ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

 


ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

 

ఈనాడు..
ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్
 
ఆంధ్రజ్యోతి...
3వ పేజీ (ఎడిట్ పేజీ) మాత్రం అక్కడక్కడా చదవాల్సిన పేపర్
 
సాక్షి...
ఫీచర్స్మాత్రం ఎంజాయ్ చేయాల్సిన పేపర్
 
టైమ్స్... 
తూకానికి, ఫాషన్/బ్యూటీ పార్లర్లకు లాభసాటి పేపర్
 
హిందూ...
మేధావులనుకునే వారు చంకలో పెట్టుకుని తిరగడానికి పనికొచ్చే పేపర్
 
ఇండియన్ ఎక్స్ ప్రెస్ ...
గత వైభవాలదృష్ట్యా అప్పుడప్పుడూ చూడాల్సిన పేపర్
 
దూరదర్శన్, ఆకాశవాణి(వార్తావిభాగాలు)...
రాజనర్తకీమణులు
 
ప్రైవేటు టీవీన్యూస్ ఛానళ్ళు...
వార్తల షాపింగ్ మాల్స్’’
 
యూట్యూబ్(న్యూస్) ఛానళ్ళు...
వార్తల కిరాణా దుకాణాలు
 
సోషల్ మీడియా...
అల్ట్రా మోడరన్ రెస్ట్ (వాష్) రూమ్.

 

 మీకేమనిపిస్తుంది ! ! !

 

 -చిన వ్యాసుడు, మా ఊరు

(chinavyasudu@gmail.com)

మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి చుట్టాలు

 



మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి చుట్టాలు

ఎవరా చుట్టాలు ! ! !

 

ఇంకెవరు ! ! ! 

మన సాధువులు(నాగ సాధువులు), యోగులు, అవధూతలు, సిద్ధులు... ఇంకా నాథ్‌లు, ..


వీరిని గురించి మనం ఆ నోటా ఈ నోటా వినడమే. ఏవో పొంతనలేని గాలికబుర్లు తప్ప వారిని గురించి మనకు పెద్దగా తెలియదు. శాస్త్రాల్లో వీరిని గురించి చెప్పిన విషయాలు పండితులకు చాలామటుకు తెలుసు. కానీ అసందర్భమనో  లేక అవకాశం దొరకకనో మరే ఇతర కారణం చేతనో వారు, వారికి తెలిసిన విషయాలు ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడం లేదు. కానీ గమ్మత్తేమిటంటే  సాధారణంగా పామరుల్లో, ముఖ్యంగా పల్లెపట్టునఉండే పలువురికి మాత్రం(ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో) ఈ చుట్టాలు చిర పరిచితులే. అయినా వారు చదువుకున్న వారికి తమ అనుభవాలు చెబితే నమ్మరనో, ఎగతాళి చేస్తారనో నాగరీకులకు చెప్పడానికి జంకుతారు. ఇక మీడియా కూడా వీరికి సంబంధించిన విషయాలు శాస్త్ర సమ్మతం కాదనే అపోహతోనో లేక మూఢనమ్మకాలని భావించడంవల్లనో  లేక అసలు తెలియకనో లేదా సమగ్ర... సాధికార సమాచారం దొరకకనో అంతగా శ్రద్ధ చూపడంలేదు. మహాకుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటి ప్రపంచంలోకి వచ్చే నాగసాధువులను, అవధూతలను కలవడానికి చూడడానికి విదేశాలనుంచి పర్యాటకులు, విదేశీ పాత్రికేయులు పెద్దఎత్తున వచ్చినప్పుడు మాత్రం వీరికి సంబంధించిన కొన్ని కథనాలు బయటికి వచ్చి హల్‌చల్‌ చేస్తుంటాయి.

 నేను ఇక్కడ ఇస్తున్నది ముడి సమాచారమే. తొందరపడి ఇవ్వడంలో ఉద్దేశం- ఇక నుంచయినా దీనిమీద ఆసక్తి ఉన్న వారుగానీ, పండితులుగానీ, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులుగానీ, మీడియా గానీ, ధార్మిక పరిశోధకులుగానీ మరింత శ్రద్ధచూపి మన ప్రాచీన భాండాగారంలో నిక్షిప్తమై ఉన్న ఇటువంటి జ్ఞాన రాశులను వెలికితీసి జనసామాన్యానికి పంచుతారని ఆశిస్తూ నేను అతిస్వల్పకాలంలో సేకరించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుంచుతున్నాను.

 

యోగులు,అవధూతలు, సిద్ధులు

 యోగశాస్త్రం అన్నింటికీ మూలం. దీన్ని తొలుత రాసింది ఎవరు ? ఎప్పుడు ? అనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం దొరకదు. యోగ సూత్రాల సంకలనకర్తగా పతంజలిని పలు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అయితే పతంజలిపేరుతో వేర్వేరు కాలాల్లో వెలువడిన గ్రంథాలు మరో కొత్త సందేహాన్ని లేవనెత్తాయి. అసలు ఈ పతంజలి ఎవరు ? అని.

 సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన మహాభాష్యకర్త అయిన పతంజలి విషయంలో మాత్రం ఆయన ఏ కాలానికి చెందినవాడో స్పష్టమైన ఆధారం ఉంది. క్రీ.పూ.120 అని. సాకేత నగరాన్ని గ్రీకులు ఆక్రమించుకున్నారంటూ ఆయన తన రచనలో చేసిన ప్రస్తావనతో చరిత్రకారులు ఈ పతంజలి విషయంలో స్పష్టంగా కాలనిర్ణయం చేయగలిగారు.

యోగసూత్రాల సంకలనకర్తగా తర్వాత పలుకాలాల్లో , పలు సందర్భాల్లో పతంజలి పేరును పేర్కొన్నారు. క్రీ.శ. 5వ శతాబ్దంలో భర్తృహరి తన గ్రంథాల్లో యోగ, వ్యాకరణ, ఆయుర్వేద శాస్త్రాల నిపుణుడిగా పతంజలిని అభివర్ణించారు. 11వ శతాబ్దంనాటి భోజుడు తన యోగ సూత్రాల పీఠికలో పతంజలిని ఇలాగే ప్రస్తావించాడు. అలాగే తమిళ సిద్ధ(శైవ) సాంప్రదాయంలోని 18మంది సిద్ధులలో పతంజలి పేరుతోఒకరు కన్పిస్తారు. పతంజలి’- ఒక వైద్యశాస్త్ర గ్రంథకర్తనికూడా తెలిపారు.

 ఇక మహాభాష్యకర్త పతంజలి అనంత శేషనాగు అవతారమని భట్టోజీ దీక్షిత, హరిదీక్షిత, నాగేశ్‌ భట్టవంటి పలువురు వ్యాకరణ గ్రంథకర్తలు తెలిపారు.

 యోగశాస్త్రం... ముఖ్యంగా శైవసంబంధమైన యోగ శాస్త్రానికీ, పతంజలికీ చాలా దట్టమైన బంధం ఆద్యంతం కనిపిస్తూ ఉంటుంది. యోగసూత్రాలను వాటికి భాష్యాన్ని కూడా ఆయనే రాశారని ఎక్కువమంది అభిప్రాయం. యోగ సూత్రాలు, వాటికి భాష్యాలు వేర్వేరు రచయితలు రాసారని అన్నా, వ్యాఖ్యానకర్తగా వ్యాసుడి పేరే చెప్పేవారు. ఇటీవల ఉద్దండపండితులంతా క్రీ.శ 1000వ శతాబ్దానికి ముందు నాటి ప్రామాణిక గ్రంథాలను తిరగదోడి రెండు విషయాలు తేల్చారు. మొదటిది సూత్రాలు, వ్యాఖ్యానం ఒక్కరే రాశారని, రెండోది.. ఇది రాసింది క్రీ.పూ 400వ శతాబ్దంలో అని.

 ఇక మరికొన్ని కథనాల ప్రకారం అత్రిమహాముని, అనసూయలకు త్రిమూర్తులు ఇచ్చిన వరప్రసాదంగా ముగ్గురు కుమారులు పుట్టారు, వారిలో ఒకడు పతంజలి (సోమ స్కంధుడు). మిగిలిన ఇద్దరు దత్తాత్రేయులు, దుర్వాసులు. శంకరాచార్యులకు  కూడా వారి గురువు పతంజలిని గురించి చెప్పి ఆయన గోవింద భగవత్పాదులుగా అవతరించి సమాధిస్థితిలో ధ్యానం చేసుకుంటున్నారని సూచించినట్లు మనకు చాలా గ్రంథాలు తెలుపుతున్నాయి.

