు వాదించగలరు  ? (60 మార్కుల ప్రశ్న ఇది.. ఎన్ని మార్కులు వేసుకుంటారు )

  

2.      తెలుగులో రాయడం : (మొత్తం 100 మార్కులకు) 

·        అమ్మానాన్నలకు, స్నేహితులకు ఉత్తరాలు పూర్తిగా తెలుగులో రాయవలసి వస్తే ఎంతవరకు రాయగలరు ? (30 మార్కుల ప్రశ్న ఇది.. ..  ఎన్ని మార్కులు వేసుకుంటారు )

·        పై అధికారులకు, యజమానులకు పూర్తి తెలుగులో ఒక లేఖ రాయవలసి వస్తే ఎంతవరకు రాయగలరు ? (30 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )

·        ఒక పత్రికకు లేదా ఒక రచనల పోటీలో పాల్గొనాలంటే పూర్తి తెలుగులో మీ రచనా సామర్ధ్యం ఎంత   ? (60 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )

  

3.      తెలుగులో చదవడం : (మొత్తం 100 మార్కులకు) 

·        తెలుగు దినపత్రికను మనసులో కాకుండా పైకి ఎటువంటి తడబాటు లేకుండా ఉన్నది ఉన్నట్లు చదవడంలో మీ సామర్ధ్యం ఎంత ? (30 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని మార్కులు వేసుకుంటారు )

·        వేమన శతకం, సుమతీ శతకం వంటి శతకాల్లో కొన్ని కొత్త పద్యాలను (మీకు నోటికి వచ్చినవి గాక మిగిలినవి) ఉన్నది ఉన్నట్లు  భావయుక్తంగా సాఫీగా పైకి చదివి అర్థం చెప్పడంలో మీ సామర్ధ్యం ఎంత ? (30 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని  మార్కులు వేసుకుంటారు )

·        పూర్తి తెలుగులో పద్యాలతో సహా ఉన్న భారత భాగవతాదులకు సంబంధించిన (టీకా తాత్పర్యాలు లేని)  ఒక పుస్తకం తీసుకొని  ధారాళంగా చదువుతూ వాటికి అర్థం చెప్పడంలో మీ సామర్ధ్యం ఎంత ? (60 మార్కుల ప్రశ్న ఇది.. .. ఎన్ని  మార్కులు వేసుకుంటారు )

 

మీకు మీరుగా మార్కులు వేసుకున్న తరువాత ఈ కింది ప్రశ్నకు జవాబివ్వండి....

మొదటి తరగతి వదిలేయండి.  రెండు మూడు తరగతుల్లో మీ మార్కులు కనీస ఉత్తీర్ణత స్థాయి దాటాయా ?

 

తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం జనాభాలో  లేదా కనీసం మీ బంధుమిత్ర పరివారంలో  పైన తెలిపిన వాటిలో  రెండవ, మూడవ తరగతుల్లో  ఎంత (%) మంది  కనీస ఉత్తీర్ణత సాధించగలరని మీరు అనుకుంటున్నారు ?  అంచనా వేయండి....


ఒకవేళ మీ అంచనాలు తక్కువగా ఉంటే... మీరేమీ నిరాశపడకండి. చాలా భాషల్లో పరిస్థితి దాదాపు మీ లెక్కలకు సరిపోతుంది. నిజానికి  ఈ భాషలు రోజురోజుకూ బక్కచిక్కుతుంటాయి... వీటికి భిన్నంగా  బాగా వెలిగిపోతున్న కొన్ని భాషలుంటాయి. అవి మిగతా వత్తులను ఆర్పేసుకుంటూ, ఉన్న చమురును మొత్తం పీల్చుకుంటూ కాంతులు విరజిమ్ముతుంటాయి. ఒక భాష ...  కేవలం మాట్లాడుకునే భాషగా మిగిలిపోకూడదు...నాలుగుకాలాలపాటూ పచ్చగా మనుగడ సాగించాలంటే.. ..అధిక సంఖ్యాకులు చదవడం, రాయడంలో కూడా చురుగ్గా ఉండాలి. అంటే తెలుగు సాహిత్యం పుష్ఠి గా ఉండాలి. ఏ రోజుకారోజు సాహిత్యం కొత్త రక్తాన్ని ఎక్కించుకుంటూ ఉండాలి. 

