నిత్యనూతన భ్రాంతి

 



తాత పుట్టిపెరిగిన ఊరు

కైలాసానికి కోసుదూరం

పిల్లల కాలానికి

కరతుమ్మలు, జిల్లేళ్ళమయం

 

నాన్న పుట్టిపెరిగిన ఊరు

వైకుంఠానికి బొడ్రాయి

పిల్లల కాలానికి

కాలిరిగిన కొక్కిరాయి,

రెక్కలు తెగిన పావురాయి.

 

నేను పుట్టి పెరిగిన ఊరు

బృందావనం, కాశ్మీరం

పిల్లల కాలానికి

పాడుబడ్డ శివాలయం.

....

అప్పుడు...

బంగారం పండిన నేల

ఇప్పుడు...

పైశాచిక హేల

మున్ముందు...

ఆశానిరాశల కల

ఆందోళనల అల 

ఇది నిత్య నూతన  లీల.


-చినవ్యాసుడు, మాఊరు



సవాళ్ళు, సమస్యలు కాళ్ళకు అడ్డుతగులుతుండే వర్తమానం ఎప్పుడూ భయంకరమే.

ఆ భయాందోళనలు లేని, ఎక్కడ తేలతామో తెలియక అనుక్షణం బుర్రలను తొలుచుకు తినే ఉత్కంఠలు లేని గతం ఎప్పుడూ ఆకర్షణీయమే...  సవాళ్ళనుండి క్షేమంగా బయటపడిన తరువాత వెనక్కి తిరిగి వాటిని తిరిగి చూసుకోవడం ఓ గొప్ప ఉపశమనం, ఓ పెద్ద ఓదార్పునిస్తుంటుంది...అప్పుడు భద్రంగా వడకట్టిన తేనెలా గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఎప్పుడూ మధురాతిమధురమే...

.... తాతలకయినా, నాన్నలయినా, మనకయినా......మన పిల్లలకయినా... 

బాల్యం/గతం ఎప్పటికీ సుమధుర జ్ఞాపకమే.


దానికి వర్తమానంతో  ముడిపెట్టి నిందించి ఏం ప్రయోజనం ?

......

...అధినాయక జయహే !





...అధినాయక జయహే !

 

(తాతా!  మన్నించు....ఈ రోజున ఇంతకంటే ఏం చెప్పలేను)

 

 

రైతు చేతిలో ఉన్నది భూమే

వ్యవసాయమూకాదు, మార్కెట్లూకాదు

వ్యాపారి చేతిలో ఉన్నది దోపిడీ సూత్రమే

వ్యాపారమూ కాదు, లాభాలూ కాదు

 

 

విద్యార్థుల చేతిలో ఉన్నవి పుస్తకాలే

జ్ఞానమూ కాదు, జిజ్ఞాసా కాదు

కోర్టుల చేతిలో ఉన్నవి చట్టాలే

న్యాయమూ కాదు, ధర్మమూ కాదు

 

 

అధికారుల చేతిలో ఉన్నది పెత్తనమే

సొంత బుర్రలూ కావు, మంచి నిర్ణయాలూ కావు

ప్రజల చేతిలో ఉన్నది ఓట్లే

ప్రజాస్వామ్యమూ కాదు, ప్రతినిధి ఎంపికా కాదు

 

 

కులం చేతిలో ఉన్నది కులమే

సంక్షేమమూ కాదూ, సంఘీభావమూకాదు

మతం చేతిలో ఉన్నది మతమే

మానవత్వమూ కాదు, దైవత్వమూ కాదు

 

 

మీడియా చేతిలో ఉన్నది వ్యాపారమే

సత్యసంధతా కాదు, పత్రికాస్వేఛ్చా కాదు

దేముడి చేతిలో ఉన్నది ప్రార్థనాస్థలమే

కరుణాకాదు, కణాక్షమూ కాదు

భరతమాత చేతిలో ఉన్నది జెండానే

దేశమూ కాదు, పౌరులూ కాదు

 

 

ఆవగింజంత తేడాలేకుండా

అన్నీ ఉన్నవి ఒక్క అధినాయకుడిలోనే

 

 

వాడే మా తలరాతలు రాసే విధాత

వాడే మమ్మల్ని బుజ్జగించే మహా విష్ణువు

వాడే మమ్మల్ని మట్టిలో కలిపేసే మాహేశ్వరుడు


-చినవ్యాసుడు

 

 

(ఇటీవలే విడుదలయిన కవితల సంకలనం ‘‘అధినాయక జయహే ... చినవ్యాసుడి ఖడ్గాలు’’ సౌజన్యంతో)


(మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా

జనవరి 30న అమరవీరుల  దినోత్సవం పాటిస్తున్న సందర్భంలో....)