 మహాభారతం, గీతలో కూడా మూడు రకాల యోగను ప్రస్తావించారు. ఇవన్నీకూడా చంచల స్వభావమైన మనస్సును నియంత్రించి చిత్తాన్ని ఏకోన్ముఖంగా నడపడానికి ఉద్దేశించినవి. అయితే తర్వాత కాలంలో వచ్చిన హఠయోగం వీటికి భిన్నంగా ఉంటుంది. ఇది మానసిక బలంతోపాటూ శారీరక పుష్ఠిని చేకూర్చుకోవడానికి సాధకుడికి తోడ్పడుతుంది.

 15వశతాబ్దంనాటి హఠయోగ ప్రదీపిక, 17వ శతాబ్దం నాటి శివసంహిత, ఇదేకాలానికి చెందిన ఘేరండ సంహితలు హఠ యోగాన్ని లేదా హఠవిద్యను విపులంగా తెలియచేసాయి. 11వశతాబ్దంనాటి గోరక్షానాథ్‌ రాసిన గోరక్ష సంహితనుకూడా కొందరు పండితులు ఈజాబితాలో చేర్చారు. 20వశతాబ్దం నుండీ యోగాప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు మనం చూస్తున్న, చేస్తున్న ఆసనాలవంటి అభ్యాసాలు హఠయోగం లోనివే. చాలా శాస్త్రాలు హఠయోగం శివుడి తోనే ప్రారంభమయిందని చెబుతున్నాయి.

 దీనికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఎవరూ చూడకుండా, వినకుండా ఉండడానికి శివుడు ఒక ఒంటరి దీవిని ఎంచుకుని హఠయోగ రహస్యాలను పార్వతీదేవికి ఏకాంతంలో బోధిస్తాడు. అయితే ఇదంతా ఒక చేప నిశ్చలచిత్తంతో విని సిద్ధపురుషునిగా మారుతుంది. ఆయనే మత్స్యేంద్ర నాథుడు. ఆయన తన శిష్యుడు గోరక్షానాథ్‌కు, చౌరంగి అనే మరొక కాళ్ళూచేతులూ లేని వ్యక్తికి బోధిస్తాడు. ఇక ఆ తరువాత గురుశిష్యపరంపరలో చాలామంది హఠ యోగులు దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. అయితే దీనికి అధిక ప్రజాదరణ కల్పించిన ఘనత మాత్రం గోరక్షానాథ్‌దే. ఆయన దీని మీద చాలా గ్రంథాలు రాశారు. అవి..గోంరక్ష సంహిత, సిద్ధ సిద్ధాంత పద్ధతి, గోరక్షాటక, యోగ మార్తాండ, యోగ చింతామణి. వీటిలో సంస్కృతంలో వెలువడిన సిద్ధసిద్ధాంత పద్ధతి గ్రంథంలో అవధూతఅంశానికి సంబంధించి చాలా సమాచారం ఉంది.

 హఠయోగ సంహిత, ఘేరండ సంహితల్లో 35మంది అద్భుత హఠయోగసిద్ధుల ప్రస్తావన ఉంది. వారిలో ఆదినాథ్‌, మత్య్సేంద్రనాథ్‌, గోరక్షానాథ్‌ ఉన్నారు. అంతేకాక షట్కర్మ, ఆసన, చక్ర, కుండలిని, బంధ, క్రియ, శక్తి, నాడి, ముద్రలతోపాటూ ఇతర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంది.

 ఇక ఇప్పుడు పాశ్చాత్యదేశాలలో అనుసరిస్తున్న ఆధునిక హఠయోగఅభ్యాసాల ఘనత తిరుమలై కృష్ణమాచార్య గారిది. ఆయన 1924నుంచీ 1989 వరకూ దీనిని బహుళవ్యాప్తి లోకి తెచ్చారు.  ఆయన శిష్యులలో ప్రముఖులు కె.పట్టాభి జాయిస్‌(అష్టాంగవిన్యాస యోగ), బి.కె. ఎస్‌ అయ్యంగార్‌, ఇంద్రాదేవి, టికెవి దేశికాచార్‌(కృష్ణమాచారిగారి కుమా రుడు).

 అలాగే విదేశాల్లో దీని వ్యాప్తికి 1887నుండీ 1963 వరకు హృషీకేశ్‌కు చెందిన స్వామి శివానంద చేసిన కృషి కూడా అమోఘం. ఆయన శిష్యుల్లో ప్రముఖులు స్వామి విష్ణు దేవానంద(శివానంద యోగ కేంద్రాల వ్యవస్థాపకులు), స్వామి సత్యానంద(బీహార్‌), స్వామి సచ్చిదానంద ప్రముఖులు. 21వ శతాబ్దంలో మన దేశంలో దీనికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారిలో బాబా రామ్‌దేవ్‌ ప్రముఖుడు.

 2008లో యోగా జర్నల్‌అమెరికాలో యోగా భ్యాసంపై ఒక సర్వే నిర్వహించింది. 1కోటి58లక్షల మంది దీనిని అభ్యసిస్తునట్లు, మరో ఏడాదిలోగా 94లక్షలమంది దీన్ని అభ్యసించడానికి ఉత్సుకత చూపినట్లు ఈ సర్వే వెల్లడిరచింది.

 

అవధూత:

 బ్రహ్మనిర్వాణతంత్రంఅనే గ్రంథం నాలుగు రకాల అవధూతలను గురించి విపులీకరించింది.

 1.           బ్రహ్మావధూత: జన్మతః అవధూత. సమాజంలోని ఏ వర్గానికి చెందినవాడయినా కావచ్చు. ప్రాపంచిక విషయాలేవీ పట్టకుండా బతికేవాడు.

2.     శైవావధూత: సన్యాసాశ్రమం ద్వారా సామాజిక జీవితాన్ని త్యజించి జటలతో, విభూతిస్నానాలతో, శివాలంకరణలతో వుంటూ ఎక్కువ భాగం సమాధిలో(ధ్యానంలో) గడిపేవాడు.

3.          వీరావధూత: సాధువు వేషధారి. ఎర్రచందనాన్ని పులుముకుని, కాషాయవస్త్రాలు ధరించి, బాగా పెంచి విరబోసుకున్న జుట్టుతో ఎముకల దండలు, రుద్రాక్ష మాలలతో, దండాయుధం, గొడ్డలి లేదా డమరుకం చేతపట్టి తిరిగేవాడు.

4.         కులావధూత: కౌల సంప్రదాయానికి చెందినవాడు. మామూలు ప్రజానీకంతో కలిసే ఉంటాడు. కనుక వీరిని ప్రత్యేకంగా గుర్తించడం కష్టం.

వీరుకాక మహారాష్ట్రలో మాత్రం కనిపించే ఒక అవధూత వర్గంవారున్నారు. అమరావతి(మహారాష్ట్ర) దగ్గర కార్లాలో ఉన్న ఒక సమాధిని పూజిస్తారు. ఇంటిదగ్గర కూడా సమాధిపూజ చేస్తారు. అయితే వీరు విగ్రహారాధనకు వ్యతిరేకులు. పూజా ప్రదేశాన్ని బంగళా అని పిలుస్తారు. గుళ్ళకుపోరు.వీరి భజనలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సమాధి దగ్గర కర్పూరం వెలిగిస్తారు. అది వెలిగినంతసేపు ధ్యానంలో ఉండి ప్రార్థనలు చేస్తారు. వీరిని షిద్‌లని కూడా అంటారు(కొందరు షిండేగా కూడా వ్యవహరిస్తారు)

 

నాథ్‌

      అవధూత పంథాలో నాథ్‌ సంప్రదాయంకూడా ఉంది. అవధూతగీతదీనిని విపులంగా చర్చించింది. వీరికి కూడా గోరక్షానాథ్‌ ఆదర్శం. సిద్ధ సాంప్రదాయంలోనే మతాచారంపట్ల నమ్మకంలేని వర్గం నాథ్‌లు. వీరిలో కూడా చాలా శాఖలున్నాయి. మూల పురుషుడు మత్స్యేంద్రనాథ్‌ లేదా మచ్ఛేంద్రనాథ్‌. దీనిని ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవాడు గోరక్షానాథ్‌. వీరిద్దరినీ టిబెట్‌ బౌద్ధగ్రంథాలు మహాసిద్ధులుగా, అనంత శక్తిమంతులుగా కీర్తించాయి.