ఇప్పుడు మన తెలుగుకు మనం ఇస్తున్న ఆదరణ ఎంతో మీ అంచనాలకు అందింది కదా !  ఎందుకిలా...?


కేరళలోని అనంత పద్మనాభస్వామి ఐశ్వర్యం నేలమాళిగల్లో మూలుగుతున్నది కదా.  బయట మనకు అందుబాటులో లేని, అక్కరకు రాని, మనకు ఉపయోగపడని ఐశ్వర్యం ఎంతుంటే ఏమిటి.... గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక స్థితే  చివరగా మనకు లెక్కలోకి వస్తుంది. ఔనా !!!

 

అలాగే.... వెయ్యేళ్ళ క్రితం ఉన్నట్లు, మూడు వందల ఏళ్ల క్రితం ఉన్నట్లు, 70 ఏళ్ళ క్రితం ఉన్నట్లు తెలుగు భాష ఇప్పుడు లేదు...అన్నది వాస్తవం. అయితే అప్పటిది కూడా మన భాషే.  మన ఐశ్వర్యమే. పోతన మన తాతే. ఆయన వాడిన తెలుగు అంతా మొత్తంగా మనదే. ఆ తాతకు ముందు తరువాత...చాలా మంది తాతలు వారు కూర్చి పేర్చిన ఐశ్వర్యాన్ని  మనకు ఇస్తూ...వాటి మీద అన్ని  వారసత్వ హక్కులు కూడా ఇచ్చేసారు....దాన్ని అనుభవించే హక్కు కానీ, అభివృద్ధి చేసే హక్కుకానీ, ధ్వంసం చేసే హక్కు కానీ ...అన్నీ మనవే..

 

ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది...తాతలు  నగిషీలు చెక్కి అందమైన ఆభరణాలుగా చేసి నేలమాళిగల్లో దాచిన  సాహితీ సంపదను  మనం ఏం చేస్తున్నాం...కాపాడుతున్నామా ?అభివృద్ధి చేస్తున్నామా?నాశనం చేస్తున్నామా ? ...అన్నది . 

 

మనం చేసిన, చేస్తున్న తప్పు తెలుసుకుంటే చాలు...ప్రస్తుతానికి..... 

శ్రద్ధ చూపకపోతే- రాజుల సొమ్ము రాళ్లపాలు, దేవుళ్ల సొమ్ము నేలమాళిగల పాలు లేదా కబ్జాదారులు, అక్రమార్కుల పాలవుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. అయినా మన తాతలు ఇచ్చిన భాషాసంపదకు చెదలు పడుతుంటే మనం కళ్ళప్పగించి చూస్తున్నాం.

 

మన అమ్మ చిక్కిపోవడానికి... తాతల ఆస్తి ఎక్కడో మూలుగుతూ ఉండడం కారణం  కాకూడదు. మన తెలుగు భాష చిక్కిపోవడానికి, కళ తప్పడానికి కారణం- ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృతం, హిందీ, తమిళం... వంటి భాషలు ప్రధాన కారణం కానే కాదు. మన దగ్గర ఎంత భాషా సంపద ఉన్నదో మనం గుర్తించకపోవడం...  మన భోషాణం పెట్టెను మనం తెరవకపోవడం... దుమ్మ దులిపి వాడుకలోకి తెచ్చుకోకపోవడమే అసలు కారణం... అంతే...

 

దీనికి కావలసింది మనందరి  సంకల్పం...  

తెలుగువారిగా మనకు శ్రద్ద ఉండాలేకానీ.. 