............


మీ కామెంట్లు ఇక్కడే నమోదు చేస్తే శాశ్వతంగా కనబడుతూ ఉంటాయి

వార్త

 జనవరి 29- భారతీయ వార్తా పత్రిక దినోత్సవం(Indian Newspaper Day ) సందర్భంగా....



వార్త

 

నాకు రాయడం తెలుసు

నాకు చదవడం తెలుసు

పట్టిపట్టి చూడడం, ఓపిగ్గా వినడం తెలుసు

 

చచ్చు విశేషాల పిచ్చి మొక్కల్లోంచి

మందు మొక్కలు పీక్కురావడం తెలుసు

మనసుపొరల్లో దాచిన మందుపాతరల

వాసన పట్టేయడం  తెలుసు

 

నా ముందున్న సమాచారం కుప్పల్లోంచి

వార్తలు ఏరుకోవడం ఎక్కువగా తెలుసు

వాటి దుమ్ము దులిపి ముస్తాబు చేసి

వినువీథుల్లో విహరింపచేయడం తెలుసు

 

దార్లో ఈల వేసేవి, గోల చేసేవి

వెంటపడి వేధించేవి

కన్నుగొట్టే కల్లబొల్లి కబుర్లనుంచి

వార్తను కాపాడుకోవడం కూడా తెలుసు

 

అప్పుడు ...

వార్త నా చిటికెన వేలు పట్టుకుని నడిచేది

పక్కచూపులు చూడాలనిపించినప్పుడు

నాకేసి ఓ లుక్కేసేది, కన్నెర్రచేస్తే

నాలుక్కరుచుకొనేది..

 

ఇప్పుడు...

 

అది నా చెయ్యి వదిలేసింది

ఈలలు, గోలలకు రెచ్చిపోతున్నది

రికార్డింగ్ డాన్సులు చేసేస్తున్నది

పచ్చికుండ మీదెక్కి

పిచ్చి కూతలు కూస్తున్నది

 

ఎంగిలిపడ్డవి, దొంగిలింపబడ్డవి

కల్తీసారాబట్టీల్లో వండివార్చినవీ

కక్కుర్తిపడి కక్కిన సొల్లు స్టోరీలన్నీ

వయ్యారాలు వొలకబోస్తూ

వార్తల మేలిమి జలతారు ముసుగు లేసుకుని

సంతంతా సందడిచేస్తున్నాయి

ఈథుల్లో ఈరంగమాడుతున్నాయి

పులివేషాలతో కాగితప్పులులు

మాయా దర్పణాలు

జాతర చేసేస్తున్నాయ్

కనికట్టుతో కట్టిపడేస్తున్నాయ్

టక్కుటమారాలతో

గజకర్ణగోకర్ణాలతో కుమ్మేస్తున్నాయ్

 

పల్లీబఠానీలక్కూడా పోటీలుపడి

పైటలు  జార్చేస్తున్నాయి

పచ్చనోటు కనపడగానే

పక్కలు పరిచేస్తున్నాయి

 

అయినా ఆశ చావక...

పనికిరావని ఊరవతల పారేసిన

సమాచార కుప్పలకేసి వెడితే

ప్రాణం లేచొచ్చింది...

 

అసలు వార్తలు శోషొచ్చి అక్కడ

చచ్చిన పీనుగుల్లా పడిఉన్నాయి

పిడచకట్టిన నాలుకలు చాచి

అమృతపు చుక్కలకోసం

ఆపన్న హస్తం కోసం

అల్లాడుతున్నాయి

 

 -చినవ్యాసుడు,  మాఊరు.

chinavyasudu@gmail.com

నిత్యనూతన భ్రాంతి

  తాత పుట్టిపెరిగిన ఊరు కైలాసానికి కోసుదూరం పిల్లల కాలానికి కరతుమ్మలు , జిల్లేళ్ళమయం   నాన్న పుట్టిపెరిగిన ఊరు వైకుంఠానికి బొడ్రాయి పిల్లల క...