నాథ్‌లలో ఆదినాథ్‌ అంటే మహాశివుడు. మహాదేవుడే తొలి నాథ్‌. నవనాథ్‌లు గురుపరంపరలో తొమ్మిదిమంది. దత్తాత్రేయ మహర్షితో ఈ సంప్రదాయం మొదలవుతుంది. 1.మత్స్యేంద్రనాథ్‌ 2. గోరక్షానాథ్‌ (గోరఖ్‌ నాథ్‌) 3. జలంధర్‌ నాథ్‌ (జన్‌ పీర్‌) 4. కనీఫ్‌ నాథ్‌ 5. గెహనీ నాథ్‌ (గైబీ పీర్‌) 6.భార్తరీ నాథ్‌ (రాజా భార్తరీ) 7. రేవణా నాథ్‌ 8. చార్‌పతినాథ్‌ 9. నాగ్‌ నాథ్‌ (నాగేష్‌ నాథ్‌). వీరిని నవ నారాయణులని కూడా అంటారు. ప్రాపంచిక కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీకృష్ణుడు నవ నారాయణులను పిలిచి వారితో నాథ్‌ సంప్రదాయాన్ని ప్రారంభించాడని మరొక కథనం.

 నాథ్‌ సాంప్రదాయం..గురుశిష్య పరంపరానుగతంగా కొనసాగుతుంది. దీక్షా గురువు నుండి దీక్ష తీసుకున్ననాటి నుంచే ఈ సాంప్రదాయంలో చేరినట్లు లెక్క. గురువు శిష్యుడి శరీరాన్ని తాకి తన ఆధ్యాత్మిక శక్తిలో కొంత భాగాన్ని మంత్ర సహితంగా ధారపోస్తాడు.తద్వారా కొత్తగా నాథ్‌ అయిన శిష్యుడికి కొత్తపేరు పెడతారు. ఈ ప్రక్రియలో గురుశిష్యులు దిగంబరులుగానే ఉంటారు. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత జీవితాంతం అతను నాథుడే.దాన్ని స్వయంగా వదిలించు కోలేరు. వేరొకరికి అప్పగించడంకూడా కుదరదు.

 నాథ్‌ సంప్రదాయాన్ని కూడా 12 పంథాలుగా విభజించారు. 1. సత్య నాథ 2. ధరమ్‌నాథ 3. దారియానాథ 4. ఆయినాథ 5. వైరాగ కీయా 6. రామాకే 7.కపిలాని 8. గంగానాథీ 9. మన్నాథీ 10. రావల్‌కే 11.పావాపంథ్‌ 12.పాగ్‌లా పంథీ. మరో వర్గీకరణ ప్రకారం మచ్ఛీంద్రనాథ్‌, ఆదినాథ్‌, మీనా నాథ్‌, గోరఖ్‌నాథ్‌, ఖపర్‌నాథ్‌, సత్‌నాథ్‌, బాలక్‌నాథ్‌, గోలక్‌ నాథ్‌, బిరూపాక్ష్‌నాథ్‌, భర్తృహరినాథ్‌, ఐనాథ్‌, ఖేచార్‌నాథ్‌, రామచంద్రనాథ్‌ అని ఉంది. 

వైష్ణవ సంప్రదాయంలో..

 అవధూత అనగానే చాలామటుకు శైవసాంప్రదాయానికి చెందినవారే ఉంటారు. అయితే వైష్ణవ సాంప్రదాయంలో కనిపించే అవధూతలను తురీయతీత్‌ అవధూతలంటారు. నారద పరివ్రాజక ఉపనిషత్‌’, ‘తురీయతీత్‌`అవధూత్‌ ఉపనిషత్‌గ్రంథాల్లో వీరికి సంబంధించి సమాచారం సమగ్రంగా లభిస్తుంది.

 

సిద్ధులు

దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ప్రాచీన తమిళ గ్రంథాల్లో వీరి ప్రస్తావన ఎక్కువగా కనబడుతుంది. దాదాపు 10వేల ఏళ్ళ క్రితం నుంచి ఈ సాంప్రదాయం ఉందనీ, తొలి సిద్ధపురుషుడు శివుడేనని అంటారు. దక్షిణభారత సిద్ధులను దురాక్రమణదారులైన ఆర్యులు బహిష్కరించారని కొన్ని పుస్తకాలు పేర్కొంటున్నాయి. సిద్ధులను తమిళంలో సిత్తార్‌లని అంటారు. కాశ్మీర్‌ శైవంలో సిద్ధుడు అంటే సిద్ధగురువని భావిస్తారు. ఇతరత్రా సిద్ధులు అని చెప్పినప్పుడల్లా  సిద్ధార్‌లు, నాథ్‌లు, సాధువులు, యోగులని కూడా వీరిని ప్రస్తావించారు. వీరందరూ సాధనా ప్రక్రియను అనుసరిస్తూన్నందువల్ల ఇలా ప్రస్తావించి ఉండవచ్చని  చరిత్రకారుల అభిప్రాయం.

తమిళ సిద్ధులు(సిద్ధార్‌ లేదా సిత్తార్‌) దీర్ఘకాల తపస్సుకు అనుగుణంగా తమ శరీరాలను సిద్ధంచేసుకోవడానికి రహస్య రసాయనాలను వాడతారనీ, దానివల్ల వీరి ఉఛ్వాసనిశ్వాసల వేగం బాగా తగ్గుతుందనీ, వీరికి ఎగిరే శక్తితో సహా 8 శక్తులున్నాయని(అష్టాంగ సిద్ధింగళ్‌) వీరి గ్రంథాలు తెలుపుతున్నాయి. వాటిప్రకారం 18మంది సిద్ధార్‌ లున్నారు. వీరి నాయకుడు శ్రీకగపుళందర్‌. మిగిలిన వారు.. అగస్తియార్‌, కమలాముని, తిరుమూలార్‌, కుతాంబాయి, కోరక్కర్‌, దన్వంద్రి, కొంగనార్‌, సత్తముని, వాన్మీగర్‌, రామ్‌దేవర్‌, నందీశ్వరర్‌(నందిదేవర్‌), ఎడాయిక్కదర్‌, మచ్ఛముని, కరువూరార్‌, బోగార్‌, పాంబట్టి  సిద్ధార్‌, సుందరందర్‌, పతంజలి.

 జైనమతంలో కూడా సిద్ధుల ప్రస్తావన ఉంది. వీరు కర్మబంధాలను తెంచుకుని, జననమరణ చక్రంనుండి విముక్తిపొందినవారనీ, భూ ప్రపంచానికి అగ్రభాగంలో ఉండే శైవశైల అనే ప్రాంతంలో నివసిస్తారని వారి గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. వీరికి కొత్త కర్మలేవీ అంటవు. మోక్షప్రాప్తి పొందుతారు. వీరికి రూపంలేదు. అన్నిరకాల కోరికలు, ఆకర్షణలను జయించారు. వీరికి 8 రకాల గుణాలున్నాయని తమిళ జైన గ్రంథం చూడామణి నిగండుపేర్కొంటున్నది.

 హిందూ ఖగోళ శాస్త్రాలలో సిద్ధలోక ప్రస్తావన ఉన్నది. వైదిక గ్రంథాలు తరచూ ప్రస్తావించే సిద్ధాశ్రమంఅనేది హిమాలయాలలోని ఒక రహస్యప్రదేశంలో ఉన్నట్లు తెలిపారు. ఇంచుమించు ఇటువంటి ప్రస్తావనే శంభారాపేరుతో టిబెట్‌ గ్రంథాల్లో కనిపిస్తుంది. రామాయణ, మహాభారతాలతో సహా ప్రాచీన హైందవ సాహిత్యంలో సిద్ధాశ్రమ ప్రస్తావన అక్కడక్కడా వస్తుంది. రాక్షసులనుంచి రక్షణకు రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకెళ్లిన సందర్భంలోనూ, విష్ణుమూర్తి వామనావతార సందర్భం లోనూ దీని ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది.