ఫుట్ పాత్ లపై దొరికే పాత పుస్తకాలు చాలవా..  మన తెలుగును వెలిగించడానికి....  

తెలుగు భాషకు సంబంధించిన బ్యాంకులో పదాల బ్యాలెన్సును పెంచుకుంటూ పోవడానికి....


-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com



(తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలి, ఎలా సుసంపన్నం చేసుకోవాలి...అన్న విషయంపై మరిన్ని ఆచరణాత్మక సలహాలు..త్వరలో ...)

అలాగే మీరు కూడా మీ అభిప్రాయాలను, మీ సూచనలను, ఇదే బ్లాగులో వ్యాఖ్యల దగ్గర తెలియపరిస్తే... భాషాభిమానుల, సాహిత్యాభిమానుల స్పందన అంతా ఒక్కచోటే చూసుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. మీ వ్యాఖ్యతోపాటూ (అభ్యంతరం లేకపోతే)  మీ ఇ-మెయిల్,  ఫోన్ నంబరు జత చేయవచ్చు

తెలుగు భాషాభిమానులు అందరికీ షేర్ చేయండి, వీలయినంత ఎక్కువ మంది ఈ చర్చలో పాల్గొనేటట్లు చూడండి.



ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!


 

 తెలుగు-2...పట్టించుకోకపోతే పర్వతాలే కరిగిపోతాయి

 

తెలుగు..గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం’  అన్న శీర్షికన  జులై 20న నా బ్లాగులో ప్రచురించిన వ్యాసానికి అందిన స్పందన చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు నాతో ఏకీభవిస్తూ కొన్ని సూచనలు, సలహాలు కూడా చేసారు. వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో .. హెడ్డింగ్ ఘాటుగా ఉండడంతో కొరపోయి.. వ్యాసం లోపలికి కూడా తొంగి చూడకుండా బాధతో, నిరాశతో మెలికలు తిరిగిపోయిన సున్నిత మనస్కులు అయిన వీర భాషాభిమానులు కూడా తారసపడ్డారు. ఇలాంటివారు ముగ్గురు నలుగురే అయినా అలా బాధపడి స్పందించకుండా ఉండిపోయినవారు ఇంకా కొందరు ఉండవచ్చనే అనుమానం కొద్దీ ఈ వివరణ ఇస్తున్నా...

 
కాగితపు పడవలు, కొయ్యగుర్రాలు...


ఇప్పటికిప్పుడు కానీ, సమీప భవిష్యత్తులోకానీ తెలుగు భాషకు వచ్చిన ప్రమాదమేదీ లేదు. ఇంటాబయటా దాదాపు 15 కోట్ల మంది తెలుగు వారు ప్రతి రోజూ  ప్రతి క్షణం నోరారా తెలుగును హాయిగా మాట్లాడుకుంటున్నప్పుడు తక్షణం ముంచుకొచ్చిన ఉపద్రవం ఏదీ లేదు. నిండు గోదావరిలా సజీవంగా ప్రస్తుతానికి ప్రవహిస్తూనే ఉంది. ఇంకా కొంతకాలం కూడా కచ్చితంగా ప్రవహిస్తుంది. అయితే గుర్తించాల్సింది ఏమిటంటే... ఎంతటి మహానది అయినా, మహా పర్వతం అయినా పట్టించుకోకపోతే ఏదో ఒకనాటికి కనుమరుగయిపోతుంది-అని. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఎప్పటిలాగే కాలం మారుతున్నా....  జీవన శైలి మాత్రం మునుపటిలాగా మందకొడిగా సాగడం లేదు. పెను మార్పులు అతి తక్కువ సమయంలో చోటు చేసుకోవడాన్ని కళ్ళారా చూస్తూనే ఉన్నాం.