 1300-1321 మధ్య మిథిలరాజ్యాన్ని పాలించిన హరసింహదేవుడి ఆస్థాన పండితుడు కవి శేఖరాచార్య జ్యోతిరీశ్వర ఠాకూర రచించిన వర్ణ రత్నాకరగ్రంథంలో 84మంది సిద్ధుల జాబితా ఇచ్చారు.15వ శతాబ్దం నాటి హఠయోగ ప్రదీపికలో 32మంది మహాసిద్ధులజాబితా ఉంది. ఈ రెండింటిలో కొన్ని పేర్లు ఉమ్మడిగా కనిపిస్తున్నాయి. వీరిలో నాథ్‌లుకూడా ఉన్నారు.

సిద్ధ చికిత్స :

ఆయుర్వేద, యునానీలతో పాటూ సిద్ధచికిత్సకూడా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఉంది. సిద్ధ చికిత్సా విధానం దాదాపు 2500 సంవత్సరాల నాటిదని తమిళ గ్రంథాలు చాటుతున్నాయి.

 

నాగసాధువులు :

సాధుఅనే సంస్కృత శబ్దానికి లక్ష్యాన్ని చేరుకోవడం’, ‘అధీనంలోకి తీసుకోవడంవంటి అర్థాలున్నాయి. దీన్నుంచే సాధనవచ్చింది. సాధువు అంటే ఉత్తమ పురుషుడు, సాధ్వి అంటే ఉత్తమ స్త్రీ. మనదేశంలో దాదాపు 40-50 లక్షల మంది సాధువులున్నట్లు కొన్ని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. వీరిని పవిత్రులుగా హిందూమతం గౌరవిస్తుంది. వీరిలో కూడా శైవ, వైష్ణవ, శాక్త సాధువు లున్నారు.మహిళలు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి సాధ్విలుగా మారతారు (ఆనందమాయిమా, అమృతానంద మాయి, కరణామాయి).

 ఇక నాగసాధువుల విషయానికొస్తే 12ఏళ్లకొకసారి వచ్చే కుంభమేళాలు, మహాకుంభమేళాల్లో వీరు వచ్చి తొలిస్నానాలు చేసిన తరువాతనే అవి అధికారికంగా ప్రారంభమవుతాయి. దీన్నిబట్టి వీరి ప్రాముఖ్యత ఊహించవచ్చు.

 వీరిది రహస్యజీవితం. ప్రత్యేక సందర్భాల్లోనే జనం మధ్యకు వస్తారు. నాగ్‌అంటే దిగంబరం అనికూడా అర్థముందట. వీరుపూర్తి దిగంబరులుగానే తిరుగుతారు. వీరిని నాగ్‌బాబాలనికూడా అంటారు.

 నాగ సాధువుల సాంప్రదాయాన్ని దత్తాత్రేయుడు ప్రారంభించారని చెబుతారు. అయితే సనాతన ధర్మ రక్షణకు వీరిని సైనికదళాలుగా మలిచినదిమాత్రం శంకరాచార్యుడే. మతాన్ని కాపాడుకోవడానికి(అప్పటి దేశకాల పరిస్థితుల్లో) రెండింటి అవసరం బాగా ఉందని ఆయన గుర్తించాడు. ఒకటి శాస్త్ర(జ్ఞానం), రెండవది అస్త్ర(ఆయుధం). జ్ఞానవ్యాప్తి ఆచార్యులకు(శాస్త్రధారులకు), మతరక్షణ నాగ్‌లకు (అస్త్రధారులకు) అప్పగించాడని చెబుతారు.

 దానికి తగ్గట్టుగానే నాగ సాధువుల ప్రవర్తన కూడా అరివీర భయంకరంగా ఉంటుంది. త్రిశూలం, కత్తి, దండం వీరి ఆయుధాలు. 1950కి ముందయితే మతగౌరవానికి, వారి సాంప్రదాయానికి ఎవరయినా భంగం కలిగిస్తే దాడి చేసేవారు, చంపడానికి కూడా వెనుకాడేవారు కారు, అది కుంభమేళాఅయినా సరే. వీరికి చావంటే భయం లేదు.(అప్పటి చట్టాలు కూడా వీరిని ఉపేక్షించేవని అంటారు.)

 ఒంటినిండా విభూతిని అలముకుంటారు. శంఖం, డమరుకం, రుద్రాక్షలుంటాయి. చిల్లుంతో ధూమపానం చేస్తారు. వీరు గుంపులు, గుంపులుగాతిరుగుతారు. బయటసమాజంతో సంబంధాలే కాదు, సంభాషణలుకూడా ఉండవు. వీరు తరచుగా పలికే శ్లోకం..

‘‘శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం

సూత్రభాష్య కటోబందే భగవత్‌ పునః పునః’’

 

(శివుణ్ణిఅయిన నేను ప్రపంచాన్ని కాపాడడానికి ప్రతి యుగంలో పుడుతూ ఉంటాను)... ధర్మసంస్థాప నార్ధాయ ..లాంటిది ఇది.

వీరు నివసించే ప్రాంతాలను అఖాడాలంటారు. 

 సాధువులు, యోగులు, అవధూతలు, సిద్ధులు, నాథ్‌లు తదితరులు పవిత్రులుగా హిందూ సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటున్నా, మనదేశ చట్టాల్లో మాత్రం ప్రత్యేకంగా వీరికి ఎటువంటి గుర్తింపులేదు.

-      ములుగు రాజేశ్వర రావు,

సీనియర్ జర్నలిస్ట్

 

(శ్రీరామదూత స్వామివారి శిష్యులు వారి మాసపత్రిక వందేహం రామదూతం` ప్రత్యేక సంచిక(ఏప్రిల్, 2014)-

ప్రచురించే సందర్భంలో వృత్తిపరంగా నా సహాయ సహకారాలకోసం వచ్చి కలిసినప్పుడు 

వృత్తి బాధ్యతగా జిజ్ఞాసను పెంచుకుని ఆరాతీస్తే నాకు కొంత సమాచారం లభించింది. 

అదే ఈ  వ్యాసం... ఆ సంచికలో ప్రచురితమైంది.)

(ఈ అంశం మీద.. మరీ ముఖ్యంగా నాగసాధువుల మీద మరింత అవగాహన కోసం, సమాచార సేకరణకోసం త్వరలో గోరఖ్‌పూర్ వెడుతున్నా...  ఈ ప్రయత్నంలో నాకు తోడ్పడగల మిత్రులు, పాఠకుల నుంచి మరింత సమాచారం, మార్గదర్శకత్వం కోరుకుంటున్నా..   నా ఇ-మెయిల్-mideabox@gmail.com )



పర్మినెంట్ అడ్రస్ అంటే ...!!!

 


పర్మినెంట్ అడ్రస్...!!!

 

దరఖాస్తు నింపుతూ పోతున్నా...

పర్మినెంట్ అడ్రస్ కాలమ్...... !!!

..............................

ఏదని రాయాలి, ఏమని రాయాలి ?

కలం ఆగింది.. కాలు కదపలేకపోతున్నది..

 

జీవం పోసుకున్నప్పుడు...

అమ్మ పొట్టేకదా అనుకున్నా..

బొడ్డూడిపడినాక..

అమ్మ ఒడివీడినాక...

కాలికి బలపం కట్టినాక..

ఇళ్ళకు ఇళ్ళే వదిలినాక...

ఊళ్ళకు ఊళ్ళే మారినాక...


ఏం రాయాలో తోచక

ఆ కాలమ్ ఖాళీగా ఉంచేద్దామనుకున్నా...

కాలం మూడి ఈ లోకాన్ని కూడా వదిలేస్తుండగా....


చిత్రంగా దూతలు వచ్చారు, గుప్తంగా చిట్టాలు విప్పారు

అక్కడెక్కడో నన్నో అగాధంలో పడేసి అడ్రస్ చెప్పారు...

పోన్లే నరకమయితేనేం.. అద్దెకొంపలు అలవాటేగా !

పర్మినెంటంటూ ఒకటి దొరికిందనుకున్నా...

పాపం తాలూకు బాకీ తీరంగానే  తన్నితరిమేసారు..

 

మరీ మంచిది .. తంతే నేతిబుట్టలో పడ్డట్టు...

ఇంద్రుడింటి దగ్గర మకాం పక్కా అనుకున్నా..

పుణ్యం ఖాతా ఖాళీకాంగానే

పాతలోకంలోకి  కొత్త అడ్రసులో

బొక్కబోర్లా  దొర్లించేసారు...


మరి నా పర్మినెంట్ అడ్రస్సో...!!!!


క్షణం ఆలస్యం కాకుండా..

పుట్టలనడిగా, పిట్టలనడిగా..

పండితులనడిగా... పీఠాలనడిగా..

గుట్టుచప్పుడు కాకుండా గుళ్ళల్లో దూరి..

దేముళ్ళను కూడా అడుగుతూ కడిగా.....


ఆకాశవాణి పలికింది..

చీకటివెలుగులకు

సుఖదుఃఖాలకు

నదీనదాలకు,

ధాత్రీధరాలకు,

జీవాత్మ, పరమాత్మలకే

అవసరంలేని

ఈ ప్రశ్న

నీకంత అవసరమా !!!!


కుప్పకూలిపోయింది  కాలం ఒక్కసారిగా

నా పర్మినెంట్ అడ్రస్ కాలమ్ దగ్గర నిర్వేదంగా...

 

-చినవ్యాసుడు, మా ఊరు


......................


పూనకాలు లోడింగ్.....

 



 పూనకాలు లోడింగ్.....

 

కాటుక మంచిదే కానీ, కన్ను పోయేటంతగా రెచ్చిపోతే ఎలా ? ఈ మధ్యకాలంలో తెలుగునాట ఏ చిన్న సంబరం కనిపించినా కాళ్ళు భూమి మీద నిలవడం లేదు, శివాలెత్తినట్టు ఊగిపోతున్నారు.  ఇల్లు అలికే సంబరంలో ఈగ తన పేరు మర్చిపోయిన కథ చిన్నప్పుడు చదువుకున్నాం... గుర్తుండే ఉంటుంది.

 

నాకు గుర్తున్నంతవరకు భోగి మంటలప్పుడు (నాదీ గ్రామీణ నేపథ్యమే)మగవారి హడావిడి ఎక్కువ. ఎండిన చెట్లకొమ్మలు, మొద్దులు, ముళ్ళకంపలు, పాడయిపోయిన, పనికిరాని ఇంటితాలూకు చెక్క సామాగ్రివంటి వాటిని ముందురోజు రాత్రినుంచే సేకరించి తెల్లవారక ముందే ... పిడకలు పెట్టి మంటపెట్టి తరువాత ఒక్కొక్కటిగా దానిమీద వేస్తుంటే, ఇరుగుపొరుగంతా  దాని చుట్టూ చేరి సంబరంగా గడపడం... పొద్దున తిన్నంత తిని చిరుతిళ్ళు జేబుల్లో కుక్కుకుని గాలిపటాలు తీసుకుని కుర్రకారు ఇల్లొదిలితే... ఎప్పుడో ఆకలేసినప్పడు వచ్చి గబగబా అంత లాగించేసి.. అప్పటికే బయట నుంచి దోస్తుల అరుపులు, కేకలు...చెయ్యికూడా సరిగా కడుక్కోకుండానే ఒక్క దూకుడు బైటికి.....

 

ఆడవాళ్ళు మాత్రం చిన్నాపెద్దా..చీకటితోనే లేచి ఇంటిముందు శుభ్రం చేసుకుని కళ్ళాపి చల్లి, ఆవుపేడ, గుమ్మడిపూలతో గొబ్బిమ్మలను సిద్ధం చేసుకుని,  పోటీలుపడి ముగ్గులు వేయడం... వేసినవాటిని ఇంటికొచ్చిన అతిథులు, పిల్లాజెల్లాతో కలిసి... పోల్చి చూసుకుంటూ ఎడతెగని ఆనందాలతో మైమరిచిపోతుంటే....  లోపల అమ్మలు, బామ్మలు పిండివంటలతో ఫుల్ బిజీ...పొద్దుగుంకి చీకటిపడేవేళకు.... చిన్న పిల్లలకు భోగిపళ్ళు, ఈడొచ్చిన పిల్లలతో కలిసి బొమ్మలకొలువులతో పేరంటాల సందడి...

 

 పెద్ద పండక్కి సెలవులియ్యంగానే  కూతుళ్ళు, అల్లుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు వస్తున్నారని ....మూడు నాలుగురోజుల ముందునుంచే ఇల్లూవాకిలి శుభ్రం చేసుకోవడాలు, సర్దుకోవడాలూ, ఇంటికి కావలసిన సరుకులు, ఇంటిల్లిపాదికీ బట్టలు కొనుక్కోవడాలు....ఒకటే హడావిడి..తీరిక దొరికేది కాదు ఎవరికీ..

 

మూడో రోజు కనుమ పండుగ. నిజంగా ఆరోజు ఎద్దులకు పండగే. అన్ని రకాల చాకిరీ నుంచి వాటికి ఫుల్ హాలిడే. శుభ్రంగా వాటిని కడిగి పసుపు కుంకుమలతో అలంకరించడం... అవి ఇష్టంగా తినేవాటిని తినిపించడం, వాటితో ఆటాపాటా... ఎడ్లపందాలు, వాటికి తోడు కోళ్లపందాలు.....వగైరా... అది పశువుల పండగగా మాత్రమే ప్రసిద్ధి. కనుమనాడు కాకయినా కదలదంటూ ఇంటికొచ్చిన వారిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఆత్మీయంగా అడ్డుకునేవారు...

 

మరిప్పుడో...

అడితినుంచి వంట చెరుకుగా ఉపయోగించే కట్టెలను కొనుక్కొచ్చి త్రికోణాకారంలో పేర్చి, దానికి పూలు చుట్టి, దండలు వేసి, దాని చుట్టూ ఆడవారే ఎక్కువగా చేరి చప్పట్లు కొడుతూ ఆడడం పాడడం... అన్ని పండగలకు బతకమ్మ ఫార్మాటే... మధ్యలో డాండియా కూడా... ఫ్లాట్ల సెటప్ లో ముగ్గులకు చోటుండదు.. అగ్గిపెట్టెలాంటి ఇంటిముందు మరో చిన్న కుంకుమ భరిణంత ముగ్గు... ఎంత ఖర్చుపెట్టినా, ఎంత సందడి చేసినా అంతవరకే... (అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అందరూ కలిసి అది వేరే విషయం...)

 

పిండివంటలకు ప్రాంతీయ భావోద్వేగాల వైరస్ సోకి తెలంగాణ పిండివంటలు, ఆంధ్రా పిండివంట లంటూ రెండు కుంపట్లు వెలుగుతున్నాయి...అటూ ఇటూ ఒకటో అరో తప్ప అన్నీ అవే ఐటమ్స్.... భావోద్వేగాలను... అమ్మేవారు సొమ్ము చేసుకుందామనుకున్నా...కొనేవారిలో మాత్రం ... నోటికి నచ్చింది, కంటికి నప్పింది కొనేసుకుంటూ పోతున్నారు, ఏ కుంపటిదని చూడకుండా.....ఇంటిపట్టున చిరుతిళ్ళు తయారు చేసుకునే అలవాటును మనం ఎప్పుడో వదులుకున్నా... పండగలప్పుడు కూడా వాటి తాలూకు ప్రత్యేక వంటల వాసనలు ఏ వంటింట్లోనూ కనిపించడం లేదు. స్వగృహ, స్విగ్గీల సంస్కృతి బాగా ప్రబలిన తరువాత పండగ రోజుల్లో పొయ్యి వెలగడం లేదు. దీనికి మేము కూడా మినహాయింపేమీ కాదు. మొన్ననే అరిసెలు, చక్కిలాలవంటివి కొని తెచ్చేసుకున్నాం. నిన్న పొద్దున మా పనిమనిషి.. లంబాడీ పిల్లను ...‘ఏం రజితా ! కూతురు హాస్టల్ నుంచి వచ్చింది కదా... పండక్కి పిండివంటలు ఏ కొంటున్నావ్’ అనడిగితే... చెంప చెళ్ళుమనే జవాబిచ్చింది... ‘అరిసెలు, సకినాలు నేనే చేస్తున్నా సారూ... అయి కూడా బైటినుంచి కొంటామా...’’ అంది అమాయకంగా... అంటే ఆచారాలను, సంస్కృతిని... అవి కొన ఊపిరితో ఉన్నా.... వాటిని ఇంకా ఎవరు బతికిస్తున్నారు... ఈ రజితలే... మనం కాదు.

 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....

పైన చెప్పిన దాంట్లో ఆక్షేపించాల్సినదేమీ లేదు. ఎవరినీ తప్పుపట్టాలసిన అవసరమేమీ లేదు... కాలం మారుతున్నది. దానికి తగ్గట్టు జీవనశైలి కూడా మారుతున్నది. ఓ 20 ఏళ్ళ తరువాత ఈ అనుభవాలే... ఇప్పటి తరానికి అప్పుడు... ఆపాత మధురాలు......