 

కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో  ఎవడి గొడ్డలి వాడు తీసుకుని వాడు కూర్చున్న కొమ్మను కాపాడుకోవడానికి మిగతా కొమ్మలను నరికేసుకుపోతుంటే...  కొంత కాలానికి ఆ చెట్టు పరిస్థితి ఏమవుతుందో చెప్పడానికి కొంత కటువుగా ఆ వ్యాసంలో హెచ్చరించాల్సి వచ్చింది, ఆ క్రమంలోనిదే  ఆ శీర్షిక కూడా...

 

కాలక్షేపానికో, ప్రచారానికో, గుర్తింపుకో ‘తెలుగు భాష’ను గురించి ఆవేదనతోనో, ఆవేశంతోనో, ఆక్రోశించో నాలుగు మాటలు  జనాల్లోకి వదులుతుంటే అవి కాగితపు పడవల్లా కాసేపు మురిపిస్తాయి. ముద్దుముద్దు మాటలతోనో,  మీసాలు మెలేయడంతోనో భాష బాగుపడదు. దానికి ఎదురయ్యే ప్రమాదాలు తొలగిపోవు.

 

ఎవడో వచ్చి ఏదో చేయాలనో, ప్రభుత్వాలు వాటంతట అవి,  రాజకీయ నాయకులు వారంతట వారు పూనుకుని ఎర్ర తివాచీలు అడుగడుగునా పరుస్తూ పోవాలనో కోరుకుంటున్నంతకాలం  ప్రయాణం  ‘కొయ్య గుర్రం’ మీద స్వారీలా ఉంటుంది...పైన ఎక్కినవాడు మాత్రం ఫుల్ జోష్ తో ఊగిపోతుంటాడు.

 

భాషపట్ల అభిమానం కానీ, ప్రమాదం ముంచుకొచ్చినప్పడు చూపాల్సిన తెగువ కానీ, అభివృద్ధి పట్ల ఆకాంక్షగానీ ఎలా ఉండాలో చెప్పడానికి ఒక అద్భుత ఉదాహరణ....

 


బాబుల్ గాడి దెబ్బంటే.. గోల్కొండ అబ్బా...అనాలి

 

అది 1970 వ దశకం. అప్పట్లో ‘రేడియో’ ప్రధాన సమాచార ప్రసార సాధనం. వార్తలు, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేసే వ్యవస్థ-ఆలిండియా రేడియో...ఆకాశవాణి. జాతీయ వార్తలు కానీ, ప్రాంతీయ వార్తలు కానీ పొద్దస్తమానం ఉండేవి కావు. వాటి నిర్ణీత వేళల్లో అవి ప్రసారమయ్యేవి. వాటిలో కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎక్కువగా చూసేది...రాత్రి 9గంటలకు ఆంగ్లంలో ప్రసారమయ్యే వార్తలు.. అప్పుడు దేశ ప్రధాని ఇందిరాగాంథీ....ఇదీ నేపథ్యం.

 

ఆ రోజు.. రాత్రి కచ్చితంగా 9 గంటలకు...ఎప్పటిలాగే ప్రారంభవాక్యం-This is All India Radio giving you the news..అని అప్పటివరకు సంవత్సరాలుగా వినడానికి అలవాటుపడిన శ్రోతలకు...ఒక మైల్డ్ షాక్...ఓ ఝలక్...This is Akashvani giving you the newsఅని వినపడింది.  దేశమంతా కొద్దిక్షణాల్లోనే తేరుకుని ముసిముసిగా నవ్వుకుంటూ వార్తల్లోకి చెవులు దూర్చారు...ఒక్క మద్రాసు రాష్ట్రంలో (ప్రస్తుత తమిళనాడు) తప్ప....ఆ క్షణంలో అక్కడ రాజుకున్న చిచ్చు తెల్లవారేటప్పటికి దావానలమయింది, మిన్నూమన్నూ ఏకమయ్యాయి. రాష్ట్ర  (భాషా) ప్రయోజనాలకోసం ప్రభుత్వం, ప్రతిపక్షం అన్న తేడా అక్కడ మాత్రం ఉండదు కాక ఉండదు.  అందరిదీ ఒకే గొంతు. ర్యాలీలు, సభలు, ఢిల్లీకి టెలిగ్రాములు, ఫోన్లు, పోస్ట్ కార్డులు...దీక్షలు..హోరెత్తుతున్నాయి. ..ఎంతగా అంటే పక్కనే ఉన్న సముద్రఘోష కూడా వినపడనంతగా......