 

అయితే... ప్రతి పండగకూ ఒక ప్రత్యేకత ఉంటుంది... దానిని తీసేసి పండగ జరుపుకుంటున్నాం. ఒఠ్ఠిగా కూడా కాదు... పూనకాలు లోడింగ్ చేసుకుంటున్నాం....

 

బతకమ్మనృత్యాలు బతకమ్మ పండక్కి ప్రత్యేకం.. అన్నిటికీ  అవే స్టెప్పులేస్తే... బతకమ్మ ప్రత్యేకత పోతుంది కదా !  అది మంచిదా !!! దాని విశిష్ఠతను కాపాడుకోవాలి కదా !   అలాగే మనకంటూ ప్రత్యేకంగా కోలాటాలున్నాయి,  కోలాటం పాటలున్నాయి.. జడకోలాటం వంటి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ప్రక్రియలున్నాయి. వాటిని వదిలేసి, వాటిని కాపాడుకోకుండా, వాటిని అభివృద్ది చేసుకోకుండా దాండియాలు దిగుమతి చేసుకోవడం అవసరమా !

 

అన్నింటా మన ప్రత్యేకతను కోల్పోతున్నాం.. చివరకు మన వస్త్ర ధారణ కూడా....మన ప్రత్యేకత-అడ్డ పంచె కాదు, కానే కాదు. ధోవతి మన సొంతం. శుభకార్యం అయినా, అశుభం అయినా.. ధోవతితోనే తంతు నడపాలి... తప్పదు కాబట్టి అంతవరకు నడుపుతున్నాం. ఇంత ప్రబలమైన సంస్కృతి ఉన్నా... అడ్డపంచెతో ‘రామరాజ్’ అడ్వర్టయిజ్మెంట్ చూపి ఇదీ మన తెలుగు సంస్కృతి అని ఓ సినీ నటుడు చెప్పంగానే ... ఇదేమన సంస్కృతి అనుకుని ఫంక్షన్లలో యువత అడ్డపంచెలతో సంబరాలు చేస్తుంటే మురిసిపోతున్నాం.

 

ఏతావాతా చెప్పేదేమిటంటే... తెలుగువారిగా మనకున్న ప్రత్యేకతలన్నీ మనం ఒక్కొక్కటిగా వదిలేసుకుంటున్నాం. మన ఉనికిని మనమే పోగొట్టుకుంటున్నాం.

 

ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు... ఇవన్నీ మన ఆస్తి, మన పెద్దలు మనకిచ్చిన అమూల్యమైన సంపద. మన ఆత్మగౌరవానికి ప్రతీకలు. వీటిని ప్రభుత్వాలు నిలపవు. వ్యక్తిగత, సామాజిక చిత్తశుద్ధిమీద ఆధారపడి ఉంటాయి.  ఒకప్పుడు వీటికి అవసరమైన మార్గదర్శనం సమాజం నుండే అంతర్లీనంగా అందేది...

 

ఇప్పుడు ఆ లింక్ మిస్సింగ్....మనుషులు, కుటుంబాల మధ్య చాలా లింకులు ఇప్పటికే... అలాగే ఇది కూడా....

 

ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న తరువాత ఇప్పుడు ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉత్సాహం పెరిగింది. ఏ చిన్న అవకాశం వచ్చినా, ముఖ్యంగా సంబరాలకు సంబంధించినది... చిన్నాపెద్దా ముసలీ ముతకా అందరూ ఒక రేంజ్ లో ఊగిపోతున్నారు.... అది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దానికి ఆలోచన, మన ఆచార వ్యవహారాలు ఏవో తెలుసుకోవాలన్న ఆరాటం, వాటిని నాలుగు కాలాలు నిలుపుకోవాలన్న ఆసక్తి  ఉంటే...

 

ఆ మిస్సింగ్ లింక్ దొరికనట్టే....

 

-చినవ్యాసుడు

.....................



జడకోలాటం

https://www.youtube.com/watch?v=vCPusgz3RDM

https://hydnews-net.translate.goog/2021/06/jadakoppu-kolatam-an-art-to-celebrate-laboured-folklore-in-telangana/?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc

 

ఎవడ్రా ఈ రామోజీ రావ్ !!!

 



ఎవడ్రా ఈ రామోజీ రావ్ !!!

 

 ...అని అడిగింది ఎవరో కాదు.... ప్రఖ్యాత చలన చిత్ర నేపథ్య గాయకుడు  శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం.

1978-79 ప్రాంతంలో... నేను మద్రాసు వెళ్ళా... వారి కుటుంబంతో  పరిచయం కారణంగా వారింట్లోనే బస.  ఏం చేస్తున్నావు రా! (అంటే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నావు ?) అని బాలసుబ్రహ్మణ్యం అడిగినప్పుడు ‘ఈనాడు’ అని చెప్పగానే ... ఆ మరుక్షణం అప్రయత్నంగా ఆయన నోటివెంట చాలా కుతూహలంగా వచ్చిన ప్రశ్న అది...

వివరాల్లోకి వెడితే....

తెలుగునాట అప్పటికే సంచలనం సృష్టిస్తున్నది ఈనాడు దిన పత్రిక. అధికారంలో ఉన్న వారి నిద్ర చెడగొడుతున్నది. జర్నలిజంలో వినూత్నపోకడలు, రాజకీయంగా సంచలనాత్మక కథనాలు, పరిశోధనాత్మక వార్తాకథనాలకంటే... ‘ఎవ్వడికీ భయపడం’... అన్న చందంగా సాహసోపేతంగా వదులుతున్న బాణాలు... వీటితో ఈనాడు ఒక పత్రికగా అమ్మకాలు పెంచుకుంటూ, స్థిరంగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే....

ఒక పత్రిక స్వతంత్రంగా, ధైర్యంగా వ్యవహరిస్తూ పోతూ దానికాళ్ళమీద అది నిలదొక్కుకోవాలంటే... ఆర్థికంగా అండదండలు గట్టిగా ఉండాలన్న సంకల్పం యాజమాన్యానికి ముందు నుంచీ ఉంది. దానికి సాక్ష్యమే... పత్రికకంటే ముందు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ను  విజయవంతం చేయడం. ఇది ఇచ్చిన వెన్నుదన్నుతోనే ఈనాడు పురుడు పోసుకుంది. సుఖ ప్రసవం అయింది. (చెన్నారెడ్డి కాలంలో ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా ఆపేసినప్పుడు పత్రిక తట్టుకుంది. తరువాత జలగం వెంగళరావు కాలంలో ఈనాడును నియంత్రించడానికి పరోక్షంగా మార్గదర్శిపై చర్యలు తీసుకోవడానికి చిట్ ఫండ్ చట్టం పేరిట కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు... ఈనాడు మార్గదర్శికి తోడ్పడింది). అయితే కేవలం మార్గదర్శి మీద ఆధారపడకుండా ఈనాడు పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి...ఇతరత్రా వ్యాపారాలు అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటికే ‘ఇమేజెస్’ అనే హోర్డింగ్ కంపెనీ, కిరణ్ యాడ్స్ పేరిట ఒక యాడ్ ఏజన్సీ, సితార సినిమా పత్రిక ఈనాడుకు అన్నివిధాలా తోడ్పడుతూ పోతున్నా... పూర్తిగా మీడియా రంగానికి భిన్నంగా ప్రారంభమైన వ్యాపారం –‘ప్రియా ఫుడ్స్’..అనే నిల్వ పచ్చళ్ళ వ్యాపారం.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించే సమయానికి.. ఈ రంగం ఎలా ఉండేది... 

హైదరాబాద్ రాజధాని కావడంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న  ఆంధ్రాప్రాంతం వారు, పనులమీద, వ్యాపార అవసరాలకొద్దీ నగరానికి వచ్చిపోయే ఫ్లోటింగ్ జనాభా పెరుగుతూ పోతుండడంతో ...వీళ్ళ రుచులు, అభిరుచులు, అవసరాలు, ప్రయోజనాలకోసం..‘ఆంధ్రా మీల్స్’ ‘ఆంధ్రా భోజనం’ ఆకర్షణగా హోటళ్ళు, మెస్‌లు వెలిసాయి. పూతరేకులు, బందర్ లడ్లవంటి పక్కా ఆంధ్రా పిండివంటలు కూడా అక్కడక్కడా దొరుకుతూ ఉండేవి. ఆ కోవలోకి కొత్తగా వచ్చి చేరినవి...ఊరగాయలు, ఇతర నిల్వ పచ్చళ్ళే అయినా.. మిగిలిన వాటిలాగా వీటికి అంత ఆదరణ ఉండేది కాదు.

దీనికి కారణాలను లోతుగా విశ్లేషించిన ఒకరిద్దరు వ్యాపారులు... ప్రత్యేకంగా ఎండాకాలంలో గుంటూరు, తెనాలి వంటి ప్రాంతాలకు వెళ్ళి, అక్కడి మహిళల సహకారంతో అక్కడే శుచి, శుభ్రతలతో వారి చేత పచ్చళ్ళు పెట్టించి(కొద్ది మొత్తాల్లోనే) జాడీలతో తెచ్చి హైదరాబాద్ లోని ఒకటి రెండు చోట్ల అమ్ముతుండేవాళ్ళు. ఇది ఆదరణకు నోచుకున్నది (జయా ఫుడ్స్/పికిల్స్ వంటివి).

ఔత్సాహిక వ్యాపారి  అయిన ఒక తెలుగు న్యాయమూర్తి కుమారుడు ఈ వ్యాపారంపట్ల కుతూహలం కనబరిచాడు. అయితే స్థానికంగాకంటే... అప్పటికే విదేశాల్లో గణనీయంగా పెరుగుతున్న భారతీయులకు సంప్రదాయ రుచులు అందించడానికి ‘స్పెన్సర్’ కంపెనీ పచ్చళ్ళ ఎగుమతి వ్యాపారంలోకి దిగింది. అయితే దాని పచ్చళ్ళలో ఆంధ్రా స్పెషల్స్ ఉండేవి కావు. అందువల్ల ఈ ఔత్సాహిక వ్యాపారి వారి వెనుకే పోతూ ఎగుమతులకు ప్రయత్నిస్తున్న రోజుల్లో...

పచ్చళ్ళ ఎగుమతులమీద కన్నేసి ‘ప్రియా ఫుడ్స్’  రంగప్రవేశం చేసింది. రామోజీరావు అండ్ టీమ్ ఏది చేసినా దానిలో చాలా విశిష్ఠతలు ఉండేటట్లు చూడడం వారి ప్రత్యేకత. స్వచ్ఛత, శుభ్రతల కోసం .. పాలరాతి వంటశాలలు (లాబ్స్ అనేవారు..అప్పటికి ఇటువంటి ఏర్పాటు కొత్త), రేటు గిట్టుబాటు కావడానికి కారం, పసుపు వంటివి బయట కొనకుండా స్వంతంగా తయారు చేసుకోవడం(వారి అవసరాలకు పోను, మిగిలినది ప్రియా బ్రాండ్ పేరుమీదే విడిగా అమ్ముకోవడం), ఊరగాయలకు అవసరమైన మామిడి తదితర కాయలు కూడా స్వంత తోటల(లేదా కౌలు ఏర్పాటుతో) నుండి సేకరించడంవంటి ఏర్పాట్లు ఘనంగా చేసి... మొత్తానికి ప్రాడక్ట్ బయటికి తెచ్చారు. స్వంతంగా ఉన్న పబ్లిసిటీ సంస్థలు, స్వంత మీడియాను(ఈనాడు, సితార, చతుర, విపుల) గరిష్ఠంగా ఉపయోగించుకుంటే అమ్మకాలకు తిరుగుండదనే మొండి ధైర్యం.....

అనుకున్నదొకటి, అయిందొకటి... అన్నట్లు.. ప్రియాఫుడ్స్ మార్కెట్ లోకి ప్రవేశించినా, ప్రచారం ఆర్భాటంగా హోరెత్తించినా ముఖ్యంగా ప్రవాసాంధ్రులకోసం ఎగుమతులకు ప్రాధాన్యం ఇచ్చి ఆ దిశగా కదిలినా. .. అప్పటికే స్పెన్సర్ వంటి కంపెనీలు క్యూలో నిలబడి కళ్ళు తేలేయడం చూసి ఖంగుతిన్నారు. దానిమీద భారీగా పెట్టిన పెట్టుబడులు, శ్రమ.. దిక్కు తోచని స్థితి.

అయినా ఓటమిని లేదా వైఫల్యాన్ని ఒకపట్టాన అంగీకరించడానికి ఇష్టపడని రామోజీ బృందం ... పబ్లిసిటీతో స్పీడు పెంచి స్ధానిక జనాలకు దగ్గర కావడానికి ఒక కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నది. ఇన్ స్టంట్ స్పందన.. క్షణాల్లో జనాలను ఆకర్షించడానికి షార్ట్ కట్ రూట్ –సినిమా గ్లామర్. ఎలాగూ ‘సితార’ చేతిలో ఉంది. ఇతర సినిమా పత్రికలంత అమ్మకాలు దీనికి ఎప్పుడూ ఉండేవి కావు. పైగా (కాస్తంత పొగరుగా ఉండే) డైలీ పేపర్ జర్నలిజం,  కొద్దిగా వంగమంటే ఏకంగా సాష్టాంగపడే సినిమా జర్నలిజం ..రెండూ భిన్న ధృవాలు. కానీ సితార కూడా ఈనాడు పొగరును పుణికి పుచ్చుకుని నడుస్తుండడంతో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం దానిని అక్కున చేర్చుకోలేదు... కొంత దూరంలోనే ఉంచింది. కానీ ‘కింగ్ మేకర్’ మైండ్ సెట్ తో ఉండే రామోజీ బృందం సితారను అడ్డుపెట్టుకుని సినిమా గ్లామర్ ను ఉపయోగించుకోవడానికి కొత్త వ్యూహాన్ని అమల్లో పెట్టింది.

నీరాజనం.....

అప్పట్లో ‘ఆకాశవాణి’లో ‘నీరాజనం’ అని ఒక ప్రాయోజిత కార్యక్రమం వారంలో ఓ అరగంటపాటూ రాత్రి 9.30 గంటలకు(సమయం సరిగా గుర్తు లేదు) ప్రసారమయ్యేది. దానిని ప్రముఖులు సమర్పించేవారు. మధ్యలో తాజా సినిమా హిట్ సాంగ్స్ ఉండేవి. ఇది బాగా పాపులర్ అయింది. కిరణ్ యాడ్స్ దీనిని చాలా వారాలపాటు ముందుగానే బుక్ చేసుకున్నది. రామోజీ టీమ్ ఎంపిక చేసిన  ప్రముఖుల వద్దకు...  సితార విలేకరులు స్వయంగా వెళ్ళి, వారి డీల్ ను వివరించేవారు... ‘‘ఈ కార్యక్రమాన్ని మీరు సమర్పించాలనేది మా బాస్ అభీష్ఠం.  మీరు దీనిని సమర్పిస్తే ప్రతిఫలంగా సితార కవర్ పేజీ మీద ఫొటో, లోపల మీ ఇంటర్వ్యూలు, ఫొటోలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ప్రచురిస్తుంటాం....’’ అని చెప్పేవారు.  పవర్ ఫుల్ మీడియా(ఈనాడు).. అదీగాక సినిమా పత్రికలో పబ్లిసిటీ అంటున్నారు... అవి ఉన్నా లేకపోయినా, ఈ డీల్ ఒప్పుకోకపోతే...వారు పగ పడతారేమోనన్న భయం కొద్దీ.. దాదాపు అందరూ ఒప్పుకునేవారు. టాప్ లో ఉన్న కొంత మంది  సినీ తారలు మాత్రం లెక్కలు వేసి చూసుకుని ...గిట్టుబాటు కాదనుకున్నప్పుడు  ముఖాన్నే ‘నో’అని చెప్పి మీడియా వారితో లేనిపోని గొడవలు కొని తెచ్చుకోవడం ఎందుకని... ఏవో కారణాలు చెప్పి లౌక్యంగా తప్పుకునేవారు. 

ఇదీ నేపథ్యం... ఇక ఆ తరువాత...

ఇలాంటి సమయంలో ఒకనాడు మద్రాస్ లో ఉన్న సితార బృందం...బాలసుబ్రహ్మణ్యం గారి అపాయింట్ మెంట్ అడిగారు. అప్పుడు ... రోజుకు ఆరేడుపాటల రికార్డింగులతో జోరుమీదున్న ఆయన కొంత వెసులుబాటు చేసుకుని వీరికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. .. ఇంటిదగ్గర కలవడానికి.