 

ఆ రాత్రి... మళ్ళీ 9 గంటలకు వార్తలు ...మద్రాసులో అకస్మాత్తుగా  ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధంకాక ... తెలుసుకోవడానికి దేశమంతా వాటికోసం ఎదురు చూస్తున్నది.... 8.58.. 8.59... 9.00.. సిగ్నేచర్ ట్యూన్... This is All India Radio  giving you the news  … అని వినపడింది. అంతే మళ్ళీ దేశం  షాక్స్.. మద్రాస్ రాక్స్... అన్నట్లు .. మిన్నంటిన మంటలు ఆనందబాష్పాలై తమిళులను జల్లులతో తడిపేసాయి.  

 

ఒక్కసారి డిసైడ్ అయిపోతే నా మాట నేనే వినను.. అనే టైపు... రాక్షసి, ఐరన్ లేడీ,  ఓన్లీ మ్యాన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్... వంటి పలు బిరుదులు తగిలించుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ .. 24 గంటల్లోనే  నిర్ణయాన్ని వాపసు తీసేసుకున్నారు. కాదు..తీసుకోక తప్పని పరిస్థితి..  కారణం ఆమెకు తెలుసు ... తమిళుల హిందీ వ్యతిరేకత, తమిళుల సంకల్పబలం ఎంత గట్టిగా ఉంటుందో...   హిందీ వ్యతిరేక ఉద్యమం మంటలు చల్లారినా, పౌరుషాల సెగలు మాత్రం బుసలు కొడుతూనే ఉంటాయి అక్కడ.

 

(ఇక్కడ ఆకాశవాణిలో పేరు మార్పుకు దేశ ప్రధానికి సంబంధం ఏమిటన్న సందేహం రావచ్చు. ఆ మార్పు ఆమె జోక్యంతోనే జరిగింది..ఆకాశవాణి అనేది వ్యవస్థ పేరు...దానికి మళ్ళీ  అనువాదమేమిటి.. నాన్సెన్స్... ఏ భాషలో చెప్పినా... ఎక్కడ చెప్పినా అది ఆకాశవాణే..అనేది ఆమె వాదన అయి ఉంటుంది. తరువాత ఉపసంహరణ కూడా ఆమెదే)


-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

 

 

గమనిక :  తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలి, ఎలా సుసంపన్నం చేసుకోవాలి...అన్న విషయంపై మరిన్ని వ్యాసాలు త్వరలో ...

అలాగే మీరు కూడా మీ అభిప్రాయాలను, మీ సూచనలను, ఇదే బ్లాగులో వ్యాఖ్యల బాక్స్ లో నమోదు  చేస్తే... భాషాభిమానుల, సాహిత్యాభిమానుల స్పందన అంతా ఒక్కచోటే చూసుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. మీ వ్యాఖ్యతోపాటూ, మీ ఇ-మెయిల్, అభ్యంతరం లేకపోతే ఫోన్ నంబరు జత చేయవచ్చు, తప్పనిసరి కాదు

తెలుగు భాషాభిమానులు అందరికీ షేర్ చేయండి

.................


తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !


 

తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

 

తెలుగును బతికించుకుందాం’.. ‘మన తెలుగును కాపాడుకుందాం’... అంటూ అత్యున్నత పదవులలోని, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల నుండి సాధారణ తెలుగు అభిమాని వరకు చేస్తున్న ప్రకటనలను దశాబ్దాలుగా విసుగూ విరామం లేకుండా వింటునే ఉన్నాం. రెండో చెవినుండి క్షణం ఆలస్యం చేయకుండా వదిలేస్తూనూ ఉన్నాం. పనిలో పనిగా టైం దొరికినప్పుడు  ప్రభుత్వాలను చెరిగేస్తున్నాం, నిప్పులతో కడిగేస్తున్నాం. భాషాభిమానం ఉండి మాతృదేశానికి దూరంగా బతుకుతున్నవారు...ఆర్థికంగా కాస్తంత నిలదొక్కుకున్న తరువాత తమ పిల్లలకు తెలుగు-పేగుబంధం తెగిపోతున్నదన్న ఆవేదనతో నిజాయితీగా వారి స్థాయిలో వారు మాత్రం ఉడతా భక్తి ప్రదర్శిస్తున్నారు, మాటలలో కాదు చేతలలో.

 

 

ఆ ఉడత ఊపులు ఇక్కడ పాతుకుపోయిన వృక్షాల కొమ్మలనే కాదు, రెమ్మలను కూడా ఏ మాత్రం కదిలించలేకపోతున్నాయి.  అంతటితో ఆ మాన్లు సరిపెట్టుకుంటే సంతోషమే. ఏ రెండు రెమ్మలు కలిసినా నీ తెలుగు వేరు, నా తెలుగు వేరు... నీ జిల్లా వేరు, నా జిల్లా వేరు...నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు...నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు... అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఎక్కడిదాకా తీసుకెళ్ళాయంటే...నీ తల్లి వేరు, నా తల్లి వేరు... ... ఇంతగా తల్లివేరుకు తెగులు ముదిరిన తరువాత, తెలుగు వృక్ష ఆత్మ క్షోభించకుండా ఉంటుందా ? సజీవ సమాధికి సిద్దం కాకుండా ఉంటుందా ?

 

 

అసలు సిసలు ఉద్యమకారుడయిన ఓ మహానుభావుడి నోటినుండి అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా (ఓరీ తెలుగువాడా..అని అంతే తప్ప ఆంధ్రోడు కాదు) చావవెందుకురా...అన్న పదాలు ఊడిపడినా... ‘‘ఆంధ్ర’’ పదం మాత్రం ఉద్యమ సేనలకు, సేనానులకు అంటరానిది అయిపోయింది, ఓ పచ్చి బూతయిపోయింది. పోతన మా వాడేఅని చంకలో ఇరికించుకున్నప్పటి సంబంరం... ఆయన రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతంతాలూకు ప్రస్తావనల్లో కూడా ఆంధ్రశబ్దాన్ని పలకడంలో మాయమయి పైగా అపచారంగా భావిస్తున్నారు. ఉచ్చరిస్తే నోటిని ఫినాయిలు వేసి కడుక్కోవాలన్నంత స్థాయిలో దూరం పెట్టేస్తున్నారు.

 

 

ఒక మతం వారికి తీన్ తేరా ఆఠ్ అఠారా (3,13,8,18 అంకెలు) నిషిద్ధాలు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండుఅంకె పాపం చేసుకుంది. ఆ రెండుపత్రికలు, రెండుజిల్లాలు, రెండువేళ్ళు...కనకూడనివి, వినకూడనివి. ముఖ్యంగా   రెండు జిల్లాల భాషనుఅందరూ మోయడమేమిటి ? అని రాగాలు తీసేవాళ్లు, ఇప్పుడు తమ ప్రాంత తెలుగే అచ్చ తెలుగు..అని మురిసిపోతూ... వారికి కూడా తెలియకుండానే వారి ప్రాబల్యం ఉన్న  రెండు జిల్లాల తెలుగుకే చీరెసారె పెట్టి  తన్మయత్వంతో మెలికలు తిరిగి పోతున్నారు. ఇక మీదట రెండు రాష్ట్రాలవారు- వారికున్న 46 జిల్లాల్లో...జిల్లాకో, పట్టణానికో ఒక దుకాణం తెరిచి ఎవడి తల్లి వాడిదే,  ఎవడి నాలుక వాడిదే, ఎవడి భాష వాడిదే, ఎవడి సంస్కృతి వాడిదే .... అని మొగసాలకెక్కే రోజులు ఎక్కువ దూరంలో లేవనిపిస్తుంది.

 

 

రెండు రాష్ట్రాలుగా విడిపోయింది భౌగోళికంగా, రాజకీయంగానే... అని ఒకవంక అవసరార్థం ప్రకటిస్తూనే..  భాష, కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కూడా విడిపోవలసిందేనని మరోవంక అడ్డ గీతలు, హద్దు గీతలు గీస్తున్నంత కాలం.. తెలుగు భాష ఇంకా చిక్కి శల్యమయిపోయి గోదాట్లో కొట్టుకుపోయి... చివరగా బంగాళాఖాతంలో కలిసిపోకుండా ఉంటుందా..?.

 

 

అలా కాకూడదు అనుకుంటే...

 

మొట్టమొదటగా ఒప్పుకోవలసింది...  కాపురాలు వేరయినా... మనం ఒకే ఒక భాషామతల్లి బిడ్డలం-అని. ఆంధ్రశబ్దాన్ని అపశబ్దజాబితానుంచి తొలగించాలి-అని. 46 జిల్లాల్లోని  ప్రతి మాండలికానికి ఇతర మాండలికాల వారు పెద్దపీట వేసి గౌరవించాలి-అని.

 

 

అందరం విధిగా గుర్తుంచుకోవలసిన అంశం భాషా ప్రయుక్త రాష్ట్రాలు: భాషల పేరుతో దేశంలో రాష్ట్రాల ఏర్పాటు జరగక ముందు భాషల మనుగడ ఎలా ఉండేదో తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి.

 

మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే......

 

తెలుగు మాట్లాడేవారితో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రం ఏర్పడక పూర్వం తెలుగు భాష పరిస్థితి ఏమిటి ? – ఏర్పడిన తరువాత  తెలుగు భాష పరిస్థితి ఏమిటి ?  అభివృద్ది చెందిందా !!! దిగజారిందా !!! ... అంటే.. ఒకే భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కట్టెలెగదోసి దేశమంతా చిచ్చును విజయవంతంగా రగిలించిన తెలుగు వాడు ...తీరా తెలుగు రాష్ట్రం ఏర్పడిన తరువాత ...భాషాపరంగా తెలుగుకు చేసిన మేలు ఏమిటి ? తవ్వి నెత్తికెత్తిందేమిటి ? కొత్తగా మొలిపించిన కొమ్ములేమిటి ?

 

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

  

మీకు నచ్చితే తెలుగు వీరాభిమానులకు షేర్ చేయండి....కలిసి బతికించడం కష్టమని అందరం తీర్మానిస్తే , కలిసి చంపేద్దాం  తేలిగ్గా.....నొప్పి తెలియకుండా......అదీ త్వరగా....ఇంకా నానబెట్టకుండా.....



పుణ్యాయనం

 



పుణ్యాయనం

 

ఒక బాల్యం...

ఆగిపోయింది

కాలికింది రాదారి కుంగిపోయింది

ఒక యవ్వనం

కాలిపోయింది

పూతకొచ్చిన చెట్టు మోడయిపోయింది

ఒక వృద్ధాప్యం

చతికిలబడిపోయింది

చేతికర్ర జారిపోయింది

 

ఇంటింటి రామాయణం

కరోనా పుణ్యాయణం

 

 -  చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

నిత్యనూతన భ్రాంతి

  మా తాతకు...  పుట్టిపెరిగిన ఊరు కైలాసానికి కోసుదూరం పిల్లల కాలానికి అది కరతుమ్మలు , జిల్లేళ్ళమయం   మా నాన్నకు...  పుట్టిపెరిగిన ఊరు వైకుంఠా...