వారు వస్తూనే ఐదారు రకాల ప్రియ పచ్చళ్ళు ప్యాక్ చేసి ఉన్న కార్టన్లను తెచ్చి ఆయనకు అందచేసారు. ఇతర ప్రముఖులకు చెప్పినట్లుగానే ..మా బాస్ మీ పాటల అభిమాని. మిమ్మల్ని స్వయంగా కలిసి ఇవి ఇమ్మనమని పంపారు... అంటూ డీల్ చెప్పారు. అసలు నీరాజనం పాపులర్ అవుతున్నదే లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో.. అందునా బాలసుబ్రహ్మణ్యమే వాటిని సమర్పిస్తే.. ఇంకేం.. సూపర్ డూపర్ హిట్... ఆ ప్రోగ్రాం మాత్రమే కాదు, ప్రియా పచ్చళ్ళ అమ్మకాలు కూడా ఆకాశమార్గం పడతాయి. .. ఇలాటి భావనామృతంలో తేలియాడుతున్న రామోజీ బృందానికి పరోక్షంగానూ, వచ్చి స్వయంగా కలిసిన సితార బృందానికి ప్రత్యక్షంగానూ దిమ్మతిరిగే షాకిచ్చారు... తియ్యటి మాటలతో పైకి చాలా సౌమ్యంగా, ఆత్మీయంగా కనిపించే ఆ నేపథ్య గాయకుడు.

ఆయన మాటల్లోనే చెప్పాలంటే...

‘‘చూడు బ్రదర్ ! నాకు ఆ రామోజీరావు గారు ఎవరో తెలియదు. పరిచయం లేదు. ఈనాడు, సితారల గురించి వింటున్నా..నేను ఇంటికి హిందూ పత్రిక వేయించుకుంటా.. అది చదవడానికే సమయం దొరక్క ఎప్పుడో ఒకసారి చదువుతుంటా వీలు చిక్కినప్పుడు(ఎక్కువగా వాష్ రూములో). మీ పత్రికలు అక్కడక్కడా చూస్తున్నా. ఇక మీరు చెప్పిన దానిని బట్టి... నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి.

ఒకటి – మీరు నాకు కవరేజి ఇస్తాననడం, నాఫొటోలు వేస్తాననడం. సరే.. మీ పాఠకులకు అవి అవసరమనుకుంటేనే వేయండి. వద్దనుకుంటే వేయకండి. మీడియాలో నాకు మిత్రులు చాలా మంది ఉన్నా... నా ఫొటోలు, నా వార్తలు వేయమని ఇప్పటివరకు నేను ఎవరినీ అడగలేదు. అలా అడిగి వేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల ...అవి వేయాలా వద్దా... అనేది మీరు, మీ సిబ్బంది, మీ యాజమాన్యం నిర్ణయించుకోవలసిన విషయం.

ఇకపోతే... నీరాజనం కార్యక్రమం నేను సమర్పించాలన్నారు. అది వాణిజ్య కార్యక్రమం. ఒక ఉత్పత్తి అమ్మకాలు పెంచుకోవడానికి మీరు చేసుకుంటున్న పబ్లిసిటీ. మీ బ్రాండ్ విలువ పెంచుకోవడానికి చేసుకుంటున్న ప్రయత్నం. మంచిదే. మంచి వ్యాపార వ్యూహమే. అయితే నేను సినిమారంగంలో చేస్తున్నది కూడా వ్యాపారమే. పాటలు ఉచితంగా పాడడం లేదు. కచ్చేరీలు కూడా ఉచితంగా చేయడం లేదు. డబ్బులు తీసుకుని పాడుతున్నా. నాది కూడా వ్యాపారమే. ఇటువంటి  కార్యక్రమాలకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా లేదా యాంకర్ గా లేదా ప్రజెంటర్ గా  ఉండాలంటే... దానికి నా టర్మ్స్  నాకున్నాయి. అవి మా పిఏ ను అడిగితే వివరిస్తాడు. మీరు చేసేది, నేను చేసేది వ్యాపారమే అయినప్పుడు మనం వ్యాపార భాషలోనే మాట్లాడుకుంటే బాగుంటుందేమో’ అని ముగించాడు.

ముఖాలు పాలిపోయాయి. బాస్ కు ఏమని చెప్పాలి ? ఎలా చెప్పాలి ? ఈ ఆందోళనతో గేటు దాటుతున్న వారిని బాలసుబ్రహ్మణ్యం వెనక్కి పిలిచి...‘‘మీ కార్టన్లు ఇక్కడే మర్చిపోయి పోతున్నారు. తీసుకెళ్ళండి. మాకు ఇంటి పచ్చళ్ళు ఉన్నాయి. అవి సరిపోతాయి. ప్లీజ్.. మరోలా అనుకోవద్దు... క్షమించండి’’

ఇంకేమనాలో తెలియక వాటిని కూడా వెనక్కి మోసుకెళ్ళిపోయింది ఆ బృందం.

ఇది జరిగిన నెలా రెండునెలల లోపే నేను మద్రాస్ కు వెళ్ళడం.. అది కూడా నేను ‘ఈనాడు’లో పనిచేస్తున్నానని చెప్పడంతో నిజంగానే అప్పటివరకు రామోజీరావు గురించి తెలియని బాలసుబ్రహ్మణ్యానికి – ప్రియా పచ్చళ్ళ డీల్ దరిమిలా ఏర్పడిన కుతూహలం ఆపుకోలేక...  నేను సాధికారికంగా, ఉన్న వాస్తవాలను చెప్పగలనన్న నమ్మకంతో నన్నడిగిన ప్రశ్న...

‘‘ఎవడ్రా ఈ రామోజీ రావ్ ! నాకు ఇంటికి పచ్చళ్ళు పంపిస్తానంటాడు. నీరాజనం చేయాల్ట..  దానికి నా ఫొటోలు, ఇంటర్వ్యూలు, వాళ్ళ పత్రికల్లో ప్రామినెంట్ గా వేస్తారట..’ అని

....

కొసమెరుపు : కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ‘పాడుతా తీయగా’ సీరీస్ మొదటి విడత బ్రేక్ (సుమన్ హయాంలో) వచ్చే వరకూ – కమర్షియల్  టర్మ్స్ లోనే ఉన్నారు వారిద్దరూ. ఆ తరువాత బాలసుబ్రహ్మణ్యం వెంటనే జెమినీ ఛానల్ లో ఎందరో మహానుభావులు(13 ఎపిసోడ్స్), ఆ వెనువెంటనే మాటివిలో ‘పాడాలని ఉంది’ సీరీస్ కు(దాదాపు నాలుగైదేళ్ళు నడిచింది) ఒప్పుకున్నప్పుడు.. రామోజీ రావు బృందం అభ్యంతరం లేవదీసింది.. నిర్మొహమాటంగానే (కొంత కటువుగానే) మాటలు పేలాయి. అప్పుడు కూడా కమర్షియల్ టర్మ్స్ లోనే... అయినా తగ్గని బాలసుబ్రహ్మణ్యం ఇతర  ఛానల్సులో తన ప్రోగ్రాములను  కంటిన్యూ చేసారు.... ఆ తరువాత (సంధి ఎక్కడో కుదిరి....  ఇద్దరికీ ఒకరి అవసరం మరొకరికి బాగా ఎక్కువయిన నేపథ్యంలో) మళ్ళీ ‘ఈనాడు’ లో పాడుతా తీయగా  సీరీస్ మొదలయింది. నిర్విరామంగా నడుస్తున్నది.. పాపులారిటీ రేటింగ్ లు పెంచుతూ.... అలా రోజులు గడుస్తున్న క్రమంలో...

ఒక వేడుకలో రామోజీరావుకు  బాలసుబ్రహ్మణ్యం అకస్మాత్తుగా పాదాభివందనం (అంత భారీ శరీరంతో కూడా సాష్టాంగ దండ ప్రమాణం /అష్టాంగ నమస్కారం) చేయడాన్ని టివీలో చూసి అవాక్కయ్యా ....అప్పుడు తెరుచుకున్న నోరు ఇప్పటికీ మూతపడలేదు.

-చినవ్యాసుడు, మాఊరు.

...........................


ